అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ ఆల్ ఫ్రీ సర్వీస్ గా మారనుందా?

త‌మిళ‌నాడులో  ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ పెద్ద యాక్టివ్ గా లేదు.   జ‌య‌ల‌లిత మరణం తరువాత అన్నాడీఎంకేలో  ఆ స్థాయి చ‌రిష్మా గ‌ల నాయ‌క‌త్వం లేదు. జ‌య ఉన్న స‌మ‌యంలో అజిత్ రూపంలో ఒక వార‌స‌త్వాన్ని త‌యారు చేయాల‌ని ఆమె ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో జయలలిత మరణం తరువాత ఆ పార్టీ దాదాపుగా అనాథగా మిగిలిపోయింది.  అయితే ప్ర‌స్తుతం ఈ పార్టీలో ఈపీఎస్, ఓపీఎస్ అంటూ పార్టీపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అదలా ఉంచితే వారిలో  ప‌ళ‌ని  స్వామి నాయ‌క‌త్వంలో ప్ర‌స్తుతం పార్టీ  అంతంత మాత్రంగా ఉందని చెప్పాలి. 

కాగా ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నా డీఎంకే వ్యూహాత్మకంగా ఒక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో పురుషులకూ ఫ్రీ బస్ ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. దీంతో   ఫ్రీ  బ‌స్ వ్య‌వ‌హారం  మరో సారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఇప్ప‌టికే  క‌ర్ణాట‌క‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం పథకం అమలులో ఉంది. ఈ పథకాన్ని ప్రకటించిన పార్టీలు ఆయా రాష్ట్రాలలో విజయం సాధించాయి. దీంతో అన్నాడీఎంకే మహిళలకే కాదు, పురుషులకూ ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం పథకాన్ని ప్రకటించి ఎన్నికలలో విజయం కోసం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు భావిస్తోంది.  

వాస్తవంగా చూస్తే తమిళనాట అన్నాడీఎంకేకు గెలుపు అవకాశలు పెద్దగా లేవు.   ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న  డీఎంకే  స్టాలిన్ నాయ‌క‌త్వంలో బ‌లంగా క‌నిపిస్తుండ‌గా,  ఈ మ‌ధ్యే పొలిటికల్ అరంగేట్రం చేసిన నటుడు విజ‌య్ సార‌ధ్యంలోని  త‌మిళ వెట్రి క‌ళ‌గం (టివీకే) ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.  ఈ నేపథ్యంలో పరిశీలకులు పోటీ మొత్తం డీఎంకే, టీవీకే మ‌ధ్యే అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో  సర్వేలు నిర్వహించిన కొన్ని సంస్థలు డీఎంకేకే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి.  ఈ క్ర‌మంలో మేము సైతం అంటూ అన్నాడీఎంకే పురుషులకూ ఫ్రీబస్ ప్రయాణం అంటూ సడన్ గా రేసులోకి దూసుకువచ్చిందని అంటున్నారు.  

ఇది  చూసి ఇత‌ర రాఫ్ట్రాలలో కూడా  ఆర్టీసీ ఫ్రీ ఫ‌ర్ ఆల్ అనే ప్ర‌చారం మొద‌లు పెట్టినా  ఆశ్చ‌ర్యం లేదంటున్నారు పరిశీలకులు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే రోజుల్లో ఆర్టీసీ బ‌స్సులు ఫ్రీఫర్ ఆల్ అన్నట్లుగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే త‌మిళ‌నాడు ఆర్టీసీ చాలా  యాక్టివ్ గా ఉంటుంది. త‌క్కువ ధ‌ర‌తో ఏ  రాష్ట్ర బ‌స్టాండ్ల‌లో అయినా స‌రే ఆక్యుపెన్సి పెంచుకుంటూ వ‌స్తోంది. సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తుంటారు. వ‌చ్చే రోజుల్లో ఆల్ ఫ్రీ కార‌ణంగా  వారిలో కూడా ఈ పోటీ త‌త్వం న‌శించిపోయేలా  క‌నిపిస్తోంది. మొత్తం మీద  రాజకీయపార్టీలు అధికారం కోసం ఆర్టీసీని ఆల్ ఫ్రీ ట్రావెల్ సర్వీసుగా మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu