విజయసాయికి ఈడీ నోటీసులు.. జగన్ కు ప్రమాద ఘంటికలేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిపే దిశగా సాగుతోందనడానికి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు పంపడమే తార్కాణమంటున్నారు పరిశీలకులు. ఔను మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని ఈ నెల 22న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అది మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ విజయసాయిని ప్రశ్నించనుంది.

ఇప్పటికే ఇదే కేసులో విజయసాయి రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించింది. ఆ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినది. అయితే ఈడీ మాత్రం కేంద్ర పరిధిలోది. ఇక్కడే అంటే ఈడీ విజయసాయిని మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడమే జగన్ కు ప్రమాదఘంటికలు మోగినట్లేనా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. 

ఎందుకంటే సిట్ విచారణ సందర్భంగానే విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఎలా జరిగిందో, వైసీపీలో ఎవరెవరు ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించారో పేర్లతో సహా పూస గుచ్చినట్లు చెప్పేశారు.  అప్పట్లో విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలను వైసీపీయులెవరే కూడా గట్టిగా ఖండించడానికి ముందుకు రాలేదు.  విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు ఇలాంటి కేసుల నుంచి రక్షణ కోసమే ఆ పని చేశారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆయనకు   ఈడీ నోటీస్ అందడం చూస్తుంటే.. కేంద్రం నుంచే ఈ కేసు విషయంలో అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చాలన్న ఒత్తిడి వస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి కాలు బయటకు పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని రప్పారప్పా ఆడిస్తానంటూ విమర్శలు గుప్పించడమే కాదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వారి మధ్య చర్చ ప్రభుత్వ ప్రగతి, సంక్షేమ పథకాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడటంపైనే సాగిందని కూడా అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.  ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో  విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఈడీ నోటీస్ పంపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  విజయసాయికి ఈడీ  నోటీస్ పంపడాన్ని ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా? అని కనుగొనేందుకు మాత్రమే కాక.. మరేదో కారణం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  ఆయన నోట మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు దిశగా కీలక ముందడుగు పడటానికి విజయసాయిరెడ్డి విచారణ కీలకంగా మారనుందన్న అభిప్రాయమూ గట్టిగా వినిపిస్తోంది.  ఏది ఏమైనా విజయసాయికి ఈడీ నోటీసులు జగన్ రెడ్డికి ప్రమాదఘంటికలు మోగడమే అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu