లాలూ ప్రసాద్ తో ఎందుకు చేతులు కలిపానంటే...

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బద్ధ శత్రువయిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ జైలుకి వెళ్లి వచ్చిన సంగతి ఆయనకి తెలుసు. ఆ కారణంగా ప్రజలలో లాలూ ప్రసాద్ పట్ల వ్యతిరేకత ఉందని కూడా తెలుసు. అయినా లాలూ ప్రసాద్ తో ఆయన చేతులు కలపడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అదే విషయం ఆయనను మీడియా ప్రశ్నిస్తే అందుకు ఆయన చెప్పిన జవాబు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

“ఈ ఎన్నికలు బీజేపీతో సహా అన్ని పార్టీలకు చాలా కీలకమయినవే. కనుక అన్ని పార్టీలు ఏదో ఒకవిధంగా ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో పొరపాటున బీజేపీ విజయం సాధించినట్లయితే ఇక ఆ పార్టీ మత మౌడ్యాన్ని, అహంకారాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇక దేశంలో తనకు ఎదురులేదనుకొని ఇంకా పేట్రేగిపోతుంది. కనుక మతతత్వ బీజేపీని అడ్డుకోవలసిన బాధ్యత నామీద ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే ఒంటరిగా పోటీ చేయడం కంటే మా భావజాలానికి దగ్గరగా ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలపడం మంచిదని భావించాను,” అని నితీష్ కుమార్ జవాబిచ్చారు.

 

ఈ ఎన్నికలలో బీజేపీని అడ్డుకోవడం చాలా అత్యవసరమని చెపుతున్న నితీష్ కుమార్ సుమారు పదేళ్ళపాటు అదే బీజేపీతో ఎన్డీయే కూటమిలో ఉన్నారు. ఏదో ఒకనాడు ప్రధానమంత్రి అవుదామని కలలుగన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ ఎన్డీయేలో నుండి బయటపడి వామపక్షాలతో కలిసి థర్డ్ ఫ్రంట్ కట్టారు. కానీ ఆ ప్రయోగం కూడా ఘోరంగా విఫలం కావడంతో రాజకీయాలలో ఒంటరి అయిపోయారు. సరిగ్గా ఇటువంటి సమయంలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో మోడీని ఒంటరిగా ఎదుర్కోవడం చాలా కష్టమని భావించి అయిష్టంగానే కాంగ్రెస్ పార్టీతో, అవినీతిపరుడయిన లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపారు. దానికి నితీష్ కుమార్ దేశం, రక్షణ, బాధ్యత, కర్తవ్యం అంటూ చాలా మంచి కలరింగ్ ఇచ్చారు.