బీజేపీని నిలువరించేందుకు నితీష్, లాలూ తిప్పలు

 

బీహార్ అసెంబ్లీలో 32స్థానాలకు రెండవ దశ ఎన్నికలు ఈనెల 16న జరుగుతాయి. కానీ మొదటి దశ ఎన్నికలు జరుగక ముందే అన్ని సర్వేలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తేల్చి చెప్పాయి. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలనే తాపత్రయంతోనే భిన్న దృక్పధాలున్న రాజకీయపార్టీలు ఐదు కలిసి జనతా పరివార్ కూటమిగా ఏర్పడ్డాయి. అయినా సర్వేలు బీజేపీకే మొగ్గు చూపడంతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరికీ ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు.

 

వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ “బీజేపీ ఇంతవరకు తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదు.. ముఖ్యమంత్రి అభ్యర్ధిపై స్పష్టత లేని బీజేపీ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించాలనుకొంటోంది? అది నేరుగా ఎవరి పేరు చెప్పదు కానీ ఒక్కో చోట ప్రజలను మభ్యపెట్టడానికి ఒక్కో పేరుని లీక్ చేస్తుంటుంది. అసలు ఇంతకీ దాని ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అతని పేరు ఇంకా ఎప్పుడు ప్రకటిస్తుంది...ప్రజలను ఈవిధంగా ఇంకా ఎంతకాలం మోసం చేస్తుంది?” అని ప్రశ్నిస్తున్నారు.

 

ఆయన ఆ విధంగా నిలదీయడానికి బలమయిన కారణాలే ఉన్నాయి. బీహార్ ఎన్నిలలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఏ కులానికి చెందిన వ్యక్తి పేరు ప్రకటించినా మిగిలినవారిని జనతా పరివార్ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. కానీ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుషీల్ కుమార్ మోడీ, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దళితుల ప్రతినిధిగా తనను అభివర్ణించుకొనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ ఉన్నారు.

 

తాజాగా ఆ జాబితాకి బీజేపీ మరోపేరు కూడా జోడించింది. గయ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్. ఆయన వెనుకబడిన వర్గాలలోకెల్లా బాగా వెనుకబడిన ఒక వర్గానికి చెందిన వ్యక్తి. మోడీ బీహార్ పర్యటనకి వచ్చినప్పుడల్లా ఆయన పక్కనే కనబడుతుంటారు. ఆయన పేరు కూడాముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మీడియాతో అన్నారు. ప్రేమ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కులానికి చెందినవారు రాష్ట్రంలో 8 నుండి 11 శాతం వరకు ఉన్నారు. ఇక బాగా వెనుకబడిన కులాలన్నీ కలిపి 32 శాతం వరకు ఉన్నట్లు 1931 జనాభా లెక్కలో అంచనా వేశారు. ఆ సంఖ్య నేటికి గణనీయంగా పెరిగి ఉంటుంది కనుక బీజేపీ ఆ వర్గానికి వల వేసేందుకే ప్రేమ కుమార్ పేరుని ఇప్పుడు లీక్ చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కానీ అదయినా దైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు.

 

జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న నితీష్ కుమార్ ప్రజలలో ప్రాంతీయవాదం రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించవలసినది బీహారీలా లేక బాహర్ వాలా (బయట వాళ్ళా)? అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ ఏ ఎన్నికలలో బీజేపీకి నేతృత్వం వహిస్తున్నందుకు నితీష్ కుమార్ దానిని కూడా ఒక అవకాశంగా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానిని అమిత్ షా అంతే గట్టిగా తిప్పి కొట్టారు. ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి చాలా మంది వస్తారు. కానీ అలాగా వచ్చిన వాళ్ళలో ఒకరిని బీహార్ ముఖ్యమంత్రిగా చేయలేము కదా? బీహార్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచినా బీహారీ వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు తప్ప బయట వాళ్ళు కాదు కదా? అని జవాబు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu