‘అమరావతి’కి యాంకర్ గా సాయికుమార్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం కోసం  అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతిరధమహారథులు ఈ బృహత్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ నటుడు సాయికుమార్ ను ఎంపికచేశారు. తెలుగుతనాన్ని గంభీరంగా ప్రదర్శించేందుకు, అతిథులను ఆత్మీయంగా పలకరించేందుకు సాయికుమార్ ను ఎంచుకున్నారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా సాయికుమార్ ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. శంకుస్థాపన మహోత్సవంనాడు నిర్వహించే వివిధ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సాయికుమార్ వ్యాఖ్యానం చేయనున్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మూడు వేదికలను సిద్ధంచేస్తున్నారు, ప్రధాన వేదికతోపాటు దానికిరువైపులా మరో రెండు వేదికలు ఉండనున్నాయి, ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడీతో సహా 15మంది వీవీఐపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో వేదికపై న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, వ్యాపారవేత్తలు... మూడో వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూర్చోనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు కూడా హాజరుకానున్నారు.

ప్రధాన వేదికపై 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కలశాలను, సంకల్ప పత్రాలను ఉంచనున్నారు, ఇదిలా ఉండగా శివమణి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిబొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu