గుంటూరులో పానీపూరీ విక్రయాలు బంద్.. ఎందుకంటే?

గుంటూరు నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరీ విక్రయాలపై నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించినట్లు గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు.  గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో పానీ పూరి విక్రయాలు, టిఫిన్ బండ్లపై నిషేధం విధించారు. డయేరియా వ్యాప్తిని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరునగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డితోట, రెడ్ల బజార్, సంగడి గుంట సహా తొమ్మిది ప్రాంతాలలో డయేరియా ప్రబలినట్లు అధికారులు గుర్తించారు.

డయేరియా కేసులు అధికంగా నమోదు కావడంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. డయేరియా వ్యాప్తి అరికట్టేం దుకు తీసుకోవలసిన చర్యలపై గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నగరంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, పానీపూరి విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయించారు.డయేరియా వ్యాప్తికి కలుషిత నీరు, ఆహారం ప్రధాన కారణాలనీ, అందుకే  ముందుజాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల అమ్మకాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పులి శ్రీనివాసులు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu