రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
posted on Sep 15, 2025 2:30PM

తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదరకు లేఖలు ఇచ్చారు. గత 20 రోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది.
ఇప్పటికే చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో సేవలు కొనసాగించడం అసాధ్యమైందని ఆసోసియేషన్ తెలిపింది. గత జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా, ఆందోళనల అనంతరం అప్పటి ఆరోగ్య మంత్రి “బకాయిలను నాలుగు నెలల్లో క్లియర్ చేస్తాం, క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ స్పష్టం చేసింది.