రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం
posted on Dec 22, 2025 5:39PM

టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యా దపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతిని శాలువతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. రాష్ట్రపతిని కలసి గౌరవించడం పట్ల బ్రహ్మీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మీ కేవలం నటుడే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. ముఖ్యంగా పెన్సిల్ ఆర్ట్‌లో దేవుళ్ల చిత్రాలను అద్భుతంగా గీస్తారు. ఖాళీ సమయాల్లో తన మనసుకు నచ్చిన చిత్రాలను గీయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయా చిత్రాలను తనను కలిసే ప్రముఖులకు బహుమతిగా అందించడం బ్రహ్మానందం ప్రత్యేకత. కృష్ణంరాజు నుంచి రామ్ చరణ్ వరకు ఎంతోమందికి ఆయన గీసిన చిత్రాలను అందించారు.