మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన
posted on Dec 22, 2025 1:16PM
.webp)
మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.