కలెక్టర్ల పనితీరు బాగలేకపోతే వేటే : సీఎం చంద్రబాబు
posted on Sep 15, 2025 3:37PM

కలెక్టర్ల పనితీరు బాగుంటేనే కొనసాగిస్తానని లేదంటే, కలెక్టర్లు అయిన సరే వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు జిల్లా రూపు రేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉంది. పాలసీ ఇవ్వడమే కాదు అమలు చేయడం ముఖ్యం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకు ముందు హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. పాత కలెక్టర్లు కూడా తమ పని తీరును నిరూపించుకోవాలి అని పేర్కొన్నారు.
సర్వర్ణాంధ్ర విజన్-2047 పత్రమే అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని హూకుం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “పనితీరు చక్కగా ఉన్న అధికారులను నేను ఎప్పుడూ మార్చలేదు.
గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రిజర్వ్ బ్యాంక్ వంటి ఉన్నత సంస్థలకు వెళ్లారు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి,” అని ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.