ఏపీలో స్థానిక సంస్థల కొత్త చట్టం?.. కనీసం ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హత!

నిన్నమొన్నటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్థానిక ఎన్నికల్లో  పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లలు తప్పనిసరి చేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.  అసలుఎన్నికలకు,పిల్లలకు సంబంధం ఏమిటనే ప్రశ్న రావడం సహజం. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో జనాభా రేటు తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి.  ఇదే పరిస్థితి విధంగా కొనసాగితే  జనాభా నిష్పత్తిలో నియోజక వర్గాలు పునర్వ్యవస్థీకరణ జరిగితే  ఉత్తరాది లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు దక్షిణాదిలో  నియోజకవర్గాల సంఖ్య తగ్గే పరిస్థితి కనపడుతున్నది. ఫలితంగా ఎన్నికలో ఉత్తరాది డామినేషన్ ఉన్న రాజకీయ పార్టీలకే పార్లమెంటులో అధికారం సిద్దించే అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దక్షిణాదిలో జనాభా రేటు పెరగాలని అందుకు తామ మద్దతు ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ గతంలోనే ప్రకటించారు. 

ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఆ మేరకు కనీసం ఇద్దరు పిల్లలు ఉన్నవారికే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత గా నిర్ణయిస్తూ చట్టం తీసుకువస్తామని ప్రకటించారు.  రాష్ట్రంలో సంపద పెంపు, ఆదాయం వృద్ధిలో పాటు జనాభా రేటులో పెరుగుదలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు.   జనాభా పెరుగుదల రేటు ఇలాగే ఉంటే 2026లో ఏపీ జనాభా 5.38 కోట్లు మాత్రమే ఉంటుంది. అదే 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుంది.  ప్రతి జంటకు సగటున 2.1 పిల్లలు జన్మిస్తే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యమ వుతుందన్న అంచనాలు ఉన్నాయి. 

భవిష్యత్ అవసరాల కోసం భారీగా రోడ్ల విస్తరణ,విమానాశ్రయాలు ఏర్పాటు తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టనున్న తరుణంలో జనాభాలో పెరుగుదల లేకపోతే వాటి వినియోగం ప్రశ్నార్ధకం గా మారే ప్రమాదం ఉంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించే ప్రణాళికలతో  ముందుకు సాగుతున్న నేపథ్యంలో  విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు,ఇతర సంస్థలు ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు కూడా పీపీపీపీ పద్ధతిన నిర్మించాలని  ఏపీ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. 
రాజకీయంగా దక్షిణాది కి సమున్నత స్థానం కల్పించాలంటే జనాభా పెరగాలని చంద్రబాబు చెబుతున్నారు. పిల్లలు కనండి...స్థానిక సంస్థల్లో పదవులు పోందండి అంటే ప్రజలు పిల్లల్ని కనలేరు. వారి ఆదాయ మార్గాలు పెంచాలి.ఉ పాధి పెరగాలి. అవి రెండూ పెరిగేలా తాను బాధ్యత తీసుకుంానని చంద్రబాబు చెబుతున్నారు.  

ఉపాధి పెరగాలంటే విద్యావిధానం మారాలి.వృత్తి విద్యా కోర్సులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పాలిటెక్నిక్, పారిశ్రామిక శిక్షణా సంస్థలు,నర్సింగ్ కోర్సులు, నైపుణ్యం పెంచే శిక్షణా సంస్థలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోర్సులు వంటి వాటిని ప్రోత్సహించాలి. ప్రస్తుతం ఏపీలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ఆ పనే చేస్తున్నది.  దక్షిణాదికి రాజకీయ ప్రాధాన్యత, ప్రాముఖ్యత పెరగడం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.