ముడా స్కామ్.. కర్నాటక సీఎం కుమారుడే సూత్రధారి?!
posted on Jan 18, 2025 11:53AM

ముడాస్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కుంభకోణం మూలాలు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ముడా కుంభకోణానికి అసలు సూత్రధారి సిద్దరామయ్య పుత్రరత్నం, ఎమ్మెల్యే అయిన యతీంద్రేనని ఈడీ అనుమానిస్తోంది.
తాజాగా ఆ కుంభకోణంలో అక్రమంగా ఫ్లాట్ లు పొందిన 142 సైట్లను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపుగా రూ. 300 కోట్లు ఉంటుంది.
మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ భూ కేటాయింపులో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేటాయించిన 1059 ప్లాట్లు అన్ని 50:50 నిష్పత్తిలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇచ్చేశారని వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 700 కోట్ల ఉందని పేర్కొంది.
ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వీటిని పొంది తరువాత భారీ లాభాలతో అమ్మి సొమ్ము చేసుకున్నారని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి పేరు మీద 14 ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఇవన్నీ అక్రమంగా కేటాయించుకున్నవే అని విచారణ లో తేలింది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, రికార్డులు మార్చివేసి మరీ కేటాయించినట్లు ఈడీ దర్యాప్తు తేల్చిందని చెబుతున్నారు. ఈడీ వాటినీ సీజ్ చేసింది.
మైసూర్ లో కేటాయించిన భూమిలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు రావడంతో పలువురు సామాజిక కార్యకర్తలు లోకాయుక్తను ఆశ్రయించారు. దానితో సిద్దరామయ్య, ఆయన భార్య ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఉండటంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది.
ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించింది సీఎం కుమారుడు ఎంఎల్ఏ యతీంద్ర అని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అమ్మ అయిన పార్వతి పేరు మీద అక్రమంగా ఫ్లాట్ల కేటాయింపులు జరపడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చారని తెలుస్తోంది. అలాగే మరో 252 సైట్లు కూడా ఎలాంటి పత్రాలు, అనుమతి లేకుండా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంలో చక్రం తిప్పారని ముడా అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోందది. తరువాత వీటిని భారీ లాభాలకు అమ్మి వాటిని వివిధ మార్గాల్లో సొంత ఆస్థిగా మలుచుకున్నారని ఈడీ భావిస్తున్నారు.