అయ్యో ఏపీ కాంగ్రెస్!

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి ప్రయాణం సాగిస్తోంది.​రాష్ట్ర విభజన ముందు వరకూ ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ ఆనవాలు వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి ఉంది. దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. సమీప భవిష్యత్ లో పుంజుకోగలదా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అయినా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అది ఎక్కడా చెక్కు చెదరలేదు.

క్యాడర్ కు దిశా నిర్దేశం చేసే నాయకులు కరవయ్యారే కానీ.. ఇప్పటికీ దేశంలో ఒక్క ఏపీ మినహా అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉందనడంలో సందేహం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నాయకులు, క్యాడరూ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయి చాలా కాలమే అయ్యింది. హై కమాండ్ కూడా ఏపీలో పార్టీ పుంజుకోవడంపై ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదని తాజాగా ప్రకటించిన కమిటీని చూస్తే ఇట్టే అర్దమైపోతుంది. ఇప్పటి వరకూ పీసీసీ చీఫ్ గా ఉన్న సాకే శైలజానాథ్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించింది. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలూ ఉన్నారు. అలాగే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్ గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా తులసి రెడ్డి నియమితులయ్యారు.  , 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించారు.

 ఇప్పటి వరకూ ఏపీసీసీ చీఫ్ గా ఉన్న సాకే శైలజానాథ్ తన పదవీ కాలం మొత్తంలో రాష్ట్రంలో పార్టీ పుంజుకోవడంపై దృష్టి సారించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఎప్పుడు పదవీ కాలం పూర్తవుతుందా.. బాధ్యతల నుంచి తప్పుకుందామా అని ఎదురు చూసినట్లుగానే ఆయన వైఖరి ఉంది. ఏపీసీసీ చీఫ్ గా సాకే ఎంత నిర్లిప్తంగా  పదవీ బాధ్యతలు నిర్వర్తించినా.. ఆయనకు పార్టీలో ఒక గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. శింగనమల నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు 2004, 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ హయాంలో మంత్రిగా  పని చేశారు. అసెంబ్లీలో బలంగా గొంతు వినిపించారు. సాకే శైలజానాథ్ కు ముందు  ఏపీ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఉన్నారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో తనను తాను రుజువు చేసుకుని ఆ పదవి దక్కించుకున్నారు.  1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రఘువీరారెడ్డి  1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఆ తరువాత 1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 1999, 2004 ఎన్నికలలో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.   వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు.  2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. వై.ఎస్ మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశాడు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం ఆ పదవిని చేపట్టిన రఘువీరారెడ్డి.. అప్పుడున్న అంతటి ప్రతి కూల పరిస్థితుల్లో సైతం రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించారు. చివరికి 2019 ఎన్నికలలో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత రఘువీరారెడ్డి అదే బాటలో నడిచి పక్కకు తప్పుకున్నారు. ఆ తరువాత సాకే శైలజానాథ్.. కానీ సాకే శైలజానాథ్ వారసుడిగా కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసిన కమిటీని చూస్తే ఏపీలో పార్టీ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకుందా అని పించక మానదు.

ఇక ఏఐసీసీ పగ్గాలు అందుకున్న గిడుగు రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. అలాగే ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా ఒడిశా రాష్ట్ర స‌హాయ ఇన్‌చార్జి బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలలో ఎన్నడూ నిలవలేదు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పని చేసిన సందర్బం కూడా లేదు. వైఎస్సార్‌, కెవీపీలకు స‌న్నిహితుడిగా మెలిగారని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పం నిజంగా పార్టీలో ఉంటే.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న నేతలకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని, అయితే ఆ ఉద్దేశం పార్టీ హైకమాండ్ లో ఉన్నట్లు కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.

రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లను మళ్లీ క్రియాశీలంగా చేసేందుకు ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పటికే ప్రజలతో సంబంధం కోల్పోయిన కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ప్రజలతో సంబంధాలు లేని నాయకుడిని నియమిస్తే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఇలా ఉంటే.. తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు అధిష్ఠానానికి కృతజ్ణతలు చెప్పిన గిడుగు అధిష్ఠానం నమ్మకాన్ని నిలుపుకుంటానని అన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా పాటుపడతానన్నారు.