ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం
posted on Jun 21, 2025 6:19PM

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఖరీఫ్ సీజన్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇరు రాష్ట్రాల వాటాలు, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు పోను సాగునీటికి ఎంత కేటాయించాలనే అంశాలపై అధికారులు కూలంకషంగా చర్చించనున్నారు.
ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను ఈ సమావేశంలో బోర్డు ముందు ఉంచనున్నారు. ఇన్సెంటివ్ క్యాన్సిల్ చేయడంతోపాటు రికవరీ చేయాలని కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు ఉద్యోగులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2023లో హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై చర్చించేందుకు 20వ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.