జగన్ మారిపోయారు కానీ..

అవును... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారిపోయారు. ఆయనలో వచ్చిన ఈమార్పును ఎవరు గమనించారో, ఎవరు గమనించ లేదో ఏమో కానీ, ఆయనలో మార్పు అయితే వచ్చిందని, ఆయన నడక, నడత, మాట తీరును దగ్గరగా చూస్తున్న సన్నిహితులు చెప్పు కొస్తున్నారు. 

ఒకప్పుడు జనంలో తిరుగుతూ ముద్దు మురిపాలతో ప్రజలను సమ్మోహితులను చేసిన   జగన్ రెడ్డి,  ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ జనం ముఖం చూసింది లేదు. ముద్దులిచ్చిందీ లేదు. మాట్లాడింది అసలే  లేదు. నిజానికి ముఖ్యమంత్రి దర్శన భాగ్యమే జనాలకు కరువైంది. సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలకు కూడా ఆయన అప్పాయింట్మెంట్ ఒక పట్టాన దొరకదని అంటారు.  ఆయన ప్యాలెస్ గడప దాటి బయటకు రారు. సామాన్య జనాలకు ప్యాలెస్ లోకి ప్రవేశం ఉండదు.సో, ఆయన ఎవరికీ కనిపించరు. వినిపించరు అనే ముద్ర పడిపోయింది. 

అదలా ఉంటే, ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి తప్పనిసరై  వచ్చినా, పరదాల చాటునే  ఉండి పోవడం తప్ప, ప్రజల మధ్యకు వచ్చి పలకరించింది లేదు. చివరకు, ప్రజలను చూసి ఒక చిరునవ్వు చిందించిన సందర్భం కూడా లేదంటే, ఆశ్చర్య పోనవసరం లేదు. నిజం. ప్రతిపక్ష నేతగా,  ఒక్క ఛాన్స్ ప్లీజ్  అంటూ ప్రజల వెంటపడిన జగన్ రెడ్డి,ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి, ఎవరికీ కనిపించకుండా నల్లపూసై పోయారని అంటారు. 

అయితే, తరుముకొస్తున్న ఎన్నికల ప్రభావమో  దిన...దిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న పలుకుబడి ప్రభావమో, వెంటాడుతున్న ఓటమి భయమో కారణం ఏమో కానీ జగన్ రెడ్డి  ఇక వాళ్ళను వీళ్ళను నమ్ముకుని లాభం లేదని స్వయంగా ఆయనే రంగంలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా జిల్లాలలో పర్యటిస్తున్నారు. అయితే ఈ  జిల్లాల పర్యటనలోనూ ఆయన ప్రజలకు దగరయ్యే ప్రయత్నం చేయడం లేదు సరికదా, ప్రజల కదలికలపైనే కాదు, వారు ధరించే వస్త్రాలపైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల నరసాపురం సభకు నల్ల చున్నీలు వేసుకుని వచ్చిన ఆడపిల్లల చున్నీలను పోలీసులు తీయించారు. అదేమంటే, పైవారి ఆదేశాలని పోలీసులు తప్పించుకుంటున్నారు.   ముఖ్యమంత్రి వస్తున్నారంటే, పోలీసులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆరో పిస్తున్నాయి. 

అయితే జగన్ రెడ్డిలో వచ్చిన మార్పు ఇదేనా అంటే,  ఇది మాత్రమే కాదు, ఆయన భాషలోనూ మార్పు వచ్చిందని అంటున్నారు. ఓవంక మీటలు నొక్కి పైసలు పంచుతున్నాను కాబట్టి, ప్రజలు చచ్చినట్లు మళ్ళీ తమకే ఓటు వేసి పట్టం కట్టాలని దబాయింపు ధోరణిలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరో వంక స్థాయిని మరిచి ప్రతిపక్ష పార్టీల నాయకులపై దూషణకు దిగుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం మరిచి పోయారు, బూతుల మంత్రుల బాధ్యతలను కూడా ఆయనే పుచ్చుకున్నారో ఏమో కానీ, ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి రాకుడని మాటలు వస్తున్నాయి. వినకూడని మాటలు వినవలసి వస్తోందని, అంటున్నారు.

“ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేవు” అంటూ బూతు పురాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి, రోజు రోజుకు మరింతగా దిగాజరుతున్నారని, వైసీపీ నేతలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. తనను తను రాముడితో పోల్చుకుంటూ, ప్రతిపక్ష పార్టీల నాయకులను రావణాసురునితో  పోల్చడం ఏమిటని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ వేదిక నుంచి ఇలాంటి అసభ్య భాషను ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 ప్రతిపక్ష నాయకులనే కాదు, మీడియా సంస్థల అధిపతులనూ పేరు పెట్టి మరీ, దుష్ట చతుష్టయం అంటూ  దూషిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మీడియాపై విమర్శలు గుప్పించినా ఆయన ఏనాడు వ్యక్తులను టార్గెట్ చేయలేదని, ఆ రెండు పత్రికలు అంటూ  మాత్రమే తప్పు పట్టరాని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ రెడ్డి ఆ మాత్రం కనీస మర్యాద అయినా లేకుండా మాట జారుతున్నారని అంటున్నారు .అయితే ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఇలాంటి మాటలు దిగజారుడు భాష మాట్లాడుతున్నారా, లేక  ప్రతిపక్షాలను రెచ్చగొట్టేందుకు ఇలా  ప్రవర్తిస్తున్నారా, అంటే ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పుకు ఇంకా వేరే కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ,  ప్రధాన కారణం మాత్రం ఓటమి భయమే అంటున్నారు. 

నిజం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాటలోనే కాదు. నడకలో, నడతలో చివరకు ఆయన తీసుకుంటున్న ప్రాంతీయ సమన్వయ కర్తల మార్పు వంటి రాజకీయ నిర్ణయాలు కూడా ఆయనలోని ఫ్రస్ట్రేషన్, ఓటమి భయాన్ని చూపుతున్నాయని అంటున్నారు.