అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు
posted on Jun 21, 2025 4:38PM

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్, రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన. ఐవోసీసీ అడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది.
అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. ఈ దుర్ఘటలో మొత్తం 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.