రక్తమోడిన ఏఓబీ.. మహిళా మావోయిస్టులు మృతి..
posted on Apr 12, 2017 5:16PM

ఏవోబీ (ఆంధ్రా - ఒడిషా సరిహద్దు) లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆ ప్రాంతం రక్తంతో తడిసిపోయింది. ఒడిషాలోని రాయగఢ్ జిల్లాలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం అందించడంతో.. ఒడిషాకు చెందిన ఎస్ఓటీ బలగాలు, సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. దీంతో భద్రతా బలగాలు.. మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలం నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వాటిలో ఒక ఏకే-47 కూడా ఉందని సమాచారం. సాధారణంగా ఈ తుపాకులను కేంద్రకమిటీ సభ్యులు గానీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగానీ మాత్రమే వాడతారు. దాంతో ఇక్కడకు ఎవరైనా మావోయిస్టు అగ్రనేతలు వచ్చి తప్పించుకున్నారా అనే దిశగా కూడా దర్యాప్తు సాగుతోంది.