అమరావతిలో పర్యావరణ విధ్వంసం?
posted on Oct 28, 2015 4:26PM

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కోటి చెట్లను నరికేయనున్నారనే సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది, ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం... పర్యావరణ విధ్వంసానికి దిగుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు, రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించిన ఆంధ్రప్రదేశ్... మరో 50వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరడంపై పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు.
పర్యావరణాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తాము ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించామని పర్యావరణవేత్తలు అంటున్నారు, అందుకే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూముల్లోనే పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే, ఇప్పుడు అటవీ భూములను కూడా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అయితే అటవీ భూములను తీసుకోవాలంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని, కానీ వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు, తీసుకున్న అటవీ భూమికి రెండింతలు మరో చోట భూములు ఇవ్వడమే కాకుండా, ప్రతి చెట్టుకు బదులు మూడేసి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుందని, కానీ ఇవేమీ అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని, ఈ లెక్కన అమరావతిలో ప్రకృతి విపత్తు తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు.