విజయసాయిరెడ్డి vs బొత్స సత్యనారాయణ
posted on Oct 28, 2015 5:03PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది, ఈ ఇద్దరూ పార్టీలో నెంబర్ టు పోజీషన్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, అదినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర తన మాటే నెగ్గాలంటే తన మాటే నెగ్గాలంటూ పంతాలకు సైతం పోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరినీ నొప్పించకుండా జగన్ వ్యవహరిస్తున్నారని, కానీ నెంబర్ 2 ఎవరనేది మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొందంటున్నారు.
వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్ కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వైఎస్ ఫ్యామిలీతో విడదీయలేని అనుబంధమున్న విజయసాయి... జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నీతానై వ్యవహరించారు. పైగా జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన సాయిరెడ్డికి తెలియకుండా పార్టీలో ఏ నిర్ణయమూ జరగదనే టాక్ ఉంది. అంతేకాదు జగన్ ఆర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్రధారి, అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయికే అధినేత ప్రాధాన్యత ఇస్తారని, అత్యంత నమ్మకస్తుడైన ఆయనను రాజ్యసభకు కూడా పంపే ఆలోచనలో ఉన్నారని పార్టీ నేతలు అంటుంటారు. పైగా విజయసాయికి తెలిసినంతగా జగన్ మనసు మరెవరికీ తెలియదంటారు వైసీపీ వర్గాలు.
అయితే ఇటీవల పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణ కూడా జగన్ కు తల్లో నాలుకలా మారారని, పార్టీ నిర్ణయాల్లో బొత్సకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స... మరో పవర్ ఫ్యాక్టర్ గా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, పైగా పార్టీలో జగన్ తర్వాత తానే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే టాక్ ఉంది. వైఎస్ కి అత్యంత నమ్మకస్తుడిగా ఉండటమే కాకుండా పదేళ్లు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను జగన్... నెంబర్ 2గా గుర్తిస్తారనే ఆశతో బొత్స ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలాగుంటే పార్టీలో నెంబర్ టు పోజీషన్ ఆశిస్తున్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలు అంతర్గతంగా మాటల తూటాలు కూడా పేల్చుకుంటున్నట్లు తెలిసింది, నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు నెంబర్ టు ఏంటని ఒకరు అంటుంటే, ఎప్పుడొచ్చామన్నది కాదు ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నే ముఖ్యమని మరొకరు కౌంటర్ ఇస్తున్నారట. అయితే ఎవరి మాటా వినని సీతయ్య లాంటి జగన్... అసలు వీళ్లిద్దరి మాటకు విలువ ఇవ్వడం కూడా డౌటేనంటున్నారు జగన్ గురించి తెలిసిన లీడర్లు.