ఏపీ ఉద్యోగుల తరలింపుకు బ్రేక్...?

 

ఈ జూన్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఉద్యోగుల్ని తరలించాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు మళ్లీ అవరోధం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఐఏఎస్ నుంచి అటెండర్ వరకూ ఎవరికీ అమరావతికి తరలివెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో తరలింపు కొంతకాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల నేతల మధ్య తరలింపుపై అనేకమార్లు చర్చలు జరిగాయి. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఒక్కసారి కూడా తరలింపుపై స్పష్టత రాలేదు. చివరికి జూన్ 27వ తేదీలోగా సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులంతా రాజధానికి తరలి రావాల్సిందేనంటూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వును జారీ చేసింది.

 

దీంతో వివిధ శాఖల అధిపతులు తమ శాఖ పరిధిలోని ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌ను వదిలి రావడానికి ఎవరూ సిద్ధంగా లేనట్టుగా తెలిసింది. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్‌ల దాకా భాగ్యనగరంపై మమకారాన్ని చంపుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి కదలమంటే మంత్రులకు కూడా ఇష్టం లేదు. అందుకనే ఇటు మంత్రులైనా, అటు ఉన్నతాధికారులైనా తరలింపు అనేసరికి ఉద్యోగులతో కఠినంగా ఉండలేకపోతున్నారు. మంత్రులకు, విభాగాల అధిపతులకు తప్పదు కాబట్టి విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని హైదరాబాద్-విజయవాడల మధ్య చక్కర్లు కొడుతున్నారు.

 

అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులను మంత్రులకు, సీఎస్‌కు వివరిస్తున్నారు. భార్యా, భర్తలలో ఒకరు ప్రైవేటు ఉద్యోగి అయివుంటే విజయవాడ తరలింపు వల్ల తాము ఒంటరి వారమవుతామని వాపోతున్నారు. పలువురు ఉద్యోగులు కొత్త విద్యాసంవత్సరం కావడంతో వారి పిల్లలను కళాశాలల్లో చేర్పించారు. వారిని మళ్లీ విజయవాడలో చేర్పించాలంటే డోనేషన్లు, పైగా స్ధానికత అంశం పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక్కడే నిర్మించుకున్న ఇళ్లు, ఆస్తులు అన్నింటిని వదిలి బెజవాడ రాలేక సగటు ఉద్యోగి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు.

 

మరో ప్రధాన కారణం ఇప్పట్లో మంచి రోజులు లేకపోవడం..ఏప్రిల్ నెలాఖరుతో మంచి రోజులు అయిపోయాయని, మళ్లీ మంచిరోజులు కృష్ణా పుష్కరాల తరువాతేనని పండితులు చెబుతున్నారు. అమరావతికి శాశ్వతంగా తరలివెళుతున్నప్పుడు మంచి రోజులు లేకపోతే ఎలా? అని ఉద్యోగులు సంకోచిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం పూర్తికాకపోయినా, హడావుడిగా రెండు గదులు పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయించారు. ఎందుకు..? మంచి ముహూర్తాలు లేవనే కదా..మరి మంచి రోజులు లేని సమయంలో ఉన్న ఊరొదిలి మరో ఊరికి శాశ్వతంగా వెళుతున్నప్పుడు ఎంత ఆలోచించాలి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 

మరో ప్రధాన భయం వరదలు. రాజధాని గ్రామాల్లో కొండవీటి వాగు విశ్వరూపం గురించి ఉద్యోగులందరికి తెలుసు మొన్నామధ్య కురిసిన భారీ వర్షాలకు కొండవీటి వాగు ఉప్పోంగటంతో రాజధాని ప్రాంతమంతా సుమారు వారం రోజుల పాటు జలమయమైపోయింది. దీంతో తెలిసి తెలిసి కష్టాలపాలవ్వడం దేనికని ఉద్యోగులు జంకుతున్నారు. అందుకే కనీసం వర్షాకాలం దాటేంత వరకు అయినా తమకు గడువు కావాలని కోరుతున్నారు . అటు ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లడానికి అనేక వరాలు ఇచ్చారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు, 30 శాతం హెచ్ఆర్ఏ, ఉద్యోగుల బస, వసతి ఏర్పాట్లు...ఇలా చాలా చేశారు. కష్టాల్లో ఉన్నా అడిగినవన్నీ ఇచ్చాను. ఇంక నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో మొరపెట్టుకున్నారు. మరి ఉద్యోగులు ఇప్పటికి రాకపోతుండటంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారా..? లేక ఉద్యోగుల కోరిక మేరకు మరి కొంతకాలం వాయిదా వేస్తారా ? అనేది వేచి చూడాలి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu