సమరానికి దేవరగట్టు సిద్ధం!

కర్రల సమరం అనగానే గుర్తుకు వచ్చే పేరు దేవరగట్టు. ఏటా దసరా పండుగ సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం పేరిట కర్రల సమరం జరుగుతుంది. ఈ ఏడు కూడా ఈ సమరానికి సర్వం సిద్ధమైంది. దసరా పండుగ రోజు అర్ధరాత్రి జరిగే ఈ సంప్రదాయ సమరానికి ఒక చరిత్ర ఉంది.  

పూర్వం దేవరగట్టు కొండ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసుకునేవారు. మణి, మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునే రుషులను వేధిస్తూ నానా బాధలూ పెట్టే వారు.  దీంతో ఋషులు తమ గోడును పరమశివునికి మొరపెట్టుకోగా, ఆయన ఆ రాక్షసులను వధించి పురుషులను రక్షించారని స్థల పురాణం చెబుతోంది. ఈ సందర్భంగా అక్కడ వెలిసిన మాల మల్లేశ్వర స్వామిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా పండగ రోజు పూజించుకుంటూ ఉంటారు. అయితే స్వామివారు కొండ మీద వెలిసినప్పటికీ కిందికి వచ్చి భక్తుల  కోరిన కోరికలు తీరుస్తారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,  నేరకిని, నెరకిని తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు కిందికి వచ్చిన మాల మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తొలతగా తమ గ్రామాలకు తరలించేందుకు కర్రలతో సమరం చేస్తారు.   దీనినే బన్నీ ఉత్సవం అంటారు. ఆయా గ్రామ ప్రాంతాల ప్రజలందరూ ఈ సమరంలో ఎంతో నియమ నిష్టలతో పాల్గొంటారు. అయితే ఈ ఉత్సవంలో దెబ్బలు తగిలిన రక్త గాయాలు అయినా కేవలం పసుపు మాత్రమే పూసుకుని తిరిగి బన్నీ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరీ ప్రాణంతమైన గాయాలు అయితే తప్ప ఆసుపత్రులకు వెళ్ళరు. అయితే కొన్ని సందర్భాలలో ఈ కర్రల సమరంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో  బన్నీ ఉత్సవాన్ని ఆపేందుకు, కనీసం..  హింసకు తావు లేకుండా జరుపుకులా  ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక దశలో పోలీసులు ఈ సాంప్రదాయ కర్రల సమరంపై నిషేధం కూడా విధించారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదులుకోబోమని తెగేసి చెప్పారు.

పోలీసుల ఆంక్షలు, నిషేధం దారి నిషేధానిదే.. అన్నట్లుగా సంప్రదాయంగా జరిగే కర్రల సమరం యథావిథిగా జరుపుకుంటున్నారు స్థానికులు.  తీవ్రమైన పోలీసు నిర్బంధం   ఉన్నప్పటికీ అర్ధరాత్రి 12 గంటలకు దాటంగానే ఒక్కసారిగా వేలాది మంది కర్రలతో ఆ ప్రాంతాన్ని చేరుకొని తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు కానీ అధికారులు కానీ ఏమీ చేయలేక వారికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయవలసిన పరిస్థితి. దీంతో కర్రల సమరం సమయంలో ఎవరికి గాయాలైనా.. ఎటువంటి ప్రాణాపాయం  సంభవించకుండా అక్కడే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్సను అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కర్రల సమరంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా భారీగా బద్దవస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. 

ఇక ఉత్సవం సందర్భంగా పాటించే నియమాలు, నిష్టల విషయానికి వస్తే.. ఉత్సవానికి ముందు అమావాస్య నుంచి దీక్షను చేపట్టి కంకణ ధారణ చేసుకుంటారు. కంకణ ధారులైన వారు బన్నీ ఉత్సవం ముగిసే వరకు  కాళ్లకు చెప్పులు వేసుకోరు. మద్యం మాంసం ముట్టరు.  బ్రహ్మచర్యం పాటింస్తారు.
ఇక దసరా రోజున అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని  తీసుకువెళ్లడానికి  నెరణికి, కొత్తపేట, నెరణికి తాండా తదితర గ్రామాల ప్రజలు  రెండు గ్రూపులుగా ఏర్పడి.. స్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లే  సమరం చేస్తారు.  ఉత్సవ విగ్రహం తిరిగి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు అత్యంత నియమనిష్టలతో పాటిస్తారు.  ఈ విధంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం అత్యంత కట్టుబాట్ల మధ్య, సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది .

Online Jyotish
Tone Academy
KidsOne Telugu