ఫోర్బ్స్ ప్రకారం భూమిపై అత్యంత శక్తివంతమైన ఏడుగురు మహిళలు

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారిలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రతి ఏటా ఫోర్బ్స్ సంస్థ  వెల్లడిస్తోంది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన జాబితా ప్రకారం అత్యంత శక్తివంతమైన మహిళల్లో మొదటి ఏడుగురి గురించి తెలుసుకుందాం...


1 ఏంజెలా మెర్కెల్,(Angela Merkel)
ఛాన్సలర్, జర్మనీ

 జర్మనీ రాజకీయాల్లో సంచలన నేత ఏంజెలా మెర్కెల్. శాస్త్రవేత్తగా ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె రాజకీయాల్లోనూ అరుదైన రికార్డులు సృష్టించారు. ఆమె 2005 లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ అయ్యారు.  ఆ తర్వాత వరుసగా నాల్గవసారి ఆమె ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. ఆమె జర్మనీలోని  బెర్లిన్ లో నివసిస్తున్నారు.

జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.  యూరోప్‌లో  పెరుగుతున్న వలస వ్యతిరేక భావనతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  మెర్కెల్ జర్మనీకి ఛాన్సలర్ కాకముందు శాస్త్రవేత్త. ఆమె భౌతిక రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసి  క్వాంటం కెమిస్ట్రీపై  థీసిస్ రాశారు. లీప్జిగ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆమె "శరణార్థులను కాపాడటంలో యూరోప్ విఫలమైతే అది మనం కోరుకున్న యూరోప్ కాదు." అంటూ ఆమె తన గళాన్ని గట్టిగానే వినిపిస్తారు.

2.  క్రిస్టిన్ లాగార్డ్ (Christine lagarde)
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు అధిపతి అయిన మొదటి మహిళగా క్రిస్టిన్ రికార్డు సృష్టించారు. నవంబర్ 1, 2019 న ఆమె ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.  ఆమె ప్రపంచ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి పనిచేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు  2011 నుండి 2019 మధ్యకాలం వరకు సారధ్యం వహించారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఆమె నివసిస్తున్నారు.

క్రిస్టిన్ టీనేజ్ లో మంచి స్మిమ్మర్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఫ్రెంచ్ స్మిమ్మర్స్ టీమ్ లో సభ్యురాలు. యూరోపియన్ ఆర్థిక వృద్ధి మందగించే సమయంలో ఆమె ద్రవ్య విధానానికి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధిని నడిపించారు. దేశీయ అవకాశాలను పెంచుకుంటూ బహుపాక్షిక వాణిజ్యంపై దృష్టి సారించారు. ఆమె వయసు 64. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఉంటున్నారు.

3.  నాన్సీ పెలోసి (Nancy pelosi)
యు.ఎస్. ప్రతినిధుల సభకు స్పీకర్.

యు.ఎస్. ప్రతినిధుల సభకు నాన్సీ పెలోసి 52 వ స్పీకర్. ఈ పదవి ఆమెను దేశంలో అత్యధిక ర్యాంకు పొందిన మహిళగా  నిలబెట్టింది.     2013 లో జరిగిన కార్యక్రమంలో ఆమెను నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. 2007 నుంచి 2011 వరకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మరోసారి 2019 లో స్పీకర్‌గా ఎన్నుకోబడ్డారు. అంతేకాదు యుఎస్ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నాల్గవసారి అభిశంసన విచారణను ఆమె 2019 లో ప్రారంభించారు.

ఆమె  కాలిఫోర్నియాలోని  శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తారు.  ట్రినిటీ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్ పూర్తి చేశారు. వివాహం చేసుకుని ఐదుగురు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ (Ursula von der leyen)
అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్,

 యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షపదవిలో జూలై 2019 లో ఉర్సులా వాన్ డెర్ లేయన్ నియమితులయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఉర్పులా. అంతేకాదు ఏంజెలా మార్కెల్ క్యాబినెట్‌లో 2005 నుండి 2009 వరకు అతి ఎక్కువ కాలం పనిచేశారు. గతంలో ఏ క్యాబినెట్ సభ్యులు కూడా ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేయలేదు. కేబినెట్‌లో ఉన్న చివరి ఆరు సంవత్సరాలుగా ఆమె జర్మనీ రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న ఆమె  బెల్జియంలో నివసిస్తున్నారు.

5. మేరీ బరా (Mary barra)
సీఈఓ, జనరల్ మోటార్స్

మేరీ  2014 నుండి జనరల్ మోటార్స్ CEO. డెట్రాయిట్ బిగ్ త్రీ వాహన తయారీ సంస్థ ఆమెకు అత్యధిక పరిహారంగా  2018 లో 21.9 మిలియన్ డాలర్లు అందించింది. ఆమె ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు  మావెన్ అనే రైడ్-షేర్ సేవలలో బిలియన్ల పెట్టుబడులు పెట్టారు. మేరీ ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థకు నేతృత్వం వహించిన  మొట్టమొదటి మహిళా.  ఆమె వయసు 58 సంవత్సరాలు. మిచిగాన్ లోని నోవిలో ఆమె నివాసం ఉంటున్నారు. USA సిటిజన్ షిప్ కలిగిన మేరీ వివాహం చేసుకుని ఇద్దరు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెట్టెరింగ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలను అందుకున్నారు.

6.  మిలిండా గేట్స్(Melinda gates)
కో-చైర్, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్

మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థపకురాలు. దాతృత్వంలో అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు.

2000 లో స్థాపించబడిన మిలిండా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల ట్రస్ట్ మూలధనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఛారిటబుల్ ఫౌండేషన్ గా ఏర్పడింది. ఈ ఫౌండేషన్ లక్ష్యం విద్య అందించడం, పేదరిక నిర్మూలన, పారిశుధ్యం, ఆరోగ్యం అందించడం మొదలైనవి. కఠినమైన  సవాళ్లను పరిష్కరించడంలో మిలిండా ఎక్కువగా కృషి చేస్తారు.ప్రజలందరికీ ఆరోగ్యకరమైనక జీవితాలను అందించే  ఫౌండేషన్ మిషన్‌లో భాగంగా  ఆమె ఎక్కువ భాగం మహిళలు, బాలికల హక్కుల సాధన కోసం  పనిచేశారు. ఆమె వయసు 55 సంవత్సరాలు. మదీనా, వాషింగ్టన్ లో ఆమె నివాసం.  బిల్ గేట్స్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. డ్యూక్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

7 అబిగైల్ జాన్సన్ (Abigail Johnson)
CEO, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్

ఆమె ఆస్తుల విలువ 15 బిలిియన్ డాలర్లు.   అబిగైల్ జాన్సన్ 2014 నుండి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్  CEO గా పనిచేశారు, ఆమె తన తండ్రి నుంచి 2016లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి చైర్మన్‌గా ఉన్నారు.  ఆమె తాత, ఎడ్వర్డ్ జాన్సన్ II మ్యూచువల్ ఫండ్ సంస్థను 1946 లో బోస్టన్ లో స్థాపించారు. ఆ సంస్థలో ఆమె వాటా 24.5శాతం. అంటే దాదాపు 2.9 ట్రిలియన్ డాలర్లు. జాన్సన్ కుటుంబం బోస్టన్ ప్రాంతంలో లాభాపేక్షలేకుండా అనేక దానధర్మాలు చేస్తుంది. అంతేకాదు న్యూ ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహాకారం అందించింది.
 
ఆమె మసాచుసెట్స్ లోని మిల్టన్ లో నివసిస్తున్నారు.  యుఎస్ పౌరసత్వం ఉన్న జాన్సన్ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News