ఒకవైపే చూడు... రెండోవైపు చూడాలనుకోకు... తట్టుకోలేవూ

ఒకవైపే చూడు... రెండోవైపు చూడాలనుకోకు... తట్టుకోలేవూ... మాడి మసైపోతావ్... ఈ డైలాగ్ మన హీరోలకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది... అభిమానులే దేవుళ్లు... సోదర సమానులు... మనదంతా ఒకటే కుటుంబం... మీరే లేకపోతే మేము లేమంటూ... ఆడియో ఫంక్షన్లలో హీరోలు పలికే మాటలు నిజమేనేమోననుకుని తీరా దగ్గరకెళితే... హీరోల రెండో యాంగిల్ చూసి షాక్ తింటున్నారు. అప్పటివరకూ దేవుళ్లంటూ పొడిగిన తమ అభిమాన హీరో... బూతులు లంకించుకోవడంతో బిక్కమొహం వేస్తున్నారు. ఒక్కోసారి చాచి చెంప మీద కొడుతుంటే... కిక్కురుమనకుండా కామైపోతున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున లాంటి పెద్ద హీరోలందరూ ఇలాగే ప్రవర్తిస్తుండటంతో అభిమానులు షాక్ తింటున్నారు.

ఇటీవల ఓ ఫంక్షన్లో అభిమానులను పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి... వేదిక దిగాక అదే అభిమానులను స్టుపిడ్ ఫెలోస్ అంటూ బూతులు లంకించుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు, ఇక బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... అభిమానులను చాచి చెంప మీద కొట్టడమే కాకుండా కాలితో తన్నిన సందర్భాలెన్నో ఉన్నాయ్, చిరంజీవి అయితే ఇంగ్లీష్ లో తిట్టాడు కానీ... బాల‌కృష్ణ మాత్రం అచ్చమైన తెలుగులో పచ్చి బూతులు తిడతాడు, చిరంజీవి, బాల‌కృష్ణ రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి... వాళ్ల నోటి దురుసుకి నేతలు, కార్యకర్తలు సైతం బలైనవాళ్లే.

అభిమానులన్నాక తమ అభిమాన హీరోతో మాట్లాడాలని పలకరించాలని, చేయి కలపాలని... ఇంకా కుదిరితే ఓ సెల్ఫీ దిగాలనుకుంటారు, తమ హీరో కనిపించినప్పుడు ఈలలేస్తారు? కేకలేస్తారా? ఇది సహజం... అయితే ఎలాంటి స్వార్థం, లాభం ఆపేక్షించకుండా తమను ఆరాధిస్తున్న అభిమానులను మాత్రం హీరోలు తూలనాడుతున్నారు, వేదికపై ఉన్నప్పుడు పొగిడి...కిందికి దిగిన వేంటనే బూతులు అందుకుంటున్నారు. ఆస్తులతోపాటు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న అభిమానుల ఆనందం కోసం ఓపిక పట్టలేకపోతున్నారు.
 
సినిమా బాగుంటే అందరూ చూస్తారు... ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా హిట్ చేస్తారు... అదే సూపర్ హిట్ కావాలంటే మాత్రం అభిమానుల అండ కావాలి... సినిమా ఎంత బాగున్నా సాధారణ ప్రేక్షకుడు ఒకసారి మాత్రమే థియేటర్ కి వెళ్తాడు... అదే అభిమాని అయితే నాలుగైదు థియేటర్ కి వస్తాడు, తిండికి తిఖానా లేకపోయినా కటౌట్లు కడతారు, వందలు వేల రూపాయలు ఖర్చు చేసి నాలుగైదుసార్లు సినిమా చూస్తారు, ఒకవేళ తమ అభిమాన హీరో సినిమా అట్టర్ ఫ్లాపైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు, అందుకే కొందరు హీరోలు మాత్రమే సూపర్ స్టార్లు అవుతున్నారు, స్టార్ డం సంపాదిస్తున్నారు, కానీ హీరోలు మాత్రం తమ అవసరాల కోసం మాత్రమే ఫ్యాన్స్ ను వాడుకుంటూ కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు.

హీరోల నైజం తెలిసినా కూడా అభిమానుల్లో మార్పు రావడంలేదు, ఒళ్లుంతా హూనం చేసుకుని కష్టపడి సంపాదించిందంతా వాళ్ల కోసమే తగలబెడుతున్నారు, రిక్షాతొక్కి, కూలీపని చేసుకుని బతికేవాళ్లు సైతం... తమ అభిమాన హీరో సినిమాను పది పన్నెండుసార్లు చూస్తూ వాళ్లను వందల కోట్ల అధిపతులుగా చేసేస్తున్నారు, తల్లికి ఓ గ్లాసుడు పాలు, పెళ్లాం పిల్లలకి కనీసం తిండిపెట్టనోడు కూడా... బిందెడు పాలతో హీరోఫొటోకి పాలాభిషేకం చేస్తున్నారు, చదువుకోని వాళ్లే కాదు... వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు, తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ ఫేస్ బుక్, ట్విట్టర్లో కామెంట్స్ పెడుతూ భారతీయుల విలువైన సమయాన్ని పాడుచేయడమే కాకుండా... సోషల్ మీడియా ఉద్దేశాన్ని సైతం చెడగొడుతున్నారు, అభిమానుల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోవడంతో వాళ్లు మారే పరిస్థితి కనిపించడం లేదు, కొట్టినా తిట్టినా తమ అభిమాన హీరోల వెంటే పడతామంటున్న అభిమానులు ఇక మారరు. మారనే మారరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu