జగన్ యూటర్న్.. టీడీపీకి భలే ఆయుధం దొరికిందిగా!!

  పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం కూడా ఉంది. పాదయాత్రలో జగన్ ఈ పెన్షన్ గురించి చెప్పారు. చేనేతలు, ఇతర వృత్తుల్లో ఉండే బలహీనవర్గాలకు చెందిన వారు కష్టం చేసి.. 45 ఏళ్లకే సర్వశక్తులు కోల్పోతున్నారని.. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం దీని గురించి రాయలేదు.  అయితే తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఈ హామీ గురించి ప్రస్తావించింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమవగానే.. 45 ఏళ్లకే పెన్షన్ అంశాన్ని హైలెట్ చేసింది. 45 ఏళ్లకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇస్తామన్న పెన్షన్ ను ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ మరియు వైసీపీ నేతలు మాత్రం మేనిఫెస్టోలో ఆ హామీ లేదన్నట్లుగా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మాత్రం.. జగన్ హామీని అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ అంశాన్ని బలంగా వినిపించిన నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడులపై.. స్పీకర్ చైర్ లో కూర్చున్న కోన రఘుపతి.. సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేశారు. దీంతో వైసీపీ సర్కార్ టీడీపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అయింది. జగన్ హామీ విషయంలో మాట తప్పారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సస్పెండ్‌ చేశారని విమర్శించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా జగన్ మీద విమర్శలు గుప్పించారు. 46 ఏళ్లకి వైఎస్ జగన్ గారికి ఉద్యోగం వచ్చింది.. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది అని ఎద్దేవా చేసారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారని లోకేష్ విమర్శించారు. టీడీపీ నేతలనే కాదు నెటిజన్లు కూడా 45 ఏళ్ళ పెన్షన్ పై జగన్ యూటర్న్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు.. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో.. టీడీపీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు కూడా సభ నుండి వాకౌట్ చేసారు. మొత్తానికి 45 ఏళ్ల పెన్షన్ హామీతో టీడీపీ జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి జగన్ ఈ హామీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మేనిఫెస్టోలో లేదని లైట్ తీసుకుంటారో, లేక మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పకుండా అమలు చేస్తాను అంటారో చూడాలి.

బాబు కాకుండా మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలే.. అందుకే గప్ చుప్!!

  అసెంబ్లీలో చంద్రబాబు కాకుండా టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరే అని చెప్పాలి. గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు అంటే.. వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసలు వారి వాయిస్ నే వినిపించట్లేదు. ఎమ్మెల్యేల వైఖరి పట్ల బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అధికారపక్షం వైసీపీ తరఫున అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య, రామానాయుడు తప్ప మిగిలిన వారెవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. గతంలో అసెంబ్లీలో ఉన్న సమయంలో కరణం బలరామ్, పయ్యావుల కేశవ్‌ వంటి వారు టీడీపీ మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. వారి వాగ్ధాటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందిపడే వారు. అలాంటిది ఇప్పుడు వారి గొంతు అసెంబ్లీలో అసలు వినిపించడం లేదు. అనవసరంగా వైసీపీకి టార్గెట్ అవ్వడం ఎందుకని కొందరు, టీడీపీలో ఇంకెన్ని రోజులు ఉంటామో తెలీదు ఈ మాత్రం దానికి హడావుడి ఎందుకని మరికొందరు.. సైలెంట్ గా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి టార్గెట్ అవుతామనే భయం సంగతి పక్కనబెడితే.. టీడీపీ నుంచి పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ మారిపోతాం కదా.. ఇప్పుడెందుకు అసెంబ్లీలో చొక్కాలు చించుకోవడం అని బీజేపీ గూటికి చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు సైలెంట్ అవుతున్నారట.  కరణం బలరాం, పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీ బీజేపీలో చేరతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ ముగ్గురూ నోరు విప్పడం లేదట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి అసలు స్పందనే లేదు. బీజేపీలో చేరే వారిలో తొలి వ్యక్తి గంటానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, గద్దెరామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ బాబు ఎందుకు నోరెత్తడం లేదనేది మరో ప్రశ్న. సాధారణంగా గొట్టిపాటి రవి అసెంబ్లీలో మితంగా మాట్లాడతారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఇక మంచి వాగ్ధాటి ఉన్న గద్దె రామ్మోహన్ కూడా ఈసారి అస్సలు మాట్లాడటం లేదు. బాబు గురించి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు కూడా గద్దె రామ్మోహన్ స్పందించడంలేదు. వెలగపూడి రామకృష్ణబాబుది కూడా ఇదే తీరు. దీంతో ఎమ్మెల్యేల తీరుపై బాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమరావతిపై ప్రపంచ బ్యాంక్ నిర్ణయం.. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం!

  ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది.  Working Group on International Financial Institutions (WGonIFIs) మరియు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క బాధిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రజల ఉద్యమాలు, పౌర సమాజ సంస్థల వ్యతిరేకత మరియు ప్రభావిత వర్గాల వారి నుంచి తనిఖీ ప్యానెల్ కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంపై నర్మదా బచావ్ ఆందోళన్ మరియు నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ యొక్క సీనియర్ కార్యకర్త మేధా పట్కర్ స్పందించారు. "అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో పాల్గొన్న స్థూల ఉల్లంఘనలను ప్రపంచ బ్యాంక్ గ్రహించి, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నర్మదా మరియు టాటా ముంద్రా తరువాత, ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూపుపై సాధించిన మూడవ అతిపెద్ద విజయం. నర్మదా బచావ్ ఆందోళన్ పోరాటం కారణంగా ఏర్పడిన తనిఖీ ప్యానెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రజల అనుమతి లేకుండా వారి ఎజెండాను ముందుకు తీసుకురావద్దని మేము ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తున్నాం" అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ కు 2014 లో శ్రీకారం చుట్టినప్పటి నుండి.. పర్యావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు మరియు ఉద్యమ సంఘాలు.. పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత, సారవంతమైన భూమిని భారీగా స్వాధీనం చేసుకోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశాయి. సారవంతమైన వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసాయి. రాజధాని ప్రాంత రైతు సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ.. "మా భూమి మరియు జీవనోపాధికి సంబంధించి అనిశ్చితితో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ పోరాటం మా జీవితంలో మరచిపోలేని ఒక ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఇప్పటికైనా రాష్ట్రం మరియు ఇతర ఫైనాన్షియర్లు అర్డంచేసుకొని.. ప్రజల ఆందోళనలను నిజాయితీ మరియు నిబద్ధతతో పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాము." అన్నారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మరొక సహ-ఫైనాన్షియర్.. తమను తాము పారిస్-పోస్ట్ బ్యాంక్‌గా అంచనా వేస్తూ.. వాతావరణ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి నిబద్ధతను సూచిస్తూ, ఇప్పుడు దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వారి అధికారిక పత్రాలలో పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో కో-ఫైనాన్షియర్‌గా మాత్రమే ప్రవేశించి.. AIIB ఈ ప్రాజెక్టులో కట్టుబడి ఉండటానికి ప్రపంచ బ్యాంక్ విధానాలను ఉపయోగించింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వైదొలగడంతో సహ-ఫైనాన్షియర్‌గా, ఇప్పుడు AIIB యొక్క స్థితి అస్పష్టంగా ఉంది. WGonIFIs రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవల్సినవి: 1. సిఆర్‌డిఎ ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌.. 2013 కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లోని బాధిత ప్రజలందరి విషయంలో భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 ను పూర్తిగా అమలు చేసి. అలాగే, ప్రజల నుండి అసంకల్పితంగా తీసుకున్న స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి.  2. వ్యవసాయం, కార్మికులు, అద్దెదారులు, భూమిలేని కుటుంబాలు, భూసేకరణ మరియు స్థానభ్రంశం ప్రక్రియ కారణంగా తీవ్రమైన ఒత్తిడి మరియు భయానికి గురైన దళితుల సామాజిక-ఆర్థిక నష్టం, భూ లావాదేవీలు అంశాలపై న్యాయ విచారణను ప్రారంభించాలి. 3. గత ఐదేళ్లలో వారి సామాజిక జీవితం చాలా వరకు దెబ్బతిన్నందున దళితులు మరియు భూ యజమానుల కోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలి. 4. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు క్యాపిటల్ రీజియన్ ప్రకటించిన తరువాత కేటాయించిన భూములను కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలి. 5. డాక్యుమెంటరీ తారుమారు ద్వారా దళిత రైతులను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నాలను ఆపివేసి, 2013 చట్టం ప్రకారం పరిహారం మరియు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్న భూమికి అసలు యజమానులుగా దళితులని పరిగణించాలి. ప్రాజెక్ట్ గురించి: జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తరువాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. 2014 సెప్టెంబరులో, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రతిపాదిత రాజధాని నగరంగా ప్రకటించారు, దీనిని చాలా సంవత్సరాలు పాటు అభివృద్ధి చేయనున్నారు. 715 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు AIIB పరిశీలనలో ఉన్నాయి. రిస్క్ అసెస్‌మెంట్‌లో కూడా, ప్రపంచ బ్యాంక్ సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ కి కేటగిరి A ని కేటాయించింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో నగరాన్ని నిర్మించడం, సారవంతమైన వ్యవసాయ భూములు మరియు అడవులను తొలగించడం, సుమారు 20 వేల కుటుంబాలను స్థానభ్రంశం చేయడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం మరియు నగర నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు యొక్క భద్రతా విధానాలను ఉల్లంఘించినందుకు ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ బ్యాంకు యొక్క తనిఖీ ప్యానెల్ కు 2017 లో బాధిత సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రక్రియలో ఉంది మరియు తనిఖీ బోర్డు నుండి దర్యాప్తు అర్హతపై సిఫారసు కోసం బ్యాంక్ బోర్డు వేచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై.. అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణం మీద వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. కానీ వైసీపీ నేతలు కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకీ వచ్చిన వైసీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

దుర్గాబాయి దేశ్‌ముఖ్.. నెహ్రూని అడ్డుకున్నారు, గాంధీకి గాజులిచ్చారు!

  మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు.  బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.

పోలవరానికి బ్రేకులు.. సర్దుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు!!

  పోలవరం ప్రాజెక్ట్ అసలు ఇప్పట్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పోలవరం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వందల మంది కార్మికులు, భారీ యంత్రాలతో హడావుడిగా కనిపించే పోలవరం ప్రాంతంలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరద సీజన్‌ కాబట్టి డయాఫ్రంవాల్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. స్పిల్‌వే వద్ద కాంక్రీటు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలు వరదల ప్రభావం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా వస్తాయి. ఇలా కొంతకాలం ఈ పనులు పుంజుకునే అవకాశం లేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.55వేల కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రూ.కోట్లాది బిల్లులు పెండింగ్‌ పడడంతో కాంట్రాక్టు సంస్థలు మెల్లగా సర్దుకుంటున్నాయి. ఇంతకాలం మట్టి పనులు చేసిన త్రివేణీ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పని నుంచి తప్పుకుంది. తన కంటైనర్లతోపాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను కూడా తరలించుకుని పోతోంది. ఈ సంస్థకు సుమారు రూ.70 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయట. దీనికంటే ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ కాఫర్‌ డ్యామ్‌ బెడ్‌ పనులు చేసి వెళ్లిపోయింది. ఆ సంస్థకు కూడా రూ.కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నవయుగ, మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా రూ.వందల కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాలలో కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేపట్టారు. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. అందులో గత నెల వరకూ 1.7 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీనిని తర్వాత పూర్తి చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం వరదల వల్ల ఇంతవరకూ నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ దెబ్బతినకుండా పీపీఏ ఓ డిజైన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలో 34 గ్రామాలకు వరద ముప్పు ఉందని, ప్రజలు ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలని తటపటాయిస్తున్నారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివెళ్లిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతీ ఏటా వరదల వల్ల దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు మునిగిపోతుంటాయి. పడవ ప్రయాణమే శరణ్యం. కానీ ఈసారి గోదావరిలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2.45 కిలోమీటర్లు. గతంలో ఇంత వెడల్పున గోదావరి వరద నీరు కిందకు ప్రవహించేది. కానీ ఇప్పటికే 1.7 కిలోమీటర్ల కాఫర్‌ డ్యామ్‌ను గోదావరికి అడ్డంగా కట్టారు. సుమారు 25మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైపు నదిలో కొంత భాగం వదిలేశారు. ప్రస్తుతం వరద నీరు కాఫర్‌ డ్యామ్‌ కట్టగా, మిగిలిన నదీ భాగం నుంచే కిందకు లాగవలసి ఉంది. ప్రస్తుతం పోలవరం వైపు పైపుతో నిర్మించిన వంతెన ద్వారా నదిని మళ్లించారు. కానీ గోదావరి వరద ఉధృతమైతే ప్రాజెక్టు వద్ద తక్కువ భాగంలో నుంచి మొత్తం నీరు లాగదు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం అంటే పాపికొండల వైపు వరదనీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఆయా గ్రామాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండి, గ్రామాలలో జనం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రజల ఆందోళన చెందుతున్నారు.

కేసీఆర్ సర్కార్ మీద కేంద్రం నజర్....వయా టీవీ9 ?

  తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ కోకి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? అంటే అవుననే అనిపిస్తోంది తాజాగా జరుగుతున్న పరిణామాలు. కేసీఆర్, జగన్ ల మధ్య దోస్తీ రహస్యం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే కేంద్రం మాత్రం కేసీఆర్ ను నమ్మినట్లే నమ్మి సమయం కోసం వేచి చూసింది కార్యాచరణ మొదలుపెట్టిందని తెలంగాణాలో కేసీఆర్ ప్రభ అంతం చేయడానికి పూనుకుందని అంటున్నారు.  ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కి ఊపిరి ఆడనివ్వడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రజలకు ఏదో చేసేశామని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని కేంద్రానికి నివేదికలు వెళ్లాయి. అసలే ఎప్పుడు ఎంటర్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్న బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని వదులుకోడానికి సిద్దంగా లేక తాజాగా ఐటీ దాడులు మొదలు పెట్టారు.  హైదరాబాద్‌లో మై హోం రామేశ్వర రావు ఇల్లు, కార్యాలయాలపై నిన్నన  ఉదయం 7 గంటల నుంచి ఐటీ అధికారులు దాడులు చేశారు. నంది నగర్‌లోని ఆయన నివాసం, హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసుల్లో సుమారు 200 మంది అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. చానెళ్ళ మీద చానెళ్ళు కొంటూ మీడియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ అండతో భూదందా చేసి వేలకోట్ల ఆస్తులు కూడగట్టి పెద్ద మాఫియాగా తయారైన రామేశ్వరావుకి అవేమీ కాకుండా అనవసరంగా కావాలని కొన్న లావాదేవీలు మెడకు చుట్టుకొని కేంద్రానికి అదే ఆయుధంగా మారింది.  అదీకాక మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర రావు టీఆర్‌ఎస్ పార్టీకి ఇటీవల రూ.3000 కోట్ల ధనాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రామేశ్వర రావుతో పాటు మరో వ్యాపారవేత్త శ్రీనిరాజు హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల భూమిని 20% శాతం ధరకే దక్కించుకున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. రైతులకు చెందిన భూములను ఉదారంగా కట్టబెట్టినట్లు కొంత మంది ఆరోపిస్తున్నారు.  అయితే నిన్నజరిగిన సోదా మాత్రం టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు రూ.220 కోట్లను తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అని అంటున్నారు. టీవీ9 సంస్థను రామేశ్వర రావు స్వాధీనం చేసుకోవడం, ఛానెల్ నుంచి రవిప్రకాశ్‌ను తప్పించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే రవి ప్రకాష్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.   

మచిలీపట్నం పోర్టు తెలంగాణాకి రాసిచ్చేశారా జగన్ ?

  అదేదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఒకటుంది " పొలం పుట్ర లో పొలం నాకు..పుట్ర నీకు..వాగువంక లో వాగు నాకు..వంక నీకు..కొంపాగోడు లో కొంప నాకు..గోడు నీకు..పంచేసుకోని హ్యాపీ గా ఉందాం.." అలా ఉంది ఏపీ సీఎం జగన్ వ్యవరించే తీరు. నిజానికి ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అవగానే తెలంగాణాలో ఉన్న ఏపీ భవనాలు ఏవీ తనకు అక్కర్లేదని మీరే తీసేసుకోండని చెప్పి వచ్చారు. ఆయన అడిగాడో లేక ఈయనే అడిగాడో తెలీదు కానీ, మొత్తానికి తెలంగాణాకి లాభం చేకూర్చే వాటికీ చాలా సందర్భాల్లో వత్తాసు పలుకుతూ వచ్చారు.  ఇందులో అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏపీకి పనికి వచ్చేది లేదు. తాజాగా కేసీఆర్, జగన్ హైదరాబాద్లో భేటి ఆయన విషయం తెలిసిందే, ఈ సమావేశం సుమారు అరు గంటల పాటు జరిగింది. ఇదే భేటిలో మచిలీపట్నం పోర్టు అంశం గురుంచి చర్చకు వచ్చినట్లు ఆ పోర్ట్ తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ జగన్ ని కోరగా దానికి జగన్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మూడు రోజుల నాడు తెలంగాణకు మచిలీపట్నం పోర్ట్ కేటాయిస్తూ రహస్య జివో RT-62 28/06/2019 రిలీజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ రహస్య జివోలో మచిలీపట్నం పోర్ట్ పూర్తి హక్కులు, సుమారు 8000 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణకి చెందేటట్లు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.  దాదపుగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ప్రబుత్వం ఈ విషయం మీద స్పందించలేదు. పోర్టులు, భవనాలు, నీళ్లు కేసీఆర్‌కు ధారాదత్తం చేస్తారా..? ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ నేతలకి ప్రభుత్వం అసలు తమకి ఏమీ వినపడడం లేదనట్టు ప్రవర్తించడం పలు అనుమానాలకి తావిస్తోంది. నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లో నెంబర్ ప్రకారం కాన్ఫిడెన్షియల్ జీవో అంటూ ఒక జీవో కనిపిస్తున్నది.  అయితే ఈ జీవో నిజంగా పోర్టును తెలంగాణాకి ధారాదత్తం చేశాడా ? ఓకవేళ నిజంగా చేసినట్ట్టయితే ఏదో ఒక రోజు బయటకు రావలసిన విషయమే అది. అయితే అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో ఒక చిన్ని చెంబు కూడా వదులుకోని సమాజం మనది, అలాంటిది అన్న వాటాకి సంబందించిన ఎయిర్ కూలర్ లాంటి వస్తువును అన్నకే తెలీకుండా తమ్ముడు తీసుకుంటే అది తెలీకుండా ఉంటుందా ? చూడాలి ఈ కాన్ఫిడెన్షియల్ జీవో ఎన్నాళ్ళు కాన్ఫిడెన్షియల్ గానే ఉంచుతారో ?

జులై 1 నుంచి సీఎం జగన్ ప్రజాదర్బార్

  ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక గుంటూరుజిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు వినతి పత్రాలతో పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. వచ్చిన వారందరి నుంచీ నెలరోజులుగా సీఎం కార్యాలయం అధికారులు వినతులు తీసుకుంటున్నారు. చాలా మంది నేరుగా సీఎం జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రజల విన్నపాలు తెలుసుకున్న జగన్‌.. క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. జులై 1న ప్రజాదర్బార్‌ ప్రారంభానికి మహూర్తంగా నిర్ణయించారు. ఆలోపు తగిన ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలతో.. ఇప్పటికే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. క్యాంపు కార్యాలయం ప్రవేశమార్గం వద్ద ఓవైపు షెడ్డును నిర్మించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడ వేచి ఉండే అవకాశం కల్పిస్తారు. మంచినీటి సదుపాయం, ఫ్యాన్లు  ఏర్పాటు చేస్తున్నారు.  జులై 1 నుంచి రోజూ ఉదయం 8గంటల తర్వాత గంట పాటు సీఎం జగన్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, స్వయంగా వారి సమస్యలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతే సీఎం.. రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.  గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... హైదరాబాద్‌ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి కొనసాగించారు. ఇప్పుడు ఆయన మార్గంలోనే ప్రజా దర్బార్‌ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్‌ నిర్ణయించి అమలు చేయబోతున్నారు.

బీజేపీ వారు శాసిస్తారు....జగన్ పాటిస్తాడు ?

  మరో రెండేళ్ళలో చంద్రబాబు జైలుకు వెళతారట, ఈ మాట చెప్పింది ఎవరో కాదు బీజేపీకి ఏపీ ఇంచార్జ్ గా నియమించబడిన దేవధర్ అనే బీజేపీ నేత. ఆయన నిన్న ఆ పార్టీ మహిళా నాయకురాలు చంద్రబాబుకు బంధువు అయిన పురందేశ్వరితో కలిసి ఎన్టీఆర్ జన్మ స్థలం అయిన పామర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ఆయన పేదల సంక్షేమం కోసం తెలుగుదేశాన్ని స్థాపించి 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు ఆయన. ఆయన అలా వ్యాఖ్యానించారో లేదో మరో పక్క గత ప్రభుత్వ అవినీతి మీద జగన్ ఒక కమిటీ నియమించారు. ఈరోజు ఏపీ విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాల మీద దృష్టి సారించిన జగన్ సోలార్, విండ్ పవర్ కొనుగోళ్ల విషయంలో బిడ్డింగ్ రేట్లు కన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీరియస్ అయ్యారట. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని రికవరీ చేయాలి జగన్ ఆదేశించారు. ఆయా విద్యుత్ సంస్థలతో తిరిగి సంప్రదింపులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వాటితో ఉన్న ఒప్పందాలు రద్దు చేస్తున్నట్టు జగన్ ఆదేశించారు. ఈ ఒప్పందాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరినట్టు తెలియడంతో అప్పట్లో ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి సీఎం, మంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంటే అదేదో సినిమాలో ఆ దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అన్నట్టు బీజేపీ నేతలు సిగ్నల్ ఇస్తారు, జగన్ ఉచ్చు బిగిస్తారు అన్నమాట. నిజానికి చంద్రబాబు మీద అసలు కేసులే లేవని ఆయనను ఇబ్బంది పెట్టె అవసరం ఎవరికి ఉంటుందని నిన్ననే తాజగా పార్టీ ఫిరాయించిన సుజనా ప్రశ్నించారు. తమను చంద్రబాబే పార్టీ మారేలా ప్రోత్సహించి కేసుల నుండి బయట పడే ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో ఆయన అలా స్పందించారు. కేసులు లేకపోతే రెండేళ్ళలో జైల్లో వేయడం ఎలాగని అనుకున్నారో ఏమో తెల్లారే సరికి కేసులు నమోదు చేసే సౌలభ్యాన్ని కలిగించారు.

కాళేశ్వరం కోసం కష్టపడిన హరీష్ రావుని పక్కన పెట్టేసారు!!

  కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఇక మంత్రులకుఅన్నారం, సుందిల్ల, కన్నేపల్లి బ్యారేజీలు.. ప్రాజెక్టులోని పంప్ హౌస్ లను అధికారంగా ప్రారంభించే అవకాశం దక్కింది. అయితే కేసీఆర్ సీఎం హోదాలో కాళేశ్వరంను ఎంత పట్టుదలతో పూర్తి చేయించారో.. అంతే పట్టుదలతో హరీష్ రావు.. గడిచిన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా కృషి చేసారు. కేసీఆర్ గొప్పగా చెబుతున్నట్టు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అదంతా హరీష్ రావు కృషే అంటారు. అలాంటిది ఇప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావుకి కనీసం చోటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు ఇప్పుడు వివిధ సహ బ్యారేజీలు, పంప్ హౌస్ లు ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం అంత కృషి చేసిన హరీష్ రావుకు శిలా ఫలకంలో పేరు కాదు కదా.. కనీసం పిలుపు కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. కష్టమొకరిది.. వాటిని అనుభవించే ఫలితం మరొకరిదిలా తయారైందని హరీష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయకపోవడానికి ఓ రకంగా హరీష్ రావే కారణమని తెలుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు పెద్ద సభ పెట్టటం.. తమ ఆనందాన్ని, తాము సాధించిన విజయాన్ని చెప్పుకోవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేవలం పూజలకే పరిమితం చేసారు. ఒకేవేళ సభ ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ రావు పేరుని ప్రస్తావించి ఆయనకు క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోనీ ఆయన పేరు ప్రస్తావించకుండా ఉందామా అంటే విమర్శలు వస్తాయి,   అటు పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పని సభ పెట్టలేదని తెలుస్తోంది.

టీడీపీకి భారీ షాక్.. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు గుడ్ బై!

  ఏపీ తెలుగుదేశంలో ముసలం ఏర్పడింది. చంద్రబాబు విదేశీ టూర్‌లో ఉండగా ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్ల‌మెంట‌రీ పార్టీ చీలిపోయింది.చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులుగా పేరున్న సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌తో పాటుగా గ‌రిక‌పాటి మోహ‌న‌రావు, టీజీ వెంకటేష్ టీడీపీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడికి లేఖ అందజేశారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. సీతారామలక్ష్మీ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు సమాచారం. కనకమేడల మాత్రం టీడీపీని వీడే ఆలోచనలో లేనట్టు తెలిసింది. తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స‌రిగ్గా పార్టీ మార‌టానికి ఈ నేత‌లు ఇదే స‌రైన స‌మ‌యంగా ఎంచుకున్నారు. పార్టీ కార్యాల‌యం నుండి స‌మాచారం అందుకున్న చంద్ర‌బాబు ఈ నేతలను ఫోన్ ద్వారా సంప్ర‌దించ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా వీరు మాత్రం ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డలేదు. అయితే క‌నీసం లోక్‌సభ స‌భ్యులైనా వెళ్ల‌కుండా అపేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని తిరిగి ఏపీకి వ‌చ్చే అవ‌శాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

అసెంబ్లీలో బాబు వర్సెస్ జగన్.. హోదాపై మాటల యుద్ధం!!

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరపున హోదా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా’’ అని జగన్‌ తెలిపారు. ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని స్పష్టం చేశారు. 2014 మార్చిలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని.. హోదా ఇవ్వాలని  తాము ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. హోదాను  ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పేరు మార్చాం కానీ.. హోదాతో వచ్చే లాభాలతో ప్యాకేజీ ఇస్తున్నామని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  దీంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా చంద్రబాబు తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ మాత్రం ప్రత్యేక హోదా పేరుకు ఒప్పుకోలేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు హోదాకు బదులుగా ప్యాకేజీ పేరు పెట్టారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ 29సార్లు ఢిల్లీకి వెళ్లానని.. రాజకీయంగా నష్టపోయినా రాష్ట్రం కోసం పోరాటం చేశామని ఆయన చెప్పారు.  ప్రత్యేక హోదా కోసం తాను సిన్సియర్‌గా పోరాటం చేసినట్టుగా  చంద్రబాబు చెప్పారు. ప్లానింగ్ కమిషన్‌కు వెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం సరైంది కాదన్నారు. మీకు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ను చంద్రబాబు కోరారు.  తనపై బురద చల్లితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని  ఆయన అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు ప్రసంగానికి జగన్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడ రాయలేదన్నారు.  చంద్రబాబు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయని విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

దమ్ముంటే పట్టిసీమ వాడకం ఆపేయండి!!

  ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రవేశ పెట్టారు. విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. ఇద్దరూ తమ ప్రసంగంలో.. టీడీపీ పాలనపై అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌పై అచ్చెన్నాయుడు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలన్నట్లుగా సాగింది.  పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంచనాలు పెంచి.. టీడీపీ సర్కార్ దోపిడీకి పాల్పడిందని కాంట్రాక్టర్లకు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విమర్శలపై అచ్చెన్నాయుడు సూటిగా స్పందించారు. అంచనాలు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సవాల్ చేశారు. అంచనాలు తగ్గించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే సన్మానం చేస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు తప్పు చేశారన్న వైసీపీ నేతలకూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అడిగారో, ఇచ్చారో ప్రభుత్వం దగ్గర రికార్డులుంటాయన్నారు. పట్టిసీమపైనా వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై పెట్టినంత దృష్టి పోలవరంపై పెడితే.. ఈ పాటికే ప్రారంభమయ్యేదని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదనుకుంటే అ ప్రాజెక్ట్ ను ఉపయోగించడం మానేయాలని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం.. కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకుని.. ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారని గుర్తు చేశారు.

రెండేళ్లు టైం ఇవ్వండి.. ప్రభుత్వ పాఠశాలలంటే ఏంటో చూపిస్తాం!!

  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక జెడ్పీ పాఠశాలలో ఈరోజు చేపట్టిన ‘రాజన్న బడిబాట' కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ఆశీర్వదించిన జగన్ ఓ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మరికొందరు చిన్నారుల చేత కూడా పలక, బలపం పట్టించి చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని అక్షరాలు దిద్దించారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ‘రాజన్న బడిబాట' నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్షరాభ్యాసం చేయించిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. చిన్నారులతో కలిసి గడపడం, వాళ్లు బాగా చదువుకోవడం తన మనసుకు నచ్చిన విషయమని తెలిపారు. తన మనసుకు నచ్చిన పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘పిల్లలు బడికి పోవాలి. బడుల నుంచి కాలేజీకి పోవాలి. అక్కడి నుంచి వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల వంటి పెద్దపెద్ద చదువులు చదవాలి. ఈ చదువుల కోసం ఏ తల్లీతండ్రి అప్పులపాలు కాకూడదు అన్నదే నా ఆశ' అని జగన్ అన్నారు. 'ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి నేను మాటిచ్చా.. మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది. ఇవాళ నేను ప్రతీ తల్లి, చెల్లికి ఇక్కడి నుంచి ఒకేఒక మాట చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడికి పంపండి. ఏ స్కూలుకు పంపించినా ఫరవాలేదు. బడికి పంపించినందుకు వచ్చే ఏడాది జనవరి 26 నాటికి ఏపీ పండుగదినం చేస్తాం. జనవరి 26వ తారీఖున పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లి చేతిలో రూ.15,000 పెడతాం. ఏ తల్లి కూడా తన బిడ్డను చదివించేందుకు కష్టపడకూడదు అనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం’ అని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. 'అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం.’ అని జగన్ భరోసా ఇచ్చారు.

సభా సంప్రదాయాన్ని మరిచిన జగన్.. చంద్రబాబు తీవ్ర అసంతృప్తి!

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయం ప్రకారం.. అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి వుండగా.. ఆ సమయంలో విపక్ష నేత చంద్రబాబు రాలేదు. దీంతో స్పీకర్ కు ధన్యవాదాలు చెప్పే సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే విషయమై విమర్శలు గుప్పిస్తుండగా, చంద్రబాబు దీనిపై క్లారిఫికేషన్ ఇఛ్చారు. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేనితో తనకు సత్సంబంధాలున్నాయని, ఆయన పేరును చెప్పగానే తనకు సంతోషం వేసిందని బాబు అన్నారు. 2014లో తాము కోడెల శివప్రసాద్ పేరును అనుకున్న సమయంలో విపక్ష నేతకు సైతం విషయం చెప్పి, ఆయన సంతకం తీసుకున్నామన్నారు. అలాగే ప్రస్తుత అధికార పార్టీ తమను అడుగుతారని భావించామని, అయితే ఎవరూ తమను సంప్రదించలేదని చెప్పారు. కనీసం తమలో ఎవరికైనా చెబితే, ప్రపోజ్ చేయాలని అనుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోడియం స్పీకర్ అయినా, కనీసం 'విపక్షనేత రండి' అని పిలవలేదని.. ఇష్టమైతే రండి, లేకుంటే లేదన్నట్టుగా ప్రభుత్వ ప్రవర్తన ఉందని అన్నారు. ఈ విషయాలను తాను ప్రజలకు చెప్పేందుకే క్లారిటీ ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మాత్రమే కాదు.. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక సీఎం జగన్‌ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సభలో ప్రమాణ స్వీకారం చేశాక సీఎం ప్రతిపక్ష బల్లల వైపు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి వెళ్లడం ఆనవాయితీ. పోయినసారి సభలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ వద్దకు వచ్చి కరచాలనం చేసి వెళ్లారు. గతంలో వైఎస్‌ సీఎం అయినప్పుడు కూడా ఇలాగే చంద్రబాబు వద్దకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు జగన్‌ అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. దీంతో వైసీపీ సభ సంప్రదాయాలను పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

గొర్రెలం, బర్రెలం కాదు.. రాజీనామా చేస్తాం: కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

  సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు.   టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకే పార్టీ మారామని, అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం.. సీఎల్పీని విలీనం చేయాలని కోరామని, చట్ట ప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదన్నారు. పదవుల కోసం చిల్లర మల్లరగా తిడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు. మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామని వివరించారు. కాంగ్రెస్‌పై తమకున్న అసంతృప్తిని చాలా సార్లు వ్యక్తం చేశామని.. రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్‌లో చేరామని తాము ప్రలోభాలకు లొంగిపోవడానికి, అమ్ముడుపోవడానికి గొర్రెలం, బర్రెలం కాదన్నారు. త్రిపుర, గోవాలలో కూడా ఇలాంటి విలీనాలే జరిగామని.. ప్రధాని కూడా ఇటీవల బెంగాల్‌లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన సంగతిని రమణారెడ్డి ప్రస్తావించారు. ‘‘వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా.. ఉత్తమ్‌ వ్యవహారశైలి మారటం లేదు. మాపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేస్తాం. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.’’ అని అన్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చదువుకుంటే మంచిదని, వేరే రాష్ట్రాల్లో ఇలాంటి చాలా జరిగాయని గుర్తు చేశారు.

రోజాకు బంప‌ర్ ఆఫ‌ర్.. ఆ పదవితో బుజ్జగిస్తున్న జగన్..!

  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని భావించిన నాయ‌కుల్లో ప్రధానంగా వినిపించిన పేరు ఆర్కే రోజా. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయం అంటూ వార్త‌లు వ‌చ్చాయి. తీరా మంత్రివ‌ర్గం ఏర్పాట‌య్యే స‌రికి.. రోజాకు చోటు ద‌క్క‌లేదు. తన‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నందుకు రోజా అలిగార‌ని, అందుకే ఆమె పార్టీ కార్య‌క‌లాపాల‌కు కాస్త దూరంగా ఉంటూ వ‌స్తున్నార‌ని కూడా వార్తలొస్తున్నాయి. దీనితో ఆమెను బుజ్జగించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా రోజాకు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైసీపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌ ది రెండో స్థానం. టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి త‌రువాత ఆ స్థాయిలో ప‌లుకుబ‌డి ఉన్న పోస్ట్ అది. ప్ర‌యాణికుల రూపంలో రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు, ఉద్యోగులు, కార్మికుల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధం ఉన్న కార్పొరేష‌న్ ఆర్టీసీ. నిర్వ‌హ‌ణ‌లో ఏ మాత్రం లోటు పాట్లు త‌లెత్తిన‌ప్ప‌టికీ.. దాని ప్ర‌భావం వెనువెంట‌నే ప్ర‌జ‌ల‌పై ప‌డుతుంది. ఆర్థిక దుర్వినియోగాన్ని అరిక‌ట్టి, సంస్థ ఎదుర్కొంటున్న న‌ష్టాల‌ను త‌గ్గించ‌డానికి అధికారులు రూపొందించే ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క్కాగా అమ‌లు కావ‌డానికి రోజా ముక్కుసూటిత‌నం స‌రిపోతుంద‌ని జగన్ భావిస్తున్నారట. అదే జ‌రిగితే ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితులైన రెండో మ‌హిళా రాజ‌కీయ నాయ‌కురాల‌వుతారు రోజా. ఇదివ‌ర‌కు దివంగ‌త మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మితుల‌య్యారు. టీడీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఆమెను ఆర్టీసీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా నామినేట్ చేశారు. ఇప్పుడు జగన్.. రోజాను నియమిస్తే.. విభ‌జ‌న త‌రువాత ఏర్పాటైన ఆర్టీసీకి తొలి మ‌హిళా ఛైర్‌ప‌ర్స‌న్‌గా రోజా రికార్డు సృష్టిస్తారు.

ఫిరాయింపు నేతలను పబ్లిక్ లో చెప్పుతో కొట్టిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త

  ఒక పార్టీ గుర్తు మీద గెలవడం, తరువాత అధికార పార్టీలోకి జంప్ అవడం.. ఈ మధ్య నాయకులకు కామన్ అయిపోయింది. వారికి ఓట్లేసిన ప్రజలు, వారి గెలుపుకి కృషి చేసిన కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం పార్టీ ఫిరాయిస్తున్నారు. ఇదే అటు ఓటర్లు, ఇటు కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలిచి తరువాత టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యే హరిప్రియకు ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లిన ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకొని.. ఆమె మరియు ఆమె అనుచరులపై చెప్పులు, రాళ్లు విసిరారు. తాజాగా ఇలాంటి సంఘటనే వరంగల్ లో జరిగింది. అసలే కాంగ్రెస్ నుండి ఎన్నికల బరిలోకి దిగి హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ ని విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంలో ఉన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్నగాక మొన్న గెలిచిన ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ ని వీడి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైపోయారు. దీంతో కార్యకర్తల్లో కోపం కట్టలుతెంచుకుంది. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్త ఫిరాయింపు ఎంపీటీసీ లపై చెప్పుతో దాడి చేసింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుండి నర్సంపేట మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరుగురు ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ స్థానం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ నుండి ఎంపీటీసీలు సహకారం అందించాలి. ఈ నేపధ్యంలో 30 లక్షలు ఇస్తాం అంటూ ముగ్గురు ఎంపీటీసీలను ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ నాయకులు ఓటింగ్ కు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే ఓ మహిళా కార్యకర్త కాంగ్రెస్ గుర్తుతో గెలిచి టీఆర్ఎస్ కి అమ్ముడు పోతారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామస్తులు సైతం మీకు ఓట్లేసి గెలిపిస్తే పార్టీ మారతారా అంటూ ఆ ఎంపీటీసిలను నిలదీశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగుతున్న తరుణంలో ఆ మహిళా కాంగ్రెస్ కార్యకర్త కోపోద్రిక్తురాలైంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎంపీటీసీలను చెప్పుతో కొట్టింది. పోలీసులు అడ్డుకున్నా సరే పార్టీ మారిన ఎంపీటీసీలపై చెప్పుతో దాడి చేసి పరువు తీసింది. ఈ సంఘటన ఫిరాయింపు నేతలకు షాక్ కొట్టినట్లు అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఫిరాయింపులపై తిరగబడితే ఎలా ఉంటుంది అన్న భావన ఈ సంఘటనతో అందరినీ ఆలోచింపజేస్తుంది.

సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి!!

  తెలంగాణలో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తయ్యింది. అసెంబ్లీ కార్యదర్శి ఇందుకు సంబంధించిన బులిటిన్ కూడా విడుదల చేయడంతో.. తెలంగాణలో కాంగ్రెస పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టయ్యింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా మజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.  తన కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరనే దానిపై అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఆమెకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ సీటు టీఆర్ఎస్‌ ఖాతాలో పడటం కూడా సబితాకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం సబితా గట్టిగా కృషి చేశారు. ఆమెకు పట్టున్న పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించింది. దీనికితోడు టీఆర్ఎస్‌లో చేరే సమయంలోనే కేసీఆర్ ఆమెకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. మొత్తానికి టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం పూర్తి కావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది. చూద్దాం మరి ఎవరెవరికి మంత్రి పదవులు వరిస్తాయో.