ఢిల్లీ సాక్షిగా కేంద్రాన్ని ఉతికారేసిన చంద్రబాబు

  ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీయడానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ మీడియా సాక్షిగా కేంద్రం తీరుపై నిప్పులుచెరిగారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలతో భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్రాన్ని నిలిదీసారు. దేశంలోని రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పిన చంద్రబాబు.. స్వయంగా ప్రధాని మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతోందో వివరించడానికే మీ ముందుకొచ్చాను అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.  నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు జమచేస్తామన్నారు.. ఏమైంది?. పెద్ద నోట్లు రద్దుచేస్తామని రూ.2వేల నోట్లు తీసుకొచ్చారు. కానీ, నోట్ల రద్దుతో దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు ఆలోచన సరైంది కాదు. సరైన ప్రణాళిక లేకుండా అమలుచేశారు. దేశంలో బ్యాంకులన్నీ స్థైర్యం కోల్పోయాయి. వేల కోట్లతో నీరవ్‌ మోదీ, జతిన్‌ మెహతా, నితిన్‌ సందేశ్రా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. 2006తో పోలిస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించినంతగా లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? వ్యవసాయంలో 3శాతం వృద్ధి మాత్రమే ఉంది అని చంద్రబాబు అన్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చెయ్యాలంటూ ఢిల్లీకి 29 సార్లు తిరిగానని కానీ స్పందించలేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతును బీజేపీ తీసుకుంది. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కూడా వాపస్‌ తీసుకున్నారు. ఏపీకి సంబంధించిన డిమాండ్లు ఒక్కటీనెరవేర్చలేదు. తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు మాత్రం రూ.450 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు నిధులు ఇవ్వొచ్చు.. అది రాజకీయ కారణం. నేను అర్థంచేసుకోగలను. కానీ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని చంద్రబాబు అని ప్రశ్నించారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో తాజాగా ఓ ఘటన జరిగిందని, ప్రతిపక్ష నేత జగన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ చిన్న కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ విషయం తెలియగానే.. తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎయిర్‌పోర్టులు కేంద్ర పరిధిలో ఉండే సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటాయని.. ఘటన జరిగింది ఎయిర్‌పోర్ట్ లోపలేనని చంద్రబాబు చెప్పారు. ఘటన జరిగిన అనంతరం దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద 10పేజీల లేఖ దొరికిందని ఆయన జాతీయ మీడియాకు వివరించారు. ఈ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు టీడీపీని విమర్శించారని చెప్పారు. అయితే ఘటన జరిగింది విమానాశ్రయం లోపల అని.. ఎయిర్‌పోర్ట్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న చోట ఘటన జరిగితే తమను బాధ్యులను చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మూడునాలుగు నెలల క్రితం శివాజీ ఆపరేషన్ గరుడ అనే ఓ అంశాన్ని తెరపైకి తెచ్చాడని.. మొదట్లో తాను నమ్మలేదని చంద్రబాబు చెప్పారు. ఆపరేషన్ గరుడలో శివాజీ ఏ అంశాలను వివరించాడో.. ప్రస్తుతం సరిగ్గా అదే మాదిరి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిణామాలతో తాను షాక్‌కు లోనయ్యానని చెప్పారు. దేశవ్యాప్తంగా రైడ్స్ జరుగుతాయని శివాజీ చెప్పాడని.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అదే తరహాలో రైడ్స్ జరిగాయని తెలిపారు. తాము బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు తమపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, పొత్తు తెగతెంపులు చేసుకున్న అనంతరం ఐటీ దాడులు జరిగాయని చంద్రబాబు అన్నారు.

జగన్ పై దాడి.. ఆపరేషన్ గరుడలో భాగమా.!!

  వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి ఆపరేషన్ గరుడలో భాగమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నటుడు శివాజీ కొన్ని నెలల క్రితం 'ఆపరేషన్ గరుడ' అంటూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒక జాతీయ పార్టీ ఏపీ మీద కక్ష్య సాధించాలనే ఉద్దేశంతో 'ఆపరేషన్ గరుడ'ను ప్రయోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు అసలు 'ఆపరేషన్ గరుడ' ను ఎలా ప్రయోగిస్తారు? ఈ ఆపరేషన్లో ఎవరెవరు పావులు? అనే విషయాన్ని వీడియో రూపంలో శివాజీ ప్రజలకు క్లియర్ గా వివరించారు. అయితే శివాజీ మాటలను దాదాపు అందరూ కొట్టిపారేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పలువురు ఆయన మీద జోకులు కూడా పేల్చారు. అయితే అప్పుడు శివాజీ మాటలు.. ఇప్పుడు జగన్ మీద జరిగిన దాడిని పరిశీలిస్తుంటే.. నిజంగా శివాజీ చెప్పినట్టు ఏపీ మీద ఒక జాతీయ పార్టీ ఆపరేషన్ గరుడను ప్రయోగిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇలా దాడి జరుగుతుందని గతంలో ఆపరేషన్ గరుడ గురించి వివరించిన వీడియోలో శివాజీ ముందే చెప్పారు. 'ఒక జాతీయ పార్టీ.. ఏపీ స్థానిక ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ఏపీలోని ఒక ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైద్రాబాద్లో రెండు సార్లు రిక్కీ కూడా నిర్వహించారు. ప్రాణహాని లేకుండా ఆ నాయకుడి మీద దాడి జరుపుతారు. దీనివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. అంతేకాదు బీహార్ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల స్థానిక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది' అని శివాజీ వీడియోలో వివరించారు. ఈ దాడి వెనుక అసలు కారణం ఏంటో ఇంకా తెలీదు కానీ.. గతంలో శివాజీ చెప్పిన మాటలు.. ఇప్పుడు దాడి జరిగిన విధానం చూస్తుంటే.. జగన్ పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమనే అనుమానం వ్యక్తమవుతోంది.

ఎట్టకేలకు మహాకూటమి లెక్క కుదిరింది

  కేసీఆర్ ముందస్తుకు తెరలేపి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనుకుంటే.. ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే అందరికీ ఎక్కడో డౌట్.. అసలీ మహాకూటమి నిలబడుతుందా? అని. ఎందుకంటే మహాకూటమితో ఎవరి ఊహలకు అందని పార్టీలు జతకట్టాయి. అవే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు. కానీ అందరూ అనుకున్నట్టు ఈ పార్టీల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి సమస్య రాలేదు. టీడీపీ, కాంగ్రెస్ తో దోస్తీ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. గతంలో ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ని వ్యతిరేకించాం.. కానీ ఇప్పుడు ప్రజావసరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ఏర్పడడం ముఖ్యం అని భావించి సీట్ల విషయంలో సర్దుకుపోవడానికి టీడీపీ సిద్ధమైంది. ఇక సీపీఐ కూడా సీట్ల విషయంలో మరి పట్టుబట్టలేదు. అయితే టీజేఎస్‌ మాత్రం మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. సీట్ల కేటాయింపు విషయంలో జాప్యం.. అలాగే తమ పార్టీకి మరీ తక్కువ సీట్లు కేటాయిస్తాననడంతో కోదండరాం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసారు. కానీ ఏ సందర్భంలోనూ ఆయన కూటమికి దూరం అవుతాననే సంకేతాలు ఇవ్వలేదు. దీంతో మహాకూటమి ఏర్పడటం ఖాయమనే అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల లెక్క కుదిరినట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఎలాగైతే బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పోవడమే కాకుండా.. అవసరమైతే పీఎం పదవి త్యాగానికి కూడా సిద్దమైందో.. అలాగే తెలంగాణలో కూడా తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే చాలా సహనంగా అడుగులు వేస్తూ.. కూటమిలోని మిగతా పార్టీలు సంతృప్తి పడేలా చేస్తూ.. ఎట్టకేలకు మహాకూటమి నిలబడేలా చేసుకుంది. ప్రస్తుతం మహాకూటమి ముందున్న టార్గెట్ ఒక్కటే.. కేసీఆర్ ని గద్దె దించడం. అందుకే మహాకూటమిలోని పార్టీలు సీట్ల విషయంలో మొండిగా పట్టుపట్టలేదు. దీంతో సీట్ల లెక్క ఓ కొలిక్కొచ్చింది. మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90, టీడీపీ 15, టీజేఎస్‌ 10, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగబోతున్నాయి. అంతేకాదు కూటమిలోని పార్టీలు విడివిడిగా కాకుండా.. ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటించనున్నాయి. తొలి జాబితాలో 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల లెక్క కుదరడంతో పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది.. మరి తెరాసను ఓడించాలన్న ఆ పార్టీల లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.

మహాకూటమిలో కుమ్ములాట

  తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఉమ్మడి ఎన్నికల ముసాయిదా కూడా సిద్ధమైంది.కానీ పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు.తెరాస పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది.బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడికి అందించారు.టీడీపీ,తెజస,సీపీఐ పార్టీలు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తులో సీట్ల సర్దుబాటుపై తేల్చకుండా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టింది.దీంతో కాంగ్రెస్ వ్యవహారశైలిపై తెజస అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 48 గంటల్లో సీట్ల సర్దుబాటుపై తేల్చండి అంటూ అల్టిమేటం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.టీటీడీపీ అధ్యక్షుడు రమణ తొందరపడొద్దని సూచించటంతో శాంతించారు కోదండరాం. రోజు రోజు ఎన్నికల సమయం దగ్గర పడుతూనే ఉంది.కానీ భేటీలకు గంటల సమయం వెచ్చించినా పార్టీల మధ్య పొంతన కుదరట్లేదు.ఒకప్పుడు నాలుగు పార్టీల ముఖ్య నేతలు కూర్చొని చర్చించుకునేవారు.కానీ కొన్ని రోజులు క్రితం కాంగ్రెస్,తెజస నేతలు మాత్రమే భేటీ అయ్యారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు.భేటీ అనంతరం మాట్లాడిన కోదండరాం కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని,తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రమణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ... కూటమి అన్నాక అనేక సమస్యలుంటాయని, రెండు మూడు రోజుల్లో అన్నీ సమసిపోతాయన్నారు. అలాగే మహాకూటమి మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని విమర్శించారు.రమణతో ఎన్నికల వ్యూహంపై చర్చించామని, కూటమిని ఏర్పాటు చేసింది సీపీఐ, టీడీపీలేనన్నారు. కలిసి ఉన్న పార్టీలు విడి విడిగా సమావేశం అవ్వటం ఏంటా అని సర్వత్రా చర్చగా ఉండగా ఎవరికి వాళ్ళు సమావేశ అనంతరం పొత్తులు అన్నాక సమస్యలు ఉంటాయి ,తొందర్లోనే సర్దుకుంటాయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరి ఎత్తుడలు వాళ్ళు వేసుకుంటున్నారని తెలుస్తుంది.కూటమి  ఏర్పాటు చేసింది మేమే అంటున్న సీపీఐ, టీడీపీ లు సీట్ల కోసం కాంగ్రెసుపై ఆధారపడాల్సిన పరిస్థితి.కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితాపై ఓ అవగాహనకి వచ్చింది.అలానే ఇంకా పార్టీ గుర్తు కూడా రాని తెజస కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించగలం అనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే  సీపీఐ, టీడీపీ పార్టీలు తమ సత్తా చాటేందుకు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చినట్టు సమాచారం. ఒకవేళ పొత్తులో పొంతన కుదరక ఎవరి దారి వాళ్ళది అయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి లేదు.ఎలాగో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసింది కాబట్టి ప్రతి నియోజక వర్గంలో అభ్యర్థిని నిలబెట్టగలదు.అసలు పొత్తుపై క్లారిటీ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సుముకంగా లేదోమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వాళ్ళు అడిగినన్ని సీట్లు ఎలాగో ఇవ్వలేం కాబట్టి,కొన్నాళ్ళు పొత్తుపై నాంచితే అప్పటికప్పుడు మిగతా పార్టీలు ధైర్యం చేసి పొత్తు నుంచి బయటకి వెళ్లి అభ్యర్థులను ప్రకటించలేవనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం.

జగన్ సాయం ప్రకటనలకే పరిమితమా.. కోటి మాటేమిటి?

  తిత్లీ తుఫాన్ రూపంలో శ్రీకాకుళంని కష్టం ముంచెత్తింది. తిత్లీ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా నిలబడడానికి పలువురు ముందుకొస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విరాళాలు ప్రకటించాయి. హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షల చెక్కును సీఎంకి అందించింది. ఇక సీఎం చంద్రబాబు అయితే తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా రూ. కోటి సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే వైసీపీ రూ. కోటి సాయం ప్రకటనకే పరిమితమా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే వైసీపీ ఆ కోటిని సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు కానీ లేదా మరేదైనా మార్గంలో సాయం చేసిన దాఖలాలు కానీ లేవు. దీంతో వైసీపీ కోటి సాయం ప్రకటనకే పరిమితమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రకటించిన ఆర్థికసాయాల విషయంలో కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ ను హుదూద్ కుదిపేసినప్పుడు.. జగన్ రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. ప్రభుత్వానికి ఇవ్వబోమని వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఖర్చు పెడతామని తన పత్రికలో ప్రకటించి పాఠకుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించారు. ఇలానే అప్పట్లో మరో ప్రముఖ పత్రిక కూడా సేకరించి మత్య్సకారులకు ఇళ్లను కట్టించింది. కానీ జగన్ ప్రకటించిన ఆ రూ. 50 లక్షలు.. సేకరించిన విరాళాలను ఏ విధంగా ప్రజలకు సాయం అందించారో బయటపెట్టలేదు. ఇక కేరళ వరదల సమయంలో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేసి కేరళకు అండగా నిలబెట్టారు. ఆ సమయంలో జగన్ కూడా కోటి సాయం ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన ప్రకటించిన సాయాన్ని కేరళకు అందించలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం.. తన కంపెనీ తరపున కేరళకు రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కేరళకు వెళ్లి సీఎంకు ఇచ్చి వచ్చారు. కానీ జగన్ చేసిన సాయం మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ వాళ్లే కాబట్టి వాళ్లు చేసినా నేను చేసిన ఒకటే అనుకున్నారా? ఏంటో తెలియట్లేదు. మరి జగన్ వైజాగ్ కు ప్రకటించిన రూ. 50 లక్షలు, కేరళకు ప్రకటించిన రూ. కోటి.. ప్రకటనకే పరిమితం చేసారా? లేక నిజంగానే సాయం చేసారా?. ఒకవేళ సాయం చేసుంటే సోషల్ మీడియాలో, సొంత మీడియాలో గట్టిగానే ప్రమోషన్ చేసేవాళ్లుగా?. దీనిబట్టి చూస్తుంటే ఆ సాయం ప్రకటనలకే పరిమితం అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి తిత్లీ బాధితుల కోసం ప్రకటించిన రూ. కోటి సాయమైనా బాధితులకు చేరుతుందా? లేక ప్రకటనగానే మిగిలిపోతుందా?. లేదా అసలు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.. మా సాయం ప్రకటనలకే పరిమితం కాదు.. సాయం చేసి చూపిస్తామని నిరూపించుకుంటారా?. చూద్దాం ఏం జరుగుతుందో.

కేసీఆర్ గజ్వేల్‌ నుంచి కష్టమేనట.!!

  ఎన్నికలకు 8 నెలల సమయమున్నా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు శ్రీకారం చుట్టారు. ఈసారి 60, 70 కాదు ఏకంగా వందకి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి తెరమీదకు వచ్చిందో అప్పటినుంచి ఆ ధీమా తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది. టీడీపీ కూడా నాయకులు దూరమైనా పలుచోట్ల కేడర్ బలంగానే ఉంది. మరి ఈ రెండు పార్టీల బలం ఒక్కటైతే తెరాసకు ఇబ్బంది తప్పదు. దీంతో మొన్నటివరకు వచ్చే ఎన్నికల్లో తెరాసదే విజయం అని బల్లగుద్ది చెప్పినవాళ్లు కూడా.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుంది పోరు అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ని మహాకూటమి బాగా ఆలోచనలో పడేస్తుంది. అందుకే ఆయన మహాకూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని, టీడీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాకూటమిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే ఆయనకి ఆ విజయం అంత ఈజీగా రాలేదు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంటేరు ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్ గట్టి పోటీనే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 44 % ఓట్లు సాధించగా.. ప్రతాప్‌రెడ్డి 34% ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన నర్సారెడ్డి 17 % ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీలు దగ్గరయ్యాయి. అంటే ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి బలం మరింత పెరిగింది. అదీగాక ఆయనపై ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటాడని మంచి పేరుంది. దీంతో మహాకూటమి తరుపున ఆయన బరిలోకి దిగితే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. కేసీఆర్ ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓడిపోతారని చెప్పలేం కానీ.. ప్రతాప్‌రెడ్డి మీద స్వల్పతేడాతో గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వేరే నేతలకి ఈ గెలుపు ఓకే కానీ.. సీఎం స్థాయి నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నేతలకు ఈ గెలుపు సరిపోదు. ఆయన లాంటి నేతలు భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలవాలి. అందుకే ఆయన అవసరమైతే వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మొన్నటివరకు ఆయన గజ్వేల్ తో పాటు.. మేడ్చల్ నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ దృష్టి మాత్రం హరీష్‌రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మీద ఉందట. సిద్దిపేటలో తెరాసకి బలముంది. తిరుగులేని మెజారిటీ వస్తుంది. అందుకే కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగాలనుకుంటున్నారట. దీనివల్ల కేసీఆర్ తన నియోజకవర్గం గురించి ఏ ఆలోచనలేకుండా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టొచ్చని భావిస్తున్నారట. మరి కేసీఆర్ మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని వదిలేస్తారా?.. ఒకవేళ కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగితే మరి హరీష్ రావు ఎక్కడినుండి పోటీ చేస్తారు?.. గజ్వేల్ నుండి పోటీ చేస్తారా? లేక అసలు పోటీకి దూరంగా ఉంటారా? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి దూరం

  చిరంజీవి..తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగి మెగా స్టార్ గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు.నటుడుగా తనదైన ముద్ర వేసిన చిరంజీవి రాజకీయాలవైపు అడుగులు వేశాడు.2008 లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు.2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ బరిలోకి దిగగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను మాత్రమే పార్టీ గెలుచుకోగలిగింది.తిరుపతి,పాలకొల్లు అసెంబ్లీ స్థానాల నుంచి చిరంజీవి పోటీ చేయగా సొంత నియోజక వర్గం అయిన పాలకొల్లులో పరాజయం చవి చూశారు.తిరుపతి స్థానం లో గెలుపొందారు.రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలి అనుకున్న చిరంజీవికి ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవటంతో కొంత కాలానికి పార్టీని 2011 లో  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో 2012 ఏప్రిల్ లో ఆ పార్టీ రాజ్య సభ పదవి కట్టబెట్టింది.అదే సంవత్సరం అక్టోబర్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లో పరిస్థితులు తారుమారు అయ్యాయి.అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉపందుకోవటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది.చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార కమీటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించింది.కానీ చిరంజీవి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అది నామమాత్రమే అని చెప్పుకోవాలి.ఎందుకంటే రాష్ట్రము విడిపోవటం తో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ విజయం కాయం అని అందరు ఉహిచిందే.దీనికితోడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతు ఇవ్వటం,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం చిరంజీవిని విస్మయానికి గురిచేశాయి.2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం ముగిసింది.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఏదైనా పదవి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవు.దీంతో గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిణామాలే కనిపిస్తున్నాయి.తాజాగా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా దాన్ని పునరుద్ధరించుకోలేదు.దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం.దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కూడా చిరంజీవి పార్టీకి దూరం అవ్వటానికి కారణంగా తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీ కి మద్దతు ఇచ్చిన పవన్ రానున్న ఎన్నికల్లో స్వతహాగా పోటీ చేస్తున్నది తెలిసిందే.అయితే ప్రస్తుతం కాంగ్రెస్,టీడీపీ పార్టీలు కాస్త సాన్నిహిత్యంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయవలిసి వస్తే తమ్ముడు పవన్ పై విమర్శలు గుప్పించక తప్పదు.అది ఇష్టపడని చిరంజీవి యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని సమాచారం. రాజకీయాలకు దూరం అవుతూవస్తున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.  

కేసీఆర్ సంచలన నిర్ణయం.. మేడ్చల్ నుండి పోటీకి సిద్ధం.!!

కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. ఎన్నికలకు 8 నెలలముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇలా దూకుడు మీదున్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే మేడ్చల్ నుండి పోటీకి సిద్దమవ్వడం. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు కేసీఆర్ మళ్ళీ అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మహాకూటమి నుండి బలమైన పోటీ తప్పదని కేసీఆర్ కి అర్థమైంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.     టీడీపీకి తెలంగాణలో ఓటుబ్యాంకు బాగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలోని నియోజక వర్గాల్లో బలంగా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో దోస్తీ చేయడానికి ముఖ్యకారణం. కాంగ్రెస్ తెలంగాణలో బలంగానే ఉంది కాని ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని పొందే అంత బలమైతే లేదనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ మహాకూటమి వైపు అడుగులు వేసింది. దీంతో కాంగ్రెస్, తెరాసకు ధీటైన ప్రత్యర్థిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల టీడీపీ ఓటుబ్యాంకు బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతెందుకు గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అందుకే కేసీఆర్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.     కాంగ్రెస్ కి టీడీపీ బలం తోడైంది. ఈ బలాన్ని తట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అధిక స్థానాలు గెలవాలంటే తాను ఏదైనా స్థానం నుండి బరిలోకి దిగడం కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ లాంటి బలమైన నేత, సీఎం అభ్యర్థి బరిలోకి దిగితే ఆ చుట్టుపక్కల స్థానాల మీద ఆ ప్రభావం ఉంటుంది. అది తెరాసకు బోలెడంత మైలేజీ తీసుకొస్తుంది. అందుకే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రాతినిద్యం వ‌హిస్తున్న గజ్వేల్ నియోజ‌కవ‌ర్గంతో పాటు మేడ్చ‌ల్ నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ నిజంగానే మేడ్చల్ నుండి బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగి.. అనుకున్నట్టే మహాకూటమి జోరుకి చెక్ పెడతారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఖమ్మంలో తెరాస బోణి కష్టమేనా?

  తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగేది.. ఒకసారి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మరోసారి టీడీపీ పైచేయి సాధించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అసలే జిల్లాలో బలమైన పార్టీలు. ఈ మూడు పార్టీలు మహాకూటమితో దగ్గరవడం.. ఖమ్మంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న తెరాసను కలవెరపెడుతుంది. తెరాసకు ముందు నుండి ఖమ్మం సమస్య ఉంది. గత ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో తెరాస ఎంతో కొంత తన మార్క్ చూపింది కానీ.. ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల అనంతరం టీడీపీ నుండి సీనియర్ నేత తుమ్మల, కాంగ్రెస్ నుండి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, సిపిఎం మద్దతుతో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇలా పలువురు నేతలు తెరాసలో చేరారు. తెరాస నాయకులతో కళకళలాడింది కానీ కాంగ్రెస్, టీడీపీ కేడర్ మాత్రం అలాగే ఉంది. కాంగ్రెస్ లో రేణుక చౌదరి, భట్టి లాంటి సీనియర్ నేతలున్నారు. ఇక టీడీపీలో కూడా మాజీ ఎంపీ నామా, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి సీనియర్ నేతలున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. ఓవైపు సీనియర్ నేతలు, మరోవైపు బలమైన కేడర్.. దీంతో ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     తెరాస మళ్ళీ అధికారం తమదే అనే ధీమాతో ముందస్తుకు సిద్ధమైంది. అయితే ఆ ఆశలకు మహాకూటమి ఆనకట్టలా మారింది. మొన్నటివరకు తెరాస వందకి పైగా సీట్లు వస్తాయి.. ఖమ్మంలో కూడా పాగా వేస్తామంటూ ధీమాగా ఉంది. అయితే మహాకూటమితో పరిస్థితి మారిపోయింది. నిన్నటిమొన్నటి దాకా తెలంగాణలో ఇంకా టీడీపీ ఎక్కడుంది? అన్నవాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మంలో కూడా టీడీపీ ఒకప్పటిలా బలంగా లేదన్న వాళ్ళకి మొన్న బాలకృష్ణ పర్యటనతో కళ్ళుతెరుచుకున్నాయి. స్వచ్చందంగా కార్యకర్తలు కదిలొచ్చారు.. బాలయ్య వెంటనడిచి ఖమ్మంలో పసుపుదళం బలంగా ఉందని నిరూపించారు. దీంతో తెరాస నేతలు ఆలోచనలో పడ్డారు. ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడుతుందా? అని అనుమానం మొదలైంది. మిగతా స్థానాల్లో ఎలా ఉన్న మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరులో అయినా తెరాస జెండా ఎగురుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పాలేరులో కూడా పరిస్థితి మారిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ సర్వేలు కూడా మహాకూటమికే అనుకూలంగా వస్తున్నాయట. నిజానికి తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. తరువాత తెరాసలో చేరి మంత్రి పదవి పొందారు. అయితే అప్పుడు పాలేరులో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగి తుమ్మల గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఉపఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. అయితే 2014 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉపఎన్నికల్లో తుమ్మల విజయం సాధించినా ఈ రెండు ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తాజా సర్వేల ప్రకారం పాలేరులో మహాకూటమే ముందుందట. దీనిబట్టి చూస్తుంటే ఖమ్మంలో పాగా వేయాలని చూస్తున్న తెరాస అసలు బోణి అయినా చేస్తుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంచనాలను తారుమారు చేస్తూ తెరాస మహాకూటమిని మట్టి కరిపిస్తుందో లేదో చూడాలి.

హరీష్ పన్నెండు ప్రశ్నలు.. ఉత్తమ్ ధీటైన సమాధానం

  కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు షరమ్‌ లేని పొత్తు అని తెరాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. ఉత్తమ్ దీనికి అంతే ధీటుగా బదులిస్తూ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హరీష్ రావు నాకు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తేల్చేశారు.. హరీష్ రావు లేఖతో ఇప్పటివరకూ కేసీఆర్‌ చెబుతున్న వందసీట్ల కల చెదిరిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు, తెరాస ఓటమిని ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు.   కాంగ్రెస్‌ పొత్తుపై హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నల్లో ఒక్కటీ తెలంగాణ సమాజానికి పనికొచ్చేది లేదని.. అవన్నీ తెరాస ప్రభుత్వం చేతగానితనాన్ని, పాలనా వైఫల్యాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. తమ పొత్తు గురించి తెరాస పడుతున్న ఆందోళన చూస్తుంటే వారి పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. వారి పాలనే బాగుంటే తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామన్న ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో 2004లో, టీడీపీతో 2009లో తెరాస పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకున్నప్పడు ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని తేల్చిచెప్పిన తర్వాత.. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీవి షరమ్‌ లేని పొత్తులు కావని, తెరాసే షరమ్‌లేని పొత్తులు పెట్టుకుందని ఉత్తమ్‌ విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించి.. రాయల తెలంగాణ డిమాండ్‌ చేసిన ఎంఐఎంతో తెరాస స్నేహమెలా చేస్తోందని నిలదీశారు. ఒంటరిగా పోటీ చేసి కూడా తెరాసను చిత్తుగా ఓడించే సత్తా కాంగ్రెస్ కి ఉందని, అయినా.. తెలంగాణను రక్షించుకోవడం కోసం సిద్ధాంత సారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకేంటి? అంటూ గతంలో కేసీఆర్‌ అన్నారు. మరి మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారికేంటి. ప్రజలకే మేం జవాబుదారులం. ప్రజలకు జవాబు చెప్పుకొనే శక్తి మాకు ఉంది. మా పొత్తుల విషయంలో ఎందుకు అంతగా భయపడుతున్నారు? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఉత్తమ్ లేఖలోని ముఖ్యాంశాలు: చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అనడం మీ ప్రభుత్వం చేతకానితనానికి పరాకాష్ఠ. చంద్రబాబులో మార్పు వచ్చిందా అని అంటున్నారు.. మరి ఏ మార్పు వచ్చిందని ఆయనను చండీయాగానికి ఆహ్వానించి సన్మానించారు? అమరావతికి వెళ్లి ఆయనింట్లో చేపల పులుసు తిన్నారు? పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళ్లి మంతనాలు చేశారు. మీరు చేస్తే సక్రమం మేం పొత్తు పెట్టుకుంటే ద్రోహం అవుతుందా?  సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, విద్యుత్‌, పోలవరం, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన లాంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేవని కూడా తెలీదా? ప్రధానమంత్రి మోదీ భజనలో మునిగి తేలుతున్నపుడు ఆ పనులన్నీ ఎందుకు చేయించలేకపోయారు?  ఖమ్మంలోని ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని సిగ్గులేకుండా చెబుతున్నారు. రాష్ట్రం సాధించామని గొప్పులు చెప్పుకొంటున్న మీరు.. ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా? చేతగాని దద్దమ్మల్లా చేతులు ముడుచుకు కూర్చున్నారా? సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు, లక్షలాది ఎకరాల భూములు ఆంధ్రాలో కలుస్తుంటే నిద్రపోయారా? మోదీని ఒక్కసారైనా సీలేరు ప్రాజెక్టు గురించి అడిగారా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలంటూ చంద్రబాబు 30 లేఖలు రాశారని అంటున్నారు. ఎగువ రాష్ట్రమైన మనం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఎలా ఆపుతారో చెప్పగలరా? ప్రాజెక్టులు కట్టడం చేతకాక చంద్రబాబు అడ్డుకున్నారని వంక పెడుతున్న మీ వైఖరిని తెలంగాణ ప్రజలు అర్థ చేసుకోగలరు. పోలవరం కడితే ఎగువ రాష్ట్రాలకు రావల్సిన 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని.. దీన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అనడం చేతకానితనం. తెలంగాణ నీటిని వదిలితేనే ఆంధ్రప్రదేశ్‌కు పోతాయని గుర్తించాలి. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరిపై 86 ప్రాజెక్టులు నిర్మించాం. వాటిని ప్రారంభించినప్పుడు పైన ఉన్న రాష్ట్రాలు ఫిర్యాదులు చేశాయి. చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఫిర్యాదులు చేసినా ఆపుతామా? కేంద్రం వద్ద పోరాడి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. చేతకాకపోతే క్షమాపణ చెప్పి తప్పుకోవాలి. మిషన్‌ భగీరథపై చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేశారో తెలియదు. కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టు అది. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెచ్చి కమీషన్లు కొల్లగొట్టారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడిగేది లేదన్నారు.. ఇప్పుడు ఇంటింటికీ నీరు వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తులో కడుతున్నారని, 50 లక్షల క్యుసెక్కుల ప్రవాహ నీటి సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారని అంటున్నారు. మీరు సీఎంగా ఉండి ఏం చేస్తున్నారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పోరాడాలి కదా? సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం వద్ద పంచాయితీ పెట్టి ఒప్పించాలి కదా? మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామంటూ.. గొప్పలు చెప్పుకొన్న మీరు.. పక్కనున్న తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా? ఇదేనా మీ తెలివి? ఆయన ఒక సీఎం, మీరూ ఒక సీఎం. ఆయన గుంజుకున్నారని అంటున్నారంటే.. సీఎంగా మీరు ఏమీ చేయలేని దద్దమ్మ అని ఒప్పుకొన్నట్లేగా? టీడీపీ నుంచి గెలిచిన తలసానికి, తెలంగాణ ద్రోహులుగా ముద్ర పడ్డ మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులిచ్చినప్పుడు షరమ్‌ గుర్తుకురాలేదా? తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి హన్మంతరావు, దానం నాగేందర్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? తెలంగాణను వ్యతిరేకించి రాయల తెలంగాణ కావాలని డిమాండ్‌ చేసిన ఎంఐఎంను మిత్రపక్షమని మీరు చెప్పుకుంటున్నప్పుడు షరమ్‌ లేదా? అని ప్రశ్నించారు. టీడీపీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామో అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ అన్నారు.

ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు 12 ప్రశ్నలు.. చంద్రబాబుని ఇరుకున పెట్టారా?

కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీతొ పొత్తు ఏ ప్రాతిపదికన చేసుకున్నారంటూ 12 ప్రశ్నలతో కూడిన లేఖాస్త్రాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి సంధించారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ది షరతులతో కూడిన పొత్తా?.. బేషరతు పొత్తా?.. అధికారం కోసం శరం లేని పొత్తు పెట్టుకున్నారా? అంటూ ఘాటైన ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ తన స్వప్రయోజనం కోసం పొత్తు పెట్టుకుందా? లేక రాష్ట్ర ప్రయోజనం కోసం పొత్తు పెట్టుకుందా అనే దానిపై తన వైఖరి చెప్పాలన్నారు.     అదేవిధంగా గతంలో కాంగ్రెస్, టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు. ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకున్నందునే గతంలో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. నాడు టీఆర్ఎస్.. వందశాతం తెలంగాణ కోసం షరతులతో కూడిన పొత్తులు పెట్టుకుందని వివరించారు. షరతులు ఉల్లంఘించినప్పుడు పొత్తులు తెగదెంపులు చేసుకుని.. మంత్రి పదవులు సైతం వదిలేశామని గుర్తుచేశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హరీష్ రావు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చంద్రబాబు గారు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేసారు.. చేస్తూనే ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమన్నా నాకు తెలంగాణ పట్ల ఉండే వ్యతిరేక వైఖరిని మార్చుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వ్యతిరేక వైఖరిని తెలంగాణ పట్ల ప్రదర్శించనని టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించి ఏమన్నా తీర్మానం చేసారా? ఆ తీర్మానం కాపీ ఉంటే ప్రజల ముందు పెట్టండి. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, పోలవరం, ప్రభుత్వరంగ సంస్థల విభజన, హైకోర్టు, నదీజలాల పంపిణీ ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు గారు తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. అలాంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాటతానని చంద్రబాబు నుంచి మీరేమన్నా హామీ తీసుకున్నారా?  విభజన హక్కు చట్టంలో లేకపోయినా ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకోవడం జరిగింది. ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతానని చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంగీకారం కుదుర్చుకుందా? 150 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్ట్ కట్టి.. 50 లక్షల క్యూసిక్కుల నీటి ప్రవాహంతో పోలవరం డ్యాంను ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం పట్టణం, రామాలయం మునిగిపోతాయని, తెలంగాణలోని లక్షల ఎకరాలు మునిగిపోతాయని.. దాని ప్రభావం ఎంత ఉంటుందో ఇంకా అంచనా వేయలేదు గనుక డిజైన్ లో మార్పు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. తెలంగాణ ఇంజినీర్లు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు కూడా డిజైన్ మార్చాలని కోర్టులో కేసు వేశారు. మరి డిజైన్ మార్చడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? చంద్రబాబు వైఖరి ఏంటి? కాంగ్రెస్ స్పష్టం చేయాలి. చంద్రబాబు గారు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు.. ఇది అక్రమ ప్రాజెక్ట్.. కొత్త ప్రాజెక్ట్ అని దాదాపు 30 లేఖలు కేంద్రానికి రాసారు. స్వయంగా ఆయనే ఢిల్లీ వెళ్లి గడ్కరీకి, ప్రధానికి ఫిర్యాదు చేసారు. మరి ఇప్పుడు చంద్రబాబు తన వైఖరి మార్చుకొని ఇది అక్రమ ప్రాజెక్ట్ కాదు సక్రమ ప్రాజెక్ట్ అని అంగీకరించారా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా? కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్‌ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను చంద్రబాబు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా? తెలుగు జాతి అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని, అలా తాను ఫిర్యాదు చేయడం తప్పే అని చంద్రబాబు ఏమైనా పశ్చాతాపం వ్యక్తం చేశారా? 365 రోజులు విద్యుత్ విడుదల చేసే సీలేరు ప్రాజెక్టు లాక్కున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం రోజుకి ఒక కోటి నష్టపోతోంది. సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఏమైనా ఒప్పుకున్నారా? ప్రాజెక్టుకు బదులుగా తెలంగాణకు నష్ట పరిహారం ఏమైనా ఇచ్చేందుకు చంద్రబాబుతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? విద్యుత్ శాఖలోని 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపచేస్తారా? నిజాం కాలం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప. ఆంధ్రప్రదేశ్‌కు ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయంలో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా? ఈ అంశాలన్నింటిపై తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ స్పష్టతనివ్వాలని, ప్రజల్లోని భయాందోళనలను తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారం కోసమే పొత్తులు పెట్టుకుంటాం.. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు అనే భావన ఉంటే ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యం గెలిచిన స్థానాలే జనసేన టార్గెట్టా?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం సహజం. అలా అని సినిమాల్లో రాణించిన వారందరూ రాజకీయాల్లో రాణించాలని రూల్ లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణించిన వ్యక్తి అంటే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన.. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఘన విజయం సాధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసారు. సినిమాల్లో ఎన్నో దేవుడి పాత్రల్లో కనిపించి కనువిందు చేసిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎందరో పేదప్రజల చేత దేవుడి అనిపించుకున్నారు. ఒకరకంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణించొచ్చని రుజువు చేసింది ఆయనే. ఆయన తరువాత కూడా ఎందరో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ స్థాయికి చేరుకోలేకపోయారు.     ఎన్టీఆర్ తరువాత సినిమాల్లో ఆ స్థాయిలో పేరు తెచ్చుకొని మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009 ఎన్నికల్లో కేవలం 18 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్నారు. తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు కొద్దికొద్దిగా దూరం జరుగుతూ వచ్చిన ఆయన.. ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇక సినిమాల్లో బాగా పేరుతెచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన మరోవ్యక్తి పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్.. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్యాన్స్ ని సంపాదించుకొని పవర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. అయితే స్టార్ హీరోగా పీక్స్ లో ఉన్న టైంలో అనూహ్యంగా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 లోనే జనసేనను స్థాపించారు కానీ ఆ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పవన్ టీడీపీని తీవ్రంగా వ్యక్తిరేకిస్తూ విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.     నిన్నమొన్నటి వరకు పవన్ సీఎం అవ్వగలరా? అంటూ చర్చలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబుని సీఎం అవ్వకుండా పవన్ ఆపగలరా? అంటూ చర్చలు మొదలవుతున్నాయి. అయితే పవన్ మాత్రం సీఎం అవ్వాలన్న ఆలోచన కంటే ముందు పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ దృష్టంతా ప్రస్తుతం ఏపీ మీదే ఉంది. తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనా పవన్ మాత్రం ఆ వైపు చూడట్లేదు. దీనిబట్టి పవన్ వచ్చే ఏపీ ఎన్నికల మీదే తన దృష్టంతా పెట్టినట్టు అర్ధమవుతోంది. అయితే పవన్ 2009 లో ప్రజారాజ్యం గెలిచిన సీట్లను బట్టి వచ్చే ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధించిన, అదే విధంగా రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారట. వాటిల్లో విజయం మీద సాధిస్తే పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం వస్తుంది అలానే కర్ణాటకలో జేడీఎస్ లాగా కింగ్ మేకర్ అయ్యే అవకాశం వస్తుందని ఆలోచిస్తున్నారట. మొత్తం 175 స్థానాల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచినా చాలు.. టీడీపీ అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశముంది. అలాంటి సమయంలో కర్ణాటకలో కుమారస్వామిలా కింగ్ మేకర్ అవుతారు. ఇప్పటికే పవన్, వైసీపీతో పొత్తుకు సిద్ధమంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పవన్ అనూహ్యంగా ఎన్నికల తరువాత వైసీపీతో చేతులు కలిపి ట్విస్ట్ ఇస్తారా?. చూద్దాం మరి పవన్ ఏం చేస్తారో.

తెలంగాణ రాజకీయం చంద్రబాబు చుట్టూ తిరుగుతోందా?

చంద్రబాబు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసారు. సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ఆయన మార్క్ చూపించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు కానీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ డీలా పడిపోయింది. 2014 లో ఎన్నికల్లో గెలిచిన కొన్ని స్థానాల్లోని మెజారిటీ నాయకులు కూడా పార్టీని వీడి తెరాసలో చేరారు. దీంతో ఇక టీడీపీ పని అయిపోయింది అనుకున్నారంతా. చంద్రబాబు కూడా తెలంగాణ బాధ్యతను ఉన్న ఒకరిద్దరు లోకల్ సీనియర్ నేతలకే అప్పగించి.. ఆయన దృష్టి అంతా ఏపీ అభివృద్ధి మీద పెట్టారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రతిపక్షాల లిస్ట్ లో టీడీపీ ఉండనే విషయాన్ని మర్చిపోయారు. ఇక అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్సే మన టార్గెట్ అనుకోని.. గడిచిన నాలుగేళ్లు కాంగ్రెస్ మీదే విమర్శలు చేసుకుంటూ వచ్చారు. రోజులన్నీ ఒకేలా ఉంటే అవి రాజకీయాలు ఎందుకు అవుతాయి చెప్పండి. ఎన్నికలకు ఏడెనిమిది నెలలు గడువు ఉండగానే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక్కడ మొదలైంది అసలైన తెలంగాణ రాజకీయం. ఎవరి ఊహలకు అందకుండా కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గరయ్యాయి.     మొన్నటి వరకు తెలంగాణలో తెరాసకు ఎదురులేదు. మళ్ళీ తెరాసదే అధికారమని తెరాస బలంగా నమ్మింది. కానీ అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, ముందస్తుకు అడుగులు తరువాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా మహాకూటమి తెరాస నమ్మకాన్ని కాస్త బలహీన పరిచింది. తెలంగాణలో కాంగ్రెస్ కాస్త బలంగానే ఉంది. ఇక టీడీపీ, నాయకులు దూరమైనా కొన్ని ప్రాంతాల్లో కేడర్ మాత్రం టీడీపీని అంటిపెట్టుకొని ఉంది. ఇదే ఇప్పుడు తెరాసకు తలనొప్పిగా మారింది. కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్ కి మహాకూటమితో టీడీపీ బలం కూడా తోడైతే.. తెరాస విజయం సులభం కాదు. దీనికితోడు మహాకూటమికి అండగా టిజెఎస్, సిపిఐ కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహాకూటమి పుణ్యమా అని తెరాస విజయం మహా కష్టంగా మారింది. అయితే ఈ  మహాకూటమి ఏర్పడటానికి తెరవెనుక చంద్రబాబు పావులు కదిపారని గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా ఈ మహాకూటమితో మొన్నటి వరకు కేసీఆర్ కు కనిపించని టీడీపీ, చంద్రబాబు.. ఇప్పుడు కనిపించడం మొదలు పెట్టారు. మొన్నటివరకు కాంగ్రెస్ మీద మాత్రమే ఎక్కువ విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేసారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి.. ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి సిగ్గులేదా అంటూ హద్దులు దాటి విమర్శలు చేసారు.     అయితే కేసీఆర్, చంద్రబాబు మీద చేస్తున్న విమర్శలు ఆయనకు మైలేజీ తీసుకురాకపోగా నెగటివ్ ఇమేజ్ తీసుకొస్తున్నాయి. 2009 లో తెరాస, టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 2009 లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబుని గొప్ప నాయకుడు అన్నావ్. అప్పుడు తెలంగాణ ద్రోహిగా కనపడని ఆయన ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సరికి చంద్రబాబు ద్రోహి అయ్యాడా అంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ ని డెవలప్ చేసి ప్రపంచపటంలో నిలిపినందుకు ద్రోహ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటివరకు కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ కాస్తా.. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. మరి తెరాసకు గెలుపు నమ్మకాన్ని దూరం చేస్తున్న మహాకూటమి.. గెలుపుని కూడా దూరం చేస్తుందేమో చూడాలి.

పవన్ వర్సెస్ చింతమనేని.. గెలుపెవరిది?

పవన్ వర్సెస్ చింతమనేని మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.రీసెంట్ గా దెందులూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్.. చింతమనేనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై చాలా కేసులున్నా.. రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. చింతమనేని ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని.. తనపట్ల వచ్చిన ఆరోపణలపై మీకు ఇష్టమొచ్చిన కమిటీ వేసుకోండని సవాల్ విసిరినా సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా నీకు దమ్ముంటే నాపై గెలువు. నీ సామాజికవర్గ ఓటర్లే నిన్ను తిరస్కరిస్తారని చింతమనేని పవన్ కు సవాల్ విసిరారు.     దెందులూరు నియోజకవర్గంలో చింతమనేకి మంచి పేరుంది. ఇంటికి ఎవరు వచ్చినా.. చెయ్యి కడగకుండా వారిని బయటకు వెళ్లనివ్వరు. అదేవిధంగా సమస్యల పరిష్కారంలో చింతమనేని స్టైలే వేరు. త్వరగా స్పందిస్తారు త్వరగా సమస్యలు పరిష్కరిస్తారు. అధికారుల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. ఆయన వ్యాపార లావాదేవీలు ఏమున్నాయో తమకు తెలియదని.. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో ఆయన ఎప్పుడూ లంచాలు తీసుకోలేదని నియోజకవర్గ అధికారులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. చింతమనేని సామాజికవర్గ అధికారులు అక్కడ తక్కువగా ఉన్నారు.. కాపు, బిసి కులాలకు చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. అయినా చింతమనేని పట్ల అధికారులు పాజిటివ్ గా ఉండటం విశేషం. కుల మదంతో చింతమనేని విర్రవీగుతున్నారని సోషల్‌మీడియాలో పవన్‌ అభిమానులు కొందరు పోస్టింగ్‌లు పెడుతున్నారు. అయితే నియోజకవర్గంలో లక్షా 80వేల ఓట్లు ఉండగా.. అందులో కమ్మ సామాజికవర్గ ఓట్లు 30వేలు మాత్రమే. మిగతా లక్షా యాభైవేల ఓట్లు ఇతర కులాల వారివే. కేవలం కమ్మ సామాజికవర్గ ఓట్లతోనే ఆయన ఎలా గెలుస్తారు?. కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామాల్లో కూడా ఓటర్లు చింతమనేనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినీహీరోగా పవన్‌ ను గౌరవిస్తాం, ప్రేమిస్తాం.. ఓటు మాత్రం చింతమనేనికే వేస్తామని కాపు వర్గానికి చెందిన ఓటర్లు చెబుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన యువత మాత్రమే పవన్‌ వైపు ఉంటారని.. మిగతా వారు చింతమనేని వైపు నిలుస్తారని వారు చెబుతున్నారు.     చింతమనేని ఆకురౌడీ అంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసినా.. చింతమనేని వ్యక్తిగత విమర్శలకు దిగకుండా.. అవును నేను రౌడీనే. అసెంబ్లీ రౌడీ సినిమాలో శివాజీ ఎలా గెలిచాడో.. నేను కూడా అలాగే గెలిచి వస్తా. దమ్ముంటే తనపై గెలవాలని పవన్‌ కు సవాల్‌ విసిరారు. చింతమనేనికి ఆయన సామాజికవర్గాల మద్దతు ఉందో లేదో కానీ మెజార్టీ ఓటర్లు మాత్రం ఆయన వైపే మొగ్గుచూపుతున్నారు. ఆయన ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు.. పనిచేస్తారు.. అధికారులతో ఆగమేఘాలపై పనులు చేయిస్తారు. ఇంటికి ఏ కులం వారు వచ్చినా వారిని గౌరవంగా పలకరిస్తారు. ఆయనకు కోపం వస్తే దూకుడుగా మాట్లాడతారు తప్ప ఆయన కడుపులో ఏమీ ఉంచుకోరని అక్కడి వారు చెబుతుంటారు. ఇదే విషయంపై మీడియా వర్గాలు జిల్లా అధికార వర్గాలతో సంప్రదించగా ఆయన అప్పుడప్పుడు తమతో మాట్లాడతారని.. పనుల విషయంపై చర్చిస్తారని.. వాటి అమలులో దూకుడగా వ్యవహరిస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని లేటుగా తెలుసుకున్న పవన్‌, చింతమనేనిపై విమర్శలు తగ్గించారు.

గుంటూరులో చంద్రబాబు లెక్కలు.. వైసీపీకి తప్పవా తిప్పలు

గుంటూరు జిల్లా మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గుంటూరులో ఆది నుండి టీడీపీకి మద్దతుగా నిలుస్తోన్న బిసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై చంద్రబాబు బిసీలకు ఎక్కడ సీట్లు ఇవ్వాలో? ఎవరు అభ్యర్థులైతే బాగుంటుందో? చెప్పాలని ఆయనకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యేను ఆదేశించారు. విద్యాధికులు,ప్రజల్లో మంచిపేరు ఉన్నవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రేపల్లె, మంగళగిరి నియోజకవర్గాలను బీసీలకు కేటాయించారు. తాజాగా మాచెర్లలో బీసీ వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. యాదవ సామాజికవర్గానికి చెందిన వారిని ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోబోతున్నారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. అదేవిధంగా కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన మంగళగిరి ఇన్‌ఛార్జి చిరంజీవిని మళ్లీ బరిలోకి దింపుతారా? లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఆయన భార్యకు సీటు ఇస్తారా? చూడాల్సి ఉంది. చిరంజీవి సామాజికవర్గమైన పద్మశాలీలు అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఇక్కడ యాదవ, పద్మశాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో బీసీలకు అవకాశం దక్కబోతోంది.     అప్పట్లో ముస్లింలకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. గుంటూరు-1 ముస్లిం వర్గాలకు చెందిన వారిని బరిలోకి దించబోతున్నట్లు సమాచారం. అభ్యర్థి లాల్‌జాన్‌భాషా వారసులు లేక వేరేవారా? అనేది తెలియకపోయినా ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించడం ఖాయమని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన వైశ్య సామాజికవర్గానికి చెందిన వారిని బుజ్జగించేందుకు వారికి నర్సరావుపేట నుంచి అవకాశం కల్పించబోతున్నారు. తాజాగా బాపట్ల నియోజకవర్గ పరిస్థితిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో మెజార్టీ ఓటర్లు వైసీపీకి మద్దతు ఇస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు.. రెడ్డి సామాజికవర్గానికి చెందని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తున్నా.. ఆయన తాను నిలబడలేనని, తన కుమారునికి అవకాశం ఇవ్వాలని కోరడంతో చంద్రబాబు తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన అన్నం సతీష్‌ప్రభాకర్‌ ఓడిపోయిన విషయం విదితమే. మళ్లీ తనకే పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో అన్నం ఉన్నారు. కానీ ఆయన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని చంద్రబాబు దృష్టికి వెళ్లింది.     యాదవులు, గౌడ్‌ సామాజికవర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారిలో యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గౌడ సామాజికవర్గానికి చెందిన వారు రేపల్లె నుంచి పోటీ చేస్తుండడంతో ఆ సామాజికవర్గానికి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు. గతంలో బీసీలకు రెండు సీట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి నాలుగు సీట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో వైసీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చునని ఎమ్మెల్యేలు, చంద్రబాబు భావిస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో వైసీపీకి మద్దతు ఇస్తోన్న క్రైస్తవ ఓటర్లకు ధీటుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇదే విషయంపై చంద్రబాబు ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారని, కొందరిని రహస్యంగా పర్యటనలు చేయిస్తున్నారని తెలుస్తోంది. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే 1983 నాటి గాలి మళ్లీ వీస్తుందనేది పార్టీ నాయకుల నమ్మకం. జిల్లాలో దళిత సామాజికవర్గానికి మూడు సీట్లు ఉన్న నేపథ్యంలో బీసీలకు రెట్టింపు ఇవ్వకపోయినా కనీసం ఐదు సీట్లు ఇస్తే పరిస్థితి మెరుగుగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కృష్ణాలో వైసీపీకి షాక్.. పార్టీని వీడే ఆలోచనలో ఇద్దరు కీలక నేతలు.!!

  కృష్ణాజిల్లాలో వైసీపీని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు విజయవాడ సెంట్రల్‌ సీటు విషయంలో వంగవీటి రాధాకు మొండిచేయి చూపడంతో.. రాధాతో పాటు ఆయన అనుచరవర్గం వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో రాధా వైసీపీని వీడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంకా ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడకముందే మరో షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు సీనియర్‌ నాయకులు వైసీపీని వీడనున్నారనే ప్రచారం జరుగుతోంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆయన మరణం తరువాత వైసీపీలో చేరిన సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి, జోగి రమేష్‌ లు ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారట. తాము కోరిన సీట్లు ఇవ్వమంటే ఎంత ఇస్తారని వారిని ప్రశ్నిస్తున్నారని.. దాంతో సొమ్ములు ఇచ్చి తాము పోటీ చేయలేమని.. ఆ ఇద్దరు నేతలు వేరే పార్టీకి జంప్‌ కావడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.   బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో పెనమలూరు నుంచి గెలిచిన పార్థసారధికి 2014 ఎన్నికల్లో అక్కడ టిక్కెట్‌ ఇవ్వకుండా మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి జగన్‌ పోటీ చేయించడంతో ఆయన అక్కడ ఓటమి చెందారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ పెనమలూరు సీటు ఇవ్వాలని పార్థసారధి డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఆయన జగన్‌ ని కలిసి స్పష్టత కోరగా.. జగన్‌ దూషించారని ప్రచారం జరుగుతోంది. జగన్‌ ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నారని.. దాంతో పార్థసారధి కన్నీళ్లు పెట్టుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే అదే సీటుపై పార్థసారధి పట్టుపడుతుండడంతో..అక్కడ ఎంత ఖర్చు పెడతావో చెప్పమని జగన్‌ ఆయనను అడిగారని.. ఆయన ఏదో సంఖ్య చెబితే అది చాలదని ఇంకా కావాలన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో తాను చెప్పిన సొమ్ములు ఖర్చు పెడితేనే సీటు ఇస్తానని జగన్‌ స్పష్టం చేయడంతో ఇక పార్టీలో తాను ఉండలేనని నేడో, రేపో నిర్ణయం తీసుకుంటానని.. ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారట.   ఇది ఇలా ఉంటే మరో సీనియర్‌ నేత జోగి రమేష్‌ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 2009లో పెడన నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత వైసీపీలో చేరడంతో.. ఆయనను టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై జగన్‌ పోటీకి నిలిపారు. ఈ ఎన్నికల్లో జోగి ఓటమి చెందినా ఉమకు గట్టిపోటీ ఇచ్చారు. ఇక మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని ఆయన భావించి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆయనకు కూడా జగన్‌ షాక్‌ ఇచ్చారు. ఇక్కడి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయిస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. దీంతో కలత చెందిన జోగి తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో స్పష్టత ఇవ్వాలని జగన్‌ ని కోరినట్లు సమాచారం. దీనికి జగన్‌ స్పందిస్తూ సొమ్ములు విషయం ఆరా తీయడంతో ఆయన దిగ్బ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో పోటీ చేయాలనే వారిపై అనేక ఒత్తిళ్లు, ఆర్థిక విషయాలు ఎత్తుతుండడంతో ఎవరికి వారు తలో దారి చూసుకుంటున్నారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆయనేనట..!!

  ఎన్నికలు సమీపిస్తుంటే.. తమ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? తమ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? అని అన్ని పార్టీలలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రం వీటితో పాటు మరో ఆసక్తికరమైన విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు?. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ. వారిలో చాలామంది 'నాకేం తక్కువ.. నేనే సీఎం అభ్యర్థిని' అనే భ్రమలో ఉంటారు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పి. సీఎం అభ్యర్థిగా ఎవరు పేరు చెప్తే ఎవరు భగ్గుమంటారో.. దాని వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో అని అధిష్టానం భయపడుతూ ఉంటుంది. అదీగాక కాంగ్రెస్ లో రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ. ఇంచుమించు అందరూ నేనే తోపు అనే భ్రమలో ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం వారిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఇంకేమన్నా ఉందా?.. మాకేం తక్కువ అంటూ అల్లకల్లోలం చేసేయరు. అందుకే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. ఒకేసారి తెరాస పార్టీ జోరుకు, కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుకు చెక్ పెట్టే ప్లాన్ వేసిందట. అదేంటంటే దళిత నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం.     గత ఎన్నికలకు ముందు తెరాస దళిత నేతను సీఎం చేస్తామని చెప్పింది కానీ డిప్యూటీ సీఎం తో సరిపెట్టింది. ఇప్పుడు దీన్నే కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోందట. దళిత నేతను సీఎంని చేస్తామని చెప్పడం కాదు.. చేసి చూపిస్తాం అనే మాటను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తున్నారట. అదీగాక గతంలో టీ.అంజయ్య, సంజీవయ్య వంటి నేతలను సీఎంలను చేసిన ఘనత కాంగ్రెస్ కి ఉంది. ఆ పాయింట్ ను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇలా వ్యూహాత్మ‌కంగా ద‌ళితుడికి సీఎం పీఠం క‌ట్ట‌బెడ‌తామ‌ని చెప్ప‌డం మూలంగా ఇటు తెరాసకు, అటు కాంగ్రెస్ వర్గపోరుకు చెక్ పెట్టొచ్చని భావిస్తోందట. ప్రస్తుతం కాంగ్రెస్ అడుగులు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. తాజాగా ఏఐసీసీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలలో ప్రచార కమిటీ, మానిఫెస్టో వంటి కీలక కమిటీల చైర్మన్ లు గా ఎస్సీ సామాజికవర్గాల వారిని నియమించటం వెనుక కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటో అర్థమౌతుంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ను ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా నియ‌మించ‌డాన్ని చూస్తుంటే ఆయ‌నే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో పాటు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను కూడా మేనిఫెస్టో క‌మిటీకి చైర్మ‌న్ గా చేయ‌డం, అలాగే అన్ని విభాగాల్లోనూ ద‌ళిత స‌భ్యులు ప్ర‌ముఖంగా ఉండ‌టం చూస్తుంటే కాంగ్రెస్ స్ట్రాటజీ దళిత సీఎం అనే అనిపిస్తోంది. మరి కాంగ్రెస్ గతంలో తెరాస చెప్పిన దళిత సీఎం కాన్సెప్ట్ ను తెరమీదకు తీసుకొచ్చి తెరాసను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి మరి.

ఓటుకు నోటు కేసు.. మళ్ళీ తెరమీదకు?

  ఓటుకు నోటు కేసు.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి అరెస్ట్, బెయిల్.. చంద్రబాబు పేరు.. ఇలా మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బాగానే హాట్ టాపిక్ అయింది. అయితే ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఈ కేసు మళ్ళీ తెరమీదకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తెలంగాణ రాజకీయాలట. తెలంగాణలో ప్రస్తుతం ముందస్తు వేడి మొదలైంది. అధికారం మళ్ళీ తమదే అనే నమ్మకంతో ముందస్తుకు సిద్దమైన కేసీఆర్ కు.. మహాకూటమి రూపంలో బలమైన ప్రత్యర్థి తయారైంది. భారీ సంఖ్యలో నాయకులతో నిండిపోయిన కాంగ్రెస్ కు కేడర్ కూడా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ బలానికి.. నాయకులు అంతగా లేకపోయినా, కేడర్ బాగానే ఉన్న టీడీపీ బలం తోడైంది. అదీగాక ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కేసీఆర్ ని గద్దె దించాలని, టీడీపీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు మింగుడుపడని విషయం. ఇన్నాళ్లు తమ గెలుపుని కాంగ్రెస్ ఆపలేదు, మళ్ళీ అధికారం మాదే అని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు టీడీపీ తోడై.. అధికారం దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే ఇప్పుడు చంద్రబాబు దృష్టిని మరల్చేందుకు ఈ ఓటుకు నోటు కేసును తెరమీదకు తీసుకువస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.     అప్పట్లో స్టీఫెన్సన్ కు 50 లక్షలు ఇచ్చి మరో 4.5 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన వీడియో బయటికొచ్చింది. అయితే మిగిలిన 4.5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి?.. ఎక్కడ ఉన్నాయో తేల్చాల్సిందిగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. నిజంగా లేఖ రాశారా?.. ఒకవేళ రాసినా.. ఆ 4.5 కోట్లు అనేది కేవలం ఒప్పందం. దానికి సంబంధించిన లావాదేవీ జరగలేదు. తెరపైన కనిపించిన 50 లక్షల గురించి ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతుంది. మరి అసలు లావాదేవినే జరగని ఆ 4.5 కోట్లు గురించి సిబిఐ, ఈడీ లాంటి విభాగాలు రంగంలోకి దిగుతాయా ? అంటే అనుమానమే. అసలు కొందరైతే ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు రావడమే అనుమానం అంటున్నారు. కేసీఆర్ ముందస్తు అంటూ 105 అభ్యర్థులను ప్రకటించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ బిజీగా ఉన్నారు. అదీగాక ఇప్పటికే జగ్గారెడ్డి అరెస్ట్, రేవంత్ రెడ్డికి నోటీసులు తెరాస కక్ష్య సాధింపు రాజకీయాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో మళ్ళీ ఓటుకు నోటు కేసు తోడుతుందా? కష్టమే. అసలే ముందస్తు, గెలుపు, అసంతృప్తులు, బుజ్జగింపులు వంటి వాటితో బిజీగా ఉన్నారు. కొందరేమో ఇదంతా కేంద్రం, తెరాస వెనుక ఉండి నడిపిస్తుంది అంటున్నారు. అయితే కొందరు దీన్ని కూడా కొట్టేస్తున్నారు. అసలే కేంద్రం రాఫెల్ డీల్ వివాదంతో తలలుపట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో బలమైన నేత, వ్యూహాలతో దిట్ట అయిన చంద్రబాబుని టచ్ చేసే సాహసం బీజేపీ చేయదనే అంటున్నారు. మరి ఓటుకు నోటు కేసు నిజంగానే తెరమీదకు వస్తుందా? ఇది తెరాస ప్లానా? లేక బీజేపీ వెనకుండి నడిపిస్తుందా? అసలు ఇవన్నీ ఫేక్ కోర్ట్ విచారణలో ఉన్న కేసుని మళ్ళీ తెరమీదకు తీసుకురావడం ఏంటి అంటారా? ఏంటో ఇవన్నీ ఆ పై వాడికే తెలియాలి.

ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి

  ఏపీలో ఎన్నికలకు 8 నెలల సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైంది.. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహించి, గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది.. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది.. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్ ను కలుస్తున్నారు.. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు.. వారిలో ఎవరైతే బాగుందన్న సమాచారాన్ని రాబడుతున్నారు.. గెలుపు ఎవరికి దక్కుతుంది?.. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు?.. లాంటి ప్రశ్నలను పార్టీ కేడర్ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు.. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ ను సంప్రదింపులు జరిపారు.. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.. తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది.. జనరల్ స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుందన్న విషయంపై దృష్టి సారించింది..పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది.     తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది.. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు.. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా ఈ స్థానాన్ని బీజేపీకి దక్కేలా చేసాయి.. టీడీపీ మద్దతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది.. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య నలిగిపోయారు.. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఈ స్తానం నుండి టీడీపీ పోటీ చేయనుంది.. అందుకు తగ్గట్టే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి?.. ఎవరి అభ్యర్థిత్వాన్నికోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు పార్టీ కేడర్ వద్ద ప్రస్తావిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది.. అందులో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసులు ఉన్నారు.. కొద్దిరోజుల క్రితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.   అదేవిధంగా ఉంగుటూరులో కూడా అధిష్ఠానం సర్వే నిర్వహించింది.. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరుకి ఒక సెంటిమెంట్ ఉంది.. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరిపక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపన్న సెంటిమెంట్ అందరిలోనూ పాతుకుపోయింది.. దీంతో టీడీపీ అధిష్ఠానం ఉంగుటూరుపైన ఆసక్తి కనబరుస్తోంది.. అందులో భాగంగా సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది.. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది.. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు.. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతో పాటు, ఉంగుటూరులోనూ సర్వే సాగింది.. మరోవైపు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు.. నలుగురు అభ్యర్దిత్వాల్లో ఎవరు కావాలి.. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించినట్లు సమాచారం. నరసాపురం నియోజకవర్గంలో గెలుపోటములు, ఓటింగ్ సరళిలో హెచ్చుతగ్గులు సామాజిక సమీకరణపైనే ఆధారపడి ఉంటాయి.. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణాలపైనే ఆధారపడుతూ వస్తోంది.. మరోవైపు నరసాపురం నియోజకవర్గంలో టీడీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరంటే ఇంకొకరికి పడదు.. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది.. ఇటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం నరసాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది.. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.. వీరిద్దరిలో ఎవరైతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు.. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది.. అలాగే మిగతా నియోజక వర్గాల్లోనూ సర్వే జరుపుతున్నట్టు సమాచారం.