ఏపీకి వందకు వంద శాతం వెళ్తా: కేసీఆర్

  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: కేసీఆర్

  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.

గజ్వేల్ లో ఎవరు గెలుస్తారో? చెప్పడం ఇష్టం లేదు: లగడపాటి

  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.

నేను కేసీఆర్‌ను విమర్శించను: చంద్రబాబు

  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం

  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 

కొడంగల్ లో కేటీఆర్.. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి

  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 

టీటీడీపీ మేనిఫెస్టోలో రైతులకే ప్రాధాన్యం

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ,కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా 14 స్థానాలను కేటాయించగా ఆయా స్థానాల్లో టీడీపీ తరుపున అభ్యర్థులు నామినేషన్ వేశారు. తాజాగా టీడీపీ తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ, దేవేందర్‌గౌడ్‌, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడరు. అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి టీడీపీ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టో రూపొందిందని వివరించారు. ఇందులో అత్యంత ప్రాధాన్య అంశంగా రైతంగ సమస్యలను పేర్కొనట్లు వెల్లడించారు. మానిఫెస్టోలో పొందుపరిచిన ముఖ్యాంశాలు: అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత. రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం. ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు. ప్రొ. జయశంకర్‌ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు. లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు. హైద్‌రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ. ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్‌ విడుదల. తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి.  ప్రగతి భవన్‌ ప్రజా ఆస్పత్రిగా మార్పు ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు. బెల్ట్‌షాపులు రద్దు. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 5వేల కోట్లు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌. బీసీలకు సబ్‌ప్లాన్‌. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. దివ్యాంగులకు రూ.3వేలు పించన్. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.

కోడి కత్తి దాడి తర్వాత జగన్ తొలి బహిరంగ సభ

  వైసీపీ అధినేత జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన దాడి ఘటన తర్వాత తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్.. పార్వతీపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయని విమర్శించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని జగన్ నిలదీశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు తోటపల్లి ప్రాజెక్టు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనిని కూడా చంద్రబాబు నాలుగున్నర ఏళ్లు గడిచినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల్ని శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తారని ధ్వజమెత్తారు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాగా దోపిడీలకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్ వాడీ పోస్టులను కూడా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా వదిలిపెట్టడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్నారని, అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు కాజేస్తున్నారని జగన్ ఆరోపించారు. జిల్లాలో 26 కరవు మండలాలుంటే వాటిలో 4 మండలాల్లో మాత్రమే కరవు ఉందని చంద్రబాబు అంటున్నారని అన్నారు. రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయైనా కరీఫ్, రబీ రైతులకు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నారని వ్యాఖ్యానించారు. పునాదులు మాత్రమే కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు చంద్రబాబు చెబుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా తనపై జరిగిన దాడి గురించి కూడా జగన్ స్పందించారు. అన్యాయమైన పాలనను ప్రశ్నించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హత్యాయత్నం చేసింది తన అభిమానంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమాని తనపై ఎందుకు హత్యాయత్నం చేస్తాడని ప్రశ్నించారు. రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్ చంద్రబాబుకు సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. దాడి జరిగిన గంటకే స్క్రిప్ట్ ప్లే చేశారని, చంద్రబాబు స్క్రిప్ట్‌ను డీజీపీ చదివారని జగన్ ఆరోపించారు.ఫ్లెక్సీలో విజయమ్మ ఫొటో లేదని, గరుడపక్షి ఫొటో ఉందన్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడి దగ్గర ఎలాంటి లెటర్ కనబడలేని జగన్ చెప్పారు. లెటర్ ఇస్త్రీ చేసినట్లు ఉందని, మడతలు కూడా లేవన్నారు.  తాను విశాఖలో అడుగు పెట్టినప్పుడే సీసీ కెమెరాలు ఆగిపోయానని తెలిపారు. తెలిసీ తెలీకుండా అభాండాలు వేయకూడదనే హత్యాయత్నంపై తాను వెంటనే స్పందించలేదనన్నారు. అప్పటికప్పుడు చొక్కా మార్చుకుని బయల్దేరానని చెప్పారు. ఎవ్వరూ కంగారుపడొద్దని ట్వీట్ చేశానని జగన్ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో తనపై హత్యాయత్నం, కుట్ర చేయకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. కుట్రలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని విమర్శించారు. సీబీఐ విచారణ జరిగితే నేరుగా జైలుకి వెళ్తారని చంద్రబాబు వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

కూటమి నుంచి బయటికి.. ఉత్తమ్ పై పోటీకి రెడీ

  టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఇంటి పార్టీకి కాంగ్రెస్ ఒక టిక్కెట్ కేటాయించిందని, ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ నకిరేకల్ నుంచి బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్ సీటుని చిరుమర్తి లింగయ్యకు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికే సీటుని కేటాయించింది. దీనిపై ఇంటి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పాపం కాంగ్రెస్ ది కూడా ఏం చేయలేని పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలోని మిగతా మూడు పార్టీలకు సీట్లు కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో నిరసన సెగలు తగులుతున్నాయి. మరి అలాంటి సమయంలో అంతగా బలం లేని ఇంటి పార్టీకి టిక్కెట్ కేటాయిస్తే ఇంకేమైనా ఉందా?. నిరసన సెగ తారాస్థాయికి చేరదు. దీనికితోడు నల్గొండలో బలమైన కేడరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదనలేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే ఇంటి పార్టీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇంటి పార్టీ మాత్రం కూటమిలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది.  తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ తాజాగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అమరావతి నుంచే కాంగ్రెస్ టిక్కెట్లు వస్తున్నాయని ఆరోపించారు. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని ఆయన చెప్పారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని అన్నారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చెరుకు సుధాకర్ బరిలోకి దిగుతానని చెప్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009లో సుమారు 29వేలు, 2014 ఎన్నికల్లో 23వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఉత్తమ్ మీద పోటీకి సుధాకర్ సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మహాకూటమిలో ఉన్న సుధాకర్.. ఇప్పుడు కూటమిలోని పెద్దన్న పార్టీ కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ మీదే పోటీకి సిద్ధమయ్యారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

పొన్నాల కోసం కోదండరాం త్యాగం

  టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అసలు ఈ కూటమి ఎన్నికల వరకు ఉంటుందా? ముందే ముక్కలవుతుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి దూసుకుపోతుంది. కూటమిలోని పార్టీలు, నేతలు త్యాగానికి సిద్దమవుతూ తమ ప్రధాన లక్ష్యం ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. టీడీపీ తక్కువ సీట్లకు సర్దుకుపోయింది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసి పొత్తు ధర్మాన్ని పాటించారు. ఇక సీపీఐ కూడా తక్కువ సీట్లు కేటాయించినా.. టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు. కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. పొన్నాల జనగామ నుంచి అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయనికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి పొన్నాలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని టీజేఎస్ కి కేటాయించింది. ఇక్కడి నుంచి కోదండరాం బరిలోకి దిగలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పినా.. పొన్నాల మాత్రం జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సుముఖుత వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ సీనియర్ నేత అయిన పొన్నాలకు మొండిచేయి చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కోదండరాం పొన్నాల కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా టీజేఎస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కోదండరాం వేరే ఏదైనా స్థానం పోటీ చేస్తారో లేక కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమిలోని పార్టీలు, నేతల త్యాగాలు చూస్తుంటే టీఆర్ఎస్ ని ఓడించాలని కూటమి ఎంత బలంగా ఫిక్స్ అయిందో అర్ధమవుతోంది. చూద్దాం కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో.

సీట్లు మహాకూటమికి.. సీఎంగా కేసీఆర్

  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది. ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి. సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.

ఆనాడు ఎన్టీఆర్..ఈనాడు చంద్రబాబు

  తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.     ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుకు హరీష్ రావు లేఖ.. 18 ప్రశ్నలతో మెలిక

  తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా? పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా? కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా? పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా? ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా? సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా? విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా? పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా? ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా? ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా? విభజన మాయని గాయం అని బాధ పడలేదా?

బీజేపీకి బిగ్ షాక్.. కనీసం ఆ సీటు గెలిస్తే పరువు దక్కేది

కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.     ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రామనగరంలో బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పొటీ ఏకపక్షమే అయ్యింది. బీజేపీ కంచుకోట 'బళ్లారి'లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కనీసం ఈ సీటు నిలుపుకుంటే బీజేపీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలు ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.

జగన్ కాళ్ల దగ్గర లక్ష్మీ పార్వతి

  రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో చంద్రబాబుపై ప్రారంభమైన విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టారంటే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలన్నీ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.ఇటీవల విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. "అలా ఎప్పటికీ జరగదని,ఒకవేళ అలా జరిగితే తాను ఉరి వేసుకుంటానని" సంచలన వ్యాఖ్యలు చేసిన కేఈ తాజగా రాహుల్ చంద్రబాబు భేటీని సమర్థించారు..దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.     రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అంతేకాకుండా లేఖలో ప్రతిపక్షాలపై పలు ప్రశ్నలను సంధించారు.''రాహుల్‌ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలని అనుకోవడం తప్పా?...ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?..  లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు.బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని కేఈ దుయ్యబట్టారు.

సీబీఐకి ఎదురుదెబ్బ.. భోఫోర్స్‌ కేసులో కాంగ్రెస్ కి ఊరట

భోఫోర్స్‌ కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూజా సోదరులతోపాటు ఇతర నిందితులను 2005లో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ ఉత్తర్వులను సీబీఐ సుప్రీంలో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్‌ చేసిందని ధర్మాసనం పేర్కొంది.     1986, మార్చి 24న భారత్ స్వీడన్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌తో 400 యూనిట్ల హౌఇట్జర్ తుపాకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు. భారత ఆర్మీని బలోపేతం చేసేందుకు నాడు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాటి ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీకి ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌కు సంబంధించి రూ.64కోట్ల అవినీతి జరిగిందని కేసు నమోదైంది. ఈ కేసులో పలువురు ప్రముఖులతో పాటు హిందూజా సోదరులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005 మే 31న బోఫోర్స్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైనా కేసు కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హిందూజా సోదరులపైన కూడా కేసు కొట్టేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ కోర్టు 13 ఏళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పును సవాలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 2న అప్పీల్‌ చేసింది. అయితే 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పును సవాలు చేయడాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 90రోజుల్లో అప్పీలు దాఖలు చేయాలి. అయితే దాదాపు 4,500 రోజుల ఆలస్యం తర్వాత సీబీఐ అప్పీలు దాఖలు చేయడం అంగీకరించే విధంగా లేదని న్యాయమూర్తి అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించినట్టు అయింది. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు మంచి విజయంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

దేశ భవిష్యత్తు కోసమే మా కలయిక

  బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయి నేతలతో భేటీ అవుతున్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు భేటీ అయ్యారు.భేటీలో బీజేపీ వ్యతిరేక కూటమి సహా తెలంగాణలో పొత్తు పై చర్చలు జరిపారు.భేటీ అనంతరం రాహుల్ గాంధీ,చంద్రబాబు ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ..నేడు మన దేశాన్ని కాపాడవలసి ఉందన్నారు. ఇది ప్రజాస్వామికంగా తప్పనిసరి పరిస్థితి అన్నారు. అన్ని పక్షాలు కలిసి రావలసిన అవసరం ఉందన్నారు. తాను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలూ కలిసి రావలసిన సమయం ఆసన్నమైందన్నారు.కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమని, ఇతర పార్టీలు కూడా కలిసి వస్తున్నాయని, అన్ని పార్టీలు కలిసి కూర్చొని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని రక్షించడమే తమ కర్తవ్యమన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ...దేశ భవిష్యత్తును కాపాడవలసి ఉందన్నారు. మన దేశానికి ప్రస్తుతం చాలా సంక్లిష్ట సమయమని చెప్పారు. ఎన్నికల పొత్తుల గురించి మీడియా ప్రశ్నలపై రాహుల్ స్పందిస్తూ మీడియాకు సెన్సేషనలిజం కావాలన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే ముఖ్యమని, తాము దాని గురించే ఆలోచిస్తున్నామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై దర్యాప్తు చేయగలిగిన దర్యాప్తు సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాఫెల్ లో అవినీతిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. పార్టీల మధ్య గతంలో జరిగిన అంశాలను మర్చిపోవాలని నిర్ణయించామన్నారు.అంతా కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించామన్నారు.రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. అన్ని వివరాలను సరైన సమయంలో తెలియజేస్తామన్నారు. యువత ముందు ఉన్న అతి పెద్ద సమస్యలు ఉపాధి కల్పన, అవినీతి అని తెలిపారు. నరేంద్ర మోదీ బహిరంగంగా మాట్లాడటానికి ఇకపై చాలా కష్టమని వ్యాఖ్యానించారు.

తెరాస సర్కార్ మొదటి స్కాం వెలుగులోకి..!!

'ఏ పార్టీ పాలించినా ఏమున్నది గర్వకారణం.. అంత స్కాముల మయం'. అన్నట్టుంది ప్రస్తుత రాజకీయాల పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీమీద అవినీతి ఆరోపణలు రావడం, ఆ పార్టీ స్కాములు వెలుగులోకి రావడం కామన్ అయిపోయింది. దీనికి తెలంగాణలోని తెరాస పార్టీ కూడా అతీతం కాదు. ఇప్పటికే ప్రతిపక్షాలు తెరాస సర్కార్ అవినీతికి పాలపడిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడొక స్కాం వెలుగులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ స్కాం మచ్చ తెరాసకు అంటుకుంటే ఆ పార్టీకి నష్టమనే చెప్పాలి. ఇంతకీ ఆ స్కాం ఏంటంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.వందల కోట్ల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వేల సంఖ్యలో చెక్కులు మంజూరు చేశారు. వందల కోట్లు ఆ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. కానీ వారు ఎవరు?.. వారికి ప్రభుత్వం ఏ కారణంగా సాయం చేసింది?.. లాంటి బేసిక్ వివరాలేమీ ప్రభుత్వం వద్ద లేవు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ స్కాం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. 2014 జూన్ నుంచి 2015 ఆగస్టు వరకు.. తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 12,462 చెక్కులు మంజూరు చేసింది. ఈ చెక్కుల నుంచి రూ. 86.6 కోట్లను డ్రా చేసుకున్నారు. ఈ చెక్కులన్నీ ఎవరు తీసుకున్నారో కానీ.. కేవలం 182 చెక్కులకు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంది. మిగతా సొమ్ములు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వానికే క్లారిటీ లేదని సమాచారం. సాధారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే..  ప్రభుత్వ ఆరోగ్య పథకాల కిందకు రాని అరుదైన, ఖరీదైన వ్యాధుల బారిన పడిన వారికి ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అలాగే ఇతర సమస్యల్లో ఉన్న వారికీ ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అయితే ఈ సాయం ఆషామాషీగా చేయడానికి ఉండదు. దానికో లెక్క ఉంటుంది. నేరుగా నిధులు ఇవ్వరు. ఏ ఆస్పత్రిలో చూపించుకుంటున్నారో వారికి మాత్రమే బిల్లు చెల్లిస్తారు. దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రతీది రికార్డెడ్‌గా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం ఎవరికి సాయం చేశారో తెలియకుండానే నిధులు మంజూరు చేసేశారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 46 నెలల్లో లక్షా ఇరవై వేల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేశామని.. ఇందు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరిగింది. పేదల్ని ఆదుకున్నారని అభినందించారు. అయితే ఇప్పుడు అసలు ఇలా మంజూరు చేసిన సాయం ఎవరికి పోయిందో తెలియకుండా పోవడంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ సొమ్మంతా ఎటు పోయిందో తేల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలు ఈ స్కాంను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ము అంతా సీఎం ఆఫీస్ సాక్షిగా కాజేశారని ఆరోపణలు చేస్తూ.. దీనిపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం తరపున విడుదలయ్యే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. కానీ కొన్ని వందల కోట్లకు.. అదీ నేరుగా సీఎంకి సంబంధం ఉన్న నిధులకు లెక్కలు లేకపోవడం.. ఎన్నికలకు ముందు చాలా పెద్ద వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందో?.. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో?.

కేసీఆర్ ఢిల్లీ టూర్.. బీజేపీ రాజకీయమేనా?

  తాజాగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కళ్ళ పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లినట్టు అధికారంగా తెలిపారు. కంటి వెలుగు పథకంతో లక్షలమంది ఇళ్లలో వెలుగు నింపామని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలో డాక్టర్లు లేనట్టు కంటి పరీక్ష కోసం ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? పేదవాడికి ఓ వైద్యం, కేసీఆర్ కో వైద్యమా? అంటూ కేసీఆర్ టూర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళింది కంటి పరీక్ష కోసం కాదు.. త్వరలో రాబోతున్న ఎన్నికల పరీక్ష కోసమని తెలుస్తోంది. గత కొంతకాలంగా కేసీఆర్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రహస్య ఒప్పందం గురించి మరిన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బీజేపీ నాయకులతో చర్చలు జరపడానికే ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బీజేపీ సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యువభేరి పేరుతో సభ నిర్వహించింది. ఆ సభకు ఆదివారం నాడు అమిత్ షా హాజరయి.. సాయంత్రం ఢిల్లీ వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం కేసీఆర్ కూడా కంటి పరీక్షల కోసమని ఢిల్లీ వెళ్లి మరుసటి రోజు తిరిగొచ్చారు. వీరిద్దరూ కలిసి ప్రయాణమైతే చేయలేదు కానీ.. ఢిల్లీలో రహస్యంగా కలుసుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మంతనాలు జరిపినట్టు న్యూస్ హల్చల్ చేస్తోంది. తెరాస, బీజేపీలు అప్పుడప్పుడు ఒకరిమీద ఒకరు పైకి విమర్శలు చేసుకుంటున్నారు కానీ.. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని.. ఆ విషయం బయటపడితే ఎక్కడ మజ్లిస్ దూరమవుతుందోనన్న భయంతోనే.. తెరాస బయటపడట్లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ తో ఢిల్లీలో బీజేపీ నేతలు ఒక డీల్ చేసుకున్నారట. మజ్లిస్ కంటే కనీసం ఒక్కసీటైనా తమకు ఎక్కువ వచ్చేలా చేయాలని బీజేపీ కేసీఆర్ ని కోరిందట.. దానికి బదులుగా మిగతా స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చి.. మళ్ళీ మీకే అధికారం దక్కేలా చేస్తామని చెప్పిందట. దీనికి కేసీఆర్ కూడా సరే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరిపారనే వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ.. ప్రస్తుతం తెలంగాణలోని పరిస్థితులు చూస్తుంటే రహస్య ఒప్పందం నిజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ కాస్త బలంగా ఉన్న ఉప్పల్ లో తెరాస బలమైన అభ్యర్థిని బరిలోకి దింపలేదు.. నాలుగు బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో తెరాస అసలు అభ్యర్థులనే ప్రకటించలేదు. ఇక తెలంగాణలో బీజేపీ బలం విషయానికొస్తే ఐదు, పది సీట్లు కూడా రావడం కష్టమే. అలాంటి బీజేపీ.. తెరాస, మహాకూటమి మీద విమర్శలు చేస్తూ.. అధికారంలోకి వస్తామని చెప్తూ.. పలు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇవన్నీ చూస్తుంటే.. అధికారం నిలుపుకోవాలని తెరాస, తెలంగాణలో ఉనికి చాటుకోవాలని బీజేపీ.. రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఇలా అడుగులు వేస్తున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ రహస్య ఒప్పందం, పరస్పర సహకారం వార్తల్లో నిజమెంతో ఆ పై వాడికే తెలియాలి.