తెలంగాణ ఎన్నికల బరిలో కళ్యాణ్ రామ్..!!

  తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.. ఇప్పటికే ఎవరి ఊహలకు అందకుండా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్ కి అధికారాన్ని దూరం చేయటమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది.. కేసీఆర్ ని ఓడించటం కోసం సీట్ల త్యాగాలకు కూడా ఈ పార్టీలు సిద్దపడ్డాయి.. మరోవైపు ఈ నాలుగు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.. కొత్త ప్రణాళికలు, కొత్త వ్యూహాలతో కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.. అలాంటి వ్యూహమే వారసులను తెరమీదకు తీసుకురావడం.. దానిలో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని మహాకూటమి భావిస్తోందట.     నందమూరి కుటుంబానికి సినీ, రాజకీయ రంగాల్లో మంచి పేరుంది.. ఆ కుటుంబాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.. విభజన అనంతరం టీడీపీ ఏపీలో అయితే అధికారంలోకి వచ్చింది కానీ, తెలంగాణలో మాత్రం వెనకపడిపోయింది.. మహాకూటమితో తిరిగి ట్రాక్ లోకి రావాలని చూస్తున్న టీడీపీకి, నందమూరి వారసులు కూడా తోడైతే తెలంగాణలో పార్టీ పూర్వవైభవానికి పూలబాట పరిచినట్టవుతోంది.. అందుకే తెలంగాణ టీడీపీ కళ్యాణ్ రామ్ వైపు చూస్తోంది.. అదీగాక హరికృష్ణ ఈమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.. కళ్యాణ్ రామ్ ని బరిలోకి దించితే ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఉంటుందని తెలంగాణ టీడీపీ భావన.. ఇప్పటికే ఈ విషయంపై సీనియర్ నేతలు నందమూరి కుటుంబంతో చర్చించినట్టు తెలుస్తోంది.. మొదట కళ్యాణ్ రామ్ అంగీకరించనప్పటికీ, తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ భవిష్యత్తు కోసం రావాలని నేతలు పట్టుబట్టడంతో ఆయన కాస్త మెత్త బడినట్టు తెలుస్తోంది.. మరోవైపు మహాకూటమిలోని మిగతా పార్టీలు కూడా కళ్యాణ్ రామ్ రాకను స్వాగతిస్తున్నట్టు సమాచారం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించాలని టీడీపీ నేతలు కోరగా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పోటీ చేస్తే ఆ స్థానాలు వదులుకోవడానికి సిద్ధమని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో ఈ రెండు స్థానాల్లో ఏదొక స్థానం నుండి కళ్యాణ్ రామ్ పోటీ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కళ్యాణ్ రామ్ నిజంగానే తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగితే తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతారు? ఇలాంటి విషయాలు తెలియాంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.

తెలంగాణలో జనసేన పరిస్థితి ఏంటి?

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల వేడి పెంచారు.. దీంతో విపక్షాలు కూడా పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి.. అయితే ఒక పార్టీ తీరు మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు.. అదే జనసేన పార్టీ.. ప్రశింస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపారు.. తరువాత వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఒంటరిగా అడుగులు మొదలు పెట్టారు.. ఏపీలో ఐతే పవన్ పర్యటనలు, ప్రభుత్వం మీద విమర్శలతో ప్రజల్లోకి వెళ్తూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.     తెలంగాణలో అసలు ఇంతవరకు జనసేన బలపడే ప్రయత్నమే మొదలు పెట్టలేదు.. నాయకులు కూడా లేరు.. ఓ వైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంటే.. జనసేన మాత్రం ఆ ఊసే లేదు.. ఇలానే ఉంటే ముందస్తు వస్తే తెలంగాణలో జనసేన పార్టీ పరిస్థితి ప్రశ్నార్ధకం అవుతుందనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇంతవరకు వరకు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టలేదు.. ముందస్తు వస్తే తక్కువ సమయంలో పార్టీ నిర్మాణం, బలోపేతం కష్టమవుతుంది.. కొందరైతే అసలు జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. అయితే కార్యకర్తలు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జనసేన అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుంది అంటున్నారు.     మరోవైపు జనసేన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే సీపీఎం పార్టీ జనసేనతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది.. మరో వైపు విపక్షాలు కూడా ఏ పార్టీ వచ్చినా కలుపుకొని పోవాలని చూస్తున్నాయి.. కానీ జనసేనాని మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు.. ఓ వైపు ముందస్తు వేడితో మిగతా పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు మొదలు పెడితే జనసేన మాత్రం మౌనంగా ఉండిపోయింది.. దీన్నిబట్టే చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బరిలోకి కష్టమనే విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరి జనసేన మౌనానికి అసలు కారణం ఏంటి?.. మౌనంగా ఉండి వ్యూహాలు రచిస్తోందా?.. ఒంటరిగా బరిలోకి దిగుతుందా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా?.. లేదా అసలు బరిలోకి దిగదా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జనసేన మౌనం వీడాలి లేదా ఎన్నికలు రావాలి.. చూద్దాం ఏం జరుగుతుందో.

ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం.. ఏపీ బరిలో తెరాస కూడానా?

ఓ వైపు ముందస్తుతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్.. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే హీట్ పెంచుతున్నారు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆరే హాట్ టాపిక్ అయ్యారు.. ఓ వైపు అసెంబ్లీ రద్దు, 105 మంది అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్.. ఏపీలోని పార్టీలకు కూడా షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం.. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళతానని కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ మేరకు కేసీఆర్ ఏపీలో వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.     చాలాకాలం నుండి వైసీపీతో, తెరాసకు సత్సంబంధాలు ఉన్నాయి.. తెలంగాణలో వైసీపీ కాంట్రాక్టర్లు పనులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో కేసీఆర్ ఏపీలో ఎన్నికల వార్తలకు బలం చేకూరుతుంది.. అయితే కొందరు మాత్రం 'చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. బాబుకి బ్రేకులు వేసేందుకే కేసీఆర్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తారన్న ప్రచారానికి తెరలేపినట్టు' భావిస్తోన్నారు.. ఈ ప్రచారంతో బాబుని భయపెట్టి, తెలంగాణలో ప్రచారానికి వెళ్లకుండా నిలువరించటమే అసలు లక్ష్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     మరికొందరు మాత్రం కేసీఆర్ ఏపీలో ప్రచారం వార్త నిజమే.. బీజేపీ ఆదేశాల ప్రకారమే కేసీఆర్, జగన్ సహకరించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.. టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ కేసీఆర్ అనే అస్త్రాన్ని సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది.. తెరాస వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తోందట.. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలలో తెరాస కొంతమంది అభ్యర్థులను నిలిపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. తెలంగాణ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న కొందరు తమకు తెరాస టిక్కెట్లు కావాలని కోరుతున్నట్టు సమాచారం.. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. కేసీఆర్ నిజంగా ఏపీలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తారా?.. ఏపీలో తెరాస తరుపున కొందరు అభ్యర్థులు బరిలోకి దిగుతారా? ఇవి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్, టీడీపీల పొత్తులో నిజమెంత?

  గత కొంతకాలంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.. ఇంకేముంది ఏపీలోని ప్రతిపక్షాలు, అధికార పార్టీ టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది అంటూ విమర్శించాయి.. ఇంకా కొందరైతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమవటం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.. ఇక ఈ పొత్తు గురించి టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కొందరు కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.. ఇక యనమల, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కాంగ్రెస్ తో పొత్తు అంటే ఒంటికాలు లేచారు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేసారు.. అయినా కాంగ్రెస్ - టీడీపీల పొత్తు గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పొత్తు వార్తలను ఖండించారు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.. దీంతో ఏపీలో కాంగ్రెస్- టీడీపీల పొత్తు వార్తకు తెరపడేలాగానే ఉంది.     అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఏపీలో అంటే టీడీపీ అధికారంలో ఉంది.. పార్టీ బలంగా ఉంది.. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదు.. నిజం చెప్పాలంటే పొత్తు కంటే ఒంటరిగా బరిలోకి దిగితేనే ఎక్కువ లాభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉంది కానీ రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది.. మెజారిటీ నాయకులు పార్టీని వీడి తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. కొన్ని చోట్ల కేడర్ అయితే ఉంది కానీ వాటిని ఓట్లుగా మలిచి గెలిపించే నాయకులు కావాలి.. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే ముందు పార్టీ నిలదొక్కుకోవాలి.. దానికి బలమైన పార్టీ మద్దతు ఖచ్చితంగా కావాలి.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని, అందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని చూస్తోంది.. ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశపడుతోంది.. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.. తెలంగాణలో ఈ రెండు పార్టీ పొత్తుపెట్టుకుంటే.. అధికారం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ కి టీడీపీ బలం కూడా తోడైతే విజయావకాశాలు ఎక్కువుంటాయి.. అదే విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్ మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకొని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి బాటలు వేసుకున్నట్టు అవుతోంది.. ఈ విధంగా తెలంగాణలో రెండు పార్టీలకు పొత్తు లాభించే అవకాశాలు ఉన్నాయి.. మొత్తానికి కాంగ్రెస్ - టీడీపీల పొత్తు 'ఏపీలో వద్దు.. తెలంగాణలో ముద్దు' అన్నట్టుగా ఉంది.. మరి ఈ పొత్తుపై అసలు ఈ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

చంద్రబాబు వ్యూహం.. టీడీపీ గెలుపు ఖాయం

తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది కానీ ఏపీలో ఆ ఊసే లేదు.. అయినా ఏపీలో కూడా అప్పుడే ఎన్నికల సెగ మొదలైంది.. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే అభ్యర్థుల వేట మొదలైంది.. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రజల్లోకి వెళ్తూ మళ్ళీ అధికారం చేపట్టే దిశగా దూసుకువెళ్తుంది.. రోజంతా అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే చంద్రబాబు క్రమక్రమంగా రాజకీయ వేడి పెంచుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో సమీక్షలకు సమయం పెంచుతూ వస్తున్నారు.. పార్టీ నేతలు, అధికార వర్గాలతో సమావేశమవుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నారు.. లోటుపాట్లు ఎక్కడున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే కోణంలో దృష్టి పెట్టారు.     క్రింది స్థాయిలో బూత్ కమిటీలు మొదలుకొని, పై స్థాయిలో తనవరకు అందరూ ప్రజల మధ్య ఉండేలా చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చన్న అంచనాతో పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెంచారు.. గతంలో అరగంట, గంటతో సరిపెట్టే రాజకీయ సమీక్షలను ఇప్పుడు రెండు మూడు గంటలు నిర్వహిస్తున్నారు.. అదే విధంగా వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామదర్శిని అమలు చేస్తున్నారు.. పార్టీపరంగా ఓ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు.. సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం చూపుతున్నారు.. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి రెండు రోజులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.. నేతలు, అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.     గ్రామదర్శినిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఒక్కోవారం రెండు నియోజకవర్గాలు ఎంపిక చేసుకొని అక్కడ ప్రజలను కలుస్తున్నారు.. ఎక్కడైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామదర్శినిలో చురుకుగా పాల్గొనడంలేదని సమాచారం అందితే నేరుగా చంద్రబాబు లైన్ లోకి వస్తున్నారు.. వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.. ఇప్పటికే 'దళిత తేజం', 'నారా హమారా- టీడీపీ హమారా' పేరిట రెండు సభలు ఏర్పాటు చేసారు.. త్వరలో గిరిజన గర్జన పేరుతో మరో సభ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.. తద్వారా ఆయా వర్గాల వారిని సమీకరించే కృషిలో పార్టీ నేతలు భాగస్వాములవుతారని, ఈ కార్యక్రమాలు, పథకాలు టీడీపీ అమలుచేస్తుందన్న ముద్ర వస్తుందని భావిస్తున్నారు.. అలాగే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపటానికి ప్రతిజిల్లాలో ధర్మ పోరాట సభలు నిర్వహిస్తున్నారు.     అదేవిధంగా కింది స్థాయిలో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటానికి ప్రభుత్వం కొత్తగా సాధికార మిత్ర వ్యవస్థను రూపొందించింది.. అలాగే బూత్ స్థాయిలో టీడీపీ కార్యకర్తలను కూడా ఎన్నికల మూడ్ లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.. పార్టీ బూత్ లో కన్వీనర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు.. మొత్తానికి చంద్రబాబు పూర్తిస్థాయిలో ఎన్నికల వ్యూహ రచనలోకి వచ్చేసారు.. ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు చూస్తూనే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.. మళ్ళీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.

హరికృష్ణ మరణం నేర్పిన పాఠం

  నందమూరి కుటుంబానికి అభిమానగణం ఎక్కువ.. అభిమానులు ఆ కుటుంబం మీద ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటారు.. నందమూరి హీరోలు కూడా అభిమానుల మీద అంతే ప్రేమ చూపిస్తూ, అభిమానుల బాగు కోరుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై పదే పదే ఓ విషయం గుర్తు చేసేవారు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటి దగ్గర మీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అభిమానులను సున్నితంగా హెచ్చరించేవారు.. అయితే 2014 లో నందమూరి కుటుంబంలోనే ఓ విషాదం జరిగింది.     హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ సంఘటనతో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.. అన్న మృతితో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కృంగిపోయారు.. ఇలాంటి బాధ అభిమానులకు రాకూడదని, ఈసారి అభిమానులను ఇంకాస్త గట్టిగా హెచ్చరించారు.. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం అంటూ ఆయన సినిమా మొదలయ్యేటప్పుడు చూపించేవారు.. అదే విధంగా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వేగంగా వెళ్ళకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ వేదికపై కూడా పదే పదే గుర్తుచేసేవాడు జూనియర్ ఎన్టీఆర్.. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోతాడని ఎప్పుడూ ఊహించి ఉండడు.     హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి అతి వేగం మరియు జాగ్రత్తలు పాటించకపోవటమే కారణంగా తెలుస్తోంది.. హరికృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, అతి వేగంగా వెళ్తూ.. వెనకనున్న వాటర్ బాటిల్ తీసుకోబోతుండగా క్షణాల్లో అంతా తారుమారైపోయింది.. ఆయన కుటుంబంతో పాటు, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది.. ఆయన కుటుంబంలో జరిగిన విషాదం వేరే కుటుంబంలో జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి అందరికీ గుర్తుచేశారు.. కానీ అదే కుటుంబంలో మరో విషాదం జరిగింది.. అందరూ బాగుండాలని కోరుకున్న కుటుంబానికి ఇలాంటి కష్టం రావటం చాలా బాధాకరం.. కానీ హరికృష్ణ మరణం మనకొక పాఠం నేర్పుతుంది.. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. మీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పొతే అది మీ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు.. ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించండి.. ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండి మీ జీవిత ప్రయాణానికి అర్దాంతరంగా ముగింపు పలకకండి.

కడప గడపలో టీడీపీ కాలు.. జగన్ కి తప్పని కష్టాలు

  రాజకీయ పరంగా కడప జిల్లా పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం.. వైఎస్ కుటుంబానికి మొదటి నుండి జిల్లాలో మంచి పట్టుంది.. వారు రాష్ట్ర రాజకీయాలు కడప కేంద్రంగా చేసేవారు.. ఇప్పుడు వైఎస్ వారసుడిగా, ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు.. అయితే కడపలో ఒకప్పటిలా వన్ సైడ్ వార్ కనిపించట్లేదు.. జగన్ కి కడపలో కూడా కష్టాలు మొదలయ్యాయి.. దానికి కారణం అధికార పార్టీ టీడీపీ.. టీడీపీ, ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. అక్కడ పాగా వేయాలని చూస్తోంది.. దానికి తగ్గట్టే అక్కడి ప్రజల్లో మార్పు కనిపిస్తుంది.. టీడీపీ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు పైన వారు సానుకూలంగా ఉన్నారు.. ముఖ్యంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో మార్పు స్పష్టం కనిపిస్తుంది.. దీంతో జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.. ఈ జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కడపలో ఏదైనా జరగొచ్చు అనిపిస్తోంది.     అయితే ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న కడపలో జగన్ ప్రభ తగ్గటానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తోన్నారు.. ముఖ్యంగా జగన్ స్వయంకృతాపరదాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఈ జిల్లా ప్రజల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, నియోజక వర్గాల్లో పర్యటించకపోయినా పర్వాలేదు.. కడపలో మాకు తిరుగులేదు.. ఓట్లన్నీ మాక్ పడతాయి అని జగన్ ధీమాగా ఉంటున్నారట.. ఈ భావనతోనే ఆయన సొంత జిల్లాని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారట.. దీంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది.. దీన్ని టీడీపీ క్యాష్ చేసుకుంది.. కడప జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.. జిల్లా ప్రజల మనస్సు దోచుకునేలా పలు వరాలు కురిపించారు.. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తానని చంద్రబాబు గతంలో వాగ్దానం చేసారు.. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలు వెటకారం చేసారు.. కానీ చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్ట్ కు రప్పించి పులివెందులకు పుష్కలంగా తాగు, సాగు నీరు అందించారు.. దీంతో నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేయలేని పనిని చంద్రబాబు చేసి చూపించారని స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు.. కలలో కూడా నీళ్లొస్తాయని ఊహించలేదు, అలాంటిది చంద్రబాబు నిజం చేసి చుపించారంటూ స్థానికులకు చంద్రబాబు మీద అభిప్రాయం ఏర్పడింది.     అదే విధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం చేసిన పోరాటంలో కూడా టీడీపీకి మంచి మార్కులు పడ్డాయి.. నిజానికి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ స్టీల్ ఫ్యాక్టరీ కోసం బలంగా పోరాడాలి, కేంద్రాన్ని నిలదీయాలి.. కానీ వైసీపీ ఆ విషయంలో విఫలమైంది.. కానీ చంద్రబాబు ఆలా కాదు టీడీపీ నేత సీఎం రమేష్ తో దీక్ష చూపించారు.. అంతేకాదు కేంద్రం ఏర్పాటు చేయకపోతే స్టీల్ ఫ్యాక్టరీనే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు.. ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు కడప మీద ప్రత్యేక శ్రద్ద చూపారు.. అక్కడ ప్రజల మనస్సు గెలుచుకున్నారు.. ఫలితంగా అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో కడపలో టీడీపీ పాగా వేసిన ఆశ్చర్యంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. మొత్తానికి జగన్ కి సొంత జిల్లాలో కష్టాలు తప్పేలా లేవు.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్ ముందస్తు మైండ్ గేమ్..!!

తెలంగాణలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ముందస్తు ఎన్నికలు.. అసలు ముందస్తు ఎన్నికలు ఉన్నాయా? లేవా?.. తెరాస నిజంగానే అసెంబ్లీని రద్దు చేస్తుందా? అంటూ ప్రతిపక్షాలే కాదు సామాన్య ప్రజలు కూడా తలలు పట్టుకుంటున్నారు.. మీడియా కూడా ముందస్తు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు వార్తలు మొదలు పెట్టింది.. దీనంతటికీ మూల కారణం తెలంగాణ సీఎం కేసీఆర్.. అసలు ఇదంతా చూస్తుంటే కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.     ఆ మధ్య కేసీఆర్ ముందస్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. మరి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఏమన్నా తక్కువ తిన్నదా.. మేం ముందస్తుకి సిద్ధమంటూ ప్రతిసవాల్ విసిరింది.. కొందరైతే ప్రజల్లో తెరాస ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందని గమనించే కేసీఆర్ ముందస్తుకు సిద్ధమయ్యారని విమర్శించారు.. తరువాత కొన్నిరోజులు ముందస్తు టాపిక్ చర్చ మందగించింది.. కానీ ఈ మధ్య మళ్ళీ ముందస్తు తెరమీదకు వచ్చింది.. ప్రగతి నివేదిక సభ గురించి చర్చించేందుకు కేసీఆర్ రీసెంట్ గా తెరాస నేతలతో సమావేశమైన విషయం తెల్సిందే.. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు మూడు నెలల్లో రావొచ్చు, ఆరు నెలల్లో రావొచ్చు ఎప్పుడైనా సిద్ధంగా ఉండండి.. నన్ను నమ్మండి మనదే విజయమని హామీ ఇచ్చారు.. ఇంకేముంది మళ్ళీ ముందస్తు వార్తలు మొదలయ్యాయి.. తెరాస సెప్టెంబర్ 6 న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి శ్రీకారం చుడుతోంది అని వార్తలు వచ్చాయి.     కానీ ఈ వార్తలపై తెరాస నేతల స్పందన భిన్నంగా ఉంది.. ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్న మాట నిజమే కానీ మూహూర్తాలు, తేదీలు మేం పెట్టుకోలేదు అని ఎంపీ వినోద్‌కుమార్‌ అంటే.. మేం అధికారికంగా చెప్పలేదు, ముందస్తు ఎన్నికలపై త్వరలో స్పష్టత వస్తుందని కేటీఆర్ అన్నారు.. దీంతో ముందస్తు మీద ఎవరికీ తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు.. కొందరైతే ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మీడియాని మిస్ లీడ్ చేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను కన్ ఫ్యూస్ చేస్తూ సడెన్ గా షాక్ ఇచ్చేలా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది... అసలు కేసీఆర్ మనస్సులో ఏముందో? మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు.. విశ్లేషకులు కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తోన్నారు.. అయితే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియకే అధికారికంగా ప్రకటించట్లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మరి ముందస్తుపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా ముందుకెళ్తారో కాలమే నిర్ణయించాలి.

వైసీపీ సిట్టింగులకు టిక్కెట్టు లేనట్టే.. మరి పార్టీ పరిస్థితి ఏంటో.!!

ప్రత్యేకహోదా కోసం అంటూ వైసీపీ ఎంపీలు ఐదుగురూ వారి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ రాజీనామాల పుణ్యమా అని సానుభూతి ఏమో కానీ ఆ ఐదుగురు ఎంపీలకు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.. ఒకవైపు రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తుంటే, మీరేమో రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోని అవే పార్లమెంట్ సమావేశాలు టీవీలో చూస్తున్నారు అంటూ విమర్శలు మూటగట్టుకున్నారు.. ఈ విమర్శలు చాలవన్నట్టు ఇప్పుడొక పెద్ద షాక్ తగిలింది.. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ మినహా మిగిలిన నలుగురు ఎంపీలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.     నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై నిర్వహించిన సర్వే ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయట.. దీంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డిని బరిలోకి దించి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఉదయగిరి నుంచి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట.. అయితే ఈ విషయంపై ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ చంద్రశేఖర్ కి టిక్కెట్టు ఇవ్వకపోతే టీడీపీలో చేరాలని ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం.. నిజానికి మేకపాటి కుటుంబంలో చంద్రశేఖర్ కే ఎక్కువ బలం ఉంది.. మరి ఆయన్ని కాదని టిక్కెట్టు రాజమోహన్ కి ఇస్తే, ఆయన భారీ అనుచరగణంతో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.. ఇది పార్టీకి తీవ్ర నష్టం.. దీంతో అధినాయకత్వం ఆలోచనలో పడిందట.     ఇక ఒంగోలు ఎంపీగా ఉన్న జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి టిక్కెట్టుకి ఎసరు తప్పేలా లేదు.. ఆయనకి టిక్కెట్టు ఇచ్చేదిలేదని, విజయవాడలో ఉండి పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని జగన్ చాలాకాలం క్రితమే చెప్పినట్టు సమాచారం.. ఆయన స్థానంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.. జిల్లానేతలు కూడా మాగుంట వస్తే మంచి అభ్యర్థి అవుతారని, ఆయన చేరితే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.. అలాగే మాట్లాడితే పవన్, మాకు వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తారని వ్యాఖ్యలు చేసే తిరుపతి ఎంపీ వరప్రసాద్ కి కూడా ఈసారి టిక్కెట్టు దక్కేలా లేదు.. ఆయన స్థానంలో కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుందరరాజు అనే అధికారికి దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.     ఇక కడప ఎంపీ స్థానం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది.. ఈసారి అవినాష్ కి టిక్కెట్టు కష్టమే అంటున్నారు.. ఈ విషయంపై కుటుంబంలో తీవ్ర విభేదాలు కూడా తలెత్తినట్టు సమాచారం.. అవినాష్ స్థానంలో జగన్ బాబాయ్ వివేకానందకు బరిలోకి దింపాలని చూస్తున్నారట.. ఒకవేళ ఆయన కాకపోతే షర్మిలకి టిక్కెట్టు ఇవ్వాలన్న ఒత్తిడి కూడా పెరుగుతుందట.. కొందరేమో అవినాష్ కి టిక్కెట్టు ఇవ్వమని, కొందరేమో ఇవ్వొద్దని.. కొందరేమో వివేకానందకి కడప ఎంపీ టిక్కెట్టు అని, కొందరేమో నంద్యాల ఎమ్మెల్యే టిక్కెట్టు అని.. కొందరేమో షర్మిలకు కడప ఎంపీ టిక్కెట్టు అని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తుండటంతో, అందరూ కుటుంబ సభ్యులు కావడంతో జగన్ కి ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నారట.. ఇక మిగతా ఎంపీ స్థానాల్లో కూడా జగన్ కి తలనొప్పి తప్పట్లేదట.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు గాని ఎంపీ అంటే అంత ఖర్చు మా వల్ల కాదని వెనకడుగు వేస్తున్నారట.. 70, 80 కోట్లు ఖర్చు పెట్టలేమని చేతులు ఎత్తేస్తున్నారట.. జగన్ మాత్రం పార్టీ నుండి ఏమి ఆశించకుండా సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకునే వారినే తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో పొత్తుల గోల..!!

  ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేసాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకుంటే, బీజేపీ నమ్మించి మోసం చేసిందంటూ టీడీపీ, బీజేపీ కి దూరమైంది.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది.. ఇక జనసేన కూడా టీడీపీ పాలన సంతృప్తికరంగా లేదంటూ టీడీపీకి దూరమైంది.. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అని ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి.     ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమైందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కొందరు ఈ పొత్తుని తప్పుపడుతున్నారు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ, అలాంటిది ఇప్పుడదే కాంగ్రెస్ తో ఎలా కలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీనికి ధీటైన సమాధానం చెప్తున్నాయి.. టీడీపీ, తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి పుట్టిన పార్టీ.. అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ మీద పోరాడం.. ఇప్పుడు విభజన హామీల విషయంలో బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి బీజేపీ మీద పోరాడుతున్నాం అంటున్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి.. ప్రధాన జాతీయ పార్టీలు ఉంది రెండు బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తానంటుంది.. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై తుది నిర్ణయం మాత్రం చంద్రబాబుదే అని స్పష్టం చేస్తున్నారు.. రాజకీయాల విశ్లేషకులు మాత్రం ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకు లాభమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ కు, టీడీపీ ఓటు బ్యాంకు కూడా తోడైతే అధికారంలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది.. అలాగే విభజన అనంతరం ఏపీలో ఒక్క సీట్ గెలవని కాంగ్రెస్ ఇప్పుడు కాస్త బలపడింది.. గత ఎన్నికల్లో 7 లక్షలు ఓట్లు సాధించిన కాంగ్రెస్, ఈ సారి 15 నుండి 20 లక్షల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇది టీడీపీకి ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల భావన.     మరోవైపు బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి.. వైసీపీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తరువాత కానీ బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి.. అయితే దీన్ని మూడు పార్టీలు ఖండిస్తున్నాయి.. కానీ కొందరు నేతలు మాత్రం పొత్తు గురించి సంకేతాలు ఇస్తున్నారు.. గతంలో, పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ కి మద్దతిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసారు.. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పిన వరప్రసాద్.. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. దీనిబట్టి చూస్తుంటే పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి అసలు ఈ పొత్తుల గోల మీద క్లారిటీ రావాలంటే ఎన్నికల సమయం రావాల్సిందే.

కేరళ విలయం ఏం నేర్పింది

కేరళ కళ తప్పింది. దేవుడి రాష్ట్రం రాక్షస రాజ్యంగా మారంది. ఎక్కడ చూసినా నీళ్లూ... ప్రజల కన్నీళ్లూ తప్ప మరింకేం లేవు. లక్షలాది ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పంటలు లేవు. వారికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే పర్యాటకం బంద్ అయ్యింది. తమ రాష్ట్రాన్ని చూసి మురిసిపోయే వారిని, అక్కడికి వెళ్లి సేద తీరే వారిని కొన్నాళ్ల పాటు రావద్దంటూ ఆ రాష్ట్ర వేడుకుంది. నష్టం భారీగానే ఉంది. వేదన తీరనిదిగానే ఉంది. శరణార్ధి శిబిరాల నుంచి ఒక్కొక్కరే ఇళ‌్లకు చేరుకుంటున్నారు. ఇంటి ముందు ఇంతకు ముందు కళకళలాడుతూ తిరిగిన... బిలబిలాడుతూ పరుగిడిన మూగజీవాలు విగత జీవులయ్యాయి. గుంజకు కట్టిన పశువులు ఆ గుంజలకే వెల్లాడుతూ మోకాల్లోతు నీళ‌్లలో కళేబరాల్లా మిగిలాయి.     ఇది దారుణ ద్రశ్యం. ఇది దారుణ విలయం. ఇది దారుణ శోకం. ఇది దౌర్భాగ్యం. ఈ ద్రశ్యానికి... ఈ విలయానికి.... ఈ శోకానికి... ఈ దౌర్భాగ్యానికి అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని నిందించడం లేదు. ఇది ప్రభుత్వ తప్పిదంలా కూడా కనిపించడం లేదు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం మహా నాయకుడు మావో అన్నట్లు ప్రక్రతి మానవునిపై చేసిన యుద్ధం. ప్రక్రతి మానవునిపై ఎక్కుపెట్టిన బాణం. దీనికి కారణం మనుషులే. మనం భవిష్యత్ అభివ్రద్ధి పేరుతో చేస్తున్న వినాశనం, చేసుకుంటున్న విధ్వంసం ఫలాలు నేడు అనుభవించాల్సి వస్తోంది.  పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నారు... పర్యావరణవేత్తలు వేడుకుంటున్నారు. అలా చేయకండి... ఇలా నాశనం చేయకండి... అంటూ మొరపెట్టుకుంటున్నారు. అయినా మనం వినడం లేదు. వారి మాటలు మన చెవికెక్కడం లేదు. మనం వినే స్థితిలో లేం. ఆచరించే పనిలో లేం. పర్యావరణ పరిరక్షణ అంటే దాని కోసం టెన్‌కె రన్‌లు, మానవ హారాలు తీయడం అనుకుంటున్నాం. ఎప్పుడో ఏడాదికొకసారి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుని ఆ రోజు మొక్కుల నాటుతాం. ఆ రోజు వాటికి నీళ్లు పోస్తాం. ఆ రోజు ప్లకార్డులు పట్టుకుని వీరావేశంతో ప్రతిన బూనుతాం.     మన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు, కొండకచో సినీ అందాల తారలు చేతులు ఊపుతూ పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం అని మన చేత ప్రమాణం చేయిస్తారు. వాళ్లూ చేస్తారు. మళ్లీ యథా ప్రకారం ఆ మర్నాడు... అంతెందుకు ఆ రోజే దాన్ని మరచిపోతాం. మళ్లీ ఇదిగో ఇలా విలయం వచ్చినప్పుడు విలవిల్లాడిపోతాం. ఇది మన నైజం. ఇదీ మన రూపం. ఇదీ మన భాధ్యత. కేరళ బాధితులకు దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నాయి. తమకు చేతనైన సాయం ఎవరికి వారు చేస్తున్నారు. ఇది మానవత్వం ఇంకా మిగిలి ఉంది అనడానికి ఓ నిదర్శనం. వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఏ ఒక్కరో పూడ్చలేరు. అందరూ కలిసినట్టుగా... సమష్టిగా చేయాల్సిన పని. బాధ్యత. అయితే, సాయం చేయడమంటే తాము కొన్నాళ్లు వాడి ఇంట్లో పక్కన పడేసిన దుస్తులు కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దుస్తులు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, ఇతర పరికరాలు ఇస్తున్నారు. ఇవి వారికి పనికి రావని కాదు. ఇవి వారికి అక్కరకు వచ్చేవి కావని కూడా కాదు. కేరళ వాసుల ఇళ్లు కొట్టుకుపోలేదు. వారి ఇళ్లలోకి నీరు చేరి వారి వస్తువులు తడిసిపోయాయి. అంతే జరిగింది. కేరళ పేద రాష్ట్రం ఏమీ కాదు.     ఆ మాట కొస్తే దక్షిశాదిలో... మరీ ముఖ్యంగా దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం. వారికి నిలదొక్కుకునేందుకు కాసింత సమయం కావాలి అంతే. దానికి వరుణుడు కరుణించాలి. పర్యాటకం ఊపందుకోవాలి. ఈ రెండు జరగడానికి ఎక్కువ రోజలేం పట్టదు. ఈలోగా వారికి కావాల్సింది పాతబడిపోయిన బట్టలు.... ముక్కిపోయిన బియ్యం... పెట్టెల కొద్దీ అగ్గిపెట్టెలు, టన్నుల కొద్దీ కొవ్వొత్తులు కాదు. వారికేం కావాలో వారే అడుగుతున్నారు. వారే వినమ్రంగా కోరుతున్నారు. వారికి మనిషి సాయం కావాలి. స్వచ్చంధంగా పని చేసే ఎలక్ట్రిక్ పని వారు కావాలి. వడ్రంగులు కావాలి. పెయింటర్లు కావాలి. మరీ ముఖ్యంగా వానలు, వరదల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు... ఇప్పటికే వచ్చిన వ్యాధులకు చికిత్స చేసేందుకు డాక్టర్లు కావాలి. ఇవన్నీ కావాలని అక్కడి ప్రజలు సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందలాది మంది ఎలక్ట్రిక్ పనివారిని, వడ్రంగులను, పెయింటర్లను, డాక్టర్లను ఇక్కడి ప్రభుత్వాలు గుర్తించి అక్కడికి పంపితే అదే వారికి కోట్లాది రూపాయల సాయం చేసినట్లు.ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కార్యచరణ ప్రారంభిస్తే అంతకు మించిన మేలు లేదు.

ముందస్తుకు తొందరేల...!!?

  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందేఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులను కూడా సిద్ధంగా ఉండమని సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి కూడా గెలుపు తమదే అని ఢంకా బజాయిస్తున్నారు. ఇవన్నీ సరే. అసలు గడవుకు ముందే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కల్వకుంట్ల వారికి ఎందుకొచ్చిందన్నది అటు రాజకీయ పక్షాలను, ఇటు తెలుగు ప్రజలను దొలిచేస్తున్న ప్రశ్న. ఇక్కడ తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మధ్యంతర ఎన్నికల ఊపులో ఉంది. రానున్న డిసెంబర్, జనవరి నెలల్లో ఎన్నికలకు పోవాలన్నది అటు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు తెలంగాణలోని కె.చంద్రశేఖర రావుల యోచన. గడువు లేదు మిత్రమా అనుకుందామనుకున్నా.... అదీ తప్పే. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఏకంగా తొమ్మిది నెలల గడువుంది. కాని, ఈ ఇద్దరు నాయకులు మాత్రం నాలుగైదు నెలలకు ముందే వారి వారి సభలను రద్దు చేసి ఎన్నికల సమరాంగణంలో దూకుదామనుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటీ. ! అని రాజకీయ విశ్లేషకులు ఆరాలు తీస్తున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ నాయకులైతే ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం అబ్బే తొందరలేదు.... మిత్రమా... ఇంకా సమయం ఉంది అనే అంటున్నారు.     తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మాత్రం ఈ ముందస్తు గోల గందరగోళానికి దారి తీస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం,తెలంగాణలోని కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం ముందుగా ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో మాత్రం ఇంత వరకూ తేల్చి చెప్పలేదు. అయితే, ఈ నాయకులు ముందస్తుకు ఎందుకు వెళ్లాలో తెలుసుకునేందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తమపై ఎక్కువ విశ్వాసమున్న నాయకులు ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాలనుకుంటారు. అలాగే ఏదైనా జరగరానిది జరిగి ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమై అవి ఓట్లుగా మారితే తిరిగి మరో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించ వచ్చు అని ఆశతో ఈ ముందస్తుకు వెళ్తారు. గతంలో ఓ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే వెళ్లారు. అలిపిరిలో ఆయనపై నక్సలైట్లు బాంబు దాడి చేస్తే తప్పించుకున్న చంద్రబాబు నాయుడు ఆ సానుభూతి తనపై కురుస్తుందని గంపెడాశతో ముందస్తుకు వెళ్లారు. అయితే అది బెడిసి కొట్టింది. అది వేరే సంగతి. ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ, తెలంగాణలో కె.చంద్రశేఖర రావు ముందస్తుకు మాత్రం ఓ వ్యూహమే ఉందంటున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూల పవనాలే వీస్తున్నాయని అంటున్నారు. ఈ గాలిని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహం. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలతో కాసింత ఊపు పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తరచుగా తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. దీనికి తోడు తెలంగాణలో అంతో ఇంతో బలం మిగిలి ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. ఈ బంధం బలపడితే తనకు ఇబ్బందే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారు.     అలాగే పార్టీలోనూ, ప్రజల్లోనూ కూడా ప్రభుత్వంపై ఎలాంటి అసంత్రప్తి లేకుండా ఉన్న ఈ సమయంలోనే ఎన్నికలు జరిపి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం. తాను అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో పార్టీ పట్ల ప్రజల్లో ఏమంత మంచి అభిప్రాయం లేదు. పైకి కబుర్లు చెబుతున్నారు కాని... లోలోపల ఆయనకు భయంగానే ఉంది. ఇవన్నీ తెలుసుకున్న కల్వకుంట్ల వారు ఎంత త్వరగా ఎన్నికలు ముగించి తిరిగి అధికారంలోకి రావాలా అని కంగారుగా ఉంది.   దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు కల్వకుంట్ల వారు. మరోవైపు ముందుగా ఎన్నికలు నిర్వహించి కుర్చీలో కూర్చోవడంతో పాటు కేంద్రంలో తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్‌ను పటిష్టం చేయడం కూడా ఆయన పనే. అక్కడ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి... ఇక్కడ అధికారంలోకి వచ్చి రాష్ట్ర స్ధాయిలోనూ, జాతీయ స్ధాయిలోనూ తాను తిరుగులేని నాయకుడు అనిపించుకోవాలన్నది కె.చంద్రశేఖర రావు ప్రధాన ఉద్దేశ్యం. తనపైనా... ప్రభుత్వం పైనా వ్యతిరేక ముద్ర పడక ముందే విజయం సాధించాలన్నది ఆయన వ్యూహం. దీనికి ముందస్తు ఎన్నికలే ప్రధాన అస్త్రం అని ఆయన భావిస్తున్నారు. అందుకే అటు పార్టీ శ్రేణులను, ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే కేంద్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై ఉన్న వ్యతిరేకత మరింత పెరగక ముందే ఎన్నికలు నిర్వహించి మరోసారి ప్రధానిగా అవతరించాలని భావిస్తున్నారు. చూడాలి. వీరి కోరికలు నెరవేరుతాయో..... ప్రజలు మార్పు కోరుకుంటారో... ఏమైనా మరో రెండు నెలల్లో ఎన్నికల పండుగ వాతావరణం మాత్రం రావడం ఖాయంగానే కనిపిస్తోంది. !!!

జలదిగ్బంధంలో రాష్ట్రాలు

దక్షిణాది రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. గడచిన వారం రోజులుగా కేరళను వణికిస్తున్న వర్షాలు తమ ప్రతాపాన్ని ఇతర రాష్ట్రాల వైపు చూపిస్తున్నాయి. ఇరవై రోజుల క్రితం వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడితే ఇప్పుడు ఈ అతి వర్షాలతో పరిస్థితి దారుణంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు చూపిస్తున్న ఆగ్రహానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పర్యాటక రాష్ట్రమైన కేరళకు ఇప్నట్లో ఎవ్వరూ రావద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వినతి చేసుకుంది. అక్కడ ఎక్కడ చూసినా నీరే. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు సాయమో రామచంద్రా అని ఎదురు చూస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఏరియల్ సర్వేలో ఆయనకు అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు అయ్యింది. దీంతో కేంద్రం నుంచి తక్షణ సాయంగా రెండు వందల కోట్లు ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపు నాలుగు వందల మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.   ఎప్పుడూ పర్యాటకులతో, పచ్చని అందాలతో కళకళలాడే కేరళ ఇప్పుడు దయనీయంగా మారింది. ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలు ముందుకు రావడం ముదావహం. తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ సాయాన్ని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి 25 కోట్ల చెక్కును కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ వంతు సాయంగా పది కోట్ల రూపాయలు అందజేశారు. తెలుగు వారు ఆపదలో ఉంటే ఆదుకునేందుకు ముందుకు వచ్చే తెలుగు సినీ హీరోలు కేరళకు సాయం చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం. ఈ విశాల మనసు ఇంతకు ముందు తమిళ హీరోలకు మాత్రమే ఉండేది. అది ఇప్పుడు తెలుగు హీరోలకు కూడా పాకడం ఆనందించాల్సిన అంశమే. తెలుగు హీరోలు అక్కినేని నాగార్జున తన వంతు సాయంగా 28 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, కల్యాణ్ రాం 10 లక్షలు, ప్రభాస్ 25 లక్షలు, పరుణ్ తేజ్ 10 లక్షలు, దిల్ రాజ్ 10 లక్షలు సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తమిళ హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచి దాని ద్వారా లక్షలు, కోట్లు పారితోషికాల రూపంలో తీసుకుంటున్న తెలుగు హీరోలు తమను ఇంత వారిని చేసిన సమాజానికి ఏ చేయాలని ముందుకు రావడం శుభ పరిణామమే కదా.     ఇక తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు విలవిల్లాడడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత నాలుగు రోజులుగా వర్షాలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొరలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నదులైన గోదావరి, క్రష్ణ, వంశధార, నాగావళి, శబరి నీటితో కళకళలాడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు కూడా నిండుకున్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుతున్నా... ఆ తర్వాత కాలల్లో ఆ నీటిని వాడుకునేందుకు వీలుగా నీటిని నిల్వ చేసుకోవడానికి ఏర్పాట్లు మాత్రం ఏ ప్రభుత్వం చేయడం లేదు. సాంకేతికత ఎంత పెరిగినా నీటిని నిలువ చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా భవిష్యత్ అవసరాలను ముందుగా గ్రహించి నీటిని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.

వర్ష బీభత్సం

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వర్షం కోసం ఆకాశంలోకి చూసిన రైతు ఇప్పుడు భూముల్లో పెరిగిపోయిన నీటిని ఎలా తోడాలా అని చూస్తున్నాడు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాలన్నీ వర్షాలతో సతమతమవుతున్నాయి. వరుణుడు ఎందుకు కరుణించడో.... ఎందుకు అతిగా కరుణిస్తాడో ఇంకా అంతు పట్టడం లేదు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం వర్షాలు లేక రైతులు విలవిల్లాడారు. విత్తిన పైరు కేసి దిగాలుగా.. బెంగగా చూశారు. ఆ పైరు మెలకెత్తుతుందా.... ఎరువులు పని చేస్తాయా.. ఈసారైనా వరుణుడు కరుణిస్తాడా అని ఎదురుచూశారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురియకపోతే పంట ఎలా అని అయోమయపడ్డారు. పొలంలో ప్రతి పైరు తడిసేలా రైతులు గ్లాసులతోటి, చిన్న చిన్న చెంబులతోటి నీరు పోయడం పత్రికల్లో చూసిన వారికి కంటి వెంట నీరాగలేదు. ఇది రైతు దుస్థితి అని ప్రతి ఒక్కరు కంటి తడి పెట్టుకున్నారు. ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకుందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడి విషాదం. సరే, వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. వర్షాలు కురుస్తాయని ఆనందించిన రైతుకు అతివ్రష్టి రూపంలో వానలు విరుచుకుపడుతున్నాయి.   దీనికి రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. గడచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను... ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలైతే ఈ వర్షాలకు భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. ఇక్కడ గడచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పొలాల్లో పైర్లు నీట మునిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం దారుణంగా ఉంది. మొన్నటి దాకా మొలకలెత్తని నాట్లను చూస్తూ ఆకాశంపైకి చూపులు సారించిన రైతు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఏం చేయాలో పాలుపోక దేవుడా నీదే భారం అంటూ కూర్చున్నాడు. వర్షాలు కురియడం... పంటలు ఏపుగా పెరగడం.... నాణ్యమైన విత్తనాలు... ఎరువులు వాడడం.. రైతు ఇంట సిరులు కురియడం.... ఇవన్నీ పాతకాలపు మాటల్లా మారిపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఏరువాకను ప్రారంభించాలని ప్రభుత్వాలు పండుగలు చేస్తున్నాయి.     గతంలో ఈ ఆడంబరాలు లేవు. ప్రభుత్వ వేడుకలు లేవు. ఏరువాక వచ్చిందంటే దానికి సంకేతంగా రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వారి పొలాల్లో  పనులు ముమ్మరంగా జరిగేవి. కాని నేడు ఆ పరిస్థితి ఏ జిల్లాలోనూ కానరావడం లేదు. ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.... దేశ వ్యాప్తంగానూ ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ నీళ్లు లేవని గగ్గోలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు భారీగా కురిసిన వర్షాలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, మిగులు జలాలను ఎలా పరిరక్షించుకోవాలో మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. లక్షల క్యుసెక్కుల నీరు సముద్రం పాలు అవుతోంది. ఈ నీటిని నిలువ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ఎలా వినియోగించుకోవాలో మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం.      ఇక ఈ భారీ వర్షాలకు దక్షాణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం చిగురుటాదకులా వణికిపోతోంది. అక్కడ పదిహేను రోజులుగా వర్షాలు తెరిపినివ్వడం లేదు. అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన విమానాశ్రయాలు మూసివేశారు. పర్యాటకులకు స్వర్గధామమైన కేరళకు పర్యాటకులను రావద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధించింది. కేరళలో ఇప్పటి వరకూ దాదాపు 350 మందికి కంటే ఎక్కువ మందే వర్షాల కారణంగా మరణించారు. ఇది అక్కడ నెలకొన్న విషాదం. శనివారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళలో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇక్కడి ఈ బీభత్సాన్ని ఆయన ఎలా పరిగణిస్తారో చూడాలి. కేరళలో ఉన్నది వామపక్ష ప్రభుత్వం. అదే కోణంలో చూసి అక్కడి ప్రజలకు సాయం చేస్తారో... లేక మొండిచేయి చూపుతారా అన్నది ప్రశ్నార్ధకం. కేరళ విపత్తును జాతీయ విపత్తుగా చూడాలని ఆ ప్రభుత్వం కోరుతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.     తమిళనాడులో కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ గురువారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు తమిళనాడు కూడా భారీ మూల్యమే చెల్లించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోనూ కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వెనుక ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాలి. ఎన్నికల సీజన్‌ ప్రారంభమైన ఈ దశలో రైతులను ఎలా ఆదుకుంటారనేది వేచి చూడాలి. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసింది. ఈ సాయం వెనుక రానున్న రానున్న ఎన్నికల కారణం కావచ్చు. కాని, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు మాత్రం ఇక్కడి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు.  అయితే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులను ఎంత వరకూ ఆదుకుంటాయనేది చూడాలి. ప్రభుత్వాల నిర్ణయాలు, వారి ఆచరణ మారకపోతే రైతుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుగా మారతాయి.  

మహా నాయకుని మహా ప్రస్తానం

ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. ఆ తరం భావాలను... ఆ నాటి సిద్ధాంతాలను, అప్పటి ప్రేమాభిమానాలను ఇక్కడే వదిలేసి....అలా అలా నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న ద్రవిళ జాతికి ఆయువులాంటి కరుణానిధి కన్నుమూశారు. నిన్నటికి నిన్న  మార్క్సిజాన్ని ఔపోసన పట్టిన సోమనాథ్ చటర్జి తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మాటకారి, చమత్కారి, "సంఘ" శ్రేయోభిలాషి అటల్ బిహారీ వాజ్‌పేయి ఇహాన్ని విడిచి పరలోకానికి పయనమయ్యారు. దీంతో ఓ మహానాయకుడి మహా ప్రస్తానం పూర్తి అయ్యింది. దేశ రాజకీయాల్లో భిన్న ధ్రవాలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ భావజాలం. మరొకటి హిందూత్వ సిద్ధాంతం. మూడోది కమ్యూనిస్టు పోరాటం. వీటిలో హిందూత్వకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు పొసగదు. రెంటికి ఆకాశం, భూమి మధ్య దూరమంత దగ్గరితనం. అవును దూరమనిపించే దగ్గరితరం ఆ రెండు సిద్ధాంతాల సారం.     స్వంత లాభం కొంత మానుకుని అన్న నానుడి ఈ రెండు పార్టీలకు అతికినట్లు సరిపోతుంది. అలాంటి హిందూత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అటల్ బిహారి వాజ్‌పేయి. పసిప్రాయంలో జనసంఘ్‌తో అడుగులు వేసిన వాజపేయి  ఆ నడకకు నడతను, పరుగును నేర్పారే తప్ప తన మార్గం నుంచి ఎప్పుడూ వెనుతిరగలేదు. ఇందుకోసం ఆయన సంసార జీవితాన్ని వదులుకున్నారు. జగమంత కుటుంబం నాది అనుకున్నారు. అలాగని ఏకాకి జీవితం అని మాత్రం అనుకోలేదు. వంద కోట్ల జనాభా నా కుటుంబం. నేను ఏకాకిని ఎలా అవుతాను అనేది వాజ్‌పైయి చిరునవ్వును చూస్తే అర్ధం అవుతుంది. వద్ధాప్యం వెంటాడగా... మతిమరుపు, శారీరిక సమస్యలతో గడచిన కొంతకాలంగా పోరాడుతున్నారు వాజ్‌పేయి. ఇక పోరాడలేను అనుకున్నారు. జీవధర్మాన్ని అనుసరించి పరమాత్మ వద్దకు చేరుకున్నారు. దేశంలో అతి చిన్న వయసులో లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. భాతర తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నిండు సభలో రేపటి భారత ప్రధాని ఈ యువకుడు అని తనను గురించి ప్రకటించేలా చేసుకున్న అసమాన ధీరుడు వాజ్‌పేయి.     నెహ్రు వాక్కు ఫలించింది. సువిశాల భారతదేశానికి... ఆ మాటకొస్తే హిందూ దేశానికి తొలి హిందూత్వ పార్టీ ప్రధానిగా ప్రమాణం చేశారు వాజ్‌పేయి. నేటి ముంబాయ్.... నాటి బొంబాయిలో జరిగిన భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ మరో నేత లాల్ క్రష్ణ అద్వాణీ " మా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి " అని హఠత్తుగా ప్రకటించేంత వరకూ వాజ్‌పేయికి తెలియదు తాను ప్రధాని అభ్యర్ధిని అని. ఇది ఆ ఇద్దరు నాయకులు స్నేహానికి, వారిచ్చే రాజకీయ విలువలకి తార్కాణం. కుటిల రాజకీయాలు, కుట్రలు,కుతంత్రాలు ఆనాటి తరానికి తెలియవు. ఆనాడు అద్వాణీ ఉన్నారు కాబట్టి వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యారు. నేడు వాజ్‌పేయి లేరు కాబట్టి అద్వాణీ ప్రధాని కాలేరు. ఇంతే తేడా. నాటి హిందూత్వ రాజకీయాలకు, నేటి హిందూత్వ రాజకీయాలకు. వాజ్‌పేయి అంటే మాటల ప్రవాహం. వాజ్‌పేయి అంటే కవిత్వ గానం. వాజ్‌పేయి అంటే సుపరిపాలన. వాజ్‌పేయి అంటే చల్లని స్నేహం. కేవలం 13 రోజుల ప్రధానిగా ఉన్నా... ఒక్క ఓటుతో ఆయన్ని గద్దెదించినా చెరగని చిరునవ్వు వాజ్‌పేయి సొంతం. వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని పల్లెత్తు మాట అనని వాజ్‌పేయి తన కవిత్వంతోనే చురకలు వేసే దిట్ట. అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో కూడా వాజ్‌పేయి ఎంతో నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించారే తప్ప ఎక్కడా తడబడలేదు. ఆ వ్యక్తిత్వమే ఆయనను సమూహంలో ఒకడిగా కాకుండా సమూహమే ఆయనగా చేసింది.      భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సాధించిన విజయాల్లో రెండు ప్రధానమైనవి. వాటిలో ఒకటి పోలియో నిర్మూలన అయితే, మరొకటి స్వర్ణభూజి పథకం. గ్రామాలను పట్టణాలకు, పట్టణాలను నగరాలకు అనుసంధానం చేస్తూ వేసిన ఆరు లైన్లు, నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం. ఈ పథకంపై అప్పటి ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. దీని రూపశిల్పి అటల్ బిహారీ వాజ్‌పేయి. దేశంలో అనేక మార్గాల్లో వందల మైళ్ల దూరం నల్లతాచులా కనిపించే రోడ్లపై నేడు వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తున్నాయి అంటే దాని వెనుక ప్రధానిగా వాజ్‌పేయి చేసిన క్రషి మరచిపోలేనిది. ఇక పట్టణ పేదల కోసం ఆయన హయాంలో చేపట్టిన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) పథకం రూపకల్పన కూడా వాజ్‌పేయి ఘనతే. పట్టణ ప్రజలకు గూడు కల్పించే ఈ పథకం ద్వారా లక్షల మంది నిర్వాసితులు సొంత ఇంటి వారయ్యారు. ఇక రాజకీయంగా కూడా వాజ్‌పేయి తన మార్కుని దేశంలో చూపించారు. పోఖ్రాన్ అణుపరీక్షలు, పొరుగు దేశంతో సత్సంబంధాలు, కార్గిల్ వార్ వంటివి ప్రధానిగా వాజ్‌పేయి విజయాలుగానే పరిగణించాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అన్నీ ఇచ్చారు. ఆయన వెంట కీర్తిని తీసుకువెళ్లారు. ఆప్తమిత్రుడు అద్వాణీని ఒంటరిని చేసి అనంతలోకాలకు సాగిపోయారు. ఆయన మరణానికి తెలుగు వన్ యాజమాన్యం తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తోంది. ఆ మహానాయకుడి ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధిస్తోంది.

చరిత్రలో అద్భుతాలుగా నిలిచిపోయిన… వాజ్ పేయ్ 5 ప్రసంగాలు ఇవే!

వాజ్ పేయ్ అనగానే మనకు ఓ మాజీ పీఎం మాత్రమే గుర్తుకు రారు. ఆయన ప్రధాని కావటం కేవలం క్లైమాక్స్ మాత్రమే! అంతకు ముందే బోలెడంత సినిమా నడిచింది! దానికి ఆయనే దర్శకుడు, ఆయనే హీరో! అసలు వాజ్ పేయ్ 1996లో తొలిసారి ప్రధాన మంత్రి కావటానికి ముందే సుప్రసిద్ధులు! ఎంతగా ఆయనకు గొప్ప పేరు వుండేదంటే… అప్పట్లో… ఆయన గురించి… భారతదేశం పొందకుండా మిగిలిపోయిన అతి గొప్ప ప్రధాని వాజ్ పేయ్ అనేవారు! అలా ఆయన ప్రధాని అవ్వక ముందే ప్రధాన మంత్రి స్థాయిని పొందేశారు! ఇక 96లో, 98లో, 99లో మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చాశారు! ఇంతకీ ఏంటది? భారతదేశాన్ని ఒక పూర్తి కాలం పరిపాలించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కావటం! అంతకంటే మించీ హస్తిన సింహాసనాన్ని కాషాయం అంటలేదని భావించిన వార్ని తప్పుగా నిరూపిస్తూ హిందూత్వ విజయానికి అత్యుత్తమ సంకేతంగా నిలవటం! ఈ రోజు మోదీ అనే పరిణామం సాధ్యమైందంటే… దాని వెనుక వాజ్ పేయ్ అనే మూలం వుండబట్టే!     అటల్ బిహారీ వాజ్ పేయ్ కి నిస్సందేహంగా రాజకీయ కోణం వుంది. ఆయనని చరిత్ర తప్పకుండా సాటిలేని రాజనీతిజ్ఞుడుగానే గుర్తు పెట్టుకుంటుంది! కానీ, వాజ్ పేయ్ కేవలం పొలిటీషన్ మాత్రమే కాదు. అదే ఆయనకు, ఇతర నేతలకు వున్న తేడా! వాజ్ పేయ్ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, హిందూత్వవాది, అన్నిటికంటే మించి … అద్బుతమైన ఉపాన్యాసకుడు! ఆయన సభలో నోరు తెరిచినా, బహిరంగ సభలో నోరు మెదిపినా అత్యంత సామాన్య జనం మొదలు మహా మేధావుల దాకా అందరూ చెవులు రిక్కించి వినేవారు. అంతటి విషయం, విశేషం రెండూ వుండేవి ఆయన ప్రసంగాల్లో! ఆయన మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అందులో గొప్ప సందేశాన్ని అందించే వారు కాదు! ఆయన గొప్ప సందేశం అందించాల్సి వస్తేనే మాట్లాడేవారు! ఊరికే ఒక్క మాట కూడా మాట్లాడని నిజమైన మౌని… వాజ్ పేయ్!     వాజ్ పేయ్ నోటి వెంట వచ్చిన ప్రతీ ప్రసంగం చారిత్రాత్మకమే అయినా … అందులో అయిదు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటిల్లో మొదటిది… 1996లో ఆయన ప్రభుత్వం కూలిపోయే స్థితి వచ్చినప్పుడు పార్లమెంట్లో చేసింది. ఒకింత సుదీర్ఘ ఉపన్యాసం తరువాత ఆయన ‘’నేను రాష్ట్రపతి వద్దకెళ్లి నా రాజీనామా అందిస్తాను’’ అన్నారు! ఇది నిజంగా ఆశ్చర్యమే! వాజ్ పేయ్ ఒటింగ్ కు అడగలేదు. ఆయన ఒటింగ్ పెట్టమని స్పీకర్ ని అడిగినా ఓడేవారే! అయినా, ఒక అద్భుత ప్రసంగం తరువాత ప్రతిపక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం స్వచ్ఛందంగా ఇచ్చేస్తూ తన పరిణతిని ప్రదర్శించారు! కాకపోతే, ప్రధానిగా రాజీనామా చేయబోతూ కూడా … ‘’మేం ప్రారంభించిన దేశానికి ఉపయోగపడే పనులు మీ చేత కూడా చేయించే దాకా మేం విశ్రమించం!’’ అంటూ ముగించారు! ఇదీ వాజ్ పేయ్ మార్కు అత్యున్నత రాజకీయ పరిపక్వత!     ఇక రెండోసారి … భారత శాస్త్రవేత్తలు ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాక ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం! ఇది చాలా చిన్న మీడియా మెసేజ్! ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాం. విజయవంతం అయ్యాయి. 1974 తరువాత ఈ విజయం సాధించిన మన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు… అన్నారు! ఇప్పుడు వింటే ఇది మామూలుగా వుండవచ్చు కానీ… 1998 నాటి ఇండియాకి అతి పెద్ద విజయం! అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లాంటివి ఒకవైపు, మనం ఒకవైపు! భారత్ తన ఆత్మరక్షణ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గదని నిరూపించింది ఆనాటి వాజ్ పేయ్ సర్కార్! ముఖ్యంగా ప్రోక్రన్ అణు బాంబులు పాకిస్తాన్, చైనాల గుండెల్లో పేలాయి! మూడోసారి వాజ్ పేయ్ ఉపన్యాసం చరిత్రలో నిలిచిపోయింది… ప్రోక్రన్ పరీక్షల విషయంలోనే! ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ … ‘’ ఇప్పటికే మూడు సార్లు మనం విదేశీ దాడులకు బాధితులుగా మిగిలాం! ఇక మీదట కాదు. మనం ఎవరి మీదా దాడి చేయటానికి ఈ పరీక్షలు చేయలేదు. మనకు ఆ ఉద్దేశం కూడా లేదు’’ అంటూ స్పష్టం చేశారు! 1947 నుంచీ స్వంత మెజార్టీ వున్న ఏ భారత ప్రభుత్వమూ ఇలా మాట్లాడలేదు. తొలిసారి వాజ్ పేయ్ పార్లెంట్ సాక్షిగా భారత్ విదేశీ దాడుల్ని సహించబోదని ప్రపంచానికి సూటిగా చెప్పారు! వాజ్ పేయ్ కంఠంలోంచి వచ్చీ చరిత్రలో మార్మోగిపోతూనే వున్న మరో ఉపన్యాసం 1980 నాటిది. బీజేపీ పుట్టిన తొలి నాళ్లలో ఆయన ముంబై మహాసభలో ప్రసంగించారు. ఏప్రెల్ 6 , 1980న కమలదళం కార్యకర్తల సమావేశంలో వాజ్ పేయ్ అద్భుతంగా ఉపన్యసించారు. ఆయన ప్రసంగం ముగిస్తూ అన్నమాటలు ఇప్పటికీ కాషాయ శ్రేణులకు ప్రేరణ కలిగిస్తూనే వుంటాయి! ‘’చీకట్లు తొలిగిపోతాయి! సూర్యుడు ఉదయిస్తాడు! కమలం వికసిస్తుంది!’’ అన్నారు! 2014లోమోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయిన వేళ నిజంగానే వాజ్ పేయ్ చెప్పినట్లు కమలం సంపూర్ణంగా వికసించింది!     ఇక అయిదోసారి వాజ్ పేయ్ పార్లమెంట్లో గర్జించిన సందర్భం… ఐకే గుజ్రాల్ ప్రధానిగా వున్నప్పుడు! ఆయన పీఎంగా వుండగా లాలు ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. బీహార్ లో పాలన పూర్తిగా గాడితప్పింది. గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్రం మాత్రం లాలూని చూసీ చూడనట్టు వదిలేస్తూ వచ్చింది! వాజ్ పేయ్ ఆ సమయంలో లోక్ సభలో ఛండప్రఛండగా ప్రసంగించారు! ఆనాటి ప్రధానమంత్రి దాదాపు నిశ్చేష్ఠులు కావాల్సి వచ్చింది!రాజకీయ నేతలు చాలా మంది మాటలు చెబుతారు! కానీ, వాజ్ పేయ్ మాటలు అలాంటివి కావు! సాధారణ నేతల మాటలు పెదల మీద నుంచి వస్తే… ఆయన పలుకులు గుండెలోతుల్లోంచీ వచ్చేవి! అందుకే అవి ఎదుటి వారి చెవుల్లోకి మాత్రమే కాక… నేరుగా చరిత్రలోకి వెళ్లిపోయాయి! శాశ్వతంగా స్థిరపడిపోయాయి!

జమిలిపై బిజేపీ పట్టు

  జమిలి ఎన్నికలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. 2019 వ సంవత్సరంలో లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యం. ఈ జమిలి ఎన్నికలతో తాము లాభపడాలన్నది బీజేపీ నాయకుల పన్నాగం. జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాలకు ఎలాంటి మేలు జరగదన్నది వివిధ రాష్ట్రాల్లోని పాంత్రీయ పార్టీలకు చెందిన నాయకులు వాదన. ఇందులో కొంత నిజం ఉంది. ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఒకటి రాష్ట్రంలో ఒకరికి... కేంద్రంలో మరొకరికి వేస్తారని ప్రాంతీయ పార్టీలకు చెందిన వారి భావన. ఇదే జరిగితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు ఎవరన్నది ప్రాంతీయ పార్టీల బలాబలాను బట్టి ఉండేది. జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి అవకాశమూ ఉండదు. జాతీయ పార్టీలది ఇష్టారాజ్యంగా ఉంటుంది. ఈ కారణంగా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జి, ఇటీవలే మరణించిన కరుణానిధి, దేవెగౌడ వంటి వారు వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ససేమిరా అన్నారు. అయితే, కేంద్రం మాత్రం దీనిపై పట్టుదలగా వ్యవహరిస్తోంది.     ఈ సారి లోక్‌సభకు జరగాల్సిన ఎన్నికలను అన్ని శాసనసభా ఎన్నికలతో కలిపి నిర్వహించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల యోచన. ఈ ఆలోచనను ఎలాగైనా అడ్డుకోవాలని. జమిలి ఎన్నికలు జరగనివ్వరాదని కొందరు నాయకులు పట్టుదలగా ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వారి నుంచే వ్యతిరేకత వచ్చేలా చేయాలన్నది ప్రాంతీయ పార్టీల నాయకుల ఉద్దేశ్యం. ఈ ఎత్తులను గమనించిన కేంద్రం వీరి ఎత్తులకు పైఎత్తుగా జమిలి ఎన్నికలకు  ఏకంగా చట్టబద్దత కల్పించాలని చూస్తోంది. దీనికి చట్టబద్దత కల్పిస్తే ఇక రాష్ట్రాలు ఏమీ చేయలేవన్నది కేంద్రం యోచన. ఇందుకోసం లా కమిషన్ తన పని ప్రారంభించింది. జమిలి ఎన్నికలకు సాధాసాధ్యలను బేరీజు వేస్తోందిజ ఈ నెల 31 నాటికి లా కమిషన్ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా జమిలిపై ఓ నివేదిక తయారు చేసి ఇచ్చే పనిలో పడ్డారు లా కమిషన్ సభ్యులు. వారి పని పూర్తి అయిన వెంటనే కేంద్రం వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు తీసుకువచ్చి దీన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. ఇదే జరిగితే ఈసారి లోక్‌సభతో పాటు 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారికి ఇలా కానిచ్చినా..... 2024 ఎన్నికలను మాత్రం జమిలిగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా దీన్ని ఎదుర్కొవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. ఈ వ్యూహంతో ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి యుద్ధమైనా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. జమిలిపై ఆయన వేసిన పాచిక పారుతుందో... లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే...!!!

మోదీ విషయంలో చేసిన తప్పే కేసీఆర్ తోనూ చేస్తున్న రాహుల్!

రారాజు అయిన తరువాత కాంగ్రెస్ యువరాజు పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చారు! సోనియా గాంధీ పట్టుదలతో రాష్ట్ర విభజన చేసిన తరువాత హస్తం గతి రెంటికీ చెడిన రేవడి అయింది. ఏపీలో సున్నా సీట్లు రాగా … తెలంగాణలో అధికారం సున్నా అయ్యి కూర్చుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాతో గత నాలుగేళ్లుగా సరిపెట్టుకుంటూ వస్తోంది రాహుల్ పార్టీ! ఇప్పుడు ఆయన హైద్రాబాద్ లో దిగి రెండు రోజుల పాటూ ఇక్కడే మకాం వేశారు. అందుక్కారణం పెద్దగా ఆలోచించాల్సినదేం కాదు. కేసీఆర్ మోదీతో వరుస భేటీలు జరుపుతూ ఏ క్షణాన్నైనా అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో వున్నారు. అది పసిగట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ తాము విభజించిన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా అధికారం సాధించాలని తాపత్రయపడుతున్నారు. కానీ, అది ఎంత వరకూ సాద్యం?     ఎవరో కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానులు లేదా కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులు చెప్పే మాటలు కాదు… నిజంగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవటం అంత సులువు కాదు! రాజకీయాల్లో అపర చాణుక్యుడైన గులాబీ బాస్ గత నాలుగేళ్లలో వీలైనంత జనాకర్షణ చేశారు. పాలన మొదలు పెట్టగానే ఆయన చేసిన సకల జనుల సర్వే మొదలు నిన్న మొన్నటి రైతు బంధు వరకూ అన్నీ ఓటర్లలో కోలాహలం సృష్టించాయి. వాటి వల్ల నిజంగా క్షేత్రస్థాయిలో జనానికి మేలు జరిగిందా అంటే ఎవరి వాదనలు వారికుంటాయి. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాత్రం మరీ దారుణమైన పాలన చేయలేదు. అలాగని అద్భుతాలు కూడా సృష్టించలేదు!     ఒకవైపు కేసీఆర్ పాలనలో కొన్ని లోపాలున్నా టీ కాంగ్రెస్ లో వాట్ని ఎత్తి చూపి ముందుకు దూసుకుపోయిన వారెవరు? నాలుగేళ్లుగా ఎవ్వరూ లేరనే చెప్పాలి! మొన్నటికి మొన్న మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారటం వరకూ టీ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు కేసీఆర్. కానీ, ఆ రేంజ్లో తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ ని ఢీకొట్టింది లేదు. రేవంత్ రెడ్డి, నాగం లాంటి కొత్త నేతలు చేరినా, ఉత్తమ్ కుమార్, జానా లాంటి పాత నేతలు సిద్ధంగా వున్నా జనం పక్షాన జరిగిన భారీ ఉద్యమాలంటూ ఏమీ లేవు! పైగా కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి వారి కారణంగా అంతర్గత కుమ్ములాటలు యథప్రకారం సాగిపోతున్నాయి. వీటన్నటి మధ్యా హైద్రాబాద్ లో దిగిన రాహుల్ … తనకు కంప్లైంట్లు ఇవ్వద్దంటూ చెప్పేశారట! అందరూ కలిసి పని చేయండి. అధికారం సాధిద్దాం. తరువాత ఆలోచిద్దాం అన్నారట! ఈ మాటలతో కాంగ్రెస్ మార్కు అంతర్గత రాజకీయాలు చల్లబడిపోతాయి. అందరూ ఏకమైపోతారా? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు… ఈ నలుగురితో కూడుకున్న గులాబీ దళాన్ని ఎదుర్కుని ఓడిస్తారా? డౌటే!     రాహుల్ పర్యటన సందర్భంగా మీడియాలో హడావిడి జరగవచ్చు. ఆయన దిల్లీ వెళ్లిపోతే మళ్లీ అంతా చల్లబడిపోతుంది. కానీ, కేసీఆర్ ఇక్కడే వుంటారు. ఆయనకు తెలంగాణ తప్ప మరో ప్రాంతంపై గురి లేదు. ఆయన స్వయంగా చెప్పినట్టు రాహుల్ కుటుంబానికి దేశం మొత్తం గోల కావాలి. కానీ, కేసీఆర్ ఫ్యామిలి దృష్టి మొత్తం తెలంగాణపైనే! కుటుంబ పార్టీనే అయినా టీఆర్ఎస్ తెలంగాణ జనానికి ఎక్కువ దగ్గరగా వుందన్నది నిజం. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి? ఏం చేయాలన్నా దిల్లీ నుంచీ ఆదేశాలు రావాలి! ఇది కేవలం తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందే కాదు. తెలంగాణ బీజేపీ కూడా అమిత్ షా వచ్చిపోయిన రెండ్రోజులు హడావిడి చేస్తుంది. తరువాత అంతా గప్ చుప్! ఇదే కేసీఆర్ లాంటి ప్రాంతీయ నేతలకి కలిసొచ్చే విషయం! వాళ్ల కాన్సన్ట్రేషన్ పూర్తిగా వారి రాష్ట్రంపైనే! జాతీయ పార్టీలు అలా చేయలేవు. జాతీయ పార్టీల స్థానిక నాయకత్వానికి పూర్తి స్వేఛ్ఛ వుండదు! మరీ ముఖ్యంగా, గాంధీలకు విధేయులైన కాంగ్రెస్ నేతల్లో అస్సలు వుండదు!     ఇక రాహుల్ తెలంగాణలో అస్సలు గుర్తించని సమస్య మరొకటి వుంది. ఎక్కడైనా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పక్షానికి లాభం. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది కాబట్టి! తెలంగాణలో కూడా అదే జరగటం దాదాపు ఖాయం అయిపోయింది. సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు నవంబర్, డిసెంబర్లలో ఎన్నికలు అన్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చేసినప్పటికీ రాహుల్ పొత్తుల కోసం ప్రయత్రాలు చేసినట్టు కనిపించటం లేదు. తెలంగాణలో కోదండరామ్ పార్టీ, గద్దర్ పార్టీ, టీ టీడీపీ పొత్తుకు అనుకూలమైన పార్టీల లిస్టులో వున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం ఎలాగూ కాంగ్రెస్ తో చేతులు కలిపే రాజకీయ వాతావరణం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ లు బద్ధశత్రువులే! ఇలాంటి స్థితిలో తమతో కలసి నడవగలిగే కోదండరామ్, గద్దర్, టీ టీడీపీ శ్రేణుల్ని కూడా ఇంతవరకూ రాహుల్ పలకరించలేదు. ఉత్తమ్ కూడా వారి మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు! మరి దీని ఎఫెక్ట్ ఏంటి? కాస్త రాజకీయం తెలిసిన వారెవరైనా చెప్పేస్తారు! జాతీయ స్థాయిలో రాహుల్ మోదీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల్ని జట్టుకట్టుటంలో విఫలం అవుతున్నారు. అదే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వివిధ పార్టీల్ని తమతో కలిసేలా చేయలేకపోతున్నారు. కేసీఆర్ మాటల్లో ధ్వనించే భరోసాకు ఇదే కారణం! హైద్రాబాద్ లో హడావిడి పర్యటనలు, కుటుంబ పాలనపై సెల్ఫ్ గోల్స్ లాంటి కామెంట్లు చేయటం కంటే రాహుల్ ముందు పొత్తులపై ఆలోచిస్తే ఎంతో బావుంటుంది. ఎందుకంటే, మిగిలింది ఇంకాస్త సమయమే కాబట్టి!

ఎన్నికల సమరం ప్రారంభం

తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇందుకు సంకేతంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే రోజు సమర శంఖం పూరించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొద్ది గంటలకే తెలంగాణ రాఫ్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ప్రణాళికను కూడా వెల్లడించారు.  అంతే కాదు... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే అవి ముందస్తు ఎన్నికలు కావని కొత్త సూత్రీకరణలకు కూడా తెర తీసారు.     అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆయన ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ని.మయ్యేలా ఉన్నాయి. అంతే కాదు... ఈ సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్ధులను సైతం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని, తిరిగి మళ్లీ తమదే అధికారమనే ధీమాను సైతం వ్యక్తం చేశారు.  ఈ ప్రకటనను ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా... లేక అతి విశ్వాసంగా చూడాలో పరిశీలకులు లెక్కలు తీస్తున్నారు. ఆత్మ విశ్వాసంగా పరిగణించాలంటే కె.చంద్రశేఖర రావు గడచిన నాలుగేళ్లుగా చేపట్టిన పలు పథకాల అమలును బేరీజు వేయాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులకు ఇచ్చిన పెట్టుబడి పథకం, మహిళలకు ప్రకటించిన కెసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఆయన్ని తిరిగి అధికారంలో కూర్చోపెడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిషన్ భగీరథ, చెరువులు పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలుగానే వారు చూస్తున్నారు. అయితే ఇవన్నీ పైకి కనిపించే పథకాలే అయినా... వాటి వెనుక దాగి ఉన్న అవినీతి ప్రతిపక్షాలకు ఈ సారి ఎన్నికల ఆయుదం కానుంది.     ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు తొలి సారి వచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా ఇక్కడకు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లో తన తొలి పర్యటన ప్రారంభించిన రాహుల్ గాంధీకి ఇక్కడ మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఈమధ్య ఆయన తన ప్రసంగాలలోనూ, లోక్‌సభలోనూ రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. కన్నుకొట్టడం వంటి చిలిపి పనులను మినహాయిస్తే ఏడాది క్రితం రాహుల్ గాంధీకీ... ఈనాటి రాహుల్ గాంధీకి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానమంత్రిని లోక్‌సభలో తన ప్రసంగం అనంతరం కౌగలించుకున్న రాహుల్ గాంధీ జాతీయ స్ధాయిలో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో కూడా ఆయన చేసిన ప్రసంగం ఇక్కడి ఏలికలకు కాసింత ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి. అందుకే హడావుడిగా... అది కూడా రాహుల్ గాంధీ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అధికార పార్టీలో ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర సెటిలర్లదే. వీరి మద్దతు ఎవరికి ఉంటుందో వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.     సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కాసింత ముందుగానే స్పందించింది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆయుధాన్ని తెలంగాణలో సెటిల్ అయిన వారిపై ప్రయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల ఓట్లను అడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ కూడా టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని ప్రకటనలు  చేశారు. దీంతో సెటిలర్ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు దిద్దుబాటు చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వారందరూ తెలంగాణ వాసులే అని ప్రకటించారు. అయితే, సెటిలర్లు ఆయన మాటలను నమ్ముతారో... లేక తమ బంధువులు, స్నేహితులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఆరు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందని మాత్రం తేటతెల్లం అయ్యింది.