పాలించాల్సింది ఏపీ సీఎంగా.. వైసీపీ చీఫ్ గా కాదు: పవన్

  ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై ఆందోళన చెందిన రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో రాజధాని ప్రాంతంలో పర్యటించి, అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే పవన్ అమరావతి పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాజధానిలో పర్యటిస్తున్న పవన్.. కురగల్లు గ్రామస్థులతో సమావేశమయ్యారు. రాజధానిపై మంత్రి ప్రకటనలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు కొందరు మహిళలు పవన్‌కు వివరించారు.  అనంతరం మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానిని పొలిటికల్ గేమ్‌గా చూడొద్దన్న పవన్.. అమరావతిని రాజధానిగా ఉంచుతారా ? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. రాజధానిని తరలిస్తామంటే జనసేన ఒప్పుకోదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. రాజధాని ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని పనవ్ హామీ ఇచ్చారు. రాజధాని విషయంపై ప్రకనటలు చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి బొత్స‌కు పవన్ సూచించారు. రాజకీయాలు చేయడానికి రాలేదన్న పవన్.. గత టీడీపీ ప్రభుత్వ సమయంలో కూడా.. భూ సేకరణ చట్టం ఉపయోగించి, భూములివ్వడం ఇష్టం లేని రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దని తాము చెప్పారని గుర్తు చేసారు. ఆ సమయంలో తమ దగ్గరకు అండగా ఉండమని అడిగింది కూడా వైసీపీ వారే అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. రైతులకు అప్పుడూ అండగా ఉన్నాం, ఇప్పుడూ ఉంటాం అని పవన్ స్పష్టం చేశారు. అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు అన్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి, అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలి అన్నారు. జగన్ రెడ్డి వైసీపీ అధినేత పాలన సాగిస్తున్నారు.. తప్ప సీఎం గా  భావించడం లేదు అని విమర్శించారు. ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టీడీపీకి కాదని, ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన  చేయాలని హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదు.. ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం అని హెచ్చరించారు. "రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే  ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. మంత్రి బొత్స పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన పై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు. వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా..  ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది. రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. 90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మంచి చేస్తారని సీఎంను‌ చేస్తే.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.రైతుల కు జనసేన అండగా ఉంటుంది." అని పవన్ స్పష్టం చేశారు.

రాజధానిని ఎవరూ మార్చలేరు.. జగన్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజధాని రగడ.. రోజురోజుకి రాజుకుంటుంది. వైఎస్ జగన్ సర్కార్ రాజధానిని మార్చే యోచనలో ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ రాజధాని రగడ అంశంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గత ఏడాది సైకిల్ పై రాజధాని ప్రాంతంలో పర్యటించిన సంగతిని గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత రగడపై స్పందించారు. "ఊరులో ఇల్లు లేదు, ఊరుబయట చేనులేదు.. నీకెందుకురా పెత్తనం అని రాయలసీమ భూస్వాములు మాట్లాడ్తుంటారు. అలావుంది రాజధాని రగడ. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరు, కాకపోతే సమయానుకూలంగా కాలాక్షేపం కొరకు చదరంగం ఆడుతున్నారు. దాదాపు సంవత్సరం క్రితం సీపీఐ జాతీయ సమావేశాలు విజయవాడలో జరిగాయి. సమావేశాలు అయిపోయిన మరుసటి రొజు కృష్ణ బ్యారేజ్ వద్దనున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు నేను నామిత్రులు వెళ్ళాం. అక్కడ సైకిల్స్ కనబడ్డాయి. వాకింగ్ బదులు ఈమద్య సైకిల్స్ వాడుతున్నామని నామిత్రులు చెప్పారు. అయితే ఈరోజు సైకళ్ళస్వారి చేద్దామనుకుని సైక్లింగ్ చేశాము. పనిలోపనిగా రాజధాని వరకు వెళ్దాం అనుకుని బయలుదేరాము. మంచి విశాలమయిన రోడ్స్ కొంతవేశారు. యింకా నిర్మాణం కొనసాగుతున్నది. ప్రధానంగా మౌలిక సదుపాయం అవసరం. అదిలేనిదే భవననిర్మాణాలుగాని, కార్యాలయాలుగాని నిర్మిచలేం. ఉపరితల నిర్మాణాలకన్నా, పునాదుల నిర్మాణం, దానికన్నా ముందు సమగ్ర పథకానికే ఎక్కువ సమయం పడ్తుంది. పథకం లేకుండా హడావుడి పనుల వలన ప్రయోజనం శూన్యం. ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం పక్కాగానే ప్లాన్ చేసింది. అయితే రాజధాని నిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొస్తాం అని, సీఎం ఉత్తర ప్రగల్బాలు పలికే నెత్తికి తెచ్చుకున్నారు. మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, చేతిలో పైసాలేకపోయినా ఆకాశానికి నిచ్చెనేశారు. అయినా జయప్రదం అయివుండేవాడేమో ప్రధాని మోడీ సహకరించి వుంటే. మోడీ గారికి రాజకీయలక్షణాలుంటే అదిజరిగేదే. మోడీ గారు చంద్రబాబుని అంత ఈజీగా మర్చిపోతాడా? మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మారణ కాండ అమెరికా మొదలు యావత్ ప్రజానీకం ఖండించింది. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు కూడా మోడీని వ్యతిరేకించాడు. రాజకీయాలలోగాని వ్యక్తిగతంగా కానీ శత్రుశేషాన్ని భరించి, ధరించే వారుకాదు మోడీజి. ఆంధ్రప్రజలేమయినా కానీ చంద్రబాబును రాజకీయంగా బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. "రాష్ట్ర హక్కులపై రాజకీయపోరాటం చేయమని సలహాయిస్తే" మీరెపుడూ అరచేవాళ్ళేకదా అరుచుకోండి నేను ఏదోక విధంగా అభివృద్ధికి పనిచేస్తానని వెటకారం చేసారు మమ్మల్ని. "కర్ణుడి చావుకు నూరు కారణాలన్నట్టు" టీడీపీ ఓడిపోయింది. యువనేత జగన్ మోహన్ రెడ్డి  సీఎంగా ఎన్నిక కావడం, సంవత్సరం లోపు మంచి సీఎంగా నిరూపించుకుంటానని ఆత్మధైర్యంతో ప్రకటించారు. డైనమిక్ సీఎంగా ఊగిసలాట లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిదేనని నేను కూడా కితాబిచ్చాను. కానీ ప్రారంభంలోనే ప్రజావేదికను నేలమట్టం చేశారు. అదిప్రభుత్వ ఆస్తి ,చట్టవిరుద్దంగా కట్టివుంటే దాన్ని సీజ్ చేసి, కార్యకలాపాలు నిషేదించి ఉండవచ్చు. అలాంటి అక్రమ నిర్మాణం ప్రభుత్వానిదయినా, ప్రైవేట్ వాళ్ళదయినా ఒక విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడేమైంది? ప్రభుత్వ ఆస్తి మట్టిపాలయింది. మిగతావన్నీ ఆలాగేవున్నాయిగదా. "తెలంగాణ సీఎం ప్రారంభంలోనే అయ్యప్పసొసైటి లో అప్పటికే నిర్మించుకుని ఉన్న కట్టడాలను కూల్చప్రారంభించారు. నేను, సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి, పల్లవెంకటరెడ్డి వెళ్ళి అభ్యంతరం తెలియజేసి బాదితులకు అండగానిబడ్డాం. అప్పుడు కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించి, అయ్యప్ప సొసైటీ అంతా రాయలసీమ, రాజశేఖరెడ్డి గుంపే ఆక్రమిచుకున్నారన్నా, మీరెందుకు అక్కడపొయి అటకిస్తారు? అన్నారు. మీరుచెప్పింది వాస్తవం కాదు, అయినా నిర్మాణభవనాలను కూల్చితే జాతీయసంపద వృధా కదా అన్నాము. గీతను చెరపడంకాదు, పెద్దగీతను గీయడానికి ప్రయత్నించాలి. గతప్రభుత్వ విధానాలను బహిర్గతం చేయాలంటే, బండగా వ్యతిరేకించడం గాక ప్రస్తుత ముఖ్యమంత్రి మంచిపనులు చేయడం ద్వారా గతప్రభుత్వ లోపాలను ప్రజలే తెలుసుకునేట్టు చేయాలి. గతపనులలో లోపాలుంటే వెలికితీయడం లో తప్పులేదు, అయితే కొనసాగే పనులు ఆపించడం వ్యతిరేకదొరణి. పోలవరం ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమయింది. ఇప్పటికే నేరపూరిత కాలయాపన జరిగిపోయింది. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనులు అపించారు. కొత్త టెండర్ల కొరకు ప్రయత్నాలు, దానిలో ఎన్ని సాదకబాదలుంటాయో అనుభవిస్తేగాని తెలియదు. పోలవరం పనులు ఆపించకుండా, దానిలోవున్న అవినీతిని బహిర్గతం చేయడానికి, నిరూపించడానికి తగిన ప్రయత్నం చేసి వుంటే అపుడు తగినచర్యకు అవకాశం వుండేదికదా. అమరావతి రాజధాని ప్రస్తావన లేనపుడే, ఉమ్మడి రాష్ట్రం లో రెండుమూడేండ్లు వరుసగా వరదలు వచ్చినపుడు ఉండవల్లి చుట్టుపక్కగ్రామాలలో విలువయిన ఉల్లి, తదితర కూరగాయల పంటలు నీటిలో మునిగి పంటనష్టం వచ్చింది. నేనే స్వయంగా పరిశీలనకువెళ్ళాను. కొండవీటి వాగు ప్రవాహం వలన ముంపుకు గురై పంటనష్టం వస్తుందని, ఆ ప్రవాహాన్ని కృష్ణ రివర్ కు మళ్ళిస్తే మంచిదని సూచించడం జరిగింది. రాజధాని నిర్మాణం లో ఇదంతా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాజదానిపై అంతచర్చ అవసరమా లేక పక్కదారిపట్టించడానికా?. నేను, మా మిత్ర బృందం సైకిళ్ళపై తిరిగినపుడు నవ్వులూరు మొదలు రాజధాని పరిసర గ్రామాలకు వెళ్ళాము. స్థానికులతో కలిశాము. అంతా సంతృప్తి వ్యక్తపరిచారు. చిన్న చిన్న లోపాలుండవా అంటే వుంటాయి. అది పరిష్కారం కానిది మాత్రం కాదు. నూతన ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబును ద్రుష్టిలో పెట్టుకునే అడుగులువేయడమంటే అది తప్పుటడుగులే అవుతుంది. ఒకసారి నా ఉపన్యాసం విన్న ఓ సైకాలజిస్టు నాతో చెప్పినమాట "నీప్రత్యర్ధి బీజేపీని గురుంచి నూరు మార్లు మాట్లాడి, మీ పార్టి నిగురుంచి పదిమార్లు మాత్రమే మాట్లాడావు. ఒక విధంగా నీవే ప్రత్యర్ది పార్టీకి ప్రచారకర్తగా నీకు తెలియకనే మారిపోయావు అన్నాడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిది కూడా ఇదే తంతు . " ఆపెద్దమనిషి , సిగ్గులేని చంద్రబాబు" అని పదేపదే వుటకించడంద్వారా, ఈప్రభుత్వం చేసే సానుకూల పనులు స్థానే, ప్రత్యర్దులను గురించి కాలం వృధా చేసుకుంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చంద్రబాబునుద్దేశించి ఏకవచనం వాడేవారు. అపుడు సినీ నటులు పచ్చిపులుసు సుబ్రమణ్యం " చంద్రబాబును ఏకవచనంతో సంబోదించకండి సార్" అని సలహా ఇచ్చారు. దానికి వైఎస్సార్ యెందుకు? అలానే అంటాను అని వెళ్ళారు. కానీ ఆ మరునాడు నుండి వైఎస్సార్ వైఖరిలో మార్పుకనపడింది. " ఎంత ఎదిగితే అంతవొదిగి వుండడం" ఉత్తమం. కానీ జగన్ లో దూకుడేతప్ప హుందా తనం లేదు." అంటూ నారాయణ తన గత అనుభవాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ వైఖరిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

ఆంధ్రాలో తెలంగాణ జర్నలిస్టులకు పెద్దపీట... జగన్ సర్కారుపై ఏపీ ఎడిటర్స్ ఆగ్రహం

    తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాత్ర మరువలేనిది. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు... తలలు పగిలేలా గాయపడ్డారు. చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంతో పలువురు జర్నలిస్టులు ఊహించని లబ్ది పొందారు. వివిధ స్థాయిల్లో పదవులను అందుకున్నారు. కొందరైతే టీఆర్ఎస్ అండతో ఏకంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చక్రం తిప్పుతున్నారు.  అయితే, తెలంగాణ జర్నలిస్టులకు స్వరాష్ట్రంలోనే కాదు, విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లోనూ పెద్దపీటే దక్కుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ...వాళ్లనుకూల వ్యక్తులకు పెద్దపీట వేయడం సహజం... కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు జర్నలిస్టు దిగ్గజాలే లేనట్లుగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెట్టడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.  ఇప్పటికే, నల్గొండకు చెందిన విజయ్ కుమార్ రెడ్డి ని సమాచారశాఖ కమిషనర్ గా, అలాగే ఖమ్మానికి చెందిన కృష్ణమోహన్ ను కమ్యూనికేషన్స్ సలహాదారుగా, అదేవిధంగా జాతీయ మీడియా సలహాదారుగా వరంగల్ వాసి దేవులపల్లి అమర్ ను నియమించడమే కాకుండా, పీఆర్వో విభాగంలో అనేక మంది తెలంగాణ జర్నలిస్టులకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం.... తాజాగా ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ఖమ్మం వాసైన కె.రామచంద్రమూర్తిని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణవాదులకు, తెలంగాణ జర్నలిస్టులకు ఏపీలో పదవులు కట్టబెడుతున్న జగన్ సర్కారు తీరుపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ముఖ్యంగా సాక్షిలో పనిచేసిన తెలంగాణ జర్నలిస్టులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఏదేమైనా తెలంగాణ జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వంలో పెద్దపీట వేయడం... ఆంధ్రా జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ముందుముందు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

పట్టుదల వీడని, వెనుకడుగు వేయని సింధు

  పీవీ సింధు అంటే పూసర్ల వెంకట సింధు కాదు.. పట్టుదల వీడని, వెనుకడుగు వేయని సింధు అని రుజువు చేసింది. బ్యాడ్మింటన్‌లో మరే భారత క్రీడాకారులకు సాధ్యంకాని.. ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించి.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. పీవీ సింధు ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో.. అప్పటివరకు సాధారణంగా వినిపించిన సింధు పేరు దేశమంతా పెద్ద సంబరంలా వినిపించింది. సింధు గెలిచింది రజతమే అయినా.. ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండా మురిసిపోయేలా చేయడంతో.. దేశమంతా స్వర్ణాన్ని మించిన సంబరాలు జరిగాయి. తనను వరించిన రజత పతకం, ప్రశంసల వర్షంతో సింధు కొందరిలాగా విర్రవీగలేదు, విశ్రమించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి దేశం గర్వపడేలా చేయాలన్న తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కొన్నేళ్లుగా విరామం లేకుండా పోరాడింది. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో..  2013, 2014 లలో కాంస్యంతో సరిపెట్టుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలవడంతో సింధు మీద అంచనాలు పెరిగాయి. విపరీతమైన ఒత్తిడి. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కి చేరింది. కానీ రజతంతోనే సరిపెట్టుకుంది. అయినా తాను నిరాశ చెందలేదు, పోరాటాన్ని ఆపలేదు. 2018 లో కూడా ఫైనల్ కి చేరింది కానీ మళ్లీ రజతంతోనే సరిపెట్టుకుంది. దీంతో కొందరు సింధు మీద విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ సింధు ఆ విమర్శలకు విజయంతోనే సమాధానం చెప్పాలనుకుంది. వరుసగా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. గత ఫైనల్ అవమానాలు వెక్కిరిస్తున్నాయి, విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ అంత ఒత్తిడిలో కూడా చరిత్ర సృష్టించింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాన్ని గెలిచి.. 2019 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. మళ్లీ దేశవ్యాప్తంగా సింధు మీద ప్రశంసలు మొదలయ్యాయి. కానీ, ప్రశంసలకు పొంగిపోని, విమర్శలకు కృంగిపోని నైజం మన తెలుగు తేజం సింధుది. గెలిచినా తన పోరాటం ఆపదు, ఓడినా తన పోరాటం ఆపదు. అందుకే సింధు ఎందరికో స్ఫూర్తి. 

తిరుమలలో అన్యమత ప్రచారం.. సీఎం జగన్ కు తెలుసా?

  తిరుమల వెళ్లే బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలను ముద్రించడంపై బీజేపీ భగ్గుమంది. తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఆర్టీసీ ఆర్ఎంకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు . కుట్రలో భాగంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన మరో నేత సౌమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా గతంలోనూ ఉద్యమాలు చేశామని, ఈ ప్రచారం ఆగకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సుల టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచార ప్రకటనలపై దుమారం రేగుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో ఇలా ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. రాంభగీచ బస్టాండ్‌లోని కౌంటర్‌లో గురువారం ఉదయం నుంచి ఇచ్చిన టిక్కెట్ల వెనుక భాగంలో హజ్, జేరుసలేం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్నాయి. దీంతో కొందరు భక్తులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. అయితే తిరుమలకు వచ్చే టిక్కెట్ రోల్‌పై ఎలాంటి ప్రకటనలు ఉండవని చెప్పిన డిపో మేనేజర్.. ప్రకటనలు ఉన్న ఐదు పేపర్లు పొరపాటున తిరుమలకు వచ్చాయని చెప్పారు.   ఇదే విషయమై టీటీడీ మాజీ సభ్యుడు ఏవీ రమణ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బస్సు టిక్కెట్ వెనుక అన్యమత యాత్రల గురించి ప్రచారం చేయడం ఘోరమని అన్నారు. టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను నియమించినప్పుడే భక్తులు ఆందోళన చెందారని, ఇప్పుడు వారి భయమే నిజమైందని విమర్శించారు. ఆలయ పవిత్రత, మనోభావాలను కాపాడాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని రమణ ప్రశ్నించారు. ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఇంతకు ముందే ఒకసారి చెప్పామని.. మత విశ్వాసాలను గౌరవించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్ని ప్రచారం చేయడం సరికాదని కన్నా మండిపడ్డారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. టికెట్లపై అన్యమత ప్రచారం చేయడం సరికాదని, ఈ విషయం గురించి సీఎం జగన్ కు తెలుసా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై జగన్ చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచార విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ సర్కారుకు తొలి దెబ్బ.! విజయసాయి మాటలపై అనుమానాలు.!

  జగన్ ప్రభుత్వానికి తొలి దెబ్బ తగిలింది. జపాన్ లేఖతో కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలన్న ఏపీ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జగన్ సర్కారు తోక ముడిచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పీపీఏల రద్దును తీవ్రంగా పరిగణించిన జపాన్ ప్రభుత్వం... ఇండియన్ గవర్నమెంట్ కి ఘాటు లేఖ రాసింది. భారత విద్యుత్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన జపాన్.... జగన్ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, ఖరారైన ఒప్పందాలను రద్దు చేయడాన్ని ఫ్రాన్స్, సౌతాఫ్రికా, ఐరోపా దేశాలు కూడా గమనిస్తున్నాయంటూ జపాన్ బాంబు పేల్చింది. దాంతో రంగంలోకి దిగిన ప్రధాని కార్యాలయం.... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పీపీఏలను రద్దుచేస్తే ఫారిన్ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది భారత్ కు మంచిది కాదని తేల్చిచెప్పింది. సరైన ఆధారాల్లేకుండా పీపీఏలను రద్దుచేయడం సరికాదని, పారదర్శకంగా వ్యవహరించకపోతే పెట్టుబడులు తగ్గి, అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. అవినీతి జరిగిందని స్పష్టంగా తేలితే తప్ప, చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్నీ రద్దు చేయలేమని జగన్ సర్కారుకు గుర్తుచేసింది.  అయితే, పీపీఏలన్నింటినీ తాము రద్దు చేయలేదని, కేవలం అవకతవకలు జరిగాయని నిర్ధారించిన ఒప్పందాలను మాత్రమే పునసమీక్షిస్తున్నట్లు కేంద్రానికి తెలియజేసింది. ఒకవైపు జపాన్ లేఖ... మరోవైపు కేంద్రం హెచ్చరికలతోనే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే పీపీఏల సమీక్ష నిర్ణయం తీసుకున్నామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినరోజే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ఈ ఆదేశాలు రావడం విజయసాయి మాటలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.

మొన్న కే-టాక్స్.. నిన్న అసెంబ్లీ ఫర్నీచర్.. నేడు మరో కక్కుర్తి?

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కూడా కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోడెల ఇంకా అనేక అక్రమాలు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల తన మార్కు చూపించారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనే నిర్ణయించారట. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ.. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదట.   ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారట. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారట. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదట. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవట. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయట. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ పై పారిశ్రామికవేత్త సంచలన కామెంట్స్.. అందుకే టార్గెట్ చేశారా?

  ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తేనే, ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి జరుగుతుంది. అయితే, పెట్టుబడులు రావడం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, ఆయా ప్రభుత్వాలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగితేనే, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టుల రద్దు, పీపీఏల సమీక్షలాంటి నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. పైగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేవైనా, వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకులాంటి మేజర్ ఇన్వెస్టర్స్ తప్పుకోవడంతో...ఇప్పటికే వందల వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయి. కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి.... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని, ఇలాగైతే రాష్ట్రం నాశనం కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తీరుతో ఏపీకి కొత్త పరిశ్రమలు రావని, ఆయన వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు దేవాలయాల భూములను జగన్ అనుచరులు కొట్టేస్తున్నారని, దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే పేరెన్నికగల పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వంపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేసిన అక్షయపాత్ర సంస్థకు దాదాపు 45కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందట. ఈ బిల్లులు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం నో చెప్పినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, విచారణ తర్వాతే చెల్లింపులు ఉంటాయని తేల్చిచెప్పిందట. ఇదే, టీవీ మోహన్‌దాస్‌ పాయికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అక్షయపాత్ర బోర్డులో సభ్యుడిగా ఉన్న మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటం, విచారణలు చేయడం వరకు ఓకే కానీ...చేసిన పనికి బిల్లులు చెల్లించమని, చెప్పడం ప్రభుత్వ ఉగ్రవాదం కిందకే వస్తుందని పాయ్ అంటున్నారు. ఏదేమైనా జగన్ ప్రభుత్వంపై ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటిసారి జగన్ టార్గెట్ గా పాయి ఘాటు విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

చంద్రబాబు బాటలో జగన్... 100రోజులు కాలేదు...అప్పుడే 90శాతం సంతృప్తి అట!

  ఇప్పుడంటే పొలిటీషన్లు అందరూ టెక్నాలజీని మంచినీళ్లలా వాడేస్తున్నారు గానీ, ఒకప్పుడు టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా!. ఎందుకంటే, అభ్యర్ధుల ఎంపిక కోసం నైన్టీస్ లోనే ఐవీఆర్ఎస్ సిస్టమ్ వాడిన తెలివైన పొలిటీషియన్ చంద్రబాబు. అయితే, పదేళ్ల నిరీక్షణ తర్వాత 2014లో అధికారాన్ని అందిపుచుకున్న చంద్రబాబు... ప్రజల నాడిని తెలుసుకునేందుకు కూడా అదే టెక్నాలజీని వినియోగించారు. ఏకంగా తన గొంతుతోనే ప్రజలకు ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచేవారు. నమస్కారం, నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా... అంటూ మొదలయ్యే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ తో ప్రభుత్వ పనితీరు ఉలా ఉంది?, మీ ఎమ్మెల్యే మీరు అందుబాటులో ఉంటున్నారా? అంటూ ఇలా పలు ప్రశ్నలు అడిగి అడిగేవారు. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి స్వరంతో ఫోన్ కాల్ వచ్చేసరికి... ప్రజలు ముందు ఆశ్చర్యానికి, ఆ తర్వాత భయానికి లోనయ్యేవారు. పరిపాలన బాగాలేదంటే ఏమవుతుందో ఏమోనని అన్నీ బ్రహ్మాండగా ఉన్నాయంటూ ఆప్షన్స్ ను నొక్కేవారు. ఇక అధికారుల గానాభజానా సరేసరి. 90శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ బాబును మెప్పించేవారు. ఇదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కొంప ముంచింది. అటు ఐవీఆర్ఎస్ సర్వే... ఇటు అధికారుల మాట నమ్మిన చంద్రబాబు... ప్రజల అసంతృప్తిని పసిగట్టలేకపోయారు. ఆఖరి సమయంలో పసిగట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి టీడీపీ చరిత్రలో ఎన్నడూలేనంతా దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిదంతా ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి పాలనకు వంద రోజులు కూడా పూర్తికాలేదు... కానీ, అప్పుడే 90శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ అధికారులు చెప్పుకొస్తున్నారట. ముఖ్యంగా స్పందన కార్యక్రమం టెలీకాన్ఫరెన్సుల్లో అధికారుల నుంచి ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయట. దాంతో ప్రజల అసంతృప్తిస్థాయి ఒక్క శాతానికి తగ్గించాలంటూ సీఎం జగన్ సైతం సూచించినట్లు తెలుస్తోంది. అయితే, సేమ్ టు సేమ్ ఇలాంటి మాటలే చంద్రబాబుకి కూడా చెప్పారట, అధికారుల లెక్కల్లో టీడీపీ పాలనపై 85శాతం హ్యాపీగా ఉన్నారని తేలిందట. అధికారుల మాటలను నమ్మిన చంద్రబాబు సైతం 85శాతంపైగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ అనేకసార్లు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం. అధికారుల చెప్పిన 85శాతం హ్యాపీకి 23 సీట్లే వచ్చాయి. మరి అప్పుడే జగన్ పాలనకు 90శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉంటే, అది రానురానూ 99శాతానికి చేరితే ఎన్ని సీట్లు వస్తాయో?. ఎందుకంటే 85శాతానికి 23 సీట్లు వస్తే... ఈ లెక్కన  99శాతానికి ఎన్ని సీట్లు వస్తాయో! ఏదేమైనా అధికారుల లెక్కలు నమ్మితే అధోగతే...అంతేమరి!

అవసరమైతే మొదటి అణు దాడి మేమే చేస్తాం: పాక్ కు రాజనాథ్ సీరియస్ వార్నింగ్

  యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులలోను అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతం కాగా ఇపుడు జమ్మూ కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ తో తలపడటానికి జిహాద్ తప్ప వేరే మార్గం లేదని అలాగే అణు యుద్ధం కూడా తప్పదని మొన్న పాక్ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా రాజనాధ్ పాక్ కు ఇలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అని, ఇప్పటివరకూ భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉందని ఐతే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అయన అన్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.

గంటా గంట కొట్టేసినట్లేనా? మరి డుమ్మా ఎందుకు కొట్టినట్లు?

  రాజకీయాల్లో అతని రూటే సెపరేటు... పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది అతని ఫిలాసఫీ... ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది... కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది.... అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన... ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా..అంటూ తెగ మధనపడిపోతున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా... లేక రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా... తిన్నావా అంటూ పలకరిస్తున్నా, మరోవైపు సీఎం రమేష్‌ రారమ్మంటూ పిలుస్తున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. అయితే గలగల గంట మోగించే ఆయన, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టారనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇతనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... ఇంకెవరు గంటా శ్రీనివాసరావే.... ఇంతకీ ఇతని గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? ఎందుకంటే, టీడీపీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి జరిగిన కీలక సమావేశానికి ఈ గంటా సారు డుమ్మాకొట్టారు. గంటా సారుకి ప్రతిపక్షంలో కూర్చోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందుకే పార్టీ మారైనా సరే పదవి సంపాదిస్తారని అంటారు. అందుకే వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేయాల్సిందేనన్న జగన్‌ నిబంధనతో చేసేదేమీలేక ఆగిపోయారట. ఇక మిగిలింది బీజేపీ. అయితే, తనతోపాటు పది పదిహేను మంది ఎమ్మెల్యేలతో కమలం గూటికి వెళ్తారంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా, రూమర్లు మాత్రం ఆగలేదు. రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గానికి దూరంగా ఉండటంతో, పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఇప్పుడు టీడీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే పదవి లేకపోతే ఉండలేరు... పైగా పీఏసీ ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో, మరింత అసంతృప్తితో ఉన్నారట.  మొత్తానికి గంటా డుమ్మాపై టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్లో వాడివేడి చర్చ జరిగిందట. గంటాపై వేటు వేయాల్సిందేనని పలువురు నేతలు చంద్రబాబును గట్టిగా కోరారట. మరి గంటా మౌనం వీడతారా? లేక అంతకంటే ముందే బాబు నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకరు మౌనం వీడితే తప్ప ఈ గంట మోగుతుందో లేక సైలెంట్ గా అలాగే కంటిన్యూ అవుతుందో తేలుతుంది.

వరదరాజస్వామి దర్శనానికి కేసీఆర్.. రోజాతో భేటీ రాజకీయమా?

  సీఎం కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ ఏడాది ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయంలో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తొక్కిసలాటలో భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మళ్ళీ 40 ఏళ్ళ వరకు స్వామిని చూసే అవకాశం లేకపోవడం, మనిషి జీవితం మొత్తం మీద ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ స్వామి దర్శనం అయ్యే అవకాశం లేకపోవడంతో భక్తులు ఎగబడుతున్నారు. ఆ భక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. మొదట్నుంచి కేసీఆర్ కి పూజలు, దేవాలయాలపై మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరదరాజస్వామి దర్శనానికి పయనమయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వరదరాజ స్వామి దర్శనంతో పాటు ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజాతో భేటీ కూడా కానున్నారని తెలుస్తోంది. సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు. వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం రోజా ఇంట్లోనే అని తెలుస్తోంది. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయట. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రోజా ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రోజాకి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రోజా దాని గురించి కేసీఆర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది.

జగన్ సంచలన నిర్ణయం.. 'మీ సేవ' కేంద్రాలు మూసివేత!!

  వైఎస్ జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పౌర సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న 'మీ సేవ' కేంద్రాలను రద్దు చేసే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 2నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో  సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాల రాకతో ఇప్పటికే రేషన్ దుకాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు కూడా ఇక కాలం చెల్లినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. మీ సేవలో అందించే పౌర సేవలన్నీ ఇక మీదట గ్రామ సచివాలయాల నుంచి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.  మీ సేవ కేంద్రాలను మొదట ఇ సేవ పేరుతో 2003లో ఏర్పాటు చేశారు. తొలుత నాలుగు రకాల సేవలతో ప్రారంభమైన మీ సేవ నేడు 367 రకాల ప్రభుత్వ సేవలు, మరో 30 రకాల ప్రైవేటు సేవలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 11,054 కేంద్రాలకు దశల వారీగా ప్రభుత్వం అనుమతిలిచ్చింది. ఇందులో రెండువేలకు పైగా మీ సేవలు పనులు లేక నిరుపయోగంగా మారడంతో మూతబడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు సుమారుగా 200 వరకు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజీల కింద దాదాపు 9 వేల మీ సేవ కేంద్రాలు పౌరులకు సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రద్దు చేసే మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ మీ సేవ కేంద్రాలు ఉంటాయా? లేక ఫ్రాంఛైజీల ద్వారా నడిచే మీ సేవ కేంద్రాలు ఉంటాయా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రైవేటు ఏజెన్సీల గడువు ముగియడంతో కార్పొరేట్‌ కంపెనీలకు మీ సేవ సాప్ట్‌వేర్‌ అగ్రిమెంట్లను బదిలీ చేయవచ్చని భావిస్తున్న తరుణంలో గ్రామసచివాలయాల ద్వారా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మీ- సేవలు రద్దు కానున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో వీటిల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మీ సేవ కేంద్రాల మూసివేతకు ప్రభుత్వం సిద్దమైతే అందులో పని చేస్తున్న సిబ్బంది.. రేషన్ డీలర్ల తరహాలోనే రోడ్డెక్కే అవకాశముంది. వీరికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి.

సుష్మా లవ్ స్టోరీ...ఆరోజుల్లోనే సంచలనం !

  బీజేపీ సీనియర్ నేత, విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా‌స్వరాజ్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. భాజపాలో మూడు దశాబ్దాలుగా ఆమె కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆమె ప్రేమ వివాహం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తోంది. చండీగడ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలోనే సుష్మా స్వరాజ్ మరియు స్వరాజ్ కౌషల్ లు కలుసుకున్నారట. వీరిద్దరూ 13 జూలై 1975 న వివాహం చేసుకున్నారు.  అయితే ప్రేమ వివాహం కోసం వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చిందట. సుష్మా స్వరాజ్ ప్రేమ వివాహం చేసుకున్న సమయంలో హర్యానాకు చెందిన ఒక అమ్మాయి ప్రేమ వివాహం గురించి ఆలోచించడమే చాలా పెద్ద విషయం. కానీ 25 సంవత్సరాల వయస్సులో హర్యానా క్యాబినెట్ మంత్రిగా బాద్యతలు చేపటిన సుష్మాకు ఈ ధైర్యం ఉంది కాబట్టే ఆమె ఇంట్లో ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంది.  స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టులో పేరొందిన న్యాయవాది. ఆయన తన 34 ఏళ్ల వయసులోనే అత్యంత పిన్నవయస్కుడైన యువ అడ్వకేట్ జనరల్‌గా పేరొందారు. స్వరాజ్ కౌశల్ తన 37 ఏళ్ల వయసులో మిజోరం గవర్నర్‌గా బాధ్యలు చేపట్టారు. ఆ పదవిలో ఆయన 1990 నుంచి 1993 వరకూ ఉన్నారు. అయితే మొన్న జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇండోర్‌లో విలేకరుల ప్రసంగం చేస్తున్నప్పుడు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయనని విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ప్రకటించారు.  సుష్మా స్వరాజ్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో ఆమె భర్త ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్‌ లో ఒక పోస్ట్ చేస్తూ పోటీ చేయకూడదనే మీ నిర్ణయానికి ధన్యవాదాలు రేసు ఈ రేసు 1977 లో ప్రారంభమైంది. ఇప్పుడు 41 సంవత్సరాలు అయ్యింది. మీరు ఇప్పటివరకు 11 ఎన్నికలలో పోటీ చేశారు. 1991 మరియు 2004 సంవత్సరాల్లో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేయలేదు, ఎందుకంటే పార్టీ మిమ్మల్ని ఎన్నికల రంగంలోకి అనుమతించలేదు. నేను గత 46 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు నాకు 19 సంవత్సరాలు కాదు కాస్త చూడండి మేడమ్ అంటూ పోస్ట్ చేశారు. ఆయన అన్నట్టుగానే ఆమె ఆ ఎన్నికలకి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా కన్నుమూశారు.  

వీజీ సిద్దార్థది ఆత్మహత్య కాదా ? కొట్టి చంపారా ?

  కన్నడ రాష్ట్రంలోనే కాక భారత కార్పొరేట్ వ్యవస్థనే ఓ కుదుపు కుదిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కార్పోరేట్ కింగ్ సిద్ధార్థ మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయాని కంటే ముందు రెండు గంటల పాటు ఆయన ఏమి చేశారు అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. పోలీసుల దర్యాప్తు లో తేలిన అనేక విషయాలు ఇప్పుడు కొత్త అనుమానాలకి కారణం అవుతున్నాయి.  జులై 29న సాయంత్రం ఐదున్నర సమయంలో బ్రహ్మర కూట్లు టోల్‌ గేట్‌ ను సిద్ధార్థ కారు దాటి వెళ్లింది. వాస్తవానికి ఆ టోల్ గేట్ నుంచి నేత్రావతి నది వద్దకు ఎంత ఎక్కువ వేసుకున్నా అరగంట లో వెళ్లిపోవచ్చు, రాత్రి ఏడున్నరకే కారు బ్రిడ్జ్ మీదకి వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. ఈ మధ్య సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లారనే విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయమై డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  ఇక డ్రైవర్ బసవరాజు సైతం సిద్ధార్థ కనిపించకుండా పోయిన గంటన్నర తరువాతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో సిద్ధార్థ ఫోన్లో మాట్లాడుతూ కాసేపు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించారని, ఆపై ఆయన కనిపించక పోయే సరికి కాసేపు వెతికి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశానని బసవరాజు చెబుతున్నాడు. అంతే కాకా కారులో ప్రయణిస్తున్నప్పుడే సిద్ధార్థ పదిపదిహేను ఫోన్లు చేశారని చెబుతుండగా ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారన్న విషయం విచారణలో కీలకం కానుంది.  అయితే మరో అనుమానాస్పద విషయం ఏంటంటే ? నదిలో దొరికిన ఆయన డేడ్ బాడీకి ఫ్యాంటు, బూట్లు, చేతి ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. ఆయన వేసుకున్న షర్ట్ లేదు. అంతే కాక ఆయన జేబులో ఉన్న వాలెట్, ఐడేంటీ కార్డులు అలానే ఉన్నా ఫోన్ మాత్రం మిస్సయ్యింది. ఆయన షర్ట్ తీసి దూకారు అనుకుంటే ఆ షర్ట్ బ్రిడ్జ్ మీద దొరికి ఉండాలి, లేదా షర్ట్ ని ఏవైనా జలచారాలు తినేశాయా అనడానికి లేదు, ఎందుకంటే అవి ఏమైనా చేసి ఉంటె ఆయన బాడీకి కూడా గాయాలు అయ్యుండాలి.  కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయం నుండి 36 గంటలు గడిచినా, మృతదేహం పాడు కాలేదు, నిజానికి అంత సేపు నీళ్ళలో ఉండి ఉంటె బాడీ దెబ్బ తింటుంది, జలచరాలు బాడీని పీక్కు తినే అవకాశం కూడా ఉంది. కానీ ఆయన బాడీ చెక్కు చెదర లేదు. పైగా ముక్కు నుంచి రక్తం కారుతున్న గుర్తులు తాజాగానే ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  అంటే ఆయనను ఎవరైనా దేని కోసం అయినా తీవ్రంగా కొట్టారా ? ఆయన చనిపోయాక నదిలో పదేసారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాసిన లేఖకి ఆయన బాడీ దొరకడానికి ఆత్మహత్య అని సర్దిచెప్పుకున్నా ఇప్పుడు ఈ విషయాలు అన్నీ పోలీసులకు కొత్త అనుమానాలు వచ్చేలా చేస్తోంది. అంతేకాక కార్పొరేట్ వర్గాల ప్రముఖులు కూడా సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు.  మరో వాదన ప్రకారం వీజీ సిద్ధార్థకు కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఐటీ విభాగం ఆయన మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టిందట. సిద్ధార్థ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణకు అల్లుడు కాగా, కృష్ణకు, సిద్దార్దకి శివకుమార్‌ అత్యంత సన్నిహితుడు. కృష్ణ బీజేపీలో చేరినా వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. సిద్ధార్థతో కుటుంబ, ఆర్థిక లావాదేవీలు వ్యాపార్లు కూడా ఉన్నాయి.  2017 ఆగస్టులో ఎన్నికలకి ముందు శివకుమార్‌ ఆస్తుల మీద ఐటీ దాడులు చేసినప్పుడు సిద్ధార్థతో ఆయనకున్న ఆర్థిక లావాదేవీలు బయటపడినట్లు సమాచారం. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోకుంటే ? మరి ఆయన ఎలా చనిపోయారు ? 36 గంటల పాటు ఆయన మృతదేహం ఎందుకు చెక్కు చెదర లేదు. ఆయనను ఎవరైనా హత్య చేశారా ? అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.  అయితే ఈ ఘటన జరిగి రెండ్రోజులు కూడా కాక మునుపే మంగళూరుకి చెందిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆయన పోస్టుమార్టం వస్తే ఏమైనా ఆధారాలు లభించే అవకాశం ఉంది, కానీ ఇద్దరు ఉన్నతాధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం సంచలనంగా మారింది.

‘కాఫీ కింగ్‌’ సిద్ధార్థ.. విజయ విషాద గాధ

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కేఫ్‌ కాఫీ డే’ వ్యవస్థాపకుడు ఆయన. కాఫీ సాగు కుటుంబంలో పుట్టి ‘కాఫీ కింగ్‌’ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామా.. కానీ నేడు ఓ విఫల వ్యాపారినంటూ లేఖ రాసి.. లోకాన్ని వీడారు. వి.జి. సిద్ధార్థ విజయ గాధ విషాద గాధగా ఎలా మారిపోయింది?. కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ సాగు కుటుంబంలో పుట్టారు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోక జ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఆటల మీదున్న శ్రద్ధ సిద్ధార్థకు చదువు మీద ఉండేది కాదు. అతడి ప్రవర్తనను భరించలేని టీచర్‌ "ఒరే, నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతోంది. చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిది" అంటూ కంటతడి పెట్టింది. టీచర్‌ కన్నీళ్లు చూశాక కళ్లు తెరిచాడు సిద్ధార్థ. అప్పటి నుండి చదువుపై శ్రద్ద పెట్టాడు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు అభిమానం, గౌరవం. తాను కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలి అనుకునేవాడు. అందుకే.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాశారు. కానీ ఉత్తీర్ణుడు కాలేదు. దీంతో చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు.  ఒక రోజు స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం ముంబై వెళ్లాలనుకుంటున్నా అంటూ తల్లిదండ్రులతో చెప్పారు. అయితే కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపారు. చిక్‌మగళూర్‌ నుంచి ముంబై చేరుకున్న సిద్ధార్థ్‌.. మహేష్‌ కంపానీని కలిసి "సార్‌, మీ గురించి చాలా. విన్నాను. నేను ఎకనామిక్స్‌ పట్టభద్రుణ్ణి. చేస్తే గీస్తే మీ దగ్గరే శిష్యరికం చేయాలి. లేదంటే మా ఊరెళ్లి, నాకిష్టం లేకపోయినా కాఫీ తోటలు సాగు చేయక తప్పదు. ఒక్క అవకాశం ఇవ్వండి"  అంటూ వినయంగా వేడుకున్నారు. సిద్ధార్థ అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఓకే అన్నారు మహేష్‌ కంపాని. ముంబై స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్‌, జేఎం క్యాపిటల్‌ అధినేత అయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధార్థ ఆలోచన. అలా ఆయన దగ్గర స్టాక్‌మార్కెట్‌లో పాఠాలు, ట్రేడింగ్‌ మెలకువలు ఆపోసన పట్టారు. స్టాక్‌ మార్కెట్‌ గురించి కొంత అవగాహన వచ్చాక తిరిగి సొంతూరు చేరుకున్నారు సిద్ధార్థ్‌. తాను బెంగళూరులో స్టాక్‌ బ్రోకర్‌ బిజినెస్‌ చేద్దామనుకుంటున్నానని, డబ్బు కావాలని తల్లిదండ్రులను అడిగారు సిద్ధార్థ. తల్లిదండ్రులు ఆయన తపనను గమనించి ఏడున్నర లక్షలు చేతికిచ్చారు. ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే, తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకోవాలని ఓ షరతు కూడా విధించారు. ఆ డబ్బుతో శివన్‌ సెక్యూరిటీస్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని ప్రారంభించారు. బొంబాయిలో సంపాదించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది. వచ్చిన లాభాలతో చిక్‌మగళూరులో కాఫీ తోటలు కొనేవారు. 1985 నుంచి 1993 వరకు సుమారు మూడువేల ఎకరాల కాఫీ తోటల్ని కొనడం సిద్ధార్థ సాధించిన పెద్ద విజయం. సిద్ధార్థ కుటుంబానికి వేల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే రిటైల్‌ మార్కెట్లోకి ఎందుకు రాకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అమాల్గమేటెడ్‌ బీన్‌ కాఫీ ట్రేడింగ్‌ కంపెనీ. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ.. కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రెండేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఈ కంపెనీ ఎదిగింది. ఒకసారి ఏదో పని మీద సింగపూర్‌ వెళ్లాడు సిద్ధార్థ. అక్కడ ఇంటర్‌నెట్‌ బీర్‌ కెఫే కనిపించింది. అందులో యువతీ యువకులు ఒక చేత్తో బీరు తాగుతూ.. మరో చేత్తో కంప్యూటర్‌ బ్రౌజ్‌ చేస్తున్నారు. సిద్దార్థకు ఆ అవుట్‌లెట్‌ చాలా కొత్తగా అనిపించింది. మన దేశంలో బీరుకు బదులు కాఫీ కెఫేలు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.    1996లో బెంగళూరులోని అత్యంత రద్దీ అయిన బ్రిగేడ్‌ రోడ్‌లో ‘కేఫ్‌ కాఫీ డే’ పేరుతో తొలి రిటైల్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు సిద్ధార్థ. అప్పట్లోనే ఇక్కడ ఒక కాఫీ, గంట ఇంటర్నెట్‌కు రూ.100 ఛార్జ్‌ చేసేవారు. ఈ అవుట్‌లెట్‌ విశేషాదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000 కెఫేలు ఉన్నాయి. విదేశాల్లోనూ కాఫీడే శాఖలు ఉన్నాయి. అలా తక్కువ కాలంలోనే కాఫీ డేకు మంచి గుర్తింపు లభించింది. కాఫీ కింగ్‌గా సిద్ధార్థ్‌ పేరు మార్మోగింది. కాఫీడేతో పాటు హాస్పిటాలిటీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే సిద్ధార్థ ప్రముఖ ఐటీ సంస్థ మైండ్‌ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్‌ట్రీలో వాటాలను రూ.3వేల కోట్లకు అమ్మేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇలా కెరీర్‌ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్ధార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. కాఫీ డే షాపులు, ఎస్టేట్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 650కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు కేఫ్‌ కాఫీ డే గత కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. అలా సక్సెస్‌కు చిరునామాగా మారిన.. ‘కేఫ్‌ కాఫీడే’ యజమాని వి.జి సిద్ధార్థ ఒత్తిడిని జయించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సిద్థార్థ రాసిన లేఖలో ఆదాయ పన్ను విభాగం మాజీ డీజీ వేధింపులు, ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయాలని చేస్తున్న ఒత్తిడిని ప్రస్తావించారు. అయితే ఎందరో వ్యాపారం పేరుతో వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, అధికార పార్టీలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్న ఈరోజుల్లో.. సిద్ధార్థ మాత్రం.. తనకు పిల్లనిచ్చిన మామ మాజీ సీఎం అయినా, ఆయన ప్రస్తుతం అధికార బీజేపీలో ఉన్నా.. తప్పించుకునే ప్రయత్నం చేయకుండా, చివరికి ఒత్తిడిని భరించలేక తనువు చాలించారు. ఇది సిద్ధార్థ విజయ విషాద గాధ.

పుల్వామాలో జవాన్లు మరణిస్తే...షూటింగ్ లో మోడీ...ఇదే అసలు విషయం !

  ''పుల్వామా దాడి జరిగినరోజు జవాన్ల మృతి గురించి తెలిసి దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కానీ ప్రధాని మోదీ మాత్రం జిమ్ కార్బెట్ పార్క్‌లో సాయంత్రం దాకా ఓ షూటింగ్‌లో బిజీగా గడిపారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా..? నిజంగా ఆయన గురించి ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు'' అని పుల్వామా దాడి జరిగిన వారం రోజుల తర్వాత ప్రధాని మోడీని ఉద్దేశించి రణదీప్ సూర్జేవాలా అనే కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ ఇవి.  ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన రోజున ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించిన ఆయన తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిబింబించే ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారని, డిస్కవరీ సంస్థ చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ వచ్చే నెలలో టెలికాస్ట్ కానుందని అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది.  ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతున్న రోజు మధ్యాహ్నామే కశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు జవాన్లపై దాడి జరుగుతుంటే మరోవైపు మోదీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారంటూ విపక్షాలు ఆయన్ను టార్గెట్ చేశాయి.  దీంతో స్వీయ రక్షణలో పడిన మోడీ సర్కార్ సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో తమకు మద్దతు ఇచ్చే టెలివిజన్‌ ఛానల్‌ చేత ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేయించింది.  ‘పుల్వామా దాడి గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సకాలంలో సమాచారాన్ని అందించలేక పోయారు.  ఆ తర్వాత ఈ విషయన్ని తెలుసుకున్న ప్రధాని మోదీ, దోవల్‌ను మందలించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రధానికి దోవల్‌ సమాచారాన్ని అందించలేకపోయారని ఆ కధనాల సారాంశం.  అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే,  అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించినట్టే మోడీ పాల్గొంది డాక్యుమెంటరీలో కాదు. అది అదో రకమైన షో. దాని పేరు “మ్యాన్ వర్సెస్ వైల్డ్”. అడవిలో తప్పిపోతే ఎలా బతకాలి, ఏమేం తినొచ్చు, ఏమేం చేయాలి ? అనే కాన్సెప్ట్‌తో ఈ షో రూపొందుతోంది. దీన్ని డిస్కవరీ చానల్ ఆగస్టు 12వ తేదీన ప్రసారం చేయబోతోంది.  మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోను బేర్ గ్రిల్స్ అనే స్టార్ హోస్ట్ నిర్వహిస్తూంటారు. చాలాకాలం అడవులు, పర్వతాల్లో గడిపానని.. తన జీవితంపై వాటి ప్రభావం చాలా ఉందని మోడీ అప్పుడప్పుడూ చెబుతూంటారు. ఇప్పుడు ఈ షోలో ఆ అనుభవాన్ని ఉపయోగించుకున్నారన్న మాట. బేర్ గ్రిల్స్ చాలా మంది దేశాధ్యక్షులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఒబామాతోనూ ఒక ఎసిసోడ్‌ చేశారు.  నిజానికి ఇది నెలలోనే రిలీజ్ చేయాలని అనుకుని ఉండచ్చు, ఎన్నికల్లో మోడీకి ఉపయోగాపడుతుందని భావించి ఉండచ్చు, కానీ పుల్వామా ఎతాక్స్ వలన ఆ సమయంలో మోడీ స్పందించక పోవడం అనే అంశం ఎక్కువ ఫోకస్ అవుతుందని భావించి దానిని ఆపేసి ఉండచ్చు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండచ్చని విశ్లేషకులు అంటున్నారు.   

ట్రాఫిక్ సీఐను తోసి, కాలితో తన్నిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు !

  జగ్గయ్య పేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కుమారుడు సామినేని ప్రసాద్ మాదాపూర్‌లో వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌ రెడ్డి మీద దురుసుగా ప్రవర్తించడమే కాక కాలితో తన్ని దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో ప్రసాద్‌ ని పోలీసులు దుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ కృష్ణ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలో హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలను ఉల్లంఘించి ముందుకు వెళుతుండగా కృష్ణ అడ్డుకుని వారించాడు. ఆ వాహనంలో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు సామినేని ప్రసాద్ బయటకు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే కానిస్టేబుల్ ఏమన్నాడో తెలియదు కానీ నన్ను నువ్వు అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్‌ను నోటికొచ్చినట్టు తిట్టాడు.  ఇంతలో ఈ వ్యవహారాన్ని గమనించి ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేశాడు. అయినా సరే వినిపించుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా సామినేని ప్రసాద్‌ను సీఐ రాజగోపాల్ కోరారు. దీంతో పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు నన్నే సేష్టన్‌కు రమ్మంటావా అంటూ ట్రాఫిక్ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్ని మరీ తిట్లపురాణం అందుకున్నాడు.  దీంతో ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడి చేరుకొని అతడిని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా జగ్గయ్య పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీ చేసి గెలిచారు. అయితే రిజల్ట్స్ కూడా రాక ముందే ఎండా కాలంలో మినరల్ వాటర్ పంపిణీని చేసేందుకు చలివేంద్రాల్లాంటివి ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పెట్టుకున్న ఫ్లెక్సీల్లో ఇచ్చుకున్న హోదా కాబోయే మంత్రివర్యులు సామినేని ఉదయభాను అని. అయితే సమీకారణాల దృష్ట్యా ఆయనకు పదవి దక్కలేదనుకోండి అది వేరే విషయం.  

జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయం....అభివృద్ధికి చెంప పెట్టు ?

  భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా నిన్న ఏపీ అసెంబ్లీ అన్ని ప్రైవేట్ సంస్థలలోని స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పారిశ్రామిక యూనిట్లు, కర్మాగారాలు, జాయింట్ వెంచర్లు మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో ఉన్న ప్రాజెక్టులలోని అన్ని ప్రైవేట్ సంస్థలలో అవసరం ఉన్న ఉద్యోగులలో 75% ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలి.  స్థానికంగా అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేకపోతే మూడేళ్ల లోపు స్థానికులకి అవసరమైన శిక్షణ ఇప్పించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏర్పాటైన అన్ని పరిశ్రమలు/కర్మాగారాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే సంయుక్త ప్రాజెక్టులతోపాటు ఇకపై రాబోయే వాటికీ ఈ చట్టం వర్తిస్తుందట. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలైతే చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలట.  అలాగే స్థానికుల్లో అర్హులైన వారు లేకపోతే సంబంధిత పరిశ్రమలు చట్టానికి అనుగుణంగా మినహాయింపులు కోరుతూ దరఖాస్తు చేయాలి. అనంతరం ప్రభుత్వం దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. నిజానికి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ల డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌  ప్రత్యేకమైనది కాదు. అయినా ముందుకు ముందే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏపీలో ఉన్న ప్రైవేట్ సంస్థల గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది.  ఇప్పటికే గతంలో కేటాయించిన కాంట్రాక్టుల రద్దు, ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాల విషయంలో పునరుద్ధరణ సహా అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న జగన్ సున్నితమైన ఈ అంశాన్ని ఇంత అనాలోచితంగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి మన రాష్ట్రంలోనే కాదు గతంలో కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్ లు వచ్చాయి, పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగాయి.  అయినా ఆ రాష్ట్రాలు అభివృద్ధికే పెద్ద పీట వేసి వెనక్కి తగ్గితే ఏపీ సిఎం జగన్ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం ఎందుకంటే మీకు పని వస్తే ఉద్యోగం ఇస్తామని కంపెనీలు అంటే మీరు ఉద్యోగమిస్తే పని నేర్చుకుంటామనే జోక్స్ చాలా వినే ఉంటాం, ఇది కూడా ఆ కోవకు చెందినదే. నిజానికి ఒక కంపెనీలో 75 శాతం ఉద్యోగం ఇవ్వాలనే రూల్ పెట్టారనుకుందాం,  అది కూడా కియానే ఉదాహరణగా తీసుకుండాం. ఇక్కడ కార్ల తయారీ స్థానికులకి అప్పచెప్పాలేము కదా, వారి సంస్థలలోని ఉద్యోగులనే తెచ్చి ఇక్కడ పెట్టుకుంది ఆ కంపెనీ, స్థానికులకి ఉద్యోగాలు అంటే సెక్యూరిటీ గానో, హౌస్ కీపింగ్ కో వాడతారు, దాని వలన ఉపయోగం ఏముంటుంది. కియాలో ఉద్యోగం రావాలంటే ఇప్పటిదాకా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేయాలని అనుకునేవారు. కానీ జగన్ స్థానిక నిర్ణయం వలన వేరే ఇంజినీరింగ్ చదివిన వారికి ఆ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేదు కదా !. ఈ చట్టం వలన కొత్త కంపెనీల సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా వెనక్కి పోయే అవకాశం ఉంది. ఎవరెన్ని మాట్లాడినా ఇది అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయమనే భావిస్తున్నామని అంటున్నారు విశ్లేషకులు.