నోట్ల రద్దు... భయపెట్టినంత భయంకరమైంది కాదా
posted on Mar 1, 2017 @ 11:08AM
నవంబర్ , డిసెంబర్ నెలల్లోదేశాన్ని కుదిపేసిన న్యూస్ ఏదైనా వుందంటే... అది డీమానిటైజేషనే! ప్రధాని మోదీ అమాంతం వెయ్యి, అయిదు వందల నోట్లు రద్దు చేయటంతో కలకలం రేగింది. నవంబర్ 8న మొదలైన చిల్లర కష్టాలు డిసెంబర్ 30దాకా కొనసాగాయి. జనవరిలో కాస్త చల్లబడ్డాయి. ఫిబ్రవరీలో అయితే ఇంచుమించూ లేవనే చెప్పాలి. కాని, ఒకవైపు మీడియా, మరో వైపు మేధావులు, ఇంకో రాహుల్, కేజ్రీవాల్, మమత లాంటి రాజకీయ నాయకులు నానా హంగామా చేసేశారు. నోట్ల రద్దు ఆర్దిక ప్రళయం అంటూ, మనం కొట్టుకుపోతాం అంటూ జనాల్ని బెంబేలెత్తించారు. అయినా కూడా ఎందుకోగాని మోదీ మీద రావాల్సినంత అసహనం రాలేదు. జనం అక్కడక్కడా, అడపాదడపా తిట్టుకున్నా తిరుగుబాటు మాత్రం రాలేదు. రేపో, మాపో యూపీ ఎన్నికల్లో కమలం బాగా వికసిస్తే సామాన్య జనం డీమానిటైజేషన్ కు ఒక విధంగా మద్దతు తెలిపారని కూడా భావించవచ్చు!
నోట్ల రద్దుతో మోదీ చేసిన భారీ ప్రయోగం కోట్లాది మందిని రోడ్లపైకి తెచ్చింది. సదుద్దేశంతోనో, దురుద్ధేశంతో మన్మోహన్ మొదలు మమత వరకూ అందరూ తిట్టిపోశారు. కాని, తాజాగా విడుదలైన ఆర్దిక గణాంకాలు మాత్రం మరో రకం సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి! నోట్ల రద్దు వల్ల లాభం జరిగినా, జరక్కపోయినా నష్టం అవ్వలేదని తెలుపుతున్నాయి. ఎట్ లీస్ట్, ప్రచార మాధ్యమాల్లో రాత్రి, పగలు ఉదరగొట్టినంత ఉపద్రవం ఏ విధంగానూ సంభవించలేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన తాజా అధికారిక జీడీపీ రేటే!
జీడీపీ... అంటే, స్థూలదేశీయోత్పత్తి... ప్రతీ సంవత్సరానికిగానూ నాలుగు భాగాలుగా లెక్కకడతారు. అలా 2016-17 సంవత్సరానికిగానూ మూడో త్రైమాసికంలో మన దేశం ఏడు శాతం వృద్ధి సాధించింది. ఇంత వేగంగా ఆర్దిక అభివృద్ధి సాధిస్తోన్న దేశం మరొకటి లేదు ప్రపంచంలో. చైనాతో సహా అన్ని దేశాలు మనకంటే వెనుకబడే వున్నాయి. అయితే, నవంబర్లో నోట్ల రద్దు వ్యవహారంతో ఈ వృద్ధి రేటు సాధ్యం కాదని ఆర్దిక పండితులు జ్యతిష్యాలు చెప్పారు. ఆరు శాతమే కష్టమని బెదిరించారు. కాని, మోదీ సాహసాన్ని దుస్సాహసం కాకుండా భారతదేశ సామాన్య జనం అండగా నిలబడ్డట్టే కనిపిస్తోంది. వ్యవసాయం, ఉత్పత్తి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాల్లో జరిగిన లావాదేవీల వల్లే ఏడు శాతం వృద్ధి రేటు భారత్ సాధించగలిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు!
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం అరికట్టడం, ఉగ్రవాదానికి చెక్ పెట్టడం, ఎన్జీవోల ఆటలు కట్టడి చేయటం ఇలాంటి బోలెడు లాభాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటి వరకూ అలాంటి విషయాల్లో పెద్దగా లబ్ది చేకూరినట్టు కనిపించటం లేదు. కాని, బ్యాంకుల్లో భారీగా డబ్బు జమైంది. పారదర్శకమైన ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. వీటన్నటికంటే ముఖ్యంగా గత త్రైమాసికంలో ఇండియా జీడీపీ ఏడు శాతం వృద్ధితో బలంగా నిలబడి... మన ఆర్దిక వ్యవస్థ పటుత్వాన్ని నిరూపించింది. ప్రధాని వ్యతిరేక వర్గం భయపెట్టినంత విషాదం చోటు చేసుకోలేదనే చెప్పాలి! మరి ఇప్పటికైతే ఆర్దికంగా డీమానిటైజేషన్ దుష్పలితాల నుంచి బయటపడ్డాం. రాజకీయంగా మోదీ నోట్ల రద్దు ఫలితం ఎలా అనుభవించనున్నారో... చూడాలి!