డిశంబరులోగా ఆంధ్రాలో పంట రుణాల మాఫీ?
posted on Sep 26, 2014 8:47AM
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కొంచెం మెరుగుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ తో పోలిస్తే ఆ రాష్ట్రానికి వ్యవసాయ రుణభారం కూడా చాలా తక్కువే. అందువలన అధికార తెరాస పార్టీ తను ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారం చెప్పట్టగానే మొత్తం రుణాలను తక్షణమే మాఫీ చేస్తుందని ఆశించడం సహజమే. కానీ ఇంతవరకు రుణాల మాఫీ జరగలేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో దాదాపు రూ.10, 000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసేందుకు సిద్దం అవుతుంటే, తెలంగాణా ప్రభుత్వం మాత్రం మొదటి దశలో కేవలం రూ. 4, 250 కోట్లు మాత్రమే మాఫీ చేసేందుకు జీ.ఓ. జారీ చేయడం, దానిని అమలు చేయడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంతే కాదు. ఈ అంశంపై బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ‘తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలా రుణమాఫీకి ఎటువంటి షరతులు మెలికలు పెట్టలేదని’ చెప్పడం కూడా చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. తెలంగాణా ప్రభుత్వం కూడా రుణమాఫీ వ్యవహారం అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేసింది. తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తామని, ఇప్పటికే రుణాలు చెల్లించిన వారికి కూడా మాఫీ చేస్తామని, డ్వాక్రా, బంగారు రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇస్తుంటే, ఆంద్రప్రదేశ్ తో పోలిస్తే అన్ని విధాల మంచి స్థితిలో ఉన్న తెలంగాణా ప్రభుత్వం మాత్రం కేవలం లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు వస్తువులపై తీసుకొన్న రుణాలను మాఫీ చేయబోమని ఖరాఖండిగా చెపుతోంది. పైగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వానికే చాల చిత్తశుద్ధి ఉన్నట్లు చెప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
తెలంగాణా ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన జీ.ఓ.ప్రకారం ఈరోజు అంటే సెప్టెంబర్ 26న రూ. 4, 250 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియే పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్ల ఈ మొదటిదశ రుణమాఫీ ఎప్పటి నుండి మొదలుపెడుతుందో ఇంకా తెలియదు. కానీ ఈ విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుండి కూడా చాలా ఖచ్చితమయిన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల నడుమ కూడా ఈ మూడు నెలల కాలంలో వివిధ ఆదాయ మార్గాల ద్వారా రూ.10, 000 కోట్లు పొదుపు చేసి, దానిని వచ్చే నెల మొదటి వారంలో మొదటి విడత రుణమాఫీకి వినియోగించేందుకు పక్కనపెట్టింది. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాక మిగిలిన పంట రుణాలను కూడా ఈ ఏడాది డిశంబరు లోగానే మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అందుకోసం నిధులు సమీకరించేందుకు ఆయన సుజనా చౌదరి నేతృత్వంలో ఇప్పటికే ఒక కమిటీని వేసారు. ఆ కమిటీ కూడా వివిధ ఆదాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. అవసరమయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తాత్కాలిక కార్పోరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదో విధంగా పంట రుణలను మొత్తం మాఫీ చేయాలని భావిస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. డిశంబరులోగా మొత్తం రుణాల మాఫీ సాధ్యమా కాదా అనే విషయాన్ని పక్కనబెడితే, ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
అందువల్ల ఈ వ్యవహారంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖించడానికి ఏమీ లేదనే చెప్పవచ్చును. ఒకవేళ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుగా రుణాలను మాఫీ చేసినట్లయితే, అప్పుడు తెలంగాణా ప్రభుత్వంపైనే మరింత ఒత్తిడి పెరగడం తధ్యం. కనుక సున్నితమయిన ఈ అంశంపై ఒకరినొకరు విమర్శించుకొనే బదులు, రైతులకిచ్చిన తమ హామీని ఏవిధంగా నిలబెట్టుకోవాలనే విషయం గురించి ఆలోచిస్తే మంచిది.