మరీ అంత ‘ఫాస్ట్’ పనికిరాదు స్మీ!
posted on Sep 23, 2014 7:25AM
తెలంగాణాలో మొదటిసారిగా అధికారం చేప్పట్టిన తెరాస తన తీరు, జోరు ఇంకా వదులుకోలేక అదే దూకుడు ప్రదర్శిస్తూ తరచూ బోర్లాపడుతోంది. పాలనలో ఆ దూకుడు ఉండాలి కానీ దానికీ ఒక లెక్క ఉండాలి. ఉద్యమం నడిపినట్లే ప్రభుత్వం కూడా నడుపుదామని ప్రయత్నిస్తే కోర్టుల చేత మొట్టికాయలు తప్పవని నిన్న మరోమారు రుజువయింది.
విద్యార్ధుల ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో అందరూ ఎంత వారించినా, విమర్శించినా తెలంగాణా ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్ళి ఫాస్ట్’ జీ.ఒ. జారీ చేసింది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు విద్యార్ధులందు తెలంగాణా విద్యార్ధులు వేరయా అంటూ తమ ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్థులకే ఫీజు రీఇంబర్స్ మెంటు చేస్తుందని ప్రకటించింది. అందుకోసం 1956సం. ఆధారంగా స్థానికతను నిర్దారించింది.
ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే దానికి తెరాస నేతలు తమ మాటకారితనంతో చక్కగా సమాధానం చెప్పారు. విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవద్దని అందరూ చెప్పిన హితవును పెడచెవిన పెట్టారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొందామని, రాష్ట్ర విభజన సందర్భంగా అన్నిటినీ 52:48నిష్పత్తిలో ఏవిధంగా పంచుకోన్నామో అదేవిధంగా దీనిని కూడా భరిద్దామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను అవహేళన చేసారు.
తీరాచేసి తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో జారీ చేసిన ‘ఫాస్ట్’ జీ.ఒ. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, తెలంగాణా భారతదేశంలో అంతర్భాగమని గుర్తుంచుకోమని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి గట్టిగా మొట్టి కాయలు వేసింది. ఇటువంటి జీ.ఒ.లు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కావని దానిని పునః పరిశీలించుకోమని హైకోర్టు నిష్కర్షగా తేల్చి చెప్పింది. బహుశః అధికార తెరాస నేతలు కోర్టు తీర్పు ఇంకా తమ చేతికి అందలేదని, ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామంటూ పడికట్టు పదాలతో స్టాండర్డ్ సమాధానం చెప్పవచ్చును. కానీ కనీసం ఇప్పుడయినా ఉద్యమాన్ని నడపడానికీ, ప్రభుత్వం నడపడానికీ చాలా తేడా ఉందని గ్రహించి తన దూకుడు తగ్గించుకొంటే ఇటువంటి అవమానకర పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించుకోవచ్చును.
తప్పులు చేయడం తప్పు కాదు. కానీ అవి తప్పులని అందరూ చెపుతున్నప్పటికీ వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు. నేటికీ తెలంగాణాలో రెండు మీడియా చానళ్ళపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో కూడా అందరూ తెలంగాణా ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నప్పటికీ, జరిగిన తప్పును సరిదిద్దుకోకపోగా దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై దేశంలో యావత్ మీడియా ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పు పడుతోంది.
ప్రభుత్వం అంటే దానిని నడుపుతున్న వ్యక్తి ఏకచక్రాధిపత్యం వహించవచ్చనే అపోహా చాలా రాజకీయ పార్టీలకుంది. కానీ అలా కుదరదని కోర్టులు తేల్చి చెపుతున్నాయి. ఎన్నికలలో ప్రజలు కూడా రుజువు చేసి చూపుతున్నారు. అయినప్పటికీ జ్ఞానోదయం కలుగకపోతే ఈవిధమయిన భంగపాటు తప్పదు.