భారత్-అమెరికా సంబంధాలను పునర్నిర్వచించనున్న మోడీ పర్యటన
posted on Sep 25, 2014 8:48AM
రేపటి నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. నిరుటి సం.వరకు మోడీకి వీసా నిరాకరిస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వమే ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరిచి ఆయన రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దేశ భవిష్యత్ అవసరాలను, ప్రపంచ దేశాలతో బలమయిన సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని పాత విషయాలను పక్కనబెట్టి మోడీ అమెరికా పయనమయ్యారు.
భారతదేశాన్ని అభివృద్ధి పధంలోకి వేగంగా పరుగులు తీయించాలని మోడీ ఆత్రుతను అమెరికా ప్రభుత్వం అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యంగా దేశంలో వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు చట్ట సవరణలు చేయడం, బులెట్ రైళ్ళు, దేశంలో కొత్తగా ఆధినిక రైల్వే లైన్ల నిర్మాణం, దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీల నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, యువతకు శాస్త్ర, సాంకేతిక నైపుణ్యం మెరుగుదల వంటి ఆయన ఆలోచనలు అమెరికా ప్రభుత్వానికి, అక్కడి పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను, ఉన్నత విద్యా సంస్థలను భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రేరేపించేవిగా ఉన్నాయి. మోడీ తన ఈ అమెరికా పర్యటనలో ‘ఫార్ట్యూన్-500’ కంపెనీల సి.ఈ.ఓ.లతో సమావేశం కాబోతుండటం ఈ అంచనాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. గుజరాత్ కు చెందిన తనలో వ్యాపారం సహజంగానే ఇమిడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపినందున ఈ అమెరికా పర్యటనలో ఆయన తన వ్యాపార దక్షతను అంతా కనబరిచి దేశానికి భారీ పెట్టుబడులు సాధించే అవకాశం ఉందని ఆర్ది నిపుణులు భావిస్తున్నారు.
భారత్-అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ అవి ఉండవలసినంత బలంగా, ప్రయోజనకరంగా మాత్రం లేవని అందరూ అంగీకరిస్తారు. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి బలమయిన విదేశీవిధానం లేకపోవడమేనని చెప్పక తప్పదు. కానీ మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తరువాత చైనా, పాకిస్తాన్ దేశాలతో వ్యవహరించిన తీరులో ఇరుగుపొరుగు దేశాలయిన భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో వ్యవహరించిన తీరులో గల స్పష్టమయిన తేడాను గమనించినట్లయితే మోడీకి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలుసునని స్పష్టమవుతోంది.
ఇంతకాలం అమెరికా గడ్డపై కాలుమోపేందుకు తనకు అనుమతించనప్పటికీ మోడీ దేశ విశాల హితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విషయాన్ని పక్కనబెట్టి అమెరికాకు పయనమయ్యారు. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వంతో ధీటుగానే వ్యవహరిస్తూ ఉభయదేశాల సంబంధాలను పునర్నిర్వచించవచ్చును. భారత్ అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా అమెరికా స్పందించలేకపోయినట్లయితే, చైనా, జపాన్ దేశాలతో జత కట్టడానికి వేనుకంజవేయబోమని మోడీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పకనే చెప్పింది. కనుక అమెరికా కూడా భారత్ తో స్నేహ సంబంధాలు మరింత బలపరుచుకోనేందుకే గట్టిగా కృషి చేయవచ్చును.
ఇంతవరకు భారత్ అంటే దరిద్రం, బీదరికం, లంచగొండితనం వంటి సకల అవలక్షణాలకు పుట్టినిల్లు వంటిదని భావిస్తున్న ప్రపంచ దేశాలు, ఇప్పుడు 125కోట్ల జనాభా గల భారతదేశం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ అని అర్ధం చేసుకోవడంతో భారత్ పట్ల వారి దృష్టి కోణం కూడా మారింది. ఇందుకు అమెరికా కూడా మినహాయింపు కాదు కనుక ఈసారి మోడీ పర్యటనలో భారత్ కు భారీగా పెట్టుబడులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చే అవకాశం ఉందని భావించవచ్చును.