అధికార పార్టీని నిందించడం కోసమే కాంగ్రెస్ సమావేశాలు
posted on Sep 22, 2014 @ 10:54AM
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎందుకు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందో అందరికి తెలుసు. అదేవిధంగా ఆ పార్టీలో లోపాల గురించి కాంగ్రెస్ నేతలకి కూడా చాలా బాగా తెలుసు. అందువలన ఇప్పుడు వారు ఆత్మవిమర్శ చేసుకొని, లోపాలను సవరించుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొంటారని ఎవరయినా భావిస్తారు. కానీ అధికార పార్టీని నిందించడం కోసమే కాంగ్రెస్స్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తునట్లు కనబడుతోంది. రఘువీరా రెడ్డి పేరుకి పీసీసీ అధ్యక్షుడయినప్పటికీ పార్టీలో సీనియర్ల ముందు జూనియర్ లాగ కనబడుతుండటంతో పార్టీలో ఆయన మాట వినేవారెవరూ లేకపోవడంతో ఆయన తనకు తోచినట్లుగా పార్టీకి శల్యసారధ్యం చేసుకు పోతున్నారు. అందుకే పార్టీకి దిశా నిర్దేశం చేయలేక అధికార తెదేపాను నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
అంతటితో ఆగితే పరవాలేదు. కానీ ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికల ఫలితాలను ఆయన ప్రతీ సభలో ప్రధానంగా ప్రస్తావిస్తు పార్టీ ఓడిపోయినప్పటికీ తమ ఓటింగ్ శాతం పెరిగిందని జబ్బలు చరుచుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఉపఎన్నికలలో వైకాపా పాల్గొనకపోవడం వల్ల దానికి పడవలసిన తమ ఖాతాలో పడ్డాయనే సంగతిని దాచిపెట్టి, అది తెదేపా పరిపాలన పట్ల ప్రజలలో పెరిగిన వ్యతిరేఖతకు నిదర్శనమంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం వలన నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే.
పార్టీకి రాష్ట్రంలో విస్త్రుతమయిన క్యాడర్ ఉంది, బలమయిన నాయకులు ఉన్నారు. వారందరినీ ఒక్క త్రాటిపైకి తేగలిగితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ కోలుకొనే అవకాశాలున్నాయి. కానీ ఆ పనిచేయగల సమర్దుడయిన నాయకుడే పార్టీకి లేడు.
ఇక తెలంగాణా రాష్ట్రంలో ఇంతకంటే భిన్నమయిన పరిస్థితి లేదు. అక్కడా కాంగ్రెస్ నేతల ఎంతసేపు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఏవిధంగా కుర్చీలోనుండి దింపేసి అందులో తాము కూర్చోవాలా ఆలోచనలు చేస్తున్నారు తప్ప నానాటికి బలహీనపడుతున్న తమ పార్టీని పట్టించుకొనే పరిస్థితిలో లేరు. తత్ఫలితంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేసిన మెదక్ ఉపఎన్నికలలో ఓడిపోవలసి వచ్చింది. ఈ విధంగా అటు కేంద్రంలో, ఇటు రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయమయిన స్థితిలో ఉందిప్పుడు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా తన రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసే స్థితిలో లేదు. ప్రధానమంత్రి అయిపోదామనుకొన్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఓడిపోయిన తరువాత పార్లమెంటరీ నాయకత్వ బాధ్యతలు కూడా స్వీకరించడానికి వెనుకంజ వేసారు. ఇటీవల దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడారు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ మంచి ఫలితాలు రాబట్టడం గమనార్హం. ఆ ఫలితాలను కూడా ప్రజలలో మోడీ పాలన పట్ల పెరుతున్న వ్యతిరేఖతకు నిదర్శనమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించేసి చేతులు దులుపుకొంది. అదే నిజమయితే వచ్చే నెల 15న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలయిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి తన అధికారం నిలబెట్టుకోవలసి ఉంటుంది. లేకుంటే కాంగ్రెస్ పతనాన్ని ఎవరూ కూడా ఆపలేరని స్పష్టమవుతుంది.మరి ఇప్పటికయినా కాంగ్రెస్ నేతలు వారి అధిష్టానం మేల్కొంటుందో లేదో చూడాలి.