హరికృష్ణ ఉద్యమకారుడా లేక కేసీఆర్‌కు చుట్టమా.. కొండా సురేఖ ఫైర్
posted on Sep 25, 2018 @ 12:27PM
తెరాస పార్టీ ప్రకటించిన తొలిజాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న కొండా సురేఖ.. తెరాసను, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మందుగోలీలు ఇచ్చే సంతోష్‌ను రాజ్యసభకు పంపారని విమర్శించారు. లష్కర్ బోనాలకు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవితకు అర్హత ఏంటి? అంటూ ప్రశ్నించారు. అలాగే కుమారుడికి పట్టం కట్టేందుకు కేసీఆర్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బార్లకు అనుమతి ఇచ్చారని అన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్ధ ప్రభుత్వం అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, ఉద్యమంలో కోదండరాంను పొగిడినవాళ్లు ఇప్పుడు దూషిస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మశాంతించాలంటే తెరాసను ఓడించాలని అన్నారు. మా కూతురు ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ స్మారకానికి ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేసారు. హరికృష్ణ ఉద్యమకారుడా లేక కేసీఆర్‌కు చుట్టమా లేదా తెలంగాణ పోరాట యోధుడా, అమరవీరుల కుటుంబ సభ్యుడా అని ఆమె ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోయిన కొద్ది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు ఇద్దరూ వెళ్లారని, అంత్యక్రియలు పూర్తయ్యే దాకా కేటీఆర్ అక్కడే ఉన్నారని, 450 గజాల స్థలాన్ని స్మారక స్థూపం కోసం కేటాయించారని.. ఎవడబ్బ సొమ్మని హరికృష్ణకు తెలంగాణ భూమిని ధారాదత్తం చేశారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మీకు టైం దొరకలేదని.. మాజీ సీఎం టి.అంజయ్య భార్య మణెమ్మ చనిపోతే మీకు తీరిక దొరకలేదని.. కొండగట్టులో 60మంది చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసీఆర్‌కు తీరిక దొరకలేదని ఆమె విమర్శించారు.