జగన్‌ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లు, సీసీలు, ఐడీ కార్డులు

  అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న జగన్ పాదయాత్రకు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడటంతో 17 రోజుల విరామం తర్వాత  జగన్‌ పాదయాత్ర ఈరోజు ఉదయం ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ విమానాశ్రయంలో దాడి నేపథ్యంలో జగన్‌ పాదయాత్రకు భారీ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడంచల భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెడ్, గ్రీన్, బ్లూ ఐడీ కార్డులను పోలీసులు జారీ చేశారు. జగన్‌ను కలిసే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. వీఐపీలకు రెడ్ ఐడీ కార్డులు, జగన్‌తో పాటు ప్రజా సంకల్పయాత్రను అనుసరిస్తున్న వారికి బ్లూ ఐడీ కార్డులు, పాదయాత్రలో సిబ్బందికి గ్రీన్ ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. ఇకపై ప్రజలు, కార్యకర్తలు జగన్‌ను కలవాలన్నా, మాట్లాడాలన్నా భద్రతా వలయం బయటినుంచే మాట్లాడాల్సి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. 50 మంది పోలీసులతో రోప్‌ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీల విషయంలోనూ ఆంక్షలు పెట్టనున్నారు. సీఆర్పీఎఫ్‌ పోలీసులు పాదయాత్ర మార్గంలో ముందుగానే తనిఖీలు చేస్తారు. రోడ్‌ క్లియరెన్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో నిఘాకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. వీటితోపాటు బాడీవేర్‌ కెమెరాలను వినియోగించనున్నారు. అదేవిధంగా జగన్ బస చేసే క్యాంపు చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

ఎన్నికల వేళ రెచ్చిపోయిన మావోలు

  ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు జరుగుతున్నది విదితమే.అయితే గతంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోలు హెచ్చరించారు.కానీ తాజాగా తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు.పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు.దంతెవాడ జిల్లాలోని తుమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డుపై ఈ ఉదయం 5.30గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో భద్రతాసిబ్బంది, ఎన్నికల అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని, వారంతా సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.గత రెండు వారాల్లో ఐఈడీ దాడులకు పాల్పడడం వరుసగా ఇది ఏడోసారి. ఈ దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఎన్నికలకు ఒకరోజు ముందు... ఆదివారం కెంకార్ జిల్లాలోని కొయలిబేడలో మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీ బాంబుతో దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ సీఆర్‌పీఎఫ్ జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో మొదటిదశలో బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 8 చోట్ల ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

క్యాన్సర్‌తో మృతి చెందిన కేంద్ర మంత్రి

  కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్‌ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.1959 జులై 22న బెంగళూరులో జన్మించిన ఆయన 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతకుమార్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌,కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు అనంతకుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.అనంతకుమార్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని  పేర్కొన్నారు.

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే.ఇప్పటికే ఎన్నికలు మరియు వాటి ఫలితాలను వెల్లడించే తేదీలను ప్రకటించిన ఎన్నికల శాఖ తాజగా అభ్యర్థుల నామిషన్లను స్వీకరించటానికి సిద్ధమైంది.నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు సాగుతుంది.20న నామినేషన్ల పరిశీలన,22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారానికి గడువు ఉంటుంది. డిసెంబర్‌ 7న జరగనున్న పోలింగ్‌ కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.గత నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటించింది. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలతో సమావేశమై ఎన్నికల నిర్వహణను సమీక్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలు శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ఓటర్ల జాబితాలో తప్పులు, సవరణలపై కసరత్తు వేగవంతం చేశారు.ఈసారి వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఎక్కడకీ వెళ్లలేదు.. బెంగళూరులోనే ఉన్నా: గాలి

  ప్రజలను కోట్ల రూపాయలకు మోసం చేసిన అంబిడెంట్‌ కంపెనీపై ఈడీ కేసులు కొట్టివేయిస్తానని జనార్దన్‌ రెడ్డి రూ. 20 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో గాలి, ఆయన అనుచరులు రహస్య ప్రదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇలా పలుచోట్ల వెతికారు. అయినా లాభం లేదు. అయితే ఎట్టకేలకు గాలి అజ్ఞాతం వీడారు. తాను ఎక్కడకీ వెళ్లలేదని, బెంగళూరులోనే ఉన్నానంటూ న్యాయవాదితో కలిసి మాట్లాడుతున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరిస్తున్నాయని గాలి ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు సహా అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో తనకు కేంద్ర క్రైమ్‌ బ్రాంచీ నుంచి నోటీసులు అందాయని, న్యాయవాదుల సలహా మేరకు సీసీబీ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే బెంగళూరు విడిచి వెళ్లలేదని తెలిపారు. బెంగళూరులో ఉంటూ మీడియా ద్వారా కేసుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఈరోజు గాలి తన లాయర్‌తో కలిసి క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరయ్యారు.

చిన్న వాడివైనా అవకాశం ఇస్తున్నాం.. సద్వినియోగం చేసుకో

  ఏపీ మంత్రివర్గ విస్తరణ రేపు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కిడారి శ్రవణ్‌కు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చిన్న వయస్సు వాడివైనా మంత్రిగా అవకాశం ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ముస్లిం మైనార్టీ నేతలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. వారికి కీలక పదవులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే మంత్రి పదవి ఖరారు కాగా.. శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాను ఖరారు చేశారు. మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఫరూక్‌ శాసనమండలి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు వారికి మంత్రి వర్గంలో చోటుకల్పించే విషయంలో జాప్యం జరగడానికి కారణాలను వివరించారు. మంత్రి పదవులు ఆశించినా రాని ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సమీకరించుకొని వెళ్లాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెడలో తెరాస కండువా..!!

  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోటమిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల ప్రచారంలో వింత అనుభవం ఎదురైంది.నల్గొండ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్న కోమటిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే తాజాగా ప్రచారంలో ఆయనకు వింత అనుభవం ఎదురైంది. మార్కెట్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ ముస్లిం యువకుడు ఆయనను కౌగిలించుకున్నాడు.అంత వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే కోమటిరెడ్డికి ఆ యువకుడు షాక్ ఇచ్చాడు. తన దగ్గరున్న టీఆర్ఎస్ పార్టీ కండువాను కోమటిరెడ్డి మెడలో వేసేందుకు ప్రయత్నించాడు.దీంతో కోమటిరెడ్డి ఆ యువకుడిని వారించే ప్రయత్నంలో కాస్త అసహనానికి గురయ్యారు. నువ్వు ఎవరు? అంటూ మండిపడ్డారు.అనంతరం కోమటిరెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు.కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండే నేతకు ఎలానో గులాబీ కండువా పడే క్షణం తృటిలో తప్పింది.

విజయమ్మ మాట..జగన్ యాత్ర

  విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంతవరకు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. కాగా ఈ ఘటనపై తొలిసారిగా వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ స్పందించనున్నారు.  వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతారని వైస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఈ నేపథ్యంలో విజయమ్మ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.కాగా జగన్ ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఈ నెల 12  నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాదయాత్ర కోసమై ఆదివారం సాయంత్రమే వైఎస్‌ జగన్‌ సాలురుకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సాలూరు నుంచి ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం కానుంది.

మాగంటి హటావో...జూబ్లీహిల్స్ బచావో

  జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్యాణ్ నగర్‌లో పర్యటిస్తున్న మాగంటికి స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి చేసేందేమి లేదంటూ స్థానిక మహిళలు మాగంటిపై దుమ్మెత్తిపోశారు. గతంలో ఇచ్చిన హామీలు, సమస్యలు ఎంతవరకు వచ్చాయని మహిళలు నిలదీశారు.నాలుగేళ్లపాటు ఏం చేశావని  ప్రశ్నించారు. ఓట్ల సమయంలోనే గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు.దీంతో ప్రచారాన్ని మాగంటి గోపినాథ్ అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయాడు. మరోవైపు మాగంటి గోపీనాథ్‌కు జూబ్లీహిల్స్‌ స్థానం కేటాయించడంపై తెరాస నేత, ఉద్యమకారుడు ఇంద్రకుమార్‌ నిరసన వ్యక్తంచేశారు.‘మాగంటి హటావో...జూబ్లీహిల్స్ బచావో’ అంటూ పెట్రోల్ బాటిల్ దగ్గర పెట్టుకుని, తన ఇంట్లో తలుపులు వేసుకుని ఇంద్రసేన నిరసనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్‌ సీసాతో ఇంట్లో స్వీయ నిర్బంధం చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఇంద్రసేనను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మందుబాబులకు షాక్..తెలంగాణలో మద్యం షాపులు బంద్

  తెలంగాణలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.అయితే శాశ్వతంగా కాదు కేవలం నాలుగు రోజులు మాత్రమే.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నది విదితమే.ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయింది.అయితే ఎన్నికల వేళ మందుబాబులకు తిప్పలు తప్పేలా లేవు.ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ నెలలో నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూత పడతున్నాయి.ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు.డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు వెల్లడించే డిసెంబర్ 11వ తేదీన కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు.ఎన్నికలు సజావుగా,ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 

తెలంగాణలో 23 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం: పవన్ కళ్యాణ్

  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉంటూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు జనసేన దూరంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రెండుమూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంతో పోటీపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా అనుకున్నామని.. అలాగే మూడు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా పోటీ చేయాలని భావించామని పేర్కొన్నారు. ముందస్తుకు వెళ్లడంతో తమ పార్టీ పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొందని వివరించారు. అయితే కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని.. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్‌ చెప్పారు. వీటన్నింటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ స్పష్టం చేశారు.

ఇన్నాళ్లు గుర్తుకు రాని వారిపై ఇప్పుడెందుకు ప్రేమ

  గల్ఫ్ దేశాల్లో జీవనం గడుపుతున్న తెలంగాణకు చెందిన వలస కార్మికులతో సమావేశమై గల్ఫ్ మేనిఫెస్టో వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు దుబాయ్ వెళ్లిన సంగతి విదితమే.అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటనపై నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు.నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత..కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి కార్మికులను పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని,ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్ కార్మికుల పట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ప్రశ్నించారు.కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే గల్ఫ్ కార్మికుల కోసం ఖర్చు చేస్తే.. తెరాస నాలుగేళ్ల పాలనలో రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన 1278 కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తీసుకొచ్చామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచి బకాయి సొమ్మును కూడా చెల్లించామని తెలిపారు.

తెరాస అభ్యర్థికి నిరసన సెగ.. గ్రామస్థులపై కార్యకర్తల దాడి

  ప్రచారానికి వెళ్తున్న తెరాస నేతలకు నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ నిరసన సెగలు తెరాసను కళవెరపెడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారంలో చేదు ఘటన చోటుచేసుకుంది. చుండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో ప్రచారానికి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లును గ్రామస్థులు అడ్డుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీంతో తెరాస కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కార్యకర్తలు గ్రామస్థులను చితకబాదారు. ఎమ్మెల్యే మైక్‌లో సర్దిజెబుతున్నా వినకుండా స్థానికులపై దాడి చేసారు. అయితే తాటి వెంకటేశ్వర్లకు ఆయన ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఆయన ఏ గ్రామంలో ప్రచారం చేపట్టినా స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు. పదవిలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ గ్రామాల్లోకి వస్తున్నారంటూ స్థానికులు తిరగబడుతున్నారు. దీంతో పోలీసుల సంరక్షణలో ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లాలో కూడా తెరాసకు చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం కోమట్లగూడెంలో తెరాస ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు భూములు లాక్కుని నిలువనీడ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార రథం ఫ్లెక్సీలను చించేశారు. ప్రచార రథం తిరగకుండా అడ్డుకోవడంతో పాటు నాయకులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గ్రామాల్లోకి నాయకులు ప్రచారానికి వెళ్లాలంటే భయపడేలా ఉన్నారు. చూద్దాం ముందు ముందు నేతలకు ఇంకెలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో.

దద్దరిల్లుతున్న గాంధీ భవన్,ఎన్టీఆర్‌ భవన్‌

  మహాకూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది.కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తే టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.టీడీపీ కి కేటాయిస్తే కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగుతున్నారు.పార్టీల మధ్య ఇంకా స్థానాల విషయంలో ఏకాభిప్రాయం రానేలేదు పైగా అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.అయినప్పటికీ కొందరు నేతలు తొందరపడి చేసే ఈ అల్లర్లు ప్రజల్లోకి కూటమి మీద వ్యతిరేక సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉంది.ప్రస్తుతం గాంధీ భవన్,ఎన్టీఆర్‌ భవన్‌ నిరసనలతో దద్దరిల్లుతున్నాయి.నిన్న మల్కాజ్‌గిరి టికెట్ టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌‌కు ఇవ్వాలంటూ గాంధీభవన్‌ ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగగా, ఈరోజు ఖానాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ధర్నాకు దిగారు. ఖానాపూర్‌ టికెట్‌ రమేష్‌ రాథోడ్‌కు ఇస్తారన్న వార్తలపై వారు ఆందోళన చేపట్టారు. రమేష్‌ రాథోడ్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వీరితో చర్చలు జరిపి నిరసనను విరమింపజేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, గూడూరు నారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట తెదేపా నేతలు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించవద్దని తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ టికెట్‌ను తమకే కేటాయించాలని సామ రంగారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు ఎలా ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. తాము ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకున్నామని.. అలాంటి స్థానాన్ని వేరే పార్టీకి కేటాయిస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ టికెట్‌ను తమకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సామ రంగారెడ్డితోపాటు ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఆర్.క్రిష్ణయ్య ఇక్కడ గెలుపొందారు.కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎల్‌బీనగర్‌ లో ప్రచారం కూడా ప్రారంభించారు.

ఒకరు వైసీపీ..మరొకరు జనసేన

  కాంగ్రెస్,టీడీపీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు దోస్తీ కట్టిన సంగతి తెలిసిందే.అయితే టీడీపీ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెటుకోవటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు.అంతేకాకుండా వైసీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.ఈ నెల 13న బొబ్బిలిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు సి.రామచంద్రయ్య.తొలుత టీడీపీ పార్టీలో పలు పదవులు చేపట్టిన రామచంద్రయ్య..ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు.అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రామచంద్రయ్య కాంగ్రెస్,టీడీపీ పొత్తును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు.వైసీపీ లో చేరనున్నారు. జిల్లాకు చెందిన రామచంద్రయ్య  పార్టీలో చేరితే పలు విభాగాల్లో ఆయన సేవలు వినియోగించుకోవచ్చు అనే యోచనలో ఉంది వైసీపీ.అంతేకాకుండా పార్టీ అభివృద్ధికి ఎంతో తోడ్పడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుంది.     మరోవైపు దాదాపు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన పనుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో ఆయన చేరనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నట్టు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బాలరాజు 1987లో ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. జీకే వీధి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాలరాజు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.

వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు లేవు

  రేపు ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ముస్లిం మైనారిటీల నుంచి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌, ఎస్టీ వర్గాల నుంచి కిడారి శ్రావణ్‌ కుమార్‌లకు చోటు కల్పిస్తున్నారు.అయితే ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ కు మంత్రి పదవి కేటాయించడంపై తెదేపా నేతలు జలీల్‌ఖాన్‌, చాంద్‌బాషా స్పందించారు.మంత్రి పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.కేంద్రంతో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం కుదరడం లేదని,పరిస్థితిని అర్థం చేసుకున్నామని తెలిపారు. మంత్రి పదవిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ..తాను సీనియర్నేనని.. మంత్రి పదవి ఆశించానని చెప్పారు. కొన్ని సమీకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదన్నారు. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ పదవి ఇచ్చారని.. సర్దుకుపోయానని వివరించారు.ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మైనారిటీ కోటాలో గత విస్తరణలోనే తన పేరు చివరి నిమిషం వరకూ పరిశీలించారని.. కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగానే తనకు అవకాశం దక్కలేదన్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్న చంద్రబాబు

  ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయిన సంగతి తెలిసిందే.రేపు జరుగనున్న మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో భేటీ కానున్నారు.మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు.ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యంలేదు.దీంతో ముస్లిం మైనారిటీల్లో ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నఎన్‌ఎండీ ఫరూక్‌కు,ఎస్టీల విషయానికి వస్తే.. ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.అదే విషయాన్ని ఫరూక్‌, శ్రావణ్‌ లకు సమావేశంలో వెల్లడించనున్నారు.అంతే కాకుండా మంత్రిపదవి ఆశించిన నేతలను సీఎం బుజ్జగించనున్నారు.ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.కీలకమైన వైద్యారోగ్య శాఖ బాధ్యతలు కొత్త మంత్రికి ఇవ్వాలా? లేక సీనియర్ మంత్రికా? అనే అంశంపై తర్జన భర్జన జరగుతోంది.మండలి ఛైర్మన్‌గా ఉన్నఎన్‌ఎండీ ఫరూక్‌ మంత్రి వర్గంలోకి రానుండటంతో ఖాళీ అయిన మండలి ఛైర్మన్ స్థానంపై చర్చించనున్నారు.ఈ స్థానానికి షరీఫ్, రెడ్డి సుబ్రమణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే చాంద్ భాషాతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కోసం విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.రేపు మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.

సోనియాగాంధీతో తెరాస నేత భేటీ

  రాజకీయాల్లో ఒక పార్టీ నేత మరో పార్టీ నేతలను కలిస్తే పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడతాయి.ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే ఆ వార్తలకు ఇంకా బలం చేకూరుతుంది.తెరాస నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయి.డీఎస్‌ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత.యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ,ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.అనుకోని పరిణామాలతో తెరాస లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తూ ఉన్నారు.దీంతో నిజామాబాద్‌కు చెందిన తెరాస నేతలంతా డీఎస్‌పై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవిత సహా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలంతా గతంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి తెరాస కార్యక్రమాలకు డీఎస్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.దీంతో పార్టీ మారుతున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి.దీనికితోడు కొన్నిరోజుల క్రితం డీఎస్‌ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.అయితే పార్టీ మారుతున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా డీఎస్‌ సోనియాగాంధీతో భేటీ అయ్యారు.సోనియాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.డీఎస్‌ పార్టీలో చేరిక గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.సోనియా డీఎస్‌ చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా పార్టీలో చేరితే మహా కూటమిలో పార్టీలను సమన్వయం చేసే భాద్యతలు,కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలను బుజ్జగించే పని కూడా డీఎస్‌ కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అధికారికంగా మాత్రం దీనిపై ఎటువంటి సమాచారం లేదు.

చంద్రబాబును కలవనున్న కాంగ్రెస్ సీనియర్ నేత

  ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలతోపాటు మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలను కలిసిన చంద్రబాబు...కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు మీడియాతో మాట్లాడారు.గతాన్ని మరచి కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.రాహుల్ గాంధీతో భేటీ అవ్వటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.రాహుల్ తో భేటీ అనంతరం చంద్రబాబు తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.అంతేకాకుండా చెన్నైవెళ్లి డీఎంకే అధక్షుడు స్టాలిన్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.ఎన్డీయేకు వ్యతిరేకంగా జరుగుతున్న కూటమిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలను, ఆయా పార్టీల అధ్యక్షులను, కీలక నేతలను ఆయన కలుస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రయత్నాల్లో వేగం పెంచింది. రాహుల్ తరుపున చంద్రబాబుతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అమరావతి వస్తున్నారు భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం.