వినరు..కనరు..నోరెత్తనివ్వరు!
posted on Jun 10, 2022 6:47AM
చెప్పింది వినరు, చేసేది చెప్పరు.. సమస్యలు పట్టించుకోరు.. విమర్శలను సహించరు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు.. కానీ రాజే మొండివాడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలంటే.. ఛఛ చెప్పడం ఎందుకు ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలను చూపిస్తే సరిపోతుంది. నోరెత్తడానికి లేదు.. చెవులకు పని చెప్పడం తప్ప. నియోజకవర్గాలలో చేయడానికి ఏమీ ఉండదు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలూ చేసేది చూడటం తప్ప.
నియోజకవర్గంలో సమస్యలపై జనం నిలదీస్తుంటే ఏం చేయాలో తెలియక జగన్ వద్దకు వెడితే.. ఆయన ప్రభుత్వ పథకాలూ, గత ప్రభుత్వ తప్పిదాలు అంటూ ఆవు కథ చెబుతారు. అది విని తీరాలి. అదే వినాలి. అయన ఎదుట చెవులకే పని చెప్పాలి. నోరెత్తి మాట్లాడకూడదు. ఫైరైపోతారు. ఫైర్ చేసేస్తారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు నోరు కుట్టేసుకోవడం తప్ప మట్లాడే అవకాశమే లేదు. ఇంతా చేసి అన్నీ సహించి ఊరుకుంటే చివరాఖరికి ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేల అసమర్థతే కారణమంటూ వారి ఫర్ఫార్మెన్స్ కు మార్కులేసి క్లాసులు పీకుతారు. దీంతో ఎమ్మెల్యేలు బలికి సిద్ధమైన గొర్రెల్లా మారారు. తమను బలిచ్చైనా సరే మరో సారి తాను ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే జగన్ ధ్యేయంగా కనిపిస్తోందని ఎమ్మెల్యేలు లబో దిబో మంటున్నారు.
ప్రజలు అయితే హాయిగా జగన్ ప్రసంగాలు వినకుండా సభనుంచి వెళ్లిపోయి నిరసన తెలపగలరు. వాళ్లకా హక్కు ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలే బాధ్యులంటే ఎలా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కలిసినా బాధలు పంచుకుని భోరు మనే పరిస్థితి ఉంది. ఇక మంగళవారం నాటి వర్క్ షాప్ అయితే మరీ దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలే ఆఫ్ ది రికార్డ్ చేబుతున్నారు. ఇంతకీ అసలు వర్క్ షాపులో ఏమైందంటే.. జగన్ ప్రభుత్వ గొప్పలను సుదీర్ఘ ప్రసంగంలో వివరించేశారు. ఎమ్మెల్యేలు ప్రజలలో మమేకం కావాలని ఉద్భోదించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదంటూ క్లాస్ పీకారు.
అసలీ కార్యక్రమం ఇంకా ప్రారంభించని ఎమ్మెల్యేలకు జీరో పర్ఫార్మెన్స్ అంటూ ‘వీరతాడులు’ తగిలించారు. ఇక అప్పుడు మీ కేమైనా సమస్యలున్నాయా చెప్పండంటూ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడే జగన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకునేలా తొలుత మాట్లాడిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలనూ ఎత్తి చూపేశారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. పనులు చేయక తప్పదనీ, బిల్లులు చెల్లించి తీరాలనీ సూచనలూ సలహాలూ ఇచ్చేశారు.అయితే జగన్ వాటిని వేటినీ అంగీకరించలేదు. ఎమ్మెల్యేలై ఉండి మీడియాలో వచ్చిన వార్తలు ఇక్కడ వల్లె వేస్తారేమిటంటూ చిరాకు పడ్డారు.
అయినా సరే అవన్నీ చేయడం సాధ్యం కాదు అని కుండబద్దలు కొట్టేశారు.దీంతో మిగిలిన ఎమ్మెల్యేలెవరూ మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కాదు కాదు సాహసం చేయలేదు. మొత్తం మీద ఈ వర్క్ షాపు ద్వారా అర్ధమైందేమిటంటే.. జగన్ ప్రభుత్వం పనులు చేయదు, వైఫల్యాలను సరిదిద్దు కోదు.. జగన్ మరోసారి సీఎం అవ్వడానికి వైసీపీ ఎమ్మెల్యేలు బలి పశువులుగా మారి సోపానాలవ్వాలి. అంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదు, ఎమ్మెల్యేల వైఫల్యంగా చూపించి..వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరు. మరో కొత్త ముఖాన్ని తీసుకువచ్చి.. మీ పాత ఎమ్మెల్యే చాతకాని తనం వల్లే సమస్యలు పేరుకుపోయాయి.. అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటారు. ఒక్క చాన్స్ సరిపోలేదు, మరోక్క చాన్స్ అంటూ మళ్లీ నవరత్నాలనో, ఏవో వజ్రాలంటూనో జనం ముందుకు వస్తారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలకు దూరమై, పార్టీలోనూ పలుచనై వైసీపీ ఎమ్మెల్యేలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యరని పరిశీలకులు అంటున్నారు.