ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని  తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి  ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు.

మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదన్నారు.  జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వైఐఐఆర్‌ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేన‌న్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు స్కూల్స్ కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాల‌న్నారు.  విద్యా శాఖ‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో  ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేప‌ట్టే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు.  త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు సీఎంకు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు  తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు ముఖ్య‌మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  బాచుప‌ల్లి పాఠ‌శాల స్థ‌లం కేవ‌లం అర ఎక‌రం మాత్ర‌మే ఉండ‌డంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎక్క‌డైనా పాఠ‌శాల‌కు క‌నీసం ఎక‌రంన్న‌ర స్థ‌లం ఉండాల‌ని, బాచుపల్లి ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లం స‌మీపంలో ఎక‌రంన్న‌ర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయన సూచించారు.  పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాల‌ని  ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న ఉండాల‌ని సీఎం అన్నారు.  ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్‌ మొలుగారం కుమార్‌, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌.సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.     

సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు  దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు.  అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్నా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ 13 లక్షలమంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం.  2024-25లో డ్వాక్రా సంఘాలు రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అభినందిస్తున్నాను. ఈ ఎక్స్‌పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.  సరస్ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు మార్కెట్ లింకేజీ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.  ఆడబిడ్డలతో ప్రత్యేక అనుబంధం ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్నా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు.  2024-25లో రూ. 46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.  నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్ ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు.  డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు.  ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు. ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం.  ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.  సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా రూ.1,375 కోట్ల చెక్కును సీఎం అందించారు. సెర్ప్ నుంచి రూ.2171 కోట్లను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీరను కొనుగోలు చేశారు.  భర్తకు ఆరోగ్యం బాగోలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.     

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో ఆశోక్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  అభ్యర్థులను చెదరగొట్టిన పోలీసులు.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే వారందరినీ విడుదల చేసి, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని   తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా  నిరుద్యోగులకు కవిత సంఘీభావం తెలిపారు

కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు...ఎందుకంటే?

  మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు మంత్రులు ఆయన నివాసాన్ని సందర్శించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆకాంక్షరెడ్డి కలిసి కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానాలు అందజేసినప్పటికీ కేసీఆర్‌ను ఎదురుగా కలుసుకునే అవకాశం రాలేదని మంత్రి సీతక్క అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయన వద్దకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం ఇచ్చామని తెలిపారు. ఆదివాసుల గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అయిన మేడారం మహాజాతరకు తప్పకుండా రావాలంటూ కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మకు ఆహ్వానం అందజేశారు. తల్లుల బంగారం, వస్త్రాలను అందించి గౌరవించారు. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించడంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజకీయాలకది సమయం కాదని, రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతరకు ప్రతి ఒక్కరూ రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా మేడారం మహాజాతరకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు.  

పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

  తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని పేర్కొంది. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.   అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికపోయారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే  టీటీడీ విజిలన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేసుకోవడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది

దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్రం నోటిఫికేషన్

  దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం(8-1-26) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు.  దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తుస్తారు. కానీ కొవిడ్ కారణంగా.. ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనన గణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  అందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనుంది. ఈ జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం

  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం ఊరటనిస్తూ బెయిల్  మంజూరు చేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితులతో పాటు శ్రవణ్ కుమార్‌కు కూడా నల్లగొండ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. వేర్వేరు కులాలకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణిలు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కుమార్తె తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ను అంతం చేయడానికి కోటి రూపాయల సుపారీతో కిరాయి హంతకులను నియమించాడు. 2018 సెప్టెంబర్ 14న, గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె కళ్ల ముందే కిరాయి హంతకుడు ప్రణయ్ మెడపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సిసిటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ కేసులో మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హంతకుడు సుభాష్ శర్మతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ దశలో ఉండగానే, 2020 మార్చిలో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులకు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది

రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

  సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను పోలీసులు సీజ్ చేయగా, ఈ వ్యవహారంలో 143 మందిని అరెస్టు చేసి 103 కేసులు నమోదు చేశారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందోత్సాహాల వేళ. అయితే ఈ సంబరాలు మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన నైలాన్, సింథటిక్, మెటాలిక్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లలో ఒకేసారి దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన, విక్రయానికి సిద్ధంగా ఉన్న మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్‌లో సీపీ సజ్జనర్ హెచ్చరిక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.“సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. కానీ మన ఆనందం మరొకరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదు. చైనీస్ మాంజా వల్ల పిల్లలు, వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం విధించింది.  నిషేధాజ్ఞలు ఉన్నా కొందరు అక్రమంగా వీటి విక్రయాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఎక్కడైనా చైనా మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని స్పష్టం చేశారు. దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయడంతో కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అక్రమ విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  ఆన్‌లైన్‌లో చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉన్న మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలతో తయారైన మాంజాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నగరవ్యాప్తంగా  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి, 35 మందిని అరెస్టు చేసి రూ.37.22 లక్షల విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 18 కేసులు నమోదు కాగా, 29 మంది అరెస్టు, రూ.6.02 లక్షల విలువైన 301 బాబిన్లు సీజ్ చేశారు.సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు, 10 అరెస్టులు, రూ.4.42 లక్షల విలువైన 221 బాబిన్లు స్వాధీనం అయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 6 కేసులు, నార్త్ జోన్‌లో 5 కేసులు, వెస్ట్ జోన్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ మొత్తం ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. మొత్తం నమోదైన కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ.68.78 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనర్  అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు అందజేశారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అవసరమైతే సంక్రాంతి ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ

పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.  ఈ ఫెస్టివల్ నిర్వహణ తొలి సారిగా గత ఏడాది నిర్వహించినట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది జనవరి 10, 11 తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వివరించారు.   పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక   అభివృద్ధి  లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్–2026 పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురువారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. తిరుపతి  తారకరామ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన రహదారుల గుండా సాగింది.ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఫ్లెమింగో పక్షుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.