ఇది బస్సు ప్రమాదాల సీజనా ఏంటి?
posted on Nov 4, 2025 @ 11:33AM
ఒక్కో టైంలో ఒక్కో సీజన్ నడుస్తుంది. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియా విమానం లండన్ కి వెళ్లబోతూ.. గాల్లోకి ఎగిరినట్టే ఎగిరి.. ఆపై వెంటనే నేలకొరిగడంతో వందలాది మంది ప్రాణాలు పోయాయి. అప్పటి నుంచీ వరుస విమాన ప్రమాద ఘటనలు లేదా వాటికి సంబంధించిన వార్తలు వెలుగు చూశాయి. మొన్న కర్నూలు జిల్లా బస్సు దగ్ధం దుర్ఘటన మరువక ముందే నిన్న చేవెళ్లలో.. ఒక బస్సు టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో మొత్తం 19 మంది ప్రాణాలో కోల్పోయారు. ఆపై అదే రోజు రాత్రి ఏలూరులో బస్సు బోల్తా పడ్డంతో రెండు ప్రాణాలు పోయాయి. ఈ మధ్య కాలంలో కేవలం బస్సు దుర్ఘటనల కారణంగా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారు. చేవెళ్ల ఘటన జరిగిన రోజు నే రాజస్థాన్ లో మరో ఘోర ప్రమాదం జరగ్గా అక్కడ కూడా 19 మంది మరణించారు.
ఇక చేవెళ్ల ప్రమాద కారణాలేంటి? ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే.. మొత్తం ఏడు కారణాల వల్ల ఈ బస్పు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒకటి టిప్పర్ ఓవర్ లోడ్, స్పీడ్ తో రావడం, ఆపై ఆర్టీసీ బస్సు సైతం ఓవర్ లోడ్ స్పీడ్ తో ఉండటం, కంకరపై టార్పాలిన్ పట్టా కప్పక పోవడం, కాంట్రాక్ట్ బస్సు డ్రైవర్ కి డబుల్ డ్యూటీ, ఇరుకైన రోడ్డు, గుంతలుండటం, 50 మంది ఎక్కాల్సిన బస్సులో 72 మందిని ఎక్కించడం, అనుమతి లేకున్నా టిప్పర్ వెళ్లడం వంటివి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే వరుస ఘటనలతో ప్రయాణికులు బస్సులు ఎక్కాలంటే భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక ఇంట్లో అయితే ముగ్గురు ఆడపిల్లల దుర్మరణం అత్యంత విషాదం వీరికి ఎంత ఎక్స్ గ్రేషియా ఇచ్చినా కూడా ఆయా కుటుంబాల్లోని విషాదాన్నయితే ఎవ్వరూ చెరిపివేయలేరన్న మాట వినిపిస్తోంది.