రాయల చెరువుకు గండి! జలదిగ్బంధంలో గ్రామాలు
posted on Nov 6, 2025 @ 5:06PM
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఓల్లూరులోని రాయల చెరువు రిజర్వాయర్ కట్టకు గండిపంది. దీంతో గురువారం (నవంబర్ 6)న పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం సంభవించలేదు కానీ, పశుసంపదకు అపార నష్టం వాటిల్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలచెరుకువు భారీగా నీరు చేరింది. గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రమాదం లేదని జనం ఊపిరి పీల్చుకున్నారు.
కానీ అంతలోనే ఏమయ్యిందో తెలియదు కానీ చెరువుకు ఒక్కసారిగా గండి పడి నీరు ఓల్లూరు, పాతపాలెం, రాజుల కండ్రిగ, కళత్తూరు, కళత్తూరు హరిజనవాడ గ్రామాలను మంచేసింది. వరద నీరు పోటెత్తడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఎత్తైన భవనాలు, ప్రదేశాలను ఆశ్రయించారు. అయితే గ్రామంలో బయట కట్టేసిన ఆవులు, గేదెలు, పాకల్లో ఉన్న మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా మోటారు బైకులు, ఆటోలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి.
వేలాది ఎకరాలలో పంట ధ్వంసమైంది. రాగిగుంట శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రోడ్డు మార్గం కూడా కోతకు గురవ్వడంతో ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగేఆదవరం, కాళంగి గ్రామాల మీదుగా కాళంగి రిజర్వాయర్ కు వరద నీరు చేరింది. దీంతో కాళంగి రిజర్వాయర్ కు సామర్థ్యానికి మించి నీటి నిల్వలు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా కాళంగి రిజర్వాయర్ కు దిగువనున్న పంట పోలాలు ముంపునకు గురయ్యాయి.