ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణమంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన వంటిదే మరో సంఘటన మంగళవారం ఉదయం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి కందుకూరు వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారిపై  చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దు మంటల్లో చిక్కుకుంది. ముందుగా బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. ప్రయాణీకులను కిందకు దించేశాడు.  దీంతో పెను ప్రమాదం తప్పి.. ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనకు ముందు బస్సును డ్రైవర్ చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆపాడు. మళ్లీ బస్సు బయలుదేరిన పది నిముషాలకే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగానే తాము క్షేమంగా బయటపడగలిగామని వారు చెబుతున్నారు. 

పేలుళ్లను మించిన కుట్ర.. రిసిన్ విష ప్ర‌యోగం

రుచిలేని విషం రిసిన్... ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన  విషాలలో ఇదీ ఒకటి.  దీని స్పెషాల్టీ ఏంటంటే రుచి ఉండ‌దు, వాసన ఉండ‌దు.  గ్లాసు నీటిలో కలిపినా, కూడా అనుమానించలేరు. మృత్యువు ఆహారం రూపంలో శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని కూడా ఎవరూ గుర్తించలేరు. అటువంటి అత్యంత ప్రమాదకరమైన విషం  రిసీన్.  డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌... త‌న వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంత‌కీ ఈ రిసిన్ ని ఎలా త‌యారు చేస్తారంటే.. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రిసిన్ సేక‌రిస్తారు,   త‌ర్వాత  దానిని శుద్ధి  చేస్తారు. ఆపై దాన్నొక విషంగా త‌యారు చేస్తారు.   ఈ చైనా డాక్ట‌ర్ ప్లాన్ ఎంత భయంకరమైందంటే... ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి మ‌హా నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి, ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్ప‌డాల‌ని భావించాడు. ఒక్కసారి ఈ విషం జ‌నం గొంతులోకి దిగితే..ఇక అంతే సంగ‌తులు. ప్రపంచంలోనే అత్యంత భ‌యంక‌ర‌మైన‌ సామూహిక విషప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక, వందలు, వేల మంది ఆస్ప‌త్రుల  పాలై, తమ మరణానికి కారణం ఏమిటన్నది తెలియకుండానే  చనిపోయి ఉండేవారు. దీంతో దేశ వాసులు ఏ నీరు తాగాల‌న్నా హ‌డ‌లిపోయి.. దాహం బిగ‌బ‌ట్టేవారు. అంత‌టి భ‌యంక‌ర‌మైన మాస్ట‌ర్ ప్లాన్ వేశాడీ విష  ఉగ్ర‌వాది.. మొహియుద్దీన్ స‌య్య‌ద్.    డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతడి సహచరులు మొహమ్మద్ సుహేల్, ఆజాద్‌లతో పాటు భారీ ఇంట‌ర్నేష‌న‌ల్ సపోర్ట్ ఇత‌డి  సొంతం. వీరు నిరంత‌రం  టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ ఉగ్ర‌వాదుల‌తో కోడ్ లాంగ్వేజీలో మాట్లాడేవార‌ని తెలుస్తోంది.  వీరికి  పాక్ కి చెందిన ఉగ్ర  మూక‌లు కొన్ని డ్రోన్ల సాయంతో ఆయుధాలు చేర‌వేసిన‌ట్టు గుర్తించారు.   ఇది కేవ‌లం విషం కాదు.. ఒక విష‌ ఉగ్ర వ్యూహం.  ఈ మొత్తం విష కుట్రను గుజ‌రాత్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ బయటపెట్టింది. నిఘా వ‌ర్గాల   నుంచి అందిన చిన్న స‌మాచారంతో రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్. వీరి అనుమానాస్ప‌ద సంభాష‌ణ‌లు, టెలిగ్రాం కోడింగ్ మెసేజీల‌ను డీ కోడ్ చేశారు. అలా ఈ ముగ్గురు దుండ‌గుల‌ను స‌రైన స‌మ‌యానికే ప‌ట్టుకున్నారు. వీరి డెన్ లో ఒక రిసిన్ త‌యారీ సెట‌ప్ ని చూసి  షాకై పోయారు ఏటీఎస్ అధికారులు.

హైదరాబాదీ డాక్టర్ ఉగ్రలింకు.. సామూహిక విషప్రయోగానికి కుట్ర!

గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం(నవంబర్ 10)  అరెస్టు చేసిన హైద రాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.   రాజేంద్ర నగర్ సర్కిల్ ఫార్ట్యూన్ కాలనీలో నివాసం ఉంటున్న మొహియుద్దీన్.. చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకు న్నాడు. పాకిస్థానీ హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ (అత్యంత విషపూరితమైనది)తో దాడులు చేసేందుకు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది.   రిసిన్ ను ప్రపంచం లోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా నిపుణులు చెబు తున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసు నీటిలో కలిపి ఇస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీనిని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమా చారం. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి, ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాదిమంది మృత్యువాత పడేలా ప్రణాళికలు తయారు చేసు కున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఎర్ర‌బారిన ఎర్ర‌కోట‌.. ఢిల్లీ బ్లాస్ట్ సూత్ర‌ధారులు వారేనా?

ఢిల్లీ ఎర్ర కోట స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6. 52 గంట‌ల‌కు కారు బాంబు పేలి  మొత్తం 13 మంది  చ‌నిపోగా  24 మంది గాయపడ్డారు. ఎర్ర‌కోట గేట్ వ‌న్ ద‌గ్గ‌ర్లోని ట్రాఫిక్ జంక్ష‌న్ వ‌ద్ద‌ వ‌ద్ద రెడ్ లైట్ ప‌డడంతో.. హ‌ర్యానాకు చెందిన స‌ల్మాన్ అనే వ్య‌క్తి పేరిట గ‌ల ఐ20 కారు  ఆగింది. ఈ కారులో ఉన్న‌ట్టుండి పేలుడు సంభ‌వించింది. దీంతో స్పాట్ లో 9 మంది  చ‌నిపోగా 8 కార్లు పూర్తిగా  ధ్వంస‌మ‌య్యాయి. చుట్టుప‌క్క‌ల ఉన్న షాపులు కూడా  దెబ్బ తిన్నాయి. ప‌హెల్గాం దాడి మ‌రువ‌క ముందే మ‌రో విషాదం సంభ‌వించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు.. ఈ కారు వెన‌క సూత్ర‌ధారులెవ‌రో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌తో ఢిల్లీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ‌గా.. ముంబై, కోలకతా, హైద‌రాబాద్, చైన్నై సహా అన్ని మెట్రో నగరాల్లోనూ వంటి మిగిలిన న‌గ‌రాల్లో హై అల‌ర్ట్ ప్రక‌టించారు. ఇక ఫోరెన్సిక్ అధికారులు ఘ‌ట‌నా  స్థ‌లిలో ఒక బుల్లెట్ స్వాధీనం చేస్కున్నారు. ఈ బుల్లెట్ ఇక్క‌డికి ఎలా వ‌చ్చింది? దీని వెన‌క దాగి ఉన్న శ‌క్తులెవ‌రు? వారి కుట్ర‌లేంటి? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు మొద‌లైంది.  ఇక ఢిల్లీకి రాష్ట్ర హోదాను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని చాలా మంది డిమాండ్ చేయ‌డం క‌నిపించింది. ఎందుకంటే రాష్ట్రంలో నిఘా కొర‌వ‌డి ఎవ‌రంటే వారు వ‌స్తున్నారు కాబ‌ట్టి  దాన్నొక సాధార‌ణ సిటీగానే మార్చాల‌ని అంటున్నారు. అప్పుడు మ‌రింత  నిఘా పెంచ‌వ‌చ్చ‌న్న మాట వినిపిస్తోంది. కొంద‌రైతే దీని వెన‌క కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద‌మే  ఉండొచ్చ‌న్న అంచ‌నా వేస్తున్నారు. అయితే కాశ్మీర్ కాకుండా ఈ సారికి ఢిల్లీని ఎంపిక చేసుకోవ‌డంలో అర్ధ‌మేంట‌న్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. అయితే ఇది ఇజ్రాయెల్ ఎంబ‌సీ టార్గెట్ గా జ‌రిగిన‌  పేలుడుగా  అనుమానిస్తున్నారు. ఇక  పేలుళ్ల స‌మ‌యంలో ఒక క్యాబ్ లో ఇద్ద‌రు వ్య‌క్తులు దిగిన‌ట్టు గుర్తించారు.  ఢిల్లీలో నివ‌సిస్తున్న 30 మంది ఇరాన్ జాతీయుల‌ను సైతం ఇజ్రాయెల్ రివెంజ్ యాంగిల్లో ప్ర‌శ్నిస్తున్నారు. శ‌నివారం (నవంబర్ 8) ఒక క్యాబ్ డ్రైవ‌ర్ ఢిల్లీ పోలీసుల‌కు ఫోన్ చేశాడు.  త‌న క్యాబ్ లో ప్ర‌యాణించిన ఇద్ద‌రి గురించి ఇత‌డు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. . ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తే నేరుగా ఇజ్రాయెల్ నే టార్గెట్ చేయాలి. ఆ దేశంలోనే ఇలాంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డాలి. కానీ, ఇలా ఇండియాలో ఇజ్రాయెల్ ఎంబ‌సీని పేల్చాల‌నుకోవ‌డం ఏంటి? అన్న చర్చ కూడా న‌డుస్తోంది. ఈ పేలుడు తీవ్ర‌త కారణంగా మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా  ఛిద్ర‌మ‌య్యాయి. ఢిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద‌ పేలుడు వెన‌క సూత్ర‌ధారులెవ‌రు? అని చూస్తే ఇద్ద‌రు అనుమానితుల‌ను ఇప్ప‌టికే అరెస్టు చేశారు.. ఇక‌ హ‌ర్యానాకు చెందిన స‌ల్మాన్ అనే వ్య‌క్తి కారుగా దీన్ని గుర్తించ‌డం రెండో మేజ‌ర్ అప్ డేట్. ఇటీవ‌లే ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను అరెస్టు చేసిన  ఎన్ఐఏ క‌న్నుగ‌ప్పి ఉగ్ర‌వాదులు ఈ పేలుడు ఎలా ప్లాన్ చేశార‌న్న విష‌య‌మై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.  ఇలా ఉండగా ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో  నిఘా పెంచారు. భద్రత కట్టుదిట్టం చేశారు. టీటీడీ విజిలెన్స్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు,  తిరుపతి నుండి తిరుమల   వచ్చేవాహనాలను అన్నిటినీ తనిఖీ చేస్తున్నారు.  

హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ ధర్మేంద్ర మృతి అంటూ వదంతులు

బాలీవుడ్ దిగ్గజ నటుడు, సీనియర్ హీరో ధర్మేంద్ర మంగళవారం (నవంబర్ 11) ఉదయం తుదిశ్వాస విడిచారంటూ వదంతులు వ్యాపించాయి.. ఆయన వయస్సు 89 ఏళ్లు.  ఇటీవల ఆయన శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరిన ధర్మేంద్ర అప్పటి నుంచీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుది శ్వాస విడిచారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటిని ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్  ఖండించారు. తన తండ్రి ధర్మేంద్ర క్షేమంగానే ఉన్నారని   వెల్లడించారు..   హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావమంతమైన నటుల్లో ఒకరిగా ధర్మేంద్ర పేరు తెచ్చుకున్నారు.   1958లో దిల్ బీ తేరా హ‌మ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్‌లో  షోలే ,  చుప్కే చుప్కే ,  ధర్మ్ వీర్ ,  సీతా ఔర్ గీత ,  యాదోం కి బారాత్ వంటి ఎన్నో  సినిమాలలో తన అసమాన నటనతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  అభిమానులు ధర్మేంద్రను హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్  అని పిలుచుకుంటారు. ప్రముఖ హీరోయిన్, బీజేపీ నాయకురాలు హేమమాలిని ఆయన భార్య. 

ఢిల్లీ పేలుడుపై అమిత్‌షాకు కీలక ప్రకటన

  ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హొం మంత్రి అమిత్‌షాకు కీలక ప్రకటన చేశారు. ఈ సాయంత్రం 7 గంటలకు ఎర్రకోట వద్ద సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో బాంబు పేలుడు సంభవించింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి అని పేర్కొన్నారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు చేరుకున్నాయని తెలిపారు.  సమీపంలో అన్ని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నమని అమిత్‌షా తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నివేదిక రాగానే ప్రజల ముందు ఉంచుతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. గాయాలపాలై LNJP ఆస్పత్రిలో చికిత్స బాధితులను అమిత్‌షా పరామర్శించారు. పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 10 చేరింది, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు  ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.  

ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా...అమిత్‌షాకు ఫోన్

  ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హొం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. బాంబు బ్లాస్ట్‌పై ఢిల్లీ పోలీసు కమీషనర్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీలో ఆధారంగా కీలక విషయాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఫుటేజీ ఆధారంగా.. నెమ్మదిగా వెళ్తున్న కారులో పేలుడు జరిగిందని తెలిపారు.  ఆ కారు కూడా వాహనాలు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లగానే పేలుడు జరిగినట్లుగా గుర్తించామన్నారు. ఆ కారు కావాలనే రద్దీగా ఉన్న చోటికి వెళ్లిందా ? లేక కారులో వేరే వ్యక్తులు బాంబును అమర్చారా? పేలుడు ఎలా జరిగింది? అన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరగా.. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

ఢిల్లీలో పేలుడు.... హైదరాబాద్‌లో అలర్ట్

  ఢిల్లీలో భారీ పేలుడు జరగడంతో హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంగా పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టినట్లు  సీపీ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం వెంటనే ఇవ్వాలని సీపీ సజ్జనార్ తెలిపారు. సీటిలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. మరోవైపు మారుతీ ఎకో కారులో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కావడంతో ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో రైలు వద్ద బ్లాస్ట్  సంభవించడంతో టూరిస్ట్‌లను టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఢిల్లీలో భారీ పేలుడు...10 మంది మృతి

  ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని షాపుల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి. ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. వెంటనే  అగ్నిమాపక సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకుంది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఈ ఘటనలో 10మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహం ఛిద్రమై గుర్తు పట్టని స్థితిలో పడి ఉంది. పలువురికి గాయాలయ్యాయి. జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ బృందాలు చేరుకున్నాయి. పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  

శ్రీవారి లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది : సోమిరెడ్డి

  తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను జీర్ణించుకోలేకే జగన్ మీడియాలో అడ్డగోలు రాతలు రాశరని సోమిరెడ్డి తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టుపట్టించిన వారి పాపాలు పండుతున్నాయిని ఆయన స్పష్టం చేశారు.  వైసీపీ హయాంలో లీటర్ కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదాని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమేని తెలిపారు. జగన్ రెడ్డికి హిందూ దేవుళ్లంటే నమ్మకం లేదు...వైవీ సుబ్బారెడ్డిదీ అదే పరిస్థితి అని వింటుంటామని తెలిపారు.  ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని..సీబీఐ విచారణతో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయిని  సోమిరెడ్డి తెలిపారు.  వాస్తవాలను జీర్ణించుకోలేక లో రివర్స్ జగన్ మీడియాలో రాతలకు పనిపెట్టారని సోమిరెడ్డి విమర్శించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారు..కుట్రలు చేయకపోతే అంత భయమెందుకని సోమిరెడ్డి ప్రశ్నించారు. తిరుమల లడ్డూ అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను దెబ్బతీసిన వారు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వస్తుందని వెల్లడించారు. ఏఆర్ డెయిరీకి అర్హత లేకపోయినా నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇవ్వడం కుంభకోణంలో భాగమేని మాజీ మంత్రి స్పష్టం చేశారు.  వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సహకారంతో వేల దర్శన టికెట్లు అడ్డగోలుగా పొంది సంతలా మార్చేశారని ఆయన ఆరోపించారు.  ప్రస్తుతం బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో అంతా నిజాయితీతో జరుగుతోంది...కోటాకు మించి ఒక్క లెటర్ ను అనుమతించే పరిస్థితి లేదని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి అంకితమై బీఆర్ నాయుడు సేవలు అందిస్తున్నారు ..టీటీడీని అంకితభావంతో పనిచేసేలా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడం కోసం అప్పట్లో అలిపిరి ఘటనలో సీఎం చంద్రబాబుని వెంకటేశ్వరస్వామి బతికించారు..ఏడుకొండల వెంకన్న మహత్యానికి అదే నిదర్శనమని  సోమిరెడ్డి తెలిపారు.

మహిళల చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేదు : సీపీ వీసీ సజ్జనర్

  మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీపడేదే లేదని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. మహిళల భ‌ద్ర‌త, రక్షణ అనేది సామాజిక బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సోమ‌వారం మ‌హిళా భ‌ద్ర‌త విభాగం ప‌నితీరుపై సీపీ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆ విభాగంలోని మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌లో న‌మోద‌వుతున్న కేసులను ఆరా తీశారు. షీటీమ్స్‌, భ‌రోసా, యాంటీ హుమ‌న్ ట్రాఫికింగ్, జువైన‌ల్, త‌దిత‌ర విభాగాల పోలీస్ అధికారుల‌తో మాట్లాడి.. వారి ప‌నితీరును అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మ‌హిళా భ‌ద్ర‌త విష‌యంలో వ్య‌వ‌హారించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.  మ‌హిళ‌లు బాధ‌తో పోలీస్ స్టేష‌న్ల‌కు వ‌స్తార‌ని, వారితో మాన‌వ‌త దృక్ప‌థం వ్య‌వ‌హారించాల‌ని సూచించారు. అన్యాయం జ‌రిగింద‌ని వచ్చే బాధిత మ‌హిళ‌కు తాము అండ‌గా ఉన్నామ‌నే భ‌రోసా క‌ల్పించాల‌న్నారు. కేవ‌లం కేసులు న‌మోదు చేసి వ‌దిలేయొద్ద‌ని, స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. పొక్సో, అత్యాచార కేసుల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే బాధ్యుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.  మ‌హిళా భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, చిన్నపిల్ల‌ల‌కు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్వీయరక్షణ విషయాలు నేర్పాలని సూచించారు. ఆప‌రేష‌న్  స్మైల్‌, ముస్కాన్ అప్పుడే కాకుండా మిగ‌తా స‌మ‌యాల్లోనూ వీధి బాల‌లు, వెట్టిచాకిరి, ప‌రిశ్ర‌మ‌ల్లో మ‌గ్గుతున్న బాల‌కార్మికుల‌ను ర‌క్షించాల‌ని ఆదేశించారు. ఆడ‌పిల్ల‌ల జోలికి వ‌స్తే చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, నిందితుల‌పై హిస్ట‌రీ షీట్స్ తెరుస్తామ‌ని హెచ్చ‌రించారు. వారికి పాస్‌పోర్ట్ మంజూరు కాద‌ని, ప్రభుత్వ ఉద్యోగాలు రావ‌ని తెలిపారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో అద‌న‌పు సీపీ క్రైమ్స్‌ శ్రీనివాస్ , డీసీపీ లావ‌ణ్య నాయ‌క్, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

చీకటి పడితే చాలు వణికిస్తున్న చలి... పులి

  మొన్నటి వరకు అయితే భానుడి భగభగలు.. లేదంటే వరణుడి ఉరుములతో  తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు నా వంతు అంటూ చలిగాలులు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలను ఈ గాలులు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జస్ట్ రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు.. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోయాయి. అయితే ఇది కాదు.. అసలు కథ ముందుంది అంటోంది వాతావరణశాఖ. రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు.  వాతావరణశాఖ విడుదల చేసిన లేటెస్ట్‌ లెక్కల ప్రకారం… ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.  రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-20 డిగ్రీల నుంచి 9-13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే, రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతుంది. అవును.. నవంబరు 11-19 తేదీల వరకు అనగా రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 13-17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ అంటే పది డిగ్రీల లోపు పడిపోనున్నాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం మన్యం, పల్నాడు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. రాబోయే పది రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకే నమోదవుతాయన్నారు.  చలి తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే మంచు వర్షం ప్రారంభమైంది. యూపీ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాజస్థాన్‌లో కూడా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కోల్డ్‌ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ సారి రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.  మరోవైపు నవంబర్ 11 నుండి 19 వరకు (ప్రధానంగా 13 నుండి 17 నవంబర్ వరకు) 8-10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతవరణ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చుని.. సాధారణంగా ఇంత దీర్ఘకాలం  చలి తీవ్రత తరచుగా ఉండదు, కానీ ఈ సంవత్సరం 8-10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండ బోతోందని పేర్కొన్నారు

ప‌వ‌న్ ఏం చేసినా త‌ప్పేనా... ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్?

  మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్...ఇదీ అట‌వీశాఖా మంత్రి, డిప్యూటీ ముఖ్య‌మంత్రి కూడా అయిన ప‌వ‌న్ బిజీ షెడ్యూల్. ప్ర‌త్యేక విమానంలో , చాప‌ర్‌లో ఆయ‌న చ‌క్క‌ర్లు కొడుతున్నారంటూ  పెద్ద ఎత్తున వైసీపీ  సోష‌ల్ మీడియా సైన్యం ఆయ‌న‌పై దుమ్మెత్తి  పోస్తోంది. ఇక ఆయ‌న విరామ స‌మ‌యంలో పుస్త‌కం పుట్టుకుని ఏదైనా సందేశం ఇవ్వ‌ద‌లిచినా కూడా దాన్లోని త‌ప్పొప్పులు వెలికి తీసి నానా యాగీ చేస్తున్నారు. ఫోనుతో లేచి- పొద్దంతా ఫోనే చూసుకుంటూ తిరుగుతూ- ఫోనుతోనే నిద్ర పోయేవారికి.. ఆ ఫోన్ పిచ్చిలో పడొద్దు.. పుస్త‌కాలు చ‌ద‌వండ్రా బాబూ! అంటూ త‌న అభిమాన గ‌ణానికి ఒక చిన్న మెసేజ్ పాస్ చేద్దామ‌ని ప‌వ‌న్ ఫోటోల‌కు పోజులు ఇస్తే.. దాన్ని కూడా రాద్దాంతం  చేస్తున్నారు. బుక్కు తిర‌గేసి  ప‌ట్టుకున్నాడు. మ‌ర‌గేసి  ప‌ట్టుకున్నాడంటూ నానా హంగామా చేస్తున్నారు. ఆ మాట‌కొస్తే ప‌వ‌న్ తిర‌గేసి ప‌ట్టుకున్నా కూడా స్టైలే. అందులోంచి వెళ్లాల్సిన మెసేజ్ ఆయ‌న అభిమాన  గ‌ణానికి వెళ్లి  చేరిపోతుంది. ఇక ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించిన గొడ‌వ విష‌యానికి వ‌స్తే. ప‌వ‌న్ అన్నా అధికారిక వ్య‌వ‌హారాల‌కు చాప‌ర్లు గ‌ట్రా వాడుతున్నారేమోగానీ.. అదే జ‌గ‌న్ త‌న జ‌మానాలో ఏకంగా  లండ‌న్ వెళ్లి  సొంత ప‌నులు చ‌క్క‌బెట్ట‌డానికి కూడా ప్ర‌త్యేక విమానాల‌ను వాడిన గ‌తం ఉంది.  ఇటీవ‌ల బాబు లండ‌న్ వెళ్తే మొత్తం సొంత ఖ‌ర్చుల‌తో ఈ ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చారు. అది ఆయ‌న సొంత విష‌యం కావ‌డంతో.. ఈ దిశ‌గా బాబు అన్నీ ఖ‌ర్చులు తానే భ‌రించారు. అదే జ‌గ‌న్ అలాక్కాదు.. మొత్తం ప్ర‌భుత్వ సొమ్మే ఖ‌ర్చు పెట్టేవారు. ఇటీవ‌ల జ‌గ‌న్ తాను లండ‌న్ వెళ్లిన‌పుడు కూడా ప‌రాయి ఫోన్ నెంబ‌ర్ ఇచ్చి కోర్టుల‌ను తిక మ‌క పెట్టారు. స‌రే విదేశాలు వెళ్లి వ‌చ్చారు.. ఒక్క‌సారైనా కోర్టు ముందు హాజ‌రు క‌మ్మంటే.. లేదు లేదు తానలా హాజ‌రైతే శాంతి  భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా రూపాంత‌రం చెందుతుంద‌ని అన్నారు త‌ప్పించి.. కోర్టు కోరిన ప‌ని చేయ‌లేక పోయారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల జ‌రిగిన జ‌గ‌న్ కాన్వాయ్ ప్ర‌మాదాలు, చాప‌ర్ తో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టారు.  అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలాక్కాదే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు సాఫీగా సాగ‌డానికే ఈ విధ‌మైన గాలి మోటారు ప్ర‌యాణాలు చేస్తున్నారు. మొన్న‌టికి  మొన్న చూడండీ.. జ‌గ‌న్ కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైందా? అంత‌కు ముందు ఒక ప్రాణ‌మే పోయిందా? ఇలాంటి వాటిని వీలైనంత‌గా త‌గ్గించ‌డానికే ప‌వ‌న్ త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌న సుత హ‌నుమాన్ లా గాల్లో ప్ర‌యాణిస్తున్నారు.  ఈ విష‌యం తెలీక ఫ్యాన్ పార్టీ ప్యాన్స్ సోష‌ల్ మీడియాలో అంత ర‌చ్చ ర‌చ్చ చేయాల్సిన అవ‌స‌రం లేదంటారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్.

ఒక వైపు టారిఫ్‌లు.. మరోవైపు తాయిలాలు ట్రాంప్ సుంకాల రాజకీయం

టారిఫ్‌లతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సొంత దేశీయులను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు.  ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా, అక్కడి అధ్యక్షుడికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోంది, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. సుంకాల వల్ల భారీ ఆదాయం సమకూరుతోందని, డివిడెండ్‌ కింద ఒక్కో అమెరికన్‌కు కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం. ద్రవ్యోల్బణం దాదాపు లేదు. రికార్డు స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డివిడెండ్‌ కింద ఒక్కో వ్యక్తికి  కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు, లైసెన్స్‌ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా..? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు..? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టుకు ఇది తెలియదా? అసలేం జరుగుతోందని ట్రంప్‌ మండిపడ్డారు. ట్రంప్‌ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా దిగుమతి సుంకాలు మార్చడం, కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేపు అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం రేవంత్

  ప్రముఖ కవి అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఘట్ కేసర్ ఎన్ఎఫ్‍సీ నగర్‌లో అందెశ్రీ అంతిమ యాత్ర జరగనున్నాది. రేపు సాయంత్రం ఆయన పార్థివదేహాన్నికి ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్న అనంతరం అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. కాగా ఇవాళ ఉదయం  గుండెపోటుతో మరణించిన అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మృతి పట్ల పలవురు ప్రముఖులు, సాహితీ వేత్తలు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1961, జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు ప్రజాకవి, గాయకుడు అందె ఎల్లయ్య అందెశ్రీగా ఖ్యాతి పొందిన ఆ మహామనిషి. గొర్రెల కాపరిగా, తాపీ మేస్త్రీగా కష్టసుఖాలను అనుభవించిన ఆయన, బాధను మర్చిపోయేందుకు పాడిన పాటలే ఆయన జీవితానికి మార్గదర్శకంగా మారాయి. ఆ గీతాలే ఆయనను ప్రజల కవి, పోరాట గాయకుడిగా తీర్చిదిద్దాయి. అవే ఆయనకు ప్రశ్నించే ధైర్యం, సమాజం కోసం పలికే స్వరాన్ని ఇచ్చాయి. “పల్లెనీకు వందానాలమ్మో”, “సూడా సక్కని తల్లీ... చుక్కల్లో జాబిల్లీ”, “కొమ్మచెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు”  ఇలా ఆయన గళం నుంచి జాలువారిన ప్రతి పాట తెలంగాణ ఆత్మను తాకింది. చివరికి, తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రూపంలో ఆయన సాహిత్య ప్రస్థానం చిరస్మరణీయమైంది. తాపీ మేస్త్రీగా పనిచేసిన అందెశ్రీ చేతులు తెలంగాణ నిర్మాణానికి ఇటుకలు పేర్చినట్లే, ఆయన గళం ఆ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. పశువుల కాపరిగా మందను దారి చూపినట్లే, ప్రజాకవిగా ఆయన తరతరాలను మేల్కొలిపారు. దగాపడిన తెలంగాణ కోసం తన మాటతో, తన పాటతో పోరాడిన ఆ గాయకుని గాధ పల్లెపల్లెల్లో నేటికీ మార్మోగుతోంది. అందెశ్రీ శరీరం లేనప్పటికీ, ఆయన గీతాల గర్జన మాత్రం చిరస్థాయిగా మారింది.  

అందెశ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటు : ప్రధాని మోదీ

  ప్రముఖ రచయిత అందెశ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. అందెశ్రీ మరణం మన సాంస్కతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన ప్రజల పోరాటాలకు ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది అని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ  ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు  విచారం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని వారు కొనియాడారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు పోరుయాత్రలో చాలా సభల్లో ఆయన పాల్గొనేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు తమ ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించామని గుర్తుచేశారు. అలాగే అందెశ్రీ తనకు సలహాలు కూడా ఇచ్చేవారని  కిషన్‌రెడ్డి అన్నారు.

కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణీకులను బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణమంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఈ సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరగడం అన్నది పక్కన పెడితే.. విమానాల రాకపోకలలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం లేదా అర్ధంతరంగా విమాన సర్వీసు రద్దు కావడం వంటివి జరుగుతుండటంతో ప్రయాణీలుకు నానా ఇబ్బందులకూ గురి చేస్తున్నాయి. అలాగే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు విమానంలో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న భయాందోళనలతో గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు స్పైస్ జెట్ ప్రయాణీకులు. ముంబై నుంచి కోల్ కతా వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సరిగ్గా కొల్ కతాలో ల్యాండింగ్ కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే కోల్ కతా విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి  విమానం గాల్లో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ 670 విమానం ఆదివారం రాత్రి ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్  సమయంలో, విమానంలోని ఒక ఇంజిన్ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వెంటనే విమానాశ్రయ అధికారులు వెంటనే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:38 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు.  కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో తమ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని జెట్ ఎయిర్ స్పేస్ సంస్థ ధృవీకరించింది.  ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది.  

తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్!

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కేటీఆర్ సుప్రీం కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని  కేటీఆర్   ఈ పిటిషన్ దాఖలు చేశారు.  కాగా ఫిర్యాయింపు ఎమ్మెల్యేల విచారణకు తమకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.   కాగా  తమ  పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరుతూ..  కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు కోరారు.చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.  తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ గవాయ్... తాను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాననీ,  ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు  అని వ్యాఖ్యానించారు. వాదనలు విన్న అనంతరం, ఈ పిటిషన్‌  విచారణను వచ్చే సోమవారం చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరగడం ఖాయమైంది. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏ తీర్పు వెలువరిస్తుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

కడపలో విద్యార్థిని ఆత్మహత్య...స్కూల్ వద్ద ఉద్రిక్తత

  కడప జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జస్వంతి హాస్టల్లో ఈ రోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పకుండా రిమ్స్‌కు తరలించారు. దీంతో  జస్వంతి తల్లిదండ్రులు  హాస్పిటల్ కి చేరుకున్నారు. తల్లిదండ్రులకు  పల్స్ లేదని డాక్టర్స్ చెప్పడంతో మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనపడంతో అనుమానస్పదంగా ఉందని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా బాత్రూమ్ లో ఉరి వేసుకుందని చెప్పున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వారే మా పిల్లని హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని  రిమ్స్ మార్చురీకి  తరలించడం జరిగింది .అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు బంధువులు ఆందోళన దిగారు. ఈరోజు ఉదయం స్కూల్ యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చిందని. అయితే విషయం  దాచిపెట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నామని తెలపారని వారు వెల్లడించారు.