తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి కేసు.. కీలక నిందితుడి అరెస్టు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది.  ఈ కేసులో  ఏ16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ ను  సిట్ అదుపులోనికి తీసుకుంది.

అజయ్ కుమార్ సుగంధ్‌  మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా  సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ రసాయనాలను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేశారనీ, ఆ కల్తీ నెయ్యినే లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందని సిట్ అధికారులు తెలిపారు.

  లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్‌ ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. గత ఏడేళ్లు  బోలే బాబా కంపెనీ కి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్‌ కుమార్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం సేకరించి అజయ్ సుగంధ్ సుకుమార్ ను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంధ్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడికి  ఈ నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 

జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం చంద్రబాబు

  జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా... ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని... కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నాని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో బుధవారం వివిధ అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.  కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా... అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు.  ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదామని ముఖ్యమంత్రి తెలిపారు.  పరిపాలనలో పవన్, లోకేష్ భేష్ ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని, మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం... కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు.  5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ. 3.90 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా... పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకం వల్ల నిర్వీర్యం అయిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని చెప్పారు.  సూపర్ సిక్స్‌... సూపర్ సక్సెస్ ‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. పేదలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకే  సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0,  స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం... అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే లక్ష్యం. ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.   పీపీపీలో నిర్మిస్తే ప్రైవేట్ పరం కాదు జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరగవుతాయని అన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని... అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెప్పారు.  మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు.  70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్టు వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, అవే డబ్బులతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఉండేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని... అలాగని అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని సీఎం ప్రశ్నించారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం అన్నారు. 

కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

  తెలంగాణలో  కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన 20న కాకుండా 22 తేదీకి  అపాయింట్‌మెంట్‌ డేను మారుస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న అమావాస్య కావున 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.  దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.   

దేవాలయంలో చోరీ యత్నం.. పట్టుబడి చావుదెబ్బలు తిన్న దొంగ

ఓ దొంగ పక్కా ప్రణాళికతో  దేవాలయంలో దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ అనూహ్యంగా  స్థానికుల  చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో దొంగతనానికి ఓ యువకుడు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓ యువకుడు రాత్రి సమయం లో అత్తాపూర్ పరిధిలోని పోచమ్మ దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటు వెండి వస్తు వులు దొంగిలించి పారిపో తుండగా... అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి  దొంగను చూశాడు. దొంగను గమనించిన పూజారి వెంటనే గట్టి గట్టిగా కేకలు వేయడంతో అప్రమ త్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని పారిపో తున్న దొంగని పట్టుకున్నారు. అనంతరం  అతడిని ఆలయ ప్రాంగణం లోని స్తంభానికి తాళ్లతో కట్టేశారు. ఈ ఘటనలో కొందరు స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆ దొంగ డొంకతిరుగుడు   సమాధా నాలు చెప్పాడు. దీంతో కొందరు   ఆగ్రహంతో దుండగుడిని చావగొట్టారు.  స్థానికులు  అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసా గుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన దొంగను ఆస్పత్రికి తరలించారు. 

బీబీసీ అస‌లు ఉద్దేశ‌మేంటి?

బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేష‌న్. ఇది  వంద‌ల కోట్ల  రూపాయ‌ల నిధుల‌తో న‌డిచే ఒకానొక సంస్థ‌. ఈ సంస్థ‌లో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్ట్ కి జాబ్ అంటే అది  లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక్క‌డ చేరి  రిటైర్ అయిన  ఎంప్లాయి కోట్లాది రూపాయ‌ల‌ను ఇంటికి  తీసుకెళ్తారు. ఐదు రోజులు మాత్ర‌మే ప‌ని దినాలు. వీలైనంత  ఎక్కువ రిలాక్సేష‌న్ వంటి  ఎన్నో స‌దుపాయాల‌ను అందిస్తుంది బీబీసీ. ఒక రోజులో ఒక స్టోరీ రాసినా, చేసినా  ఆ ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుంది. సదరు ఉద్యోగిని నెత్తిన  పెట్టుకుని మరీ చూసుకుంటుంది ఈ ప్ర‌పంచ వార్తా  సంస్థ‌ బీబీసీ. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ లేబ‌ర్ లా ఫాలో అయ్యే కంపెనీ ఏదైనా ఉందంటే అది  బీబీసీయే. అయితే  బీబీసీ ఇటీవ‌ల  వ‌రుస వివాదాల‌ను ఎదుర్కొంటోంది. గ‌తంలో మోడీ గోద్రా అల్ల‌ర్ల  వ్య‌వ‌హారంపై ఒక డాక్యుమెంట‌రీ  రిలీజ్ చేసిన  బీబీసీ. ఆ త‌ర్వాత  ఇక్క‌డ ఈడీ రైడ్స్ ఫేస్ చేయాల్సి వ‌చ్చింది. అంతే కాదు త‌న అడ్రెస్ తో స‌హా అన్నీ మార్చుకోవ‌ల్సి వ‌చ్చింది. అంతేనా ప్ర‌స్తుతం  బీబీసీ  నుంచి క‌లెక్టివ్ న్యూస్ రూమ్ అనే పేరు మార్చుకోవ‌ల్సి  వ‌చ్చింది.  ప్ర‌భుత్వ తాకిడిని  ఎదుర్కునేందుకు మ‌రో దారి  వెతుక్కోవ‌డంలో భాగంగా  ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీబీసీ  అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి కూడా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కుంటోంది. ట్రంప్ ప్ర‌సంగాన్ని వ‌క్రీక‌రిస్తూ బీబీసీ డాక్యుమెంట‌రీ త‌యారు చేసింద‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. దీంతో తీవ్రంగా స్పందించిన ట్రంప్ బీబీసీ పై ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని సందేశాలు పంపారు. త‌న లీగ‌ల్ టీమ్ ద్వారా ఆ సంస్థ‌కు పెద్ద ఎత్తున తాఖీదులు పంపారు. దీంతో బీబీసీ  ఇద్ద‌రు ఉద్యోగుల‌కు ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికింది. క‌ట్ చేస్తే 5 బిలియ‌న్ డాల‌ర్ల ప‌రువు న‌ష్టం  ప‌రిహారం  చెల్లించ‌మ‌ని డిమాండ్ చేశారు ట్రంప్. అది వీలు కాద‌ని.. కావాలంటే ఎన్ని క్ష‌మాప‌ణ‌లైనా చెబుతామ‌ని రిప్లై ఇచ్చింది. బీబీసీ. అయితే ఈ విష‌ యం మీ ప్ర‌ధానితో మాట్లాడ‌తాన‌ని బెదిరించారు ట్రంప్. వారి నుంచి ఇద్ద‌రు టాప్ ఎంప్లాయిస్ తొల‌గింపు అన్న చ‌ర్య త‌ప్ప మ‌రెలాంటి  రియాక్ష‌న్ లేదు. దీంతో ట్రంప్ బీబీసీపై భారీ  ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ దావా విలువ ఇండియ‌న్ క‌రెన్సీలో  అక్షరాలా 90 వేల కోట్లు.  భారీ మొత్తంలో బీబీసీకి చారిటీ నిధులున్న మాట వాస్త‌వ‌మే  కానీ ఇంత మొత్తంలో న‌ష్ట‌ప‌రిహారం క‌ట్ట‌డం మాత్రం క‌ష్ట‌మే. ఎందుకంటే ఉద్యోగులు తెలిసీ తెలియ‌క చేసిన త‌ప్పుల‌కు ఇంత మొత్తం చెల్లించ‌డం అంటే అది  బీబీసీకి అయ్యే ప‌ని కాదని అంటున్నారు చాలా మంది.. ఇంత‌కీ బ్రిట‌న్ కి చెందిన ఈ వార్తా వ్య‌వ‌స్థ భార‌త్, యూఎస్ వంటి దేశాల‌ను ఎందుకు టార్గెట్ చేసింది? ఈ సంస్థ అస‌లు ఉద్దేశ‌మేంటి? ఇందులో ఏదైనా మ‌ర్మం దాగి ఉందా? అన్న‌ది ఒక డిబేట్ కాగా, బీబీసీ ఇప్ప‌టి  నుంచే కాదు ఎప్ప‌టి నుంచో ఇలాగే ఉంది. కాకుంటే ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత బీబీసీ కంటెంట్ మ‌రింత వైల్డ్ గా  డిస్ట్రిబ్యూట్ అవుతోంది. దీంతో బీబీసీని టార్గెట్ చేస్తున్నారు ట్రంప్, మోడీ వంటి  వారు. గ‌తంలో బీబీసీ చేసిన డాక్యుమెంట‌రీలెన్నో ఇలాంటి ఎన్నో వ‌క్రీక‌ర‌ణ‌ల‌తోనే ఉంటా యి కావాలంటే చూసుకోవ‌చ్చంటారు కొంద‌రు. కార‌ణం బీబీసీకి వ‌క్రీక‌ర‌ణ అన్న‌ది  దాని  డీఎన్ఏలోనే ఉందంటారు.

ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల హవా

ఎప్పట్లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేలం కొందరు ఊరూ పేరూ కూడా పెద్దగా తెలియని ప్లేయర్ల జాతకాలు మార్చేసింది. ఇప్పటి వరకు వారి పేర్లు కూడా ప్రపంచానికి తెలియని ప్లేయర్లను కోటీశ్వరులను చేసింది. అదే  సమయంలో  మల్టీట్యాలెంటెడ్ ప్లేయర్లపై కాసులు కురిపించింది. అన్ని ఫ్రాంచైజీలూ తమ జట్లలోని లోటు పాట్లను సరిదిద్దు కోవడానికి అందుకు పనికొస్తారని భావించిన  ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ ఏకంగా  25.20 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడీ  ఆసీస్ యంగ్ ప్లేయర్. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. రూ.25.20 కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు స్టృష్టించాడు. భారీ పర్సుతో వేలంలో దిగిన కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసింది. ముంబై, రాజస్థాన్ తదితర ఫ్రాంచైజీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న కేకేఆర్, గ్రీన్‌ను మాత్రం వదలకుండా పట్టుకుంది. అలాగే శ్రీలంక పేసర్ మతీష పతిరాణాను కూడా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. వీళ్లిద్దరే ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్లు కావడం గమనార్హం. అన్ని ఫ్రాంచైజీలూ స్టార్ ప్లేయర్ల వెంట పడతారనుకుంటే.. ఈసారి వేలంలో దేశవాళీ ప్లేయర్ల కోసం హోరాహోరీ పోరు జరిగింది. రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ, యూపీ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం గట్టిపోటీ ఎదుర్కొన్న సీఎస్కే.. వీళ్లిద్దర్నీ చెరో రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ నుంచి కుర్రాళ్లపై ఫోకస్ పెట్టిన ఈ టీం.. ఈసారి కూడా కుర్రప్లేయర్లతో జట్టులో జోష్ నింపేందుకు రెడీ అవుతోంది. తమకు ఇంత భారీ ధర పలుకుతుందని ప్రశాంత్, కార్తీక్ ఇద్దరూ అనుకోలేదు. వీళ్లిద్దరే కాదు జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌కు రూ.8.40 కోట్లు దక్కగా.. మధ్యప్రదేశ్ యంగ్‌స్టర్ మంగేష్ యాదవ్‌కు రూ.5.2 కోట్ల ధర లభించింది. అలాగే ఢిల్లీ వికెట్ కీపర్ తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రాజస్థాన్ క్రికెటర్ ముకుల్ చౌదరీ (రూ.2.6 కోట్లు) దక్కించుకున్నారు. వీరంతా కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన వారే కావడం గమనార్హం.

ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజనా?

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చని చెప్పుకొచ్చాడు. అందుకే మేనేజ్ మెంట్  టీమ్‌ లోకికి  యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోనీ ని ఆయన్ను చూస్తే చాలు అనుకునేవాళ్లు కొంతమంది. ఏదో ఒక ఫార్మాట్.. ఆడితే చాలు అనుకునేవాళ్లు మరికొంత మంది. ప్రతి ఐపీఎల్ సీజన్ చివర్లో.. అభిమానుల గుండెల్లో ఓ గుబులు.. మాహీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడా? అని. ధోనీ కూడా ఏం తక్కువ కాదు, మోకాళ్ల నొప్పి వేధిస్తున్నా.. వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నా.. తమ అభిమానుల కోసమే అన్నట్టుగా ప్రతి ఐపీఎల్‌కు సిద్ధమవుతుంటాడు. ఈ సారి కూడా తాను ఐపీఎల్ ఆడతున్నట్లు ఏదో రకంగా హింట్లు ఇస్తూ వస్తాడు. క్రీజులో నిలబడి భారీ షాట్లు కొట్టాలన్నా.. సెకండ్లలో స్టంప్స్ పడగొట్టాలన్నా మాహీనే కావాలి. ధోనీ బ్యాటింగ్‌కి రాకపోయినా పర్వాలేదు.. జట్టులో ఉంటే చాలు అని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో పాటు ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓ అలజడి సృష్టించే వార్త ఒకటి  భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప నుంచి వచ్చింది. పరిస్థితులను చూస్తుంటే ధోనీకిదే చివరి సీజన్‌  అవ్వొచ్చు. ఆపై ఎడిషన్‌ ఆడతాడని తాను అనుకోవడం లేదని ఉతప్ప చెప్పాడు. ఐపీఎల్‌ మినీ వేలంలో సీఎస్ కే ఎక్కువగా యువ క్రికెటర్లపై ఇన్వెస్ట్ చేసిందనీ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి టాలెంట్ కలిగిన యువ క్రికెటర్లను ఫ్రాంచైజీతో ఉంచుకుందన్నారు.  ధోనీ మరిన్ని సీజన్లు ఆడకపోవచ్చనే దానికి ఇది సూచికని, క్రికెటర్‌గా ఆడకపోయినా సీఎస్ కేకు ధోనీ మెంటర్‌గా వస్తాడని చెప్పుకొచ్చాడు.    దానికి తగ్గట్లే సీజన్ వేలంలో సీఎస్‌కే యూపీకి చెందిన 20 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్ వీర్‌లో పాటు రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ , బ్యాటర్ కార్తీక్‌శర్హలను అన్ క్యాప్‌డ్ అటగాళ్లయినప్పటికీ చెరో 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ  సీజన్లో మొత్తం 9 మంది యువ క్రికెటర్లను చెన్నై సొంతం చేసుకోవడం భవిష్యత్తు అవసరాల కోసమే అంటున్నారు.

ఎన్టీఆర్ రాజు కన్నుమూత

దివంగత ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న  ఎన్టీఆర్ రాజు  బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూశారు. ఎన్టీఆర్ రాజు మరణంతో  ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. ఎన్టీఆర్ రాజు రెండు పర్యాయాలు టీటీడీబోర్డు సభ్యునిగా అంకిత భావంతో సేవలందించారు.   రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు.  ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా వద్దని తిరస్కరించి, ఆజన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు .పదవుల కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలసుత్తుంది.  

మరో ఏడు దేశాలపై ట్రంప్ పర్యాటక నిషేధం

వివిధ దేశాలపై విధిస్తున్న పర్యాటక నిషేధంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలా నిషేధించిన దేశాల  జాబితాలో కొత్తగా మరో ఏడు దేశాలను చేర్చింది. జనవరి 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. జాతీయ భద్రత, ప్రజా భద్రత, వీసా నిబంధనల ఉల్లంఘనలు తదితర కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ పేర్కొంది. బర్కీనో ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా, లావోస్, సియేరా లియోన్‌పై విధించిన ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. వీటితో పాటు మరో 11 దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం విధించింది. అయితే, ఈ ఆంక్షల నుంచి తుర్క్‌మెనిస్థాన్‌కు మాత్రమే స్వల్ప ఊరట లభించింది. తుర్క్‌మెనిస్థాన్ పౌరులకు వలసేతర వీసాల జారీపై గతంలో విధించిన నిషేధాన్ని ట్రంప్ ప్రభుత్వం తాజాగా తొలగించింది. కాగా పర్యాటక నిషేధాల విస్తరణను అమెరికా ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆయా దేశాల్లో పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత కుమ్ములాటలు, వీసా నిబంధనల ఉల్లంఘనలే నిషేధాజ్ఞలకు కారణమని పేర్కొంది. విదేశీయులపై పూర్తి తనిఖీలు సాధ్యం కాని పక్షంలో వీసాలను జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వారితో ముప్పు పొంచి ఉంటుందని ప్రకటించింది.  నిషేధిత జాబితాలోని దేశాల్లో అవినీతి, పౌర డాక్యుమెంట్స్‌లో లోపాలు, జనన ధ్రువీకరణలో లోటుపాట్లు వంటి కారణాలతో వీసా జారీకి పూర్తిస్థాయి తనిఖీలు సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, అమెరికాలో శాశ్వత నివాసార్హత ఉన్న వారు, ఇతరత్రా వీసాలు ఉన్న వ్యక్తులు, దౌత్యవేత్తలు, క్రీడాకారులు, అమెరికా ప్రయోజనాలకు కీలకమైన వ్యక్తులపై ఈ నిషేధం వర్తించదని అమెరికా పేర్కొంది.

కారు బీభత్సం... ఇద్దరు మృతి

హైదరాబాద్ శివారులో  బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారు జామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ శివారు  మైలార్ దేవుని పల్లి ప్రాంతంలో ఈ ఉదయం ఐదు గంటల సమయంలో  అతి వేగంగా దూసుకొచ్చిన  కారు అదుపుతప్పి రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించే దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆ దుకాణంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. మరొ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో తండ్రి ప్రభుమహరాజ్, అతని ఇద్దరు కుమారులు దీపక్, సత్తునాథ్ లు నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో దీపక్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తండ్రి ప్రభు మహరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.  ప్రభు మహరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి మైలార్ దేవుపల్లిలో దుప్పట్లు, రగ్గుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.   కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెడుతుండగా అదుపుతప్పిందనీ, సంఘటన జరిగిన తరువాత కారులో ఉన్నవారిలో ముగ్గురు పారిపోగా, మిగిలిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.  

ఐపీఎల్ కు కరీంనగర్ ప్లేయర్ అమన్ రావు

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రూ. 30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది.  హైదరాబాద్‌ అండర్‌ 23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అమన్‌రావుది క్రీడా, రాజకీయ  నేపథ్యం ఉన్న కుటుంబం. అమన్ రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్‌గా ఆడారు. ఆయన తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.అమన్ రావు  స్వగ్రామం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి కాగా, కొన్నేళ్లుగా వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో మంచి ప్రతిభ కనబరిచాడు. అయినా దుబాయ్ లో జరిగే వేలంలో పాల్గొనేందుకు అమన్ రావు వద్ద పాస్ పోర్టు కూడా లేకపోవడంతో, విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని తనకు పాస్ పోర్టు జారీ చేయించారు. దీంతో అమన్ రావు ఐపీఎల్ వేలంలో పాల్గొనగలిగారు.