ఏపీకి మరో వాయు‘గండం’!

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటున్నది. ఇప్పుడిప్పుడే మొంథా తుపాను దెబ్బ నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీపంలో ఈ నెల 19 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి  నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉండగా.. ఏపీలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండటం లేదు. దీంతో పగలు ఉక్కపోత, రాత్రిళ్లు చలికి గజగజ అన్నట్లుగా ఏపీలోని వాతావరణం మారింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ సీజన్ లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో శుక్రవారం (నవంబర్ 14) అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

గన్నవరం టు సింగపూర్ విమాన సేవలు ప్రారంభం

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడప నుంచి. శనివారం ప్రారంభమైన ఈ విమాన సర్వీసును  విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు లాంఛనంగా ప్రారంభించారు. గన్నవరం నుంచి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసు ప్రారంభం కావడంతో  రాజధాని అమరావతి నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అంటున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం, సింగపూర్ విమాన సర్వీసును వారానికి మూడు రోజులు నడపనుంది.  గన్నవరం సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభంతో రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల కు సంబంధించి కీలక పురోగతి సాధించినట్లయ్యింది.   ప్రయాణీకుల సంఖ్య, వయబులిటీ వంటి  అంశాలతో సంబంధం లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు సింగపూర్ కు విమానసర్వీసులు నడుపుతుంది. మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఇందులో భాగంగా తొలి విమానం ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు గన్నవరం నుంచి సింగపూర్ కు బయలుదేరింది.  .

మావోయిస్టు సీనియర్ నేత ఆజాద్ అలియాస్ సాంబయ్య లొంగుబాటు?

కేంద్ర ప్రభుత్వం నక్సల్ విముక్త భారత్ లక్ష్యం అంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలౌతోంది. వరుస ఎన్ కౌంటర్లో వందల మంది మావోయిస్టులు హతం కాగా, భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. అలా లొంగిపోయిన వారిలో పార్టీకి చెందిన అంత్యంత కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత బలపైన ప్రాంతంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉనికి మాత్రంగా నిలిచింది. ఆ తరువాత మావోయిస్టు పార్టీకి అంతో ఇంతో బలమైన పట్టు ఉన్న తెలంగాణలో సైతం మావోయిస్టు పార్టీ వరుస ఎదురుదెబ్బలతో సతమతమౌతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి తెలంగాణలో  మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సాంబయ్యతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ కేడర్ కూడా ఆయుధాలు విడిచి  జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలియవచ్చింది. అయితే సాంబయ్య, ఆయనతో పాటు క్యాడర్  లొంగుబాటు వార్తలను పోలీసులు   అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  ములుగు జిల్లా  మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995 నుంచీ అజ్ణాతంలో ఉన్నారు.   గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా  కూడా పని చేసిన సాంబయ్యపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.  

సతీష్ కుమార్ ది హత్యే!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి .. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు.   దీంతో సతీశ్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి పోలీసు స్టేషన్ లో కేసు  నమోదైంది.   మృతుడు సతీష్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శుక్రవారం (నవంబర్ 14)న మరణించి రైలు పట్టాలపై పడి ఉన్నారు.  దీంతో ఆయనది అనుమానాస్పద మృతిగా అందరూ భావించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీయులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఉండటంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో సతీష్ ది హత్యే అని తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.  అయితే  వైసీపీ మాత్రం దర్యాప్తు అధికారులు, తెలుగుదేశం నేతల వేధింపుల కారణంగానే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది.  అలాగే సతీష్ ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.  టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకరరెడ్డి అయితే.. ఈ ఆరోపణలు, డిమాండ్ లతో చేసిన అతి వికటించింది.    అత్యంత కీలకమైన కేసులో  ఫిర్యాదుదారు, సాక్షి అయిన ఓ పోలీసు  అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మామూలుగా అయితే ఆయన హత్యకు గురయ్యారు అని వైసీపీయులు ఆరోపణలు చేయాలి. కానీ.. అసలు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా తేలక ముందే ఆత్మహత్య అంటూ నిర్ధారించేసి ఆరోపణలు గుప్పించడం చూస్తుంటూ.. గతంలో అంటే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు తొలుత గుండెపోటు అంటూ ప్రచార చేసిన విధానం గుర్తుకు వస్తున్నది.  ఇక భూమన అయితే..  ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా ఆరోపణలు గుప్పించడం పలు సందేహాలకు తావిస్తున్నది. గతంలో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కూడా వైసీపీయులు ఇలాగే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఇప్పుడు విషయానికి వస్తే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే పరకామణి చోరీ కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి  తెచ్చి కేసు  రాజీ చేయించారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ వాంగ్మూలం ఇచ్చేందుకు వెడుతున్న సమయంలోనే సతీష్  మరణించారు. ఇక్కడే  సతీష్ మృతి వెనుక ఈ కేసులో నిందితులుగా  ఉన్న వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు  ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు.  తన ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా  సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిన రవిపై పలువురు తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల యవ్వారలన్నీ బయటపెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకే సవాల్ చేసి బెదరించే స్థాయికి వెళ్లాడు. అప్పటి నుంచీ రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండంటూ రవి పోలీసులకు సవాల్ కూడా విసిరాడు.  ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాలోని  రూ. 3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.  కాగా రవి శుక్రవారం (నవంబర్ 14) హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.    

బ్యాటింగ్ కాదు విధ్వంసం!

వీడెవ‌డండీ బాబూ! వంద మంది వీరేంద్ర సెహ్వాగ్ లు ఒకే సారి బ్యాటింగ్ చేస్తున్నట్లు..   యాభై మంది రిష‌బ్ పంత్ ల ఇన్నింగ్స్ ఇన్ స్పిరేష‌న్ గా తీస్కున్న‌ట్టు.. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. ప్ర‌తి  రెండో బాల్ కి ఒక సిక్స్ కొడుతూ..  స్కోర్ బోర్డుకు ర‌న్నింగ్ రేస్ నేర్పిస్తున్న‌ట్టు  ప్ర‌తి బాల్ నీ ఫోర్ గానీ సిక్స్ గానీ వెళ్లేలా చేస్తూ.. ఆ మాట‌కొస్తే.. బాలు ఉన్న‌దే తాను ఫోర్లూ సిక్స్ లు కొట్టేందుక‌న్న‌ట్టు.. క‌ల‌లో రాకుమారుడుగానీ బ్యాటు ప‌ట్టుకుని ఫ‌టా ఫ‌టా బాదిన‌ట్టూ.. పుస్త‌కాల్లో మాత్ర‌మే క‌నిపించే కామిక్ క్యారెక్ట‌ర్ గానీ మాయ‌లూ మంత్రాలు  చేసిన‌ట్టు.. ఇలా ఒక‌టా రెండా ఆ విశేష‌ణాలు అన్నీ ఇన్నీ కావు.. యూఏఈ తో ఇండియా ఏ జ‌ట్టు ఆడిన ఈ ట్వంటీ ట్వంటీలో స్టేడియంలో కూర్చున్న‌దే ప‌ట్టుమ‌ని పాతిక మంది.. వారంతా క‌ల‌సి వైభ‌వ్ సూర్య‌వంశీ ఆడుతుంటే..స్టేడియం నిండా జ‌న‌మున్న‌ట్టు ఆ అరుపులేంటి  కేక‌లేంటి..??? జ‌స్ట్ 17 బంతుల్లో హాఫ్ సెంచురీ, జ‌స్ట్ 32 బంతుల్లో సెంచురీ.. ప్ర‌తి బంతినీ ఆకాశం చూడాలా అన్న‌ట్టు చిత‌క‌బాదుతూనే వెళ్లాడంటే న‌మ్మండీ.. అబ్బ‌బ్బ‌బ్బ 10 ఫోర్లు 15 సిక్సులూ.. ఇలా చెబుతూ పోతుంటే ఆ ఇన్నింగ్స్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ పారించిన ప‌రుగుల వ‌ర‌ద‌కు ఒక అంతే లేదా అన్న‌ట్టు మారింది అత‌డి బ్యాటింగ్ సెన్సేష‌న్.   అస‌లు వీ అన్న అక్ష‌రంతో పేరున్న వాళ్లంతా  ఒక్కో వీరేంద్ర సెహ్వాగ్ లా  చెల‌రేగుతారా? అన్న‌ట్టుగా సాగిందా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్. కేవ‌లం 41 బంతుల్లో 144 ప‌రుగులు చేసి.. ఎట్ట‌కేల‌కు అత‌డు ఔట్ అయితే ప్ర‌దత్య‌ర్ధి ప్లేయ‌ర్లు కూడా హ‌ర్ట్ అయ్యారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.. అది కోత కాదు.. మామా ఊచ కోత‌!  అత‌డు ఆడిన మొద‌టి బంతికే ఇచ్చిన క్యాచ్ ని ఎందుకు డ్రాప్ చేశామా? అని ప్రత్యర్థి జట్టు ఫీల‌వ‌లేదంటే ఒట్టు. ఒక స‌మ‌యంలో ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే ఇంత‌టి  విధ్వంస‌క‌ర  ఇన్నింగ్స్ ని  మ‌నం కూడా  చూడ‌లేక పోయే వాళ్లం  క‌దాని  యూఏఈ జ‌ట్టు ఆట‌గాళ్లు కూడా  ఫీల‌య్యేలా చేశాడు పట్టుమ‌ని ప‌దిహేను ఏళ్లు కూడా లేని వైభ‌వ్ సూర్య‌వంశీ.

శ్రీశైలంలో కోటి దీపోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆలయ అధికారులు ఆలయ ప్రధాన మాడవీధి నుండి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయం ముందు 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం 6.30 గంటలకు కైలాస వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, దశవిధ హారతులను సమర్పించారు.  గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ప్రమిదలు, పూజా సామాగ్రిని  దేవస్థాన అధికారులు ఉచితంగా అందజేశారు.  భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అధ్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీశైలం క్షేగ్రంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.  

కాశ్మీర్ లో భారీ పేలుడు.. 13 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం (నవంబర్ 14) అర్ధరాత్రి సంభవించిన ఈ పేలుడులో కనీసం 12 మంది మరణించారు. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ కారు పేలుడు సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం.   కాగా నౌగామ్ పోలీసు స్టేషన్ లో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఇస్పత్రికి తరలించారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా పేలుడు జరిగిన నౌగామ్ సీఎస్ భద్రతా పరంగా అత్యంత కీలకమైన, సున్నితమైనదని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే వ్యూహాత్మకంగా ఉగ్రవాదులు ఈ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు.  కాగా పేలుడు అనంతరం ఆ పోలీసు స్టేషన్ పరిశర ప్రంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.  

12 మంది సైబర్ నిందితుల అరెస్టు

డిజిటల్‌ అరెస్టు పేరిట  దోచుకుంటున్న 12 మంది సైబర్‌ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు శుక్రవారం (నవంబర్ 14) అరెస్టు చేశారు.   కడప  ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆ వివరాలు వెల్లడించారు.  నిందితులు వేంపల్లెకు చెందిన రిటైర్డ్‌ ఎంఈవో వీరారెడ్డికి ఏడు నెలల కిందట వీడియోకాల్‌ చేసి ఆయన పేరుతో ఉన్న సిమ్‌ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఢిల్లీలో కేసు నమోదైందని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలంటూ  ఫేక్‌ సుప్రీంకోర్టు కాపీలు వాట్సప్‌ ద్వారా పంపించి డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించారు. ఈ అరెస్టును తాత్కాలికంగా వాయిదా వేసేందుకు డబ్బు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంటులోని డబ్బు పంపించారు. అలా దాదాపు ఏడు నెలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరారెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు వేంపల్లెకు వచ్చినట్టు సమాచారం రావడంతో 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.

విశాఖలో పెట్టుబడుల సదస్సు..తొలి రోజు రికార్డు స్థాయిలో ఎంవోయూలు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు శుక్రవారం (నవంబర్ 14) రికార్డు స్థాయిలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నిర్వహిస్తున్న ఈ భాగస్వామ్య సదస్సుకు అద్భత స్పందన లభించింది. రెండు రోజుల సదస్సులో మొత్తం 400 ఎంఓయూల ద్వారా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా. ఇందులో భాగంగా తొలి రోజు సదస్సులో రూ. 8. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఎంఓయూల ద్వారా  12.05 లక్షల ఉాద్యోగాలు వస్తాయన్నది అంచనా.  అంతే కాకుండా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.   ఇక రెండో రోజు అంటే ఆదివారం  41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్న ఈ ఎంవోయూల ద్వారా  4.16 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇక మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు జరుగుతాయని  తెలిపాయి.   

బిహార్‌లో జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదు : ప్రధాని మోదీ

  బిహార్‌లో ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మాట్లాడుతూ.. బిహార్‌ ప్రజలు అతి పెద్ద విజయం అందించారన్నారని.“బిహార్‌లో ఇవాళ ప్రతి ఇంట మఖానా పాయసం వండుకునే ఆనందం కనిపిస్తోంది. ఒకప్పుడు ‘జంగిల్‌ రాజ్‌’ అన్న మాట వచ్చినప్పుడు ఎలాంటి వ్యతిరేకత లేదని… ఇక ఆ రోజులు తిరిగి రానివ్వమని ప్రజలు తేల్చిచెప్పారు” అని మోదీ తెలిపారు. తాము ప్రజలకు సేవకులమని, వారి మనసులు గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌ చేసి ఎన్డీఏకి ప్రజలు ఘనవిజయం అందించారని అభినందించారు.  జంగిల్‌ రాజ్‌ కాలంలో జరిగిన దోపిడీలు, అక్రమాలు, హింసను ప్రజలు మరచిపోలేరని… ఈసారి వచ్చిన ఫలితాలతో ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని ప్రధాని తెలిపారు. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసేవని… ఇప్పుడు ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా బయటకు వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌ చేసిన పరిస్థితి బిహార్‌ మార్పుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నరు. నూతన సంకల్పంతో బీహార్ అభివృద్ధికి పని చేసేందుకు ఈ చరిత్రక విజయం మరింత శక్తినిస్తుందన్నారు. యువశక్తి, మహిళా శక్తి ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విజయం వెనుక సీఎం నితీశ్ కుమార్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సభ్యులకు ప్రధాని అభినందనలు తెలిపారు.

ఏపీలో రెండు రోజుల్లోనే రూ.7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

  విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు  మొత్తంగా 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సులో హజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించామని తెలిపారు.  త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని సీఎం కొనియాడారు. ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగాలు వచ్చాయని స్ఫష్టం చేశారు.  నిన్న, ఇవాళ కలిపి 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు కల్పించనున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి... భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

లులూ గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

  ఏపీలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం సీఎం చంద్రబాబు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.  అనంతరం  చంద్రబాబు మాట్లాడుతూ గత పాలకులు నిలిపోసిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చామని అన్నారు. గూగుల్, ఆర్సెల్లార్ వంటి సంస్థలు విశాఖ రావడం లులూ సంస్థకు సానుకూల అంశమని సీఎం చెప్పారు. మూడేళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లులూ మాల్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదని, విశాఖ పర్యాటకానికి దోహదపడుతుందని చెప్పారు.  అలాగే ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ సంస్థ ఇందుకు అవసరమ్యే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా లులూ చైర్మన్‌ను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంలోనూ   లులూ సంస్థ ఒప్పందాలు చేసింది.  మామిడి, జామ పల్ప్‌తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేస్తామని లులూ సంస్థ వెల్లడించింది వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.  త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులూ సంస్థ 13.83 ఎకరాలు, 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌తో 5 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రస్తుతం విశాఖ లో నిర్మించనున్న మాల్ దేశంలో భారత్ లో 9వ దని రాష్ట్రంలో  మొట్టమొదటిదని లులూ సంస్థ వెల్లడించింది.  

జూబ్లీహిల్స్ గెలుపు మరింత బాధ్యతను పెంచింది : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి తను మాట్లాడనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరని హెల్త్ అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని రేవంత్‌రెడ్డి  అన్నారు.  అయితే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అహంకారం పోలేదని, మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.  స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని రేవంత్‌రెడ్డి అన్నారు.  రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నరు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్‌కి, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. దీని ద్వారా గత రెండేళ్ల తమ పాలనను ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

బీఆర్‌ఎస్ ఓటమి ....కవిత షాకింగ్ ట్వీట్

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రిజల్డ్స్  వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్  చేసింది. కర్మ హిట్స్‌ బ్యాక్‌’’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నది. దండం పేట్టే ఎమోజీలతో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇవాళ వెలువడిన జూబ్లీ ఫలితాల్లో బీఆర్‌ఎస్  ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే.  ఇటీవల కవిత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆమె అధినేత కేసీఆర్ మినహా మిగతా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్‌ఎస్  అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.

ఏపీలో రిలయెన్స్ భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు.  రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ భేటీ అనంతరం ఆ సంస్థ ప్రకటించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సీఎంతే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.  ఈ సందర్భంగా  ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన జీపీయులు, టీపీయులు, ఏఐ ప్రాసెసర్‌లతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుదన్నారు. ఈ రెండు కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ అవతరించనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయెన్స్ నిర్మించనుంది. దీంతో పాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  

యావద్దేశ ప్రగతి గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు.. పియూష్ గోయెల్

విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందస్సులో ప్రసంగించిన ఆయన చంద్రబాబును కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రగతి గురించి ఆలోచించే  విజనరీగా అభివర్ణించారు.   చంద్రబాబు వంటి నాయకుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడన్న పియూష్ గోయెల్, స్వర్ణాంధ్ర విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం  గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల కోసం ఢిల్లీలో నిర్మించిన  భారత్ మండపం' తరహాలో  ఏపీలో ఆంధ్రా మండపం నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని   2047 నాటికి భారతదేశాన్ని  సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నే ఈ ప్రగతిని సాధించగలమన్న పియూష్ గోయెల్.. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ విధానంతో  సాంకేతికతను  అందరికీ చేరువ చేస్తున్నామన్నారు.  

జూబ్లీ బైపోల్.. కౌంటింగ్ వేళ ఇండిపెండెంట్ ఆభ్యర్థి మృతి

జూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అన్వర్.. కౌంటింగ్ సందర్భంగా తీవ్ర టెన్షన్ కు లోనై గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 40 ఏళ్లు.   ఎర్రగడ్డలో నివాసముండే మహ్మాద్ అన్వర్ ఉదయం నుంచి  కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ఓటమి భయం, ఆందోళనే ఆయన మరణానికి కారణమని అంటున్నారు.  

ఢిల్లీ పేలుడు.. ప్రధాన నిందితుడి ఇల్లు పేల్చివేత

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నడి ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.    జమ్మూ కశ్మీర్  పుల్వామాలోని  అతడి ఇంటిని గురువారం(నవంబర్ 13)  అర్ధరాత్రి దాటిన  తర్వాత  భద్రతా దళాలు పేల్చివేశాయి. పేలుడు పదార్థాలు ఉపయోగించి అతడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి.  ఉమర్ నబీ  తన నివాసాన్ని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా చేసుకోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.  కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్‌లో భాగంగానే డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు.   అలాగే ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. సోమవారం (నవంబర్ 10)న జరిగిన ఢిల్లీ పేలుడులో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ కారు నడిపి ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీయే అని దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి. ఆ పేలుడులో ఉమర్ నబీ కూడా మరణించాడు.