జూబ్లీహిల్స్ గెలుపు మరింత బాధ్యతను పెంచింది : సీఎం రేవంత్
posted on Nov 14, 2025 @ 5:28PM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి తను మాట్లాడనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరని హెల్త్ అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అహంకారం పోలేదని, మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని రేవంత్‌రెడ్డి అన్నారు.
రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నరు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్‌కి, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. దీని ద్వారా గత రెండేళ్ల తమ పాలనను ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.