మావోయిస్టు సీనియర్ నేత ఆజాద్ అలియాస్ సాంబయ్య లొంగుబాటు?
posted on Nov 15, 2025 @ 11:27AM
కేంద్ర ప్రభుత్వం నక్సల్ విముక్త భారత్ లక్ష్యం అంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలౌతోంది. వరుస ఎన్ కౌంటర్లో వందల మంది మావోయిస్టులు హతం కాగా, భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. అలా లొంగిపోయిన వారిలో పార్టీకి చెందిన అంత్యంత కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత బలపైన ప్రాంతంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉనికి మాత్రంగా నిలిచింది. ఆ తరువాత మావోయిస్టు పార్టీకి అంతో ఇంతో బలమైన పట్టు ఉన్న తెలంగాణలో సైతం మావోయిస్టు పార్టీ వరుస ఎదురుదెబ్బలతో సతమతమౌతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సాంబయ్యతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ కేడర్ కూడా ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలియవచ్చింది. అయితే సాంబయ్య, ఆయనతో పాటు క్యాడర్ లొంగుబాటు వార్తలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ములుగు జిల్లా మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995 నుంచీ అజ్ణాతంలో ఉన్నారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పని చేసిన సాంబయ్యపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.