ఏపీకి మరో వాయు‘గండం’!
posted on Nov 15, 2025 @ 11:49AM
ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటున్నది. ఇప్పుడిప్పుడే మొంథా తుపాను దెబ్బ నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీపంలో ఈ నెల 19 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదలా ఉండగా.. ఏపీలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండటం లేదు. దీంతో పగలు ఉక్కపోత, రాత్రిళ్లు చలికి గజగజ అన్నట్లుగా ఏపీలోని వాతావరణం మారింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ సీజన్ లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో శుక్రవారం (నవంబర్ 14) అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.