ఏపీలో రెండు రోజుల్లోనే రూ.7.15 లక్షల కోట్ల పెట్టుబడులు
posted on Nov 14, 2025 @ 6:49PM
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు మొత్తంగా 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సులో హజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించామని తెలిపారు.
త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని సీఎం కొనియాడారు. ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగాలు వచ్చాయని స్ఫష్టం చేశారు.
నిన్న, ఇవాళ కలిపి 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు కల్పించనున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి... భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.