రాజమహేంద్రవరానికి ఓఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఆకాశమే హద్దా అన్నట్లుగా దూసుకుపోతున్నది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో రాష్ట్రప్రగతి నల్లేరుమీద బండి నడకలా సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలలో కూడా అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.   ఇందులో భాగంగానే రాజమహేంద్ర వరం చుట్టూ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి బీజం పడింది. రాజమహేంద్రవరంకు ఔటర్ రింగ్ రోడ్డు వేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ధి వేగం పెరుగుతుందనీ, వైజాగ్, చెన్నై రోడ్డు కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందనీ భావిస్తున్నారు.  అంతే కాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమౌతుందని భావిస్తున్నారు.  రాజమహేందరవరం ఔటర్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీని కోసం అధికారులు డీపీఆర్ రెడీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. డీపీఆర్ పూర్తికాగానే ఓఆర్ఆర్ కోసం భూమి సమీకరణ ప్రారంభించనున్నారు.   కాగా రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు విషయాన్ని మంత్రి నారాయణ ధృవీకరించారు. రాజమహేంద్రవరం మునిసిపల్  కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ మధురపూడి, రాజానగరం, దివాన్‌చెరువు, దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్‌ రాహుల్‌ మీనా పాల్గొన్నారు.  

హిడ్మా ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ!

హిడ్మా ఎన్‌కౌంటర్‌  ఓ కట్టుకథగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభివర్ణించింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను విజయవాడలో అరెస్టు చేసి హత్య చేసి మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి  మాడ్వి హిడ్మా , రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నిరాయుధులుగా ఉండగా పట్టుకుని క్రూరంగా హత్య చేశారని ఆ ప్రకటన పేర్కొంది.  ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ఆదివారం (నవంబర్ 23) దేశ వ్యాప్తంగా నిరసన దినం  పాటించాలని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది.     దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.  ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నదని ఆ ప్రకటన పేర్కొంది.  హిడ్మా,  అతని  భార్య  రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారనీ, ఈ సమాచారాన్ని కొందరు ద్రోహుల ద్వారా తెలుసుకుని వారిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.   కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఆంధ్ర ఎస్ఐబీ  ఈ నెల 15 న విజయవాడలో హిడ్మా తదితరులను అదుపులోనికి తీసుకుని  లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారని పేర్కొంది. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలని పేర్కొంది.   చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందన్న ఆ ప్రకటన వీరు  కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోందని పేర్కొంది. 

బెంగళూరు వదిలేస్తే భారీ ప్రోత్సాహకాలు, రాయతీలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు కర్నాటక బంపరాఫర్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ  బెంగళూరు నగరం నుంచి టెక్ కంపెనీలను, టెకీలను బయటకు వెళ్లిపొమ్మంటోంది కర్నాటక ప్రభుత్వం. ఇందు కోసం ఏకంగా ఒక పాలసీనే రూపొందించింది.  ఈ పాలసీ మేరకు  స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది సిద్దరామయ్య సర్కార్. ఇలా ఇచ్చే ప్రోత్సాహకాలలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె రాయితీ, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను మినహాయింపు, 5 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీలపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అదే కాకుండా కంపెనీలకు ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల్లో  పాతిక శాతం, ఏఐ, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధన ఖర్చులపై 40 శాతం వరకు   రీఫండ్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నది. ఈ విధానం టెక్ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు సమాచారం. దీనిపై  టెక్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ప్రభుత్వం నూతన ఐటీ పాలసీలో భాగంగా  కంపెనీలు మైసూర్, మంగళూరు వంటి నగరాలకు మారేందుకు డబ్బు ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీ కోసం కర్నాటక సర్కార్ ఐదేళ్లలో  దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. ఈ పాలసీలో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ పద్ధతిగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశాలుంటాయని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కర్నాటక సర్కార్ వచ్చే నెల రెండో వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బియాండ్ బెంగళూరు అన్న కర్నాటక సర్కార్ వ్యూహంలో లీవ్ బెంగళూరు కీలకం అంటున్నారు.   రాష్ట్రంలోని మైసూరు, మంగళూరు, హుబ్బిళి, ధారవాడ, బేలగావి, కలబురిగి, శివమెుగ్గ, దావణగెరె, తుమకూరు వంటి నగరాలు ఐటీ ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రప్రగతికి దోహదమౌతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలాగే కంపెనీలు రాష్ట్రంలోని ఇతర నగరాలకు తరలిపోవడం వల్ల బెంగళూరులో  ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యలు  కూడా ఆటోమేటిగ్గా సాల్వ్ అయిపోతాయన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది.   అలాగే బెంగళూరు నగరం విడిచి రాష్ట్రంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు ఎంచుకున్న ఐటీ ఉద్యోగులకు కూడా కర్నాటక ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  బెంగళూరు నుంచి రాష్ట్రంలోని మైసూరు మైసూరు, మంగళూరు, కలబురగి వంటి ఇతర నగరాలకు మారేందుకు అంగీకరిస్తే వారికి 50 వేలు ప్రొత్సాహకంగా అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 445 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధానం కూడా అతి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఓ వైపు స్టార్టప్ లను తరలిపోవాలని కోరుతూనే.. వాటికి సిబ్బంది కొరత లేకుండా, రాకుండా ఉద్యోగులకు కూడా బెంగళూరు వదిలి వెళ్లిపోవడానికి సుముఖత చూపితే ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.   దేశం మొత్తంలోనే ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా బెంగళూరు భాసిల్లుతోంది. అటువంటి నగరాన్ని వీడడానికి ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులూ ఏ మేరకు ముందుకు వస్తారన్నది చూడాల్సిందే.  

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?

నగరంలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ ఈ శుక్రవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపుతూ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.   అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో , అలాగే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన  రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ  జారీ చేసిన నోటీసుల్లో ఈ రెండు స్టూడియోలూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ తక్కువగా చెల్లిస్తున్నట్లే పేర్కొంది.  అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు.. తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ.. భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు  గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.   అన్నపూర్ణ స్టూడియో 1,92,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తోందనీ, దీని ప్రకారం  రూ.11, 52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా,   8,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లుగా చూపించి కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియో  68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ, కేవలం 19 వందల చదరపు అడుగుల విస్తీర్ణం అని మాత్రమే  చూపుతూ.  రూ.7,600 మాత్రమే టాక్స్ చెల్లిస్తోందని పేర్కొన్న అధికారులు ఆ మేరకు    బకాయిపడ్డ  మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని ఈ రెండు స్టూడియోలనూ నోటీసులు జారీ చేశారు. 

సాగర్ కుడికాలువకు గండి

నాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గురువారం (నవంబర్ 20)అర్ధరాత్రి గండి పడింది.  ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద కట్టకు గండి పడి నాగులేటి వాగుకు ఒక్కసారిగా  ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక  ప్రాంతాల ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.  పల్నాటి వీరుల తిరునాళ్ల నేపథ్యంలో నాగులేటి వాగుకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో  వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలలోకి నీరు చేరింది.   మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న ఆందోళనలో జనం ఉన్నారు. కాగా గండి విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని  గండి పూడ్చే పనులు చేపట్టారు.ఇలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కట్టను ధ్వసం చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా.. సాగర్ కుడికాలువకు గండిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఆందోళన వద్దంటూ ప్రజలకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు చేపట్టామనీ, మధ్యాహ్నానికల్లా గండిని పూడ్చేస్తామనీ హామీ ఇచ్చారు. అలాగే గ్రామాలలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అదే సమయంలో.. గండి పడటానికి గల కారణాలను నివేదిక రూపంలో అందించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. 

భార్యా బిడ్డల హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

వికారాబాద్  హత్యల కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం (నవంబర్  22) తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే..  వికారాబాద్ పట్టణంలో  ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించే ప్రవీణ్ కుమార్ కు అప్పటికే పెళ్లై ఒక కొడుకు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.  దీంతో వారివురూ వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది. అయితే వివాహం తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.   2019 ఆగస్టు 5 రాత్రి పీకలదాకా మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దదవ్వడంతో ఆగ్రహానికి లోన ప్రవీణ్ కుమార్  ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో భార్య మరియు ఐదేళ్ల కుమార్తెను  కొట్టి హతమార్చాడు. అనంతరం 9 ఏళ్ల కుమారుడని గొంతు నులిమి హత్య చేశాడు. భార్యా పిల్లలను హత్య చేసిన అనంతరం  పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య మొబైల్లో మెసేజీలు  చూసి  అనుమానం పెంచుకుని భార్య పిల్లలను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.   పోలీసులు సాక్ష్యాధారాలు లను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.  

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం

  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ దూకుడు పెంచింది.  ఈ కేసు దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని దర్యాప్తులో వెలుగులోనికి వస్తున్నది. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని సిట్ ఇప్పటికే విచారించింది. ఈ విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్ 19) ఉదయం వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విచారించారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు వైసీ సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.   ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలు కీలక అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. వారి వాంగ్మూలాలన సిట్ రికార్డు చేసింది. వారి విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు.  టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత, కొనుగోలు విధానాలు, కాంట్రాక్టుల కేటాయింపులపై సిట్ అధికారుల ప్రశ్నలతో వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం.  సుబ్బారెడ్డి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోనికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.    తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు  నోటీసులు జారీ చేశారు. అయితే.. అరోగ్యం సహకరించని కారణంగా తాను విచారణకు రాలేననీ వైవీ చెప్పడంతో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వచ్చి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలోనే విచారించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందన్న సంకేతాలను ఇచ్చింది.   వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై ఈ విచారణలో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. అప్పన విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.  

అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. ఆస్తుల అటాచ్

 ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి వరుస షాకులిస్తోంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. తాజాగా అంబానీ గ్రూపునకు చెందిన 1400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.    ఆయనకు చెందిన రిలయెన్స్ గ్రూప్ పై మనీలాండరింగ్  నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా  ఈ చర్య తీసుకుంది. ఇదే నెలలో ఈడీ ఇప్పటికే   అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కు చెందిన నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న 132 ఎకరాల భూమిని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ భూముల విలువ దాదాపు 4 వేల 462 కోట్లకు పైనే ఉంటుంది.  అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్ లో కూడా అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన సంస్థలకు సంబంధించి 3 వేల 84 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.   ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, కాంచీపురం, తూర్పు గోదావరిలలో ఉన్నాయి.  ఇప్పుడు తాజాగా  మరో 14వందల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ అనిల్ అంబానీకి చెందిన దాదాపు 9వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్లైంది. ఈడీ తాజాగా జప్తు  చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, భువనేశ్వర్ లలో ఉన్నాయి.  

తెరపైకి ఐ బొమ్మ వ‌న్.. పైరసీ నాన్ స్టాప్

ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం అన్న పాట చందంగా తయారైంది సినిమా పైరసీల వెబ్ సైట్ ల పరిస్థితి. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి ఆ ఐబొమ్మ వెబ్ సైట్ ను పోలీసులు ఇలా క్లోజ్ చేశారో లేదో.. అలా మరో పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చింది. ఇబొమ్మ వన్ దాని పేరు. దీనిని బట్టి చూస్తుంటే.. ఐబొమ్మ రవి అరెస్టుతో మొత్తం పైరసీని కట్టడి చేసినట్లు కాదని పోలీసు అధికారి సీవీ ఆనంద్ చెప్పిన మాట నిజమే అనిపించక మానదు. నిన్నమొన్న‌టి  వ‌ర‌కూ ర‌వి అధ్వ‌ర్యంలో న‌డిచే ఐబొమ్మ‌, బప్పం  టీవీల ప‌ని  ఇక అయిపోయింది. సినిమా ఫీల్డ్ ఇక ఎంచ‌క్కా లాభాల ఆర్జ‌న చేయ‌వ‌చ్చనుకుంటుంటే.. ఐబొమ్మ వ‌న్ అంటూ మ‌రో కొత్త పైరసీ వెబ్ సైట్ తెరమీదకు వచ్చి ఒక్కొక్క‌రికీ  దిమ్మ తిరిగి మ‌ళ్లీ బొమ్మ కనిపించేలా చేసింది. ఇందులో కూడా స‌రిగ్గా  సినిమా పైరసీ కంటెంటే ఉంది. క్లిక్ చేస్తే చాలు నేరుగా మూవీ వరల్డ్ లోకి తీసుకుపోతుంది.   దీనంత‌టికీ కార‌ణం ఐ బొమ్మ ఎకో సిస్ట‌మ్ లో 65 మిర్ర‌ర్ వెబ్ సైట్స్ ఉన్నాయ‌నీ,  అందులో భాగంగానే  ఈ కొత్త  సైట్ ప్ర‌త్య‌క్ష‌మైంద‌నీ చెబుతున్నారు అధికారులు.  ఈ లెక్క‌న ఈ పైర‌సీ బెడ‌ద తెలుగు సినిమాకి ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేర‌న్న మాట నిజ‌మేనంటున్నారు. సీవీ ఆనంద్ ఈ అంశంపై మాట్లాడుతూ, మ‌న ద‌గ్గ‌ర నివార‌ణ త‌ప్ప మ‌రెలాంటి శాస్వ‌త ప‌రిష్కారం లేద‌ని చెప్పుకొచ్చారు. ఒక‌టి పోతే మరొకటి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి.   దొరికిన‌పుడు వాటి నిర్వాహకులను అరెస్టు చేయడమే అంతే! 

పూవర్తికి కు హిడ్మా భౌతిక కాయం.. కన్నీరుమున్నీరుగా విలపించిన గ్రామం

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో  జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు  హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ కు తరలించారు.   రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నిన్న హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి.   ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి దగ్గర జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత భౌతిక కాయాలను వారి వారి బంధువులకు అప్పగించారు.  హిడ్మా మృతదేహం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం చేరుకోవడంతో మొత్తం గామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టుల దండయాత్రకు నాయకత్వం వహించిన   హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.   గ్రామంలోని దాదాపు 50 ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. గ్రామస్థులు భయంతో, దిగ్భ్రాంతితో తమ ఇళ్లకు తాళాలేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  హిడ్మా మృతదేహాన్ని చూసి  నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు  భోరున విలపించింది 50 ఇళ్లే ఉన్న ఈ చిన్న గ్రామమైన పువర్తిలోనే ఏకంగా 90 మంది యువకులు మావోయిస్టులుగా మారారంటే గ్రామంపై హిడ్మా ప్రభావం ఎంతగా ఉందో అవగతమౌతుంది.  ఈ గ్రామానికే చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా..  హిడ్మా తరువాత కీలక నాయకుడిగా భావిస్తున్నారు. మావోయిస్టుల అధీనంలో ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి భద్రతా దళాలకు ప్రవేశం కూడా కష్టమయ్యేది. అయితే ఏడాది క్రితం సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపు స్థాపించడంతో పరిస్థితుల్లో కొంత మార్పు చోటు వచ్చింది. అంతే కాకుండా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోల్ అవ్వలేదంటే ఈ గ్రామంపై మావోయిస్టుల ప్రభావం ఎంత ఉందో అర్ధమౌతుంది.     

పోక్సో కేసులో కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

పోక్సో కేసులో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 2 లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ యెడ్యూరప్పకు సమన్లు జారీ చేసింది.   యెడ్యూరప్పపై 2004లో పోక్సో కేసు నమోదైంది.  సహాయం కోరేందుకు 2024 ఫిబ్రవరి 2న తన నివాసానికి వచ్చిన ఓ మైనర్ బాలికను యెడ్యూరప్ప లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై అప్పట్లో సదాశివనగర్‌ పోలీస్ స్టేషన్‌ కేసు కూడా నమోదైంది.  ఈ కేసు విచారణలో భాగంగా యెడ్యూరప్ప వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఆయనకు తాజాగా సమన్లు జారీ చేసింది. అంతకు ముందు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ యెడ్యూరప్ప ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా, ఆయన అభ్యర్థనను   హకోర్టు ధర్మాసనం కొట్టివేసి, విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిథుల కోర్టు యెడ్యూరప్పను వ్యక్తిగతంగా ఆదేశించాలంటూ సమన్లు జారీ చేయడం ప్రాథాన్యత సంతరించుకుంది.  

ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిందితుల డిఫాల్ట్ బెయిలు రద్దు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. వీరు ముగ్గురూ ఈనెల ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.  నిందితులు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు  వెసులుబాటు కల్పించిన హైకోర్టు..  వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై   కేసు మెరిట్స్ ఆధారంగానే  విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు  ఈ తీర్పులోని అభిప్రాయాలతో  ప్రభావితం కావాల్సిన అవసరం లేదనీ పేర్కొంది. వీరి డిఫాల్ట్ బెయిలును రద్దు చేసిన హైకోర్టు ముందు ఈ నెల 24లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తరువాత నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో లొంగుబాటు గడువును మరో రెండు రోజులు పొడిగించింది.  మద్యం కుంభకోణం కేసులో నిందితులు  ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  

అమెరికాలో తల్లీ కొడుకుల హత్య.. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత హంతకుడి గుర్తింపు

అమెరికాలో ఎనిమిదిన్నరేళ్ల కిందట జరిగిన తల్లీ కొడుకుల హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు కనిపెట్టారు. తొలుత ఈ కేసులో హతురాలి భర్తే నిందితుడిగా అనుమానించారు. హతురాలి తల్లిదండ్రులు సైతం అతడిపైనా ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేశారు. అయితే భర్తే హత్య చేశాడన్న ఆధారాలేవీ దొరకలేదు.   చివరికి హత్య జరిగిన ఎనిమిదిన్నరేళ్ల తరువాత అసలు నిందితుడిని కనిపెట్టారు. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత నిందితుడ్ని కనిపెట్టారు.   వివరాల్లోకి వెడితే..  అమెరికా న్యూజెర్సీలోని మెపుల్ షేడ్‌లోని ఫాక్స్ మెడో అపార్ట్‌మెంట్‌లో  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ  శశికళ నర్రా , ఆమె కుమారుడు  హత్యకు గురయ్యారు. అప్పట్లో అందరూ శశికళ భర్త నర్రా హనుంతరావే హంతకుడని అనుమానించారు.  ఎనిమిన్నరేళ్ల విచారణ తర్వాత అమెరికా పోలీసులు అసలు నిందితుడిని కనిపెట్టారు. హంతకుడిని  నజీర్ హమీద్ గా గుర్తించారు. నజీర్ కూడా ఇండియనే.  శశిఖళ భర్త హనుమంత్ రావు నర్రా మాజీ సహోద్యోగి. వృత్తిపరమైన వివాదాల కారణంగా  వ్యక్తిగత ప్రతీకారేచ్ఛతో  అతడే ఈ హత్యలకు పాల్పడ్డాడని అమెరికా పోలీసులు తెలిపారు. కాగా శశికళ, ఆమె కుమారుడిని హత్య చేసిన తరువాత నజీర్ అహ్మద్ ఇండియా వచ్చేశాడు.  ఇప్పుడు అతడిని తమకు అప్పగించాలంటూ  అమెరికా ఇండియన్ గవర్నమెంట్ తో సంప్రదింపులు చేస్తున్నది.  ఇంతకీ నజీర్ అహ్మద్ హంతకుడని ఎలా కనిపెట్టగలిగారంటే.. అతడు గతంలో పని చేసిన కంపెనీలో ఉపయోగించిన లాప్ టాప్ ద్వారా డీఎన్ ఏను సేకరించి.. క్రైమ్ ప్రదేశంతో ఉన్న రక్తపు మరకలతో సరిపోల్చడం ద్వారా నజీరే హంతకుడని గుర్తించారు.     

ఫార్ములా ఈ రేస్.. కేటీఆర్ కు బిగ్ షాక్!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బిగ్ షాక్ తగిలింది. ఈయన ఏ1 నిందితుడుగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే  ఈ కేసులో ఏ1 కేటీఆర్ ను ఏసీబీ నాలుగు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ ను ఐదుసార్లు విచారించింది. ఈ కేసుకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈ-మెయిల్స్ ను, ఎలెక్ట్రానిక్ ,ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  తొమ్మిది నెలల పాటు అన్ని కోణాల నుంచీ పకడ్బందీగా  విచారణ జరిపిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి  రెడీ అవుతోంది.  కాగా ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి అవసరం. దీంతో ఏసీబీ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న లేఖ రాసింది.  అలా లేఖ రాసిన పది వారాల తరువాత కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు  గవర్నర్ నుంచి అనుమతి లభించింది.  అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీవోపీటీ అనుమతి కోరిన ఏసీబీ.. ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, అలాగే బీఎల్ఎన్ రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. 

శబరిమల ప్రవేశానికి వర్చువల్ క్యూపాస్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ రోజు రోజుకూ అధికమౌతున్న నేపథ్యంలో   కేరళ ప్రభుత్వం   కీలక నిర్ణయం తీసుకుంది.  కేరళ హైకోర్టు సూచనల మేరకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.  భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిబంధనలు ఈ నెల 24 వరకూ కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేరళ సర్కార్ ప్రకటించింది.   శబరిమలకు ఒకేసారి అధిక సంఖ్యలో యాత్రికులు చేరకుండా నియంత్రించేందుకు రోజువారీ అనుమతులకు పరిమితి విధించింది.అలాగే వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70,000మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అదనంగా స్పాట్ బుకింగ్ ద్వారా మరో ఐదు వేల మందికి ప్రవేశం కల్పిస్తారు.   కోటా పూర్తయిన వెంటనే స్పాట్ బుకింగ్ నిలిపి వేస్తారు.  జరుగుతుంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి  వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి చేసింది. దీంతో ఈ పాస్ లేకుండా నీలక్కల్ చెక్‌పాయింట్ నుంచి శబరిమలకు ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.  భక్తుల  స్పాట్ బుకింగ్ కోసం నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి,  చెంగన్నూర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీలక్కల్ వద్ద కోటా చాలా వేగంగా ముగిసే అవకాశం ఉన్నందున, యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచించారు.యాత్ర ప్రారంభించే ముందు పాస్ తమ వద్ద ఉన్నదని భక్తులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే నీలక్కల్, పంపా,  సన్నిధానం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలకు యాత్రి కులు  సహకరించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తుల కోసం 04735-14432 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.  బరిమల యాత్రను మరింత క్రమబద్ధంగా, భద్రతగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ భూమిపై నడయాడిన దైవ స్వరూపం పుట్టపర్తి సాయిబాబా.. చంద్రబాబు

ఈ భూమిపై మనం చేసిన, మనకు తెలిసిన   దైవ స్వరూపం     సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  ప్రేమ, సేవ, శాంతిలకు బాబా నిలువెత్తు నిదర్శనమన్నారు. పుట్టపర్తిలో  జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పాల్గొని ప్రసంగించారు.   ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం   సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.

చంద్రబాబు ఓ అద్భుతం.. ఆనంద్ మహేంద్ర

మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ఒక అద్భుతంగా అభివర్ణించారు. చంద్రబాబు పని తీరు, అభివృద్ధి కాముకత, దార్శనికత మాత్రమే కాకుండా ఆయన రూపొందించే విధానాలు కూడా గొప్పగా ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ప్రశంసించడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో ఆయన నారా చంద్రబాబుపై పొగడ్తలు కురిపించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు.  చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే  ఈ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన  ఎస్క్రో వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రానికి ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న చంద్రబాబు దార్శనికతను అభినందించారు.  దీర్ఘకాలంగా ఆయన నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిత్సున్న తీరు పట్ల తాను ముగ్థుడైనట్లు పేర్కొన్నారు. కాగా ఆనంద్ మహేంద్ర ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు.  ఆయనను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.   

ఇది కదా విజ్ణత!

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. మిగిలిన సమయంలో రాజకీయ విభేదాలు మరిచి రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచించాలి. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పుడు ఆయన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత, మంత్రి నారా లోకేష్ చొరవ, కృష్టి, పట్టుదల కారణమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం ఈ మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ఇలా పెట్టుబడులు వెల్లువెత్తడానికి తమ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కారణమని చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఘనతా తమదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు.  అభివృద్ధి అన్నది సమష్టిగానే సాధించగలమని ఎప్పుడూ చెబుతూ ఉండే మంత్రి నారా లోకేష్ వైసీపీ క్లెయిములపై స్పందించిన విధానం ఆయనలో పరిణితికి అద్దంపట్టింది.  వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వం  కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను సమర్పిస్తే వాటిని అమలులోకి తీసుకురావడానికి, ఆ ఒప్పందాల క్రెడిట్ వైసీపీకే ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలోనే చెప్పిన లోకేష్ ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసి.. గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో సంప్రదింపులకు  ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.   గత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడిదారులతో ఇప్పటికే సంప్రదించామని చెప్పిన లోకేష్ వారికి అనుకూలమైన, విశ్వసనీయ వాతావరణాన్ని అందించేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు.  ఈ ఒక్కమాటతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజకీయ తారతమ్యాలు చూపబోమని చాటారు.  ఇది కదా విజ్ణత అంటే అంటూ  నెటిజనులు పెద్ద ఎత్తున లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ, వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఏపీకి పెట్టుబడుల వరద లోకేష్ చలవే.. పొగడ్తలు కురిపించిన రాయిటర్స్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఈ కథనంలో యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన 16 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం వెనుక  లోకేష్ శ్రమ, సమర్థతను ప్రస్తావిస్తూ రాయిటర్స్ తన ప్రత్యేక కథనంలో.. 42 ఏళ్ల యువకుడు కీలకమని పేర్కొంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేసిన 42 ఏళ్ల యువకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారనీ, నిలుస్తున్నారనీ ఆ వ్యాసంలో పేర్కొంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన తండ్రి కావడం కలిసివచ్చిన అంశాలే అయినా లోకేష్ తన ప్రతిభ, సమర్థత, వేగం, చొరవతో ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చగలు గుతున్నారని పేర్కొంది.  భారత్‌లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తోందని తెలియగానే లోకేశ్ బృందం రంగంలోకి దిగి,  పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయడమే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా  నెలల వ్యవధిలోనే గూగుల్ తో  ఒప్పందం ఖరారైంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అనుమతులు కూడా ఆఘమేఘాల మీద లభించేలా లోకేష్ చొరవ చూపారని ఆ ప్రత్యేక వ్యాసంలో రాయిటర్స్ పేర్కొంది.  లోకేష్ చెబుతున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదనీ.. అది ఆచరణలో కనిపిస్తోందని ప్రశంసించింది.    రాయిటర్స్ రాష్ట్రప్రభుత్వ విజయాలు, అందులో తన పాత్రపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, సాహసోపేతమైన సంస్కరణల పై తమ ప్రభుత్వం  దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.