హవ్వ ఇదేం పని.. పోలీసువేనా?

అంబర్ పేట పీఎస్ లో ఎస్ ఐగా పని చేస్తున్న భానుప్రకాష్ సస్పెండయ్యారు. అయితే అయ్యో పాపం అని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే.. ఓ పోలీసు అనేవాడు చేయకూడని చేసి సస్పెండ య్యారాయన. ఇంతకీ ఆయనేం చేశారంటే.. క్రైమ్ విభాగంలో పని చేసే భాను ప్రకాష్.. ఓ దొంగతనం కేసులో రికవర్ చేసిన దాదాపు ఐ తులాల బంగారాన్ని ఏకంగా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు వాడేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే ఆయన సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టే పెట్టేశారు.  ఆర్థిక సమస్యల ఉండటంతో ఎస్సై భాను ప్రకాష్ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు తన  సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టేసినట్లు తేలడంతో  పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.   ఎస్ఐ భాను ప్రకాష్ బెట్టింగులకు బానిసై అందిన కాడికల్లా అప్పులు చేసి అవి తీర్చే మార్గం కనపడకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

తిరుపతి ఎస్పీయూలో చిరుత సంచారం

తిరుపతిలో మరోసారి చిరుత  సంచారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో  చిరుత సంచరిస్తున్న దృశ్యాలు  అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోని  గ కోళ్ల షెడ్‌పై  మంగళవారం నవంబర్ 25) అర్ధరాత్రి చిరుత దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ  ఫుటేజీలలో స్పష్టంగా కనిపించాయి. ఆ తరువాత అక్కడ నుంచి  ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద కొద్ది సేపు తచ్చాడిన చిరుత.. ఆ తరువాత అక్కడ నుంచి అటవీ ప్రాంతంవైపు వెళ్లిపోయింది.  ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచా రం సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది,  టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.     గతంలో కూడా తిరుమల ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో,  ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో  చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఇక ఈ నెల మొదటి వారంలో కూడా ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతపులి సంచారం కనిపించింది.  ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురౌతున్న వర్సిటీ  విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలోకి వన్యప్రాణులు వచ్చే అవకాశంలేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

అయ్యప్ప మాల ధరించినందుకు మెమో… కొత్త వివాదం

హైదరాబాద్ పాతబస్తీ సౌత్ ఈస్ట్‌ జోన్‌లో విధులు నిర్వహిస్తున్న కంచన్‌బాగ్ ఎస్‌ఐ ఎస్. కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేసిన విషయం వివాదంగా మారింది. డ్యూటీలో  ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరించడం పోలీసు విభాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కృష్ణాకాంత్ కు అడిషనల్ డీసీపీ  మెమో జారీ చేయడంపై భిన్న స్పందనలు వచ్చాయి.  పోలీసు శాఖలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మతపరమైన ఆచారాలు పాటించే సమయంలో డ్యూటీకి హాజరు కాకుండా సెలవులు తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. అయ్యప్ప మాల వేసుకుని డ్యూటీ చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని  ఆ మెమోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ మెమో ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది. బీజేపీ నేతలు అయ్యప్పమాట ధరించినందుకు ఎస్ఐకు మెమో జారీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. మతపరమైన ఆచారాలు ఆచరించడం నియమాల్లో భాగమైతే, పోలీస్‌ సిబ్బంది పట్ల సౌలభ్యం చూపాలని   డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొకవైపు ఇందులో తప్పేమీ లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

కాలుష్యంలో హైదరాబాద్ ను మించిపోయిన విశాఖపట్నం

దేశంలో అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం 13వ స్థానంలో  నిలిచింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 749 జిల్లాల్లో నిర్దిష్ట ప్రమాణాలకు మించి కాలుష్య కారక పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు.  తాజా సర్వేలో తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో 40 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువగా నమోదయింది. అయితే  హైదరాబాద్ నగరంలో మాత్రం ఇది 40 మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్కు మించి వాతావరణ కాలుష్యం ఉన్నట్టు గుర్తించారు. ఇక ఏపీలో 26 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో కాలుష్య ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇక నగరాల విషయానికి వస్తే విశాఖ నగరం లో కాలుష్యం హైదరాబాద్ ను మించి ఉందన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ 25వ స్థానంలో ఉండగా, విశాఖ 13వ స్థానంలో ఉండటం గమనార్హం.  

ముంబై విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి విలువ 39 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.  బ్యాంకాక్‌ నుండి ముంబై వచ్చిన ఎనిమిది మంది ప్రయాణీల తీరుపై అనుమానం వచ్చిన అధికారులు వారి లగేజీ తనిఖీ చేయడంతో ఈ విదేశీ గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టైంది. వారి లగేజీలో ఉన్న చాక్లెట్ ప్యా ఎనిమిది మంది ప్రయాణికులపై అనుమానం వచ్చిన అధికారులు వారి సామానులను పరిశీలించగా, చాక్లెట్ ప్యాకెట్లలో  దాచిన గంజాయి బటయపడింది.  కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా సాధారణ చాక్లెట్ ర్యాపర్ల మాదిరిగానే ప్యాకింగ్ చేసి అక్రమంగా తరలించేందుకు  ఈ స్మగ్లర్లు చేసిన ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు.  అధికారులు ఎనమండుగురు స్మగ్లర్లనూ అదుపోనికి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.   అదుపులోకి తీసుకున్న నిందితులపై ఎన్డీపీఎస్  చట్టం కింద కేసులు నమోదుచేసి   దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో బ్యాంకాక్‌–భారత్‌ మధ్య గంజాయి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకాక్ నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.   అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్లపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

సత్తా చాటిన భార‌త మ‌హిళ‌లు.. ఒకే ఏడాది నాలుగు ప్ర‌పంచ క‌ప్పులు

ఈ మ‌ధ్య కాలంలో భార‌త్  క్రీడాకారులు, మ‌రీ ముఖ్యంగా మ‌హిళా జ‌ట్లు అన్ని విభాగాల్లో ప్ర‌పంచ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. 2025 భార‌త మ‌హిళా జ‌ట్లు ప్రంపంచ స్థాయిలో  నంబంర్ వన్ గా నిలిచాయనడానికి ఆ జట్లు సాఆధించిన నాలుగు వరల్డ్ కప్ లే నిదర్శనం.  తొలుత అండర్ 19 విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తో మోదలైన  భారత మహిళల విజయపరంపర.. 2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. సుమారు యాభై ఏళ్ల సుదీర్ఘ‌మైన నిరీక్ష‌ణ‌కు తెర దించితూ వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా మహిళల జట్టు. ఇదే గొప్ప అనుకుంటే, బ‌ధిరుల మ‌హిళా ప్ర‌పంచ క‌ప్ సైతం గెలిచి భ‌ళిరా! భార‌త మ‌హిళ.. అనిపించారు.  తాజాగా భార‌త మ‌హిళా క‌బ‌డ్డీ జ‌ట్టు సైతం ప్ర‌పంచ క‌ప్ గెలిచి భార‌త మ‌హిళ‌ల‌కు క్రీడా ప్రపంచంలో తిరుగే లేదనిపించారు.  భార‌త మ‌హిళ‌ల జ‌ట్లు ఇప్పుడు అన్ బీట‌బుల్ గా మారాయని క్రీడా లోకం కోడై కూస్తోంది.    భార‌త మ‌హిళ‌లూ మీరు భేష్! అంటూ స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు.. సామాన్య భక్తులకే పెద్దపీట

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.   ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలను   ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే వీలు కల్పించింది. అంతే కాకుండా ఈ సారి వీఐపీలకు కాకుండా   సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ   కీలక మార్పులు చేసింది. దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకూ  పూర్తిగా సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మూడు రోజులకు గాను 1.88 లక్షల సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.  ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగుతుంది.  డిసెంబర్ 2 నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మిగిలిన ఏడు రోజుల్లో  ) ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లు, 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్యులకు అదిక సమయం కేటాయించేందుకు   వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని బాగా కుదించారు. మొత్తం 184 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించినట్లు టీటీడీ పేర్కొంది.   తొలిరోజు వీఐపీ బ్రేక్‌ను 4 గంటల 45 నిమిషాలకు, ఇతర రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేసింది.   ఇలా ఉండగా,  వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక చివరి మూడు రోజులూ అంటే జనవరి 6 నుంచి జనవరి 8 వరకూ   స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ఇందు కోసం ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శనం కోసం   రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు.  ఇకపోతే.. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా  డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఆ పది రోజులూ   తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. 

మునిసిపాలిటీల విలీన ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం

అవుటర్ రింగ్ రోడ్  పరిధిలో లేదా దానికి ఆనుకుని ఉన్న 27 మునిసిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం  కానున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.   మంగళవారం (నవంబర్ 25) జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో కీలక అంశంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సమావేశంలో టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టగా, కౌన్సిల్ దానిని పరిశీలించి అ  ఆమోదించింది.   వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి, సేవల పరంగా పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఈ విలీనం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విలీనం ద్వారా ఏకీకృత నగర ప్రణాళిక, మెరుగైన పౌర సేవలు, సమగ్ర మెట్రో పాలిటన్ అభివృద్ధి సాధ్యమవుతాయని వివరించింది. పెద్ద అంబర్‌పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ తదితరులు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం, విలీనం ప్రతిపాదనపై పరిశీలన చేసి, అవసరమైన అధ్యయనాలు నిర్వహించి అభిప్రాయాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఆదేశించింది. దానికి అనుగుణంగా, నవంబర్ 21, 2025న జారీ చేసిన ప్రభుత్వ మెమోను   సమావేశంలో టేబుల్ ఐటమ్ నంబర్ 2గా జిహెచ్ఎంసి జనరల్ బాడీ ముందు ఉంచగా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా మంగళవారం (నవంబర్ 25) ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఈ 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

మాక్ అసెంబ్లీకి మంగళగిరి ఎమ్మెల్యేగా ఎంపికైన విద్యార్థినికి లోకేష్ అభినందన

నేటి బాలలే రేపటి పౌరులుగా మారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై స్పందిస్తారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యా బుద్దులతో పాటుగా సమాజంతో ఎలా నడుచుకోవాలి అనే అంశాలు పాఠశాలల్లో నేర్పిస్తే.. పిల్లలు మంచి పౌరులుగా దేశ అభివృద్దిలో భాగస్వాములు అవుతూ వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారన్న ఉద్దేశంతోనే పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువల బోధన, అలాగే  రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే  రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడిలా మారి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. ఈ చర్చల్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఓ వర్గం విద్యార్థులు మాట్లాడితే.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై మరో వర్గం విద్యార్థులు మాట్లాడుతారు. ఈ సందర్భంగా జరిగే చర్చలు అచ్చం అసెంబ్లీని తలపించే విధంగా ఉంటాయి. విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసింది. అక్టోబరు 21, 22 తేదీల్లో పాఠశాల స్థాయిలో 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్‌ పోటీలు నిర్వహించింది. వీరిలో ఆరుగురు చొప్పున మండల స్థాయిలో అక్టోబరు 24, 25 నిర్వహించే పోటీలకు ఎంపిక అయ్యారు. అనంతరం మండల స్థాయి నుంచి ఆరుగురు చొప్పున అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. చివరికి నియోజకవర్గాల నుంచి రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ పోటీలకు 175 మందిని ఎంపిక అయ్యారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేలా విద్యార్థులను ఎంపిక చేసి  శాసనసభలో మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తారు. అలా మంగళగిరి నియోజకవర్గం నుంచి కనకపుట్లమ్మ ఎంపికైంది.  విద్యార్థుల మాక్‌ అసెంబ్లీకి ఎన్నికైన మంగళగిరి విద్యార్థిని శ్రీకనకపుట్లమ్మను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.  ఆ విద్యార్ధినిని ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని తన నివాసానికి  పిలిపించుకుని మాట్లాడారు. 8వ తరగతి చదువుతున్న శ్రీకనకపుట్లమ్మ వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపికవ్వడం ముదావహమని అభినందించారు.  ఆ విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను  అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము దివ్యాంగుడు. ట్రై స్కూటిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని, తనకు రూ.6వేల పెన్షన్ వస్తోందని విద్యార్థిని తండ్రి రాము తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి తన కుటుంబంలా మారిపోయిందని, మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్​లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. అమరావతిలో బుధవారం (నవంబర్ 26)న నిర్వహించనున్న  స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికకావడం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విద్యార్థిని కనకపుట్లమ్మ పేర్కొంది   . మంత్రి నారా లోకేష్ ను కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

జీహెచ్ ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం (నవంబంర్ 25)  దాదాపు నాలుగు గంటల పాటుజరిగిన మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక అంశాలపై చర్చించారు.  ముఖ్యంగా జీహెచ్ఎంసీ విస్తరణపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న  27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు  ఆమోదం తెలిపింది. దీంతో పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్‌లు, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జీగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి. అలాగే  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ డిస్కం లకు తోడు మరో డిస్కమ్ ను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లను ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అదే విధంగా  రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలపై చర్చించిన మంత్రి వర్గం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు   నిర్ణయం తీసుకుంది.   .  రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం  కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.  

అసోం తరహాలో యూపీలోనూ డిటెన్షన్ సెంటర్లు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాల ప్రక్షాళనలో భాగంగా ప్రస్తుతం పలు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐగా శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఆరంభమైన ఈ ఎస్ఐఆర్ వచ్చే నెల 4వ తేదీ వరకూ జరుగుతుంది. ఈ ఎస్ ఐఆర్ లో భాగంగా నకిలీ ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవానికి ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే.. సరైన పత్రాలు లేనివారి ఓట్లు, నకిలీ పత్రాలతో  ఓటు హక్కు పొందిన వారి ఓట్లూ కూడా తొలగిస్తున్నారు.   ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది.  యూపీలోకి నేపాల్‌ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉందని అంటున్నారు. నేపాల్ నుంచి అక్రమంగా వలస వచ్చి  గోరఖ్‌పూర్‌ నుంచి గౌతమ బుద్ధనగర్‌ వరకు లఖీన్‌పూరిఖేరీ, బెహ్రాయిచ్, ఫిల్‌బిత్‌ జిల్లాల్లో స్థిరపడిన వారి సంఖ్య అధికం. అంతే అక్రమంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింల సంఖ్య కూడా ఎక్కువే అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ లో ఓట్లు అక్రమంగా పొందిన వారు, అక్రమంగా నివసిస్తున్న వారి వివరాలు వెల్లడి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి వారిని నిర్బంధించడానికి డిటెన్షన్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అక్రమంగా వచ్చిన వారిని ఆ డిటెన్సన్ సెంటర్లలో పెట్టాని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఇప్పటి వరకూ ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు అసోంలో మాత్రమే ఉన్నాయి. ఇప్పడు యూపీలో కూడా డిటెన్సన్ సెంటర్లు వెలుస్తున్నాయిజలో  అక్రమంగా వచ్చినవారిని ఉంచి.. ఈ డిటెన్షన్ సెంటర్లలో ఉంచి.. వారు ఇంత కాలం ఎలా ఉన్నారు. వారి వ్యాపకం ఏమిటి? వారికి నకిలీ పత్రాల సంపాదించడంలో ఎవరి సహకారం అందింది.  వంటి వివరాలన్నీ రాబట్టాలని యోగి ఆదేశించారు. వారు తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం శక్షించాలనీ, ఆ తరువాత వారినివారి వారి స్వదేశాలకు పంపించే చర్యలు తీసుకోవాలని యోగి భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే యోగి సర్కార్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

మంగళగిరి ఎయిమ్స్ కి చెవిరెడ్డి

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని విజయవాడ జిల్లా జైలు అధికారులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు ఆరోగ్యం బాగాలేదని జైలు అధికారులకు చెబుతుండటంతో వారు ఆయనను సోమవారం (నవంబర్ 24) విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ చెవిరెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన వెరికో వెయిన్స్ తో బాధపడుతున్నారని నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో జైలు అధికారులు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మంగళవారం  (నవంబర్ 25) మంగళగిరిలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. 

వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  కాలుష్య నియంత్రణకే కాకుండా ఆరోగ్య రక్షణకు కూడా ఇది అవసరమని పేర్కొంది.   ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి  ఢిల్లీ సర్కార్  కీలక ఆదేశాలు జారీ చేసింది.   ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతి రోజూ 50 శాతం మంది సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వచ్చిపని చేయాలనీ, మిగిలిన 50 శాతం మందీ వర్క్ ఫ్రం హోం పని చేయాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని ప్రైవేటు కార్యాలయాలు కూడా సిబ్బంది హాజరును తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్న సంగతి తెలిసిందే.  

నిన్న మొంథా.. రేపు సెన్యార్.. ఏపీకి వరుస తుపానులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుపానులు వణికిస్తున్నాయి. మొన్నటికి మొన్న మొంథా తుపాను విలయానికి రాష్ట్రం అతలాకుతలమైంది. భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. దాని నుంచి తేరుకోకముందే మరో తుపాను రాష్ట్రంపై పంజా విసరడానికి రెడీ అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 48 గంటలలో తుపానుగా రూపాంతరం చెందనుంది. అది తుపానుగా మారితే దానికి సెన్యార్ అని నామకరణం చేయనున్నారు.   ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో ఈ నెల   29 నుంచి 30 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఈ తుపాను ప్రభావం తమిళనాడు కేరళ, లక్షద్వీప్‌లపై  ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం నిషిద్ధమని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్పమత్తమైంది. రైతాంగాన్ని అప్రమత్తం చేసింది.  

హిడ్మా ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ బూటకమంటూ జాతీయ మానవహక్కుల పరిరక్షణ సంఘం (ఎన్ హెచ్ ఆర్సీ)లో ఫిర్యాదు నమోదైంది. హిడ్మా ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ హెచ్ ఆర్సీని విజయ్ కిరణ్ అనే న్యాయవాది ఆశ్రయించారు. హిడ్మాది ఫేక్ ఎన్ కౌంటర్ అని తన ఫిర్యాదులో పేర్కొన్న న్యాయవాది హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని కోరారు.   ఎన్‌హెచ్‌ఆర్‌సి మార్గదర్శకాల మేరకు   ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదనీ. తటస్థ అధికారుల ద్వారా దర్యాప్తు జరగలేదనీ ఆయన పేర్కొన్నారు. హిడ్మా ఎన్ కౌంటర్ లో నిజానిజాలు తెలియాల్సి ఉందని పేర్కొన్న విజయ్ కిరణ్..   హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వాస్తవ సమాచారం  ప్రజలకు వెల్లడించాలన్నారు.  మావోయిస్టులైనా, పోలీసులైనా ఎవరు చేసినా  చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం నేరమేనని పేర్కొన్న ఆయన  హిడ్మా ఎన్ కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు.  

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఉన్నత స్థాయి సలహామండలి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా సీఎం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా చర్యలు ఆరంభమయ్యాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మేరకు 2047 నాటికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అందుకే ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు పది మందితో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 24) అధికారిక ప్రకటన వెలువడింది. అత్య‌ధికంగా ప్ర‌జ‌ల అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్న 10 వ్యాధుల‌కు సంబం ధించి ఒక్కో వ్యాధికి అడ్వ‌యిజ‌రీ గ్రూపు ఏర్పాటు చేశారు.  ఆధునిక సాంకేతిక‌తో మెరుగైన వైద్య సేవ‌ల్ని అందించ‌డానికి గేట్స్ ఫౌండేష‌న్, టాటా ఎండి, ఐఐటి చెన్నై స్వ‌స్థి వంటి సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో   ప్ర‌ణాళిక‌లు అమ‌ల‌వుతున్నాయి. వీటితో పాటు ప‌లు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వం స్పాన్సర్ చేస్తున్న ఆరోగ్య ప‌థ‌కాలూ నడుస్తున్న సంగతి తెలిసిందే.   ఈ ప్ర‌ణాళిక‌ల అమ‌లు, ఫ‌లితాలను స‌మీక్షిస్తూ ఆరోగ్యాంధ్ర సాధ‌న దిశ‌గా ఒక స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించ‌డానికి 10 మంది అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన సలహామండలి ఏర్పాటైంది.  ఈ సలహా మండలి   విజ‌న్-2047 మేర‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పూర్తి ఆరోగ్యం, ఆహ్లాదం క‌ల్పిం చేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌ చేస్తుంది. అలాగే   మాతాశిశు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ, అసంక్ర‌మిక‌ వ్యాధుల నిర్మూల‌న‌కు అవ‌స‌ర‌మైన  మార్గాల‌ను సూచిస్తుంది.  ఇంకా వివిధ వివిధ ప‌ధ‌కాల  స‌మ‌ న్వ‌యం కోసం  చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్నిసూచిస్తుంది. అలాగే  రాష్ట్రాన్ని జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో గ్లోబ‌ల్ హెల్త్‌ హ‌బ్ గా రూపొందించ‌డానికి అవసరమై సూచనలు, సలహాలు ఇస్తుంది. ఈ సలహామండలి మొదటి సమావేశం డిసెంబర్ లో జరగనుంది. ఆ తొలి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.  

సజావుగా ఎస్ఐఆర్.. 99శాతం పూర్తి!

దేశంలోని తొమ్మది రాష్ట్రాలు, మూడు యూనియన్ టెరిటరీలలో  ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా, వేగంగా సాగుతోందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (నవంబర్ 24) ప్రకటించింది. ఇప్పటి వరకూ ఎస్ఐఆర్ లో భాగంగా ఈ తొమ్మది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 99 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని పేర్కొంది.  ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలలో ఉన్న 50.97 కోట్ల మంది ఓటర్లలో 50.50 కోట్ల మంది  ఓటర్లకు పాక్షికంగా పూరించిన ఫారాలను జారీ చేసినట్లు  ఎస్ఐఆర్ బులిటిన్ పేర్కొంది.  ఈ నెల 4న మొదలైన  రెండో దశ ఎస్ఐఆర్ వచ్చే నెల 2 వరకూ సాగుతుంది.   రెండో దశ ఎస్ఐఆర్ లో భాగంగా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలయిన పుదుచ్చేరి, అండమాన్ ,నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో ఎస్ఐఆర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా  తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.   అదే ఏడాది ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయ్యింది. 

టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు నోటీసులు.. ఎందుకంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సీఐడీ నోటీసులు పంపింది.  శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు.   2023 ఏప్రిల్‌ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లు చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల   పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే..  హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది.  కేసు దర్యాప్తు జరుగుతుండగా విచారణకు వస్తున్న ఫిర్యాది దారు, టీటీడీ  ఏవీఎస్‌వో సతీశ్‌ కుమార్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి టీటీడీ అప్పటి  వీజీవో గిరిధర్‌, ఏవీఎస్‌వో పద్మనాభంను  సీఐడీ అధికారులు సోమవారం (నవంబర్ 24) ప్రశ్నించారు.  ఇప్పుడు తాజాగా భూమనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు.  

స్కూళ్లలో ఇక ప్రతి శుక్రవారం విలువల పిరియడ్

సమష్టి కుటుంబాలతో పాటే కుటుంబ విలువలూ మాయమైపోతున్న కాలం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో  రాజకీయంగా అత్యంత ప్రభావమంతమైన కుటుంబాలలో కూడా అన్నా చెళ్లెళ్లు, తల్లీ కొడుకులు వేరుపడటం చూశాం. కుటుంబ విలువలకు తిలోదకాలిచ్చి మరీ విమర్శలతో రోడ్డున పడటం చూశాం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో సమాజంలో నైతిక విలువలను కాపాడాలంటే ముందుగా కుటుంబ విలువలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల గురించి ఇసుమంతైనా అవగాహన లేని నేటి విద్యార్థులకు కుటుంబ విలువల పట్ల సరైన బోధన అవసరం. అలాగే వాటిపై అవగాహన పెరగాల్సిన అవస్యకత ఎంతైనా ఉంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సరిగ్గా ఆ విషయంపైనే దృష్టి పెట్టారు.  ఏపీలో విద్యార్థులకు విలువలు, మరీ ముఖ్యంగా కుటుంబ విలువల గురించి బోధన అవసరం అని భావించారు. అందుకే ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును ఆ పనికి నియోగించారు. ఈ విషయాన్ని  చాగంటి కోటేశ్వరరావు స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సోమవారం (నవంబర్ 24) చాగంటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  చంద్రబాబు కుటుంబ విలువలు, కుటుంబ నీతికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు చెప్పారని చాగంటి అన్నారు. ఒక వ్యక్తి కుటుంబం, తల్లిదండ్రులు, తోబుట్టువులకు విలువనిస్తేనే.. సమాజ విలువలను అవగాహన చేసుకోగలు గుతాడని చంద్రబాబు చెప్పారన్నారు.  కుటుంబ విలువలు నైతిక విలువల గురించి పిల్లలకు బోధించాలని తనకు సూచించారన్నారు.  కుటుంబ విలువల గురించి చంద్రబాబులో నిజాయితీతో కూడిన ఆందోళన ఉందన్న చాగంటి ఆయన తనకు అప్పగించిన పనిని బాధ్యతతో నెరవేరుస్తానని చెప్పారు.   వాస్తవమే.. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు మాత్రమే లక్ష్యం కాకూడదు.. సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి. ఇప్పుడు అదే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో  ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు మంత్రి నారా లోకేష్.  రాష్ట్ర వ్యాప్తంగా   నైతిక విలువల విద్యా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు.   ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను నైతిక విలువలతో బలోపేతం చేయాలని సంకల్పించారు. ఆ బాధ్య తను ప్రవచనకారుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు అప్పగించారు.  విలువలను విద్యలో భాగం చేసేందుకు పాఠ్య పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువల విద్యా సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే విజయవాడలో సోమవారం (నవంబర్ 24)  తొలి సదస్సు జరిగింది.  విలువలు అనేవి మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో కూడా ఉండాలని చాగంటి ఈ సందర్భంగా ఉద్బోధించారు.  విద్యార్థులకు ఈ విషయాన్ని పాఠశాల స్థాయి నుంచే బోధించాల్సిన అవసరం ఉంది.   చాగంటి ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏ పనైనా పిల్లలు చేయాలని భావించినప్పుడు ఆ విషయాన్ని తల్లికి ముందుగా చెప్పాలి. అలా చెప్పలేమనుకున్న పని అసలు చేయనేకూడదు. ఇది విద్యార్థులకు చాగంటి చెప్పిన తొలి నైతిక సూత్రం.  ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలి. ఒక్క విద్య మాత్రమే కాదు  నైతికతతో , రుజువర్తనతో సమాజంలో మార్పు వస్తుంది.    ఇప్పటికే  విద్యార్థులలో మార్పు వస్తున్నది. విద్యా మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకువచ్చిన సంస్కరణలు విద్యార్థులను బాధ్యత దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. గుంటూరు జిల్లా నర సరావుపేటలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సొంతంగా  రోజూ 10 నిమిషాలు స్కూల్ శుభ్రం అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. అలాగే  తిరుపతి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యా ర్థులే స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించి స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. విజయ నగరం జిల్లాలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో  విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టంబర్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 700 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో విద్యార్థులు ప్రతి ఆదివారం స్థానిక వృద్ధాశ్రమానికి వెళ్లి, వృద్ధులతో గడుపుతున్నారు.   ఇక త్వరలో  1 నుంచి 12వ తరగతి వరకూ చాగంటి మార్గదర్శకత్వంలో విడుదల కానున్న నైతిక విలు వల పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిరియడ్ నైతిక విలువల బోధనకు కేటాయించనున్నారు.  విద్యార్థులలో నైతిక విలువలపై అవగాహన పెంపోందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.