జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేస్తాం.. మావోల ప్రకటన

ఆపరేషన్ కగార్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు ఆయుధాలు విసర్జించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ (మద్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ) జోన్ ప్రతినిథి అనంత్ శుక్రవారం (నవంబర్ 28) ఓ ప్రకటనే విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయుధ విసర్జనకు ఓ తేదీని ప్రకటించారు.  మావోయిస్టు పార్టీ జనవరి 1వ తేదీ నుంచి ఆయుధ విరమణ అమలు చేస్తుందని పేర్కొన్నారు.  పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.  ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్న అనంత్  తమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంతోనే చర్చలు ఉంటాయన్నారు.  హిడ్మా ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడిందని ఆ ప్రకటనలో అనంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోలు లొంగిపోవాలన్న కేంద్రం పిలుపునకు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాము జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మావోయిస్టు పార్టీ ఏకంగా ఒక తేదీని ఖరారు చేసి ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్!

భార్య బతికి ఉండగానే, ఆమె డెత్ సర్టిఫికెట్ తీసుకుని దానికి ఆమెకే నేరుగా కొరియర్ ద్వారా పంపించిన భర్త ఉదంతమిది. కడప జిల్లా  కలిసపాడు  మండలం  దూలవారిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు ఆమె భర్త డెత్ సర్టిఫికెట్ పంపించాడు. భర్త వేధింపులను భరించలేక ఆదిలక్ష్మి ఇటీవల తన స్వగ్రామమైన దూలవారి పల్లెకు వచ్చేసి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముద్దనూరులో ఉండే ఆమె భర్త మారుతీరాజు ఏకంగా ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ పుట్టించి దానిని ఆమెకే కొరియర్ ద్వారా పంపించారు. తన డెత్ సర్టిఫికెట్ చూసి విస్మయానికి గురైన ఆదిలక్ష్మి తాను బతికుండగానే డెత్ సర్ఫిఫికెట్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నది. బతికున్న వ్యక్తిని డెత్ సర్టిఫికెట్  మంజూరు చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.   వివరాల్లోకి వెడితే కడప జిల్లా ముద్దనూరుకు చెందిన మారుతిరాజుతో  అదే జిల్లా కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మికి 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొన్నేళ్ల తరువాత నుంచీ దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్షగట్టిన మారుతీ రాజు తన భార్య చచ్చిపోయిందంటూ ఆమె డెత్ సర్టిఫికెట్  ను నేరుగా ఆమెకే పంపించాడు. దీంతో తాను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ పంపించడంపై ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసుల విచారణలో మారుతీరాజు తన తల్లి డెత్ సర్టిఫికెట్ లో మార్పు చేసి భార్య పేరు రాసి పంపినట్టు తేలింది.  ఈ విషయాన్ని మారుతీరాజు పోలీసుల ఎదుట అంగీకరించాడు.  బతికుండగానే భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. 

ఏపీలో మూడు కొత్త జిల్లాలు

రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాలలోని బనగానపల్లి, సత్యసాయి జిల్లాలోని మడకశిరలను రెవెన్యూడివిజన్లుగా కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.  కాగా పోలవరం జిల్లా పరిధిలోకి రంపచోడవరం, చింతూరు డివిజన్లు వస్తాయి. మార్కా పురం, కనిగిరి డివిజన్లను కలిపి మార్కాపురం జిల్లాగా, మదనపల్లె, పీలేరు డివిజన్లను కలిపి మదపల్లి జిల్లాగా ఏర్పాటౌతాయి.   

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (నవంబర్ 26)న సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన ఈ సమీక్షలో   మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే  సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా అన్ని ఏర్పాట్లూ చేయాలని మార్గనిర్దేశం చేశారు.  ఈ సదస్సుకు  ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.   పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనీ, విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతో పాటు వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు.  ఈ సందర్భంగా ఈ గ్లోబల్  సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాళ్ల డిజైన్లను అధికారులు వివరించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.  

కొనసాగుతున్న మావోల లొంగుబాటు పర్వం

మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో  ఛత్తీస్ గఢ్ లో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  బీజాపూర్   ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఈ మావోయిస్టులపై 1.19 కోట్ల రివార్డులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.  ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తున్నది. అలాగే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానం కూడా నక్సల్స్ లొంగుబాటుకు కారణంగా భావిస్తున్నారు. తాజాగా లొంగిపోయిన మావోయిస్టులలో  12 మంది మహిళలు, బెటాలియన్ నంబర్ 1, వివిధ ఏరియా కమిటీల సభ్యులు, ప్లాటూన్ కంపెనీ, మిలీషియా కమిటీ సభ్యులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.  అలాగే  లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ధమారి, గరియాబంద్, నొవాపాడ డివిజన్ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు.  

ఏపీకి అతి భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం (నవంబర్ 27) ఉదయానికి వాయుగుండంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. ఇది మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం (నవంబర్30) నాటికి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో శుక్ర, శనివారాల్లో (నవంబర్ 29, 30) ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా  ముఖ్యంగా  నెల్లూరు, చిత్తూరు, తిరుపతి  ప్రకాశం, అన్నమయ్య,  కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు   70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం

ఇండోనేసియాలో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప తీవ్రత ఉంది. సమత్రా దీవిలోని   ఏస్ ప్రావిన్స్ సమీపంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఏస్ ప్రావిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   పసిఫిక్ మహాసముద్రంలోని  రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం వల్ల ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభ విస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తతం వచ్చిన ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.  

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు

అయ్యప్ప స్వాములు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫారంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు గురువారం (నవంబర్ 27) డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరికి బీజీవైఎసం కార్యకర్తలు తోడయ్యారు. అయ్యప్పట ముట్టడి కార్యక్రమంతో డీజీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   అయ్యప్ప దీక్షలో ఉన్న కంచన్‌బాగ్  ఎస్సై ఎస్. కృష్ణకాంత్ కు విధుల్లో ఉండగా యూనిఫాం వేసుకోకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ అయ్యప్పలు ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. విధుల్లో ఉండగా మతపరమైన దీక్షలు అంటూ యూనిఫారం వేసుకోకపోవడం పోలీసు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎస్ ఐ కృష్ణకాంత్ కు అడిషనల్ డీసీసీ మెమో జారీ చేయడం పట్ల అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాటు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలగడంతో పోలీసులు అయ్యప్ప స్వాములను అరెస్టు చేశారు. 

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నది. మెడికల్ కాలేజీలలో అనుమతుల కోసం ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల్లో   పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో సోదాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్ లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరులో భారీగా అవకతవకలు జరిగిన కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాచరణలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.   ఈ కేసులో డబ్బుల లావాదేవీలు, బ్రోకర్ల నెట్వర్క్, నిధుల మార్గాలు, మనీ లాండరింగ్, ఎన్ఎంసీ అధికారులకు చెల్లింపులకు సంబంధించి కీలక విషయాలు ఈ సోదాలో  వెలుగులోకి  వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అమరావతిలో శ్రీవారి ఆలయం రెండున్నరేళ్లలో పూర్తి.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో  శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ఈ రోజు ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతిలో వేంకటేశ్వ స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణను  260 కోట్ల రూపాయలతో రెండు దశల్లో చేపట్టనున్నారు.  మొదటి దశలో దాదాపు  140 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకార నిర్మాణానికి 92 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు.  రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం నిర్మించబోతున్నారు. ఇక  రెండో దశలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లుగా ఆలయ మాడవీధులు నిర్మించనున్నారు.   అమరావతిలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణం, విస్తరణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని అమరావతిలో   చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధిచేస్తామన్నారు.  రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులలో మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.  దేవతల రాజధాని అమరావతే.. మనకూ రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిం చామన్న చంద్రబాబు.. కృష్ణానదీ తీరాన ఈ ఆలయ నిర్మాణానికి పాతిక ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు.  రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశామన్నారు.  ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారనీ, రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప ఒక్కమంచి పనీ చేయలేదు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే ఐదేళ్లు వారికి నరకం చూపించారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పిన చంద్రబాబు, తమ ఇంటి దైవం ఆ స్వామే అని చెప్పారు. మా ఇంటి నుంచి చూస్తే శేషాచల పర్వతం కనిపిస్తుందనీ, చిన్నతనం నుంచీ స్వామివారి ఆలయం చూస్తూ పెరిగాననీ అన్నారు.  స్వామికి అప్రతిష్ట కలిగించే ఏ పనీ  తాను చేయననీ, ఎవరినీ చేయని వ్వననీ స్ఫష్టం చేశారు.  తప్పులు చేస్తే వేంకటేశ్వర స్వామివారు చూస్తూ ఊరుకోడన్నారు.  తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే తాన్ స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించానని గుర్తు చేశారు. నాడు వేంకటేశ్వరుని సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే  నక్సలైట్లు 23 క్లైమోర్ మైన్స్‌ను   పేల్చారు. ఆ సమయంలో స్వామి వారే తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు, పాల్గొన్నారు.  

ప్రతికూల వాతావరణం.. వెనక్కు మళ్లిన జగన్ హెలికాప్టర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ప్రమాదం తప్పింది. పులివెందుల పర్యటనను ముగించుకుని గురువారం (నవంబర్ 27) ఆయన హెలికాప్టర్ లో బేంగ ళూరుకు బయలుదేరారు. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా టేకాఫ్ తీసుకున్న పావుగంటకే పైలట్ హెలికాప్టర్ ను వెనక్కు తీసుకువచ్చి పులివెందులలో ల్యాండ్ చేశారు. విపరీతమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ను వెనక్కు మళ్లించినట్లు తెలిసింది. ఎటువంటి ప్రమాదం లేకుండా హెలికాప్టర్ సురక్షితంగా పులివెందులలో ల్యాండ్ కావడంతో వైసీపీ నేతలు, శ్రేణులూ ఊపిరి పీల్చుకున్నారు.  జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 25న పులివెందులకు వచ్చిన  సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అలాగే అరటి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మూడు రోజుల పర్యటనను ముగించుకుని పులివెందుల నుంచి హెలికాప్టర్ లో  గురువారం (నవంబర్ 27) ఉదయం బెంగళూరుకు బయలుదేరారు. అయితే అలా బయలుదేరిన పావుగంటలోనే వాతావరణ ప్రతికూలత కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పైలట్ వెనక్కు మళ్లించి పులివెందులలో ల్యాండ్ చేశారు. 

మరోసారి పోలీసు కస్టడీకి ఐ బొమ్మ రవి

ఐబొమ్మ రవిని మరో సారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు గురువారం (వంబర్ 27) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీసులు ఐబొమ్మ రవిని అదుపులోనికి తీసుకుని విచారించనున్నారు. గురువారం (నవంబర్ 27) నుంచి శనివారం (నవంబర్ 29) వరకూ రవిని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే తొలి సారి ఐదు రోుల కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు ఇప్పుడు పైరసీకి సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు మూడు రోజులు విచారించనున్నారు.   గతంలో  ఐదు రోజుల పాటు జరిగిన విచారణకు ఐబొమ్మ రవి తమ ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడని, కొన్నిటికి అసలు జవాబే ఇవ్వలేదనీ, అందుకే మరోసారి అతనిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ   సైబర్ క్రైమ్ పోలీసులు  నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఐబొమ్మ రవిని మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ విచారణలో పోలీసుల   ప్రధానంగా ఐబొమ్మ రవి నెట్‌వర్క్‌, అతడితో కలసి పనిచేస్తున్న వ్యక్తులు, ఐపీ అడ్రస్ మాస్కింగ్‌ ద్వారా తప్పించు కుంటున్న నేరగాళ్లపై సమాచారం రాబట్టనుంది.  

రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ కుమార్ కు నోటీసులు

వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుపై వైసీపీ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించింది. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సంగతి తెలిసిందే.  గతంలో తనపై కస్టడీలో దాడి చేసిన వారిపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని రఘురామకృష్ణం రాజు పలు సందర్భాలలో తన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తే  రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు ఆ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందాయి.  వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సీఐడీ ఛీఫ్ గా పని చేశారు. అప్పట్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ ప్రభుత్వ తప్పి దాలను ఎత్తి చూపేవారు. ఆ క్రమంలోనే ఆయన్ను నియంత్రించేందుకు  జగన్ సర్కార్ రఘురా మకృష్ణంరాజుపై రాజద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేయించి అరెస్టు చేసింది. అనంతరం గుంటూరు సీఐడీ కస్టడీలో రఘురామరాజును టార్చర్ చేశారు.  అప్పట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి రఘురామరాజు శరీరంపై ఎటువంటి గాయాలూ లేవనీ, ఆయనపై కస్టోడియల్ టార్చర్ జరగలేదనీ రిపోర్టు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన రఘురామకృష్ణం రాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు. సికిందరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల్లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని తేలింది.  2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధకారంలోకి వచ్చింది. రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ మాత్రం నత్తనడకనే కొనసాగుతోంది. ఈ కేసులో ఇంత కాలానికి కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు గుంటూరు పోలీసులు నోటీసులు పంపి.. డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.  

వైట్ హౌస్ సమీపంలో కాల్పులు.. భద్రత కట్టుదిట్టం

అమెరికా అధ్యక్ష భవనం  వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఉగ్ర దాడిగా అభివర్ణించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే   అదనంగా 500 మంది సైనికులను పంపాలని పెంటగాన్‌ను ఆదేశించారు.  వైట్ హౌస్ వద్ద గస్తీ కాస్తున్న వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులపై  ఓ దుండగుడు   కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్‌హౌస్ కాంప్లెక్స్‌ను లాక్‌డౌన్ చేశాయి.  అలాగే భద్రతా దళాలు దుండగుడిని అదుపులోనికి తీసుకున్నారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని ఆఫ్ఘనిస్థాన్ కు రెహమానుల్లాలకన్వాలాగు గుర్తించారు.  అంతే కాకుండా అమెరికా సైన్యానికి సహాయం చేసిన అఫ్ఘన్లకు ఇచ్చే ప్రత్యేక వీసాపై వచ్చిన ఇతడు, వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలోనే ఉంటున్నట్లు తేలింది.ఈ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బైడెన్ హయాంలో ఆఫ్ఘన్ నుంచి వచ్చిన శరణార్థులందరి వివరాలను పునఃపరిశీలించాలన్నారు. 

అన్నీ ఆలోచించే.. పార్టీ నిర్ణయం మేరకే లొంగిపోయాం.. మావోయిస్టు ఆజాద్

ఆయుధాలు విడిచి లొంగిపోవడంపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ మాజీ సభ్యుడు ఆజాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఆయుధాలను విసర్జించి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలన్న మావోయిస్టు పార్టీ పిలుపుమేరకే తాము లొంగిపోయామని స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తమ లొంగుబాటుకు కారణాలు, లొంగుబాట్లకు వ్యతిరేకంగా తాను అంతకు ముందు చేసిన ప్రక టన తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. తామంతా పార్టీకి చెప్పే లొంగిపోయామని పునరు ద్ఘాటించారు. ఇంకా లొంగిపోకుండా ఉన్న రాష్ట్ర కమిటీ అగ్రనేతలు కూడా సరెండర్ కావాలని పిలుపు నిచ్చారు.   మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని కొనసాగించడం కష్టమని పేర్కొన్న ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడంలేదన్నారు.   తొలుత మల్లోజుల సాయుధపోరాటం వీడాలంటూ రాసిన లేఖతో పార్టీలో అయోమయం నెలకొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తామంతా ఆ లేఖతో షాక్ కు గురయ్యామన్నారు.  ఆ సమయంలోనే  మావోయిస్టు కేంద్ర కమిటీ సలహా మేరకు జగన్ పేరుతో మల్లోజుల స్టేట్ మెంట్ న ఖండిస్తూ..  మల్లోజుల సొంత ప్రయోజనాల కోసమే లేఖ రాశారని  జగన్ పేరుతో తాన ప్రకటన విడుదల చేసినట్లు చెప్పిన ఆజాద్.. ఆ తరువాత పార్టీ కేంద్ర కమిటీ క్లారిటీ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడిందన్నారు. పార్టీకి చెప్పే ఆయుధాలను వీడి పోలీసుల ఎదుట లొంగిపోయామన్నారు.  భూస్వామ్య  వ్యవస్థ మీద వ్యతిరేకతతో పార్టీలో చేరాను..పీడత జనాల అభివృద్ధి కోసమే పార్టీలో చేరానని చెప్పిన ఆయన ఆ దిశగా పోరాటంలో కొంత మేర విజయం సాధించామని చెప్పుకొచ్చారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయనీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం జరగలేదనీ అన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని  పొందడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు.  అలాగే పార్టీలోకి కొత్త క్యాడర్ రావడం ఆగిపోయిందనీ చెప్పుకొచ్చారు.  

మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేసిన సూపరింటెండెంట్.. ఎక్కడో తెలుసా?

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్   రమణ మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఒక పల్లెటూరి వృద్ధుడి వేషధారణలో ఆయన  రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు.  ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ ఇటీవల జీజీహెచ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో సూపరింటెండెంట్ ఈ తనిఖీ చేపట్టారు. తన తనిఖీలలో  ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన గుర్తించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఆయన ఈ తనిఖీలో భాగంగా  ఎమర్జెన్సీ విభాగం, లేబరేటరి, సిటీస్కాన్, ఎంసీయూ, ఐసీయు వార్డులను  పరిశీలించారు.  వైద్యులు, సిబ్బంది పనితీరు పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ మృతి వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్  ఖండించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనను మరో జైలుకు తరలించారని వచ్చిన వదంతులను సైతం కొట్టి పారేశారు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో కంటే ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన ఆహారం అందుతోందని, జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతినిచ్చారు.   అంతకు ముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో  రావల్పిండిలోని అదియాలా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జైలు వద్దకు వెళ్లిన ఆయన ముగ్గురు సోదరీమణులపై పోలీసులు  దాడి చేశారన్న వార్తలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిలు నూర్యీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్   పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులతో కలిసి   అదియాలా జైలు వద్దకు చేరుకున్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా  నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు  దాడికి పాల్పడ్డారని   ఆరోపించారు. ఈ దాడిపై పంజాబ్ పోలీస్ చీఫ్‌కు రాసిన లేఖలో   రోడ్లను దిగ్బంధించలేదనీ, ఎవరికీ ఆటంకం కలిగించదనీ,  అయినా పోలీసులు   వీధి దీపాలను   ఆపేసి, చీకటిలో తమపై దాడికి దిగారని ఆరోపించారు.   71 ఏళ్ల వృద్ధురాలిననైనా చూడకుండా తన  జుట్టు పట్టుకుని, కింద పడేసి  ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.      పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో  ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కనీసం పుస్తకాలు చదవనీయడం లేదనీ, న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఏడుసార్లు ప్రయత్నించినా, ఇమ్రాన్‌ను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. కాగా ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు జైలు అధికారులు ఆయన సోదరిలకు అనుమతిస్తూ, ఇందుకు డిసెంబర్ 2 తేదీని ఖరారు చేయడంతో జైలు వద్ద పీటీఐ శ్రేణులు చేస్తున్న ఆందోళన విరమించారు. 

దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా వైట్ వాష్

సొంత గడ్డపై టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాతో  గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్టులో కూడా టీమ్ ఇండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 0-2తో చేజార్జుకుని దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది.  బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య  ఛేదనలో టీమ్ ఇండియా బొక్కబోర్లా పడింది. కేవలం 140 పరు గులకే  ఆలౌట్ అయ్యి 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.  

హవ్వ ఇదేం పని.. పోలీసువేనా?

అంబర్ పేట పీఎస్ లో ఎస్ ఐగా పని చేస్తున్న భానుప్రకాష్ సస్పెండయ్యారు. అయితే అయ్యో పాపం అని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే.. ఓ పోలీసు అనేవాడు చేయకూడని చేసి సస్పెండ య్యారాయన. ఇంతకీ ఆయనేం చేశారంటే.. క్రైమ్ విభాగంలో పని చేసే భాను ప్రకాష్.. ఓ దొంగతనం కేసులో రికవర్ చేసిన దాదాపు ఐ తులాల బంగారాన్ని ఏకంగా తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు వాడేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే ఆయన సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టే పెట్టేశారు.  ఆర్థిక సమస్యల ఉండటంతో ఎస్సై భాను ప్రకాష్ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటు తన  సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టేసినట్లు తేలడంతో  పోలీసు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.   ఎస్ఐ భాను ప్రకాష్ బెట్టింగులకు బానిసై అందిన కాడికల్లా అప్పులు చేసి అవి తీర్చే మార్గం కనపడకపోవడంతో ఇలా అడ్డదారి తొక్కాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.