ప్రేమకు నిర్వచనాలు ఏవి?

ప్రేమ అనగానే అందరికీ ఎక్కడలేని హుషారు పుడుతుంది. జీవితంలో తోడుగా అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు అనేది ప్రేమికుడు లేదా ప్రేమికురాలి ద్వారా దొరుకుతుంది. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలకు నిజమైన అర్థం నిజం, నిజాయితీ, నమ్మకం, ధైర్యం, విజయం. ఈ అయిదు ప్రేమకు నిజమైన అర్థాలు...!

ఈనాటి సమాజంలో వున్న యువకుల ఆలోచనలు ఎక్కువగా ప్రేమవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో కళ్ళలో కళ్లు పెట్టుకుని చూసుకుని నవ్వుకోవడం, సైగలు చేసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రియురాలి కోసం ఏమైనా కొనివ్వడం సినిమాలకు తీసుకెళ్ళడం, ప్రియురాలు ఏదైనా అడిగితే ప్రేమికుడు ప్రియురాలు కోసం తన తాహతుకు మించకపోయినా ప్రియురాలు అడిగినదాని కోసం తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేయడం ప్రియురాలి కోరికలు తీర్చడం వంటివి చేస్తున్నారు. చివరికి తల్లి దండ్రులకు అప్పుల బాధను మిగిల్చి, వాళ్ళు వారి సరదాలను కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ప్రేమికురాలికి న్యాయం చేయడమా, లేక తల్లిదండ్రులకు న్యాయం చేయడమా మీరే ఆలోచించండి. 

నిజమైన ప్రేమికుడు లేక ప్రియురాలుకు ముందు ప్రేమ పట్ల మంచి అవగాహన వుండాలి. ప్రేమను ఆరాధించాలి, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. వయసులో ఉన్నవారు ప్రేమించడం సహజం. ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమికులు ఇద్దరు మీకు ఉన్నదాంట్లో మీ కుటుంబానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి. మీరు మీ ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులను అప్పుల బాధకు గురి చేయకూడదు. ప్రేమికుడికి, ప్రేమికురాలు ఇవ్వవలసిన నిజమైన ఆనందం, ప్రేమికుడికి తల్లి దండ్రుల దగ్గర మంచిగౌరవం వుండేలా సమాజంలో మంచి గుర్తింపు ఉండేలా చేయడం. ఇది నిజమైన ప్రేమికురాలు ప్రేమికుడికి ఇచ్చే నిజమైన ఆనందం. ప్రేమ మోజులో పడిపోయి మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు.

అలాగే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో  ఒక పరిధిలో ఉండాలి. చాలామంది ప్రేమ అనగానే ఇక మొత్తం ఒకరికొకరు ఏకమైపోవాలి అనుకుంటారు. శారీరకంగా కలవడానికి ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల జీవితాలు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాయి. ప్రేమంటే మనుషుల్ని అర్థం చేసుకుని ఆరాధించి తరువాత ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. అంతే తప్ప ముందే అన్ని అయిపోవాలని లేకపోతే ప్రేమ లేదు అని మాటలు చెప్పడం కాదు. 

మీరు ఒకవేళ ప్రేమ మోజులో పడితే నిజాయితీగా వుండి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఒక సరైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా నమ్మకం ఏర్పడితే జీవితంలో భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే ధీమా వస్తుంది. 

ఏర్పరుచుకున్న ఆ లక్ష్యంలో ఏవైన సమస్యలు వస్తే కృంగిపోకుండా ధైర్యంగా వుండాలి. ఆ సమస్యను ఇద్దరు ధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరూ నిర్ణయంలోనూ, సమస్యలొనూ, పరిష్కారంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత ఇబ్బందులు అయినా అధిగమించగలుగుతారు. 

ఇలా లక్ష్యాన్ని ఏర్పరుచుకొని విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి మీ ప్రేమకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి మంచి గుర్తింపు వుండేలా చేసుకోవాలి. మీ ప్రేమను ఇతర ప్రేమికులు ఆదర్శంగా తీసుకునేలా మీరు గొప్పగా ఉండాలి అనుకోవాలి. ఇద్దరి మధ్యన ప్రేమ స్నేహభావంగా వుండాలి. ఇది మాత్రమే కాదు ప్రేమకు కావలసింది ఓర్పు, సహనం, ఇవి రెండూ కూడా చాలా అవసరం. అదే విషయాన్ని ఆలోచించాలి.  ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను కన్నీటిని మిగిల్చి పారిపోయి పెళ్ళి చేసుకోవడం న్యాయమా? లేక మీ ప్రేమకు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ ప్రేమ పట్ల మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు కలిగేటట్లుగా వ్యవహరించడం న్యాయమా?

ప్రేమకు నిర్వచనాలను ఎవరికి వారు ఇచ్చుకుంటూ నిజమైన నిర్వచనాన్ని నవ్వులపాలు చేయకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.

                                          ◆నిశ్శబ్ద.

Advertising
Advertising